"ఎస్సయ్ వస్తాడా? ఎందుకూ?" అన్నాడు జాన్.
"చూద్దువుగాని ఉండు" అతనన్నట్లే పావుగంట తర్వాత ఎస్సయ్ వచ్చాడు.
"రెడీగా ఉన్నాయా?" అన్నాడు వచ్చీరాగానే.
"ఆ! అవిగో! ఆ గోడవారన పెట్టుంచాం!" అన్నాడు రాఘవరావు.
లేచి గోడవారగా పెట్టివున్న సారాసీసాలవైపు చూసాడు ఎస్సయ్. లెక్కపెట్టి జాగ్రత్తగా వాటి వివరాలు రాసుకున్నాడు. కానిస్టేబుల్స్ వచ్చి వాటిని వ్యాన్ లోకి ఎక్కించారు.
ఉత్తుత్తి రెయిడ్ పూర్తయింది. కానీ అంతకుముందెఎక్సయిజు కంట్రాక్టరు రాఘవరావుగారి అసలు సరుకంతా చేరవలసినచోట్లకు చేరిపోయింది.
ఇప్పుడు నామ్ కే వాస్తే...... రికార్డు కోసం.....కాస్త హంగామా.....చిన్నకేసు......తర్వాత ఎక్సయిజ్ వాళ్ళు జోక్యం చేసుకుంటారు.....కొద్దిగా ఫైను.......ఇదంతా రొటీన్! కన్నీటి తుడుపు!
"పనయిపోయిందికదా! ఒక రౌండు తీసుకుంటారా?" అన్నాడు రాఘవరావు నవ్వుతూ.
కుర్చీలో కూర్చున్నాడు ఎస్సయ్. జాన్ భయభక్తులతో గ్లాసులో విస్కీపోసి అందించాడు.
"మరో చిన్న సాయం చెయ్యాలి!" అన్నాడు రాఘవరావు ఎస్సయ్ తో.
"చెప్పండ్రి!"
"ఈ సీసాలు ఈ ఇంట్లో కాకుండా మాలారీలో దొరికినట్లూ ఆ లారీని మా డ్రయివరు జాన్ గాడు నడుపుతుండగా పట్టుకున్నట్లూ రాసుకోండి కేసు. గొడవ లేకుండాపోద్ది!" అన్నాడు తేలిగ్గా.
ఇన్స్ పెక్టరు ఒకసారి సూటిగా రాఘవరావు కళ్ళలోకి చూశాడు. దేవాంతకుడు వీడు! వీడు చెబుతున్నంతతేలిక విషయం అయి ఉండదు ఇది. ఇంకేదో మతలబు ఉండే ఉంటుంది. హెల్పు చెయ్యడానికి తను రెడీనే! కానీ హెల్పుచేసేముందు నిజం పక్కాగా తెలుసుకుని వీణ్ణి తన గుప్పెట్లో పెట్టుకోవాలి. లేకుంటే తనజుట్టు వీడి చేతిలో ఇరుక్కుంటుంది! అది నిజం!
"ఏం లేదు! మా జాన్గాడికి కాస్త ఒళ్ళు తిమ్మిరిగా ఉంది. నాల్రోజులు అత్తారింటికెళ్ళొత్తే బాగుపడతాడేమోననీ!" అన్నాడు రాఘవరావు హాస్యంగా.
తొడచరిచి పెద్దగా నవ్వాడు ఎస్సయ్. "అరే ఛోడో రాఘవరావ్ సాబ్! మేరేకూ ఉల్లూ బహరైక్యా! జరిగిందేమిటో సక్కగా చెప్పండ్రి. నాతాన ఏమయితదో అది చేస్తా!" ఎస్సయ్ ఘటికుడని తెలుసు రాఘవరావుకి. వివరాలు చెప్పకుండా తేలిగ్గా పని చేయించుకుందామని చూసాడు గానీ ఎస్సయ్ వాసన పసికట్టేసాడు. ఇప్పుడింక ఈడికి వాటా ఇవ్వకతప్పదు.
తప్పనిసరై జరిగినదంతా వివరంగా చెప్పాడు రాఘవరావు. జాన్ గాడు ఆ స్త్రీని ఎత్తుకొస్తుంటే ఆమె తరపువాళ్ళు జీపులో తరిమారు. మొత్తంమీదవాళ్ళని తప్పించుకుని బయటపడ్డాడు జాన్. కానీ వాళ్ళు లారీ నెంబరు నోట్ చేసుకునే ఉంటారు. పోలీసు రిపోర్టు ఇస్తారు. గొడవ అవుతుంది. అందుకని, సరిగ్గా అదే టైముకి ఆ లారీ హైదరాబాద్ సిటీలోనే ఉన్నట్లూ, ఎస్సయ్ దాన్ని ఆపి కాపుసారా స్వాధీనంచేసుకున్నట్లూ కేసు బుక్ చేస్తే జాన్ కి మంచి ఎలిబీ దొరుకుతుంది. ఒక్క దెబ్బకు రెండుపిట్టలు రాలుతాయి.
అంతా విని 'మరి నాకేమొస్తది?' అన్నాడు ఎస్సయ్.
"తలో అయిదువేలు" అన్నాడు రాఘవరావు.
కాసేపు ఆలోచించి "సరే!" అన్నాడు యాస్సయ్. తర్వాత జాన్ వైపు తిరిగాడు. అరే చాల్ బాజ్! కేసెట్లు తీసిన తర్వాత ఆ ఆడదాన్ని ఊరిమీదకు వదుల్తారా ఏమి? అందరం పరేశాన్ లో పడతాం! నాల్గు దినాలు మాకాడ ఉండనీ! ఇంతలో మీసారు నీకు బెయిలు ఇప్పిస్తడు. అప్పుడు సక్కగ దాన్ని తీసుకెళ్ళి బొంబైలో పాంచ్ హజార్, దస్ హజార్ కి అమ్మేసి రా! ఖతం!" అన్నాడు.
10
బాంబే బ్రీచ్ కాండీ హాస్పిటల్లో స్పెషల్ రూం అది. అందులో రెండు బెడ్స్ వేసి ఉన్నాయి. ఒకదానిమీద బ్రహ్మాజీరావు పడుకుని ఉన్నాడు. రెండోదాని మీద మనోహర్ ఉన్నాడు. సౌఖ్యంగా ఉన్న కుర్చీలు రెండు ఉన్నాయి అక్కడ. ఒకదానిలో సీత కూర్చుని ఉంది.
ఉన్నట్లుండి చిన్నగా మూలిగాడు బ్రహ్మాజీరావు. చటుక్కున లేచి అతని దగ్గరికి వెళ్ళింది సీత. కళ్ళు తెరవకుండానే చెయ్యిజాచి ఆమెచేతిని అందుకున్నాడు బ్రహ్మాజీరావు. చాలా దృఢంగా ఉంది అతని పట్టు.
"ఈసారి నిన్ను వదిలెయ్యను ప్రమీలా! నా ప్రాణాలు పోయినా సరే నీ చెయ్యివదలను. అన్నాడు కలవరిస్తూ."
హెలికాఫ్టర్ ఎక్కబోతూ తనుప్రమీల చెయ్యి పట్టుకోవడం, చేయి జారిపోవడం ప్రమీల మంటల్లోనే ఉండిపోవడం ఆ తాపం భరించలేక ఆమె నలభై అంతస్తుల మేడమీదనుంచి దూకెయ్యడం ఇవన్నీ ఇంకా అతని సబ్ కాన్షస్ లో మెదులుతున్నాయి. మగతలో ఉన్నాడు అతను. ప్రమీలని రక్షించుకోవాలనే ప్రయత్నంలో అతని వళ్ళుకాలింది. ట్వెంటీ పర్సెంట్ బర్న్ అని తేల్చారు డాక్టర్లు. అరవై శాతంకంటే ఎక్కువగా వళ్ళు కాలితే ప్రాణాపాయం సంభవిస్తుంది. కానీ బ్రహ్మాజీరావుకి మంటలవల్ల కలిగిన గాయాలు ఇరవైశాతంమించకపోయినా ఆ గాయాలు అతని ఛాతీకి ఎడమవైపు ఉన్నాయి!
అంటే గుండెకి దగ్గరగా! అగ్నివల్లే శరీరానికి ఎడమవైపు గాయాలుకలిగితే చాలా ప్రమాదమని చెబుతారు.
"ప్రమీలా! నేను నిన్ను వదులుకోలేను ప్రమీలా! నువ్వు నన్ను వదిలిపోకు ప్రమీలా!" అంటున్నాడు బ్రహ్మాజీరావు. సంధి ప్రేలాపనలాగా అస్పష్టంగా వస్తోంది మాట.
ఏం చెయ్యాలో తోచలేదు సీతకి కాసేపు ఇబ్బందిగా చూస్తూ నిలబడిపోయింది.
కొద్దిక్షణాల తర్వాత ఆమెకి స్ఫురించింది, బజర్ నొక్కి నర్సుని పిలవవచ్చునను.
ఆమె బజర్ ని అందుకోవడానికి కొద్దిగా ముందుకి వంగగానే ఆ కదలికకే కళ్ళు తెరిచాడు బ్రహ్మాజీరావు. కాసేపు తనెక్కడ ఉన్నానో అర్ధం కాలేదు అతనికి తర్వాత గమనానికొచ్చింది, తన ఎదురుగా ఉన్నది సీత అనీ తను ఆమె చేతిని తనుపట్టుకుని ఉన్నాననీ!
అది గ్రహించగానే చటుక్కున వదిలేసాడు ఆమె చేతిని.
"ఐయామ్ సారీ!" అన్నాడు అపాలజిటిక్ గా.
"ఎలా ఉంది మీకు?" అంది సీత.
"ఫర్వాలేదు ప్రమీల.....?" అన్నాడు బ్రహ్మాజీరావు. జరిగిపోయిందేమిటో తను కళ్ళారా చూసినా, ఆ చూసినది భ్రమ అయితే బాగుండునన్న ఆశతో.
జవాబుగా తల వంచుకుంది సీత.
కొద్దిక్షణాల సేపు మౌనంగా ఉండిపోయాడు బ్రహ్మాజీరావు. మౌనంగా రోదిస్తోంది అతని మనసు.
అప్పుడు అతనికి గుర్తొచ్చింది. చిరకాలం క్రితం.
వ్యాపారంలో తనని తన మిత్రులే ఘోరంగా మోసంచేస్తే దివాలా ఎత్తాడు కానీ అష్టకష్టాలు పడి తిరిగి నిలడొక్కుకో గలిగాడు.
కాని ఈసారి విధే వంచించింది తనని! తను మళ్ళీకోలుకోగలడా? కోలుకోవలసిన అవసరం ఉందా అసలు?
ఇదివరకు వ్యాపారంలో దివాలా తీసినప్పుడు అప్పట్లో తనకి అండగా వయసు ఉంది మళ్ళీ పుంజుకోవాలనే కాంక్ష ఉంది.
అన్నిటికంటే ఎక్కువగా.
