Previous Page Next Page 
అష్టపది పేజి 43


    
    శీతల్ కి క్షణకాలం మెదడు దిమ్మెక్కిపోయి నట్లయింది.
    
    తేరుకున్న మరుక్షణం వేగంగా ఆలోచించి, "కుందన్! నా నిర్ణయం విని నీవు బాధపడవుగా అంది.
    
    "పడను" అన్నాడు కుందన్.
    
    "నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు" తెలివిగా చెప్పింది శీతల్.  

 

    కుందన్ ఆ మాట విని మౌనం వహించాడు.
    
    "పెళ్లి అనేది నా వూహల్లోకి రాలేదు. మరో రెండేళ్ళ దాకా నేను పెళ్ళి మాట తలపెట్టను. అందాక నిన్ను వేచి వుండమనడం భావ్యంకాదు. మనసు అనేది ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేము. అయినా నా ప్రస్తుత అభిప్రాయం ఇదే కాబట్టి నువ్వు ఏమీ అనుకోవద్దు మనం ఇలాగే ఫ్రెండ్లీగా వుందాము" అని చెప్పేసింది శీతల్.
    
    మరోసారి మన మధ్య పెళ్ళి మాటలు జరక్కుండా వుంటే బాగుంటుంది. నీ మీద నాకు మనసు లేదు... నేను ఇప్పుడప్పుడే పెళ్ళి చేసుకోను... ఇన్ని అర్ధాలు శీతల్ మాటల్లో వున్నాయి.    

 

    కుందన్ అప్పటికి ఏమీ మాట్లాడలేదు. కాకపోతే తెలివిగా మాట మార్చేసి మళ్ళీ పాప్ మ్యూజిక్ లో పడ్డాడు.    

 

    పట్టుమని పది రోజుల పరిచయం ఇద్దరి మధ్యలేదు. ధైర్యంగా, డైరెక్టుగా పెళ్ళి మాట ఎత్తేశాడు.
    
    తన అభిప్రాయం చెప్పగానే అంతకు క్రితం అసలేం జరగనట్టు మామూలుగా వున్నాడు.
    
    ఆ రోజు మొత్తం మీద కుందన్ మళ్ళీ పెళ్ళి మాట ఎత్తలేదు. అసలేం జరగనట్టు మామూలుగా వున్నాడు.
    
    లోకేశ్వరరావుకి ఈ విషయం తెలుసో తెలియదో కాని ఆయన మామూలుగానే వున్నాడు.
    
    రాత్రయింది.
    
    శీతల్ కి ఇదే ఆలోచన. ఎంతకీ నిద్ర పట్టలేదు' ఆలోచన...ఆలోచన....దరీ తెన్నూ తెలియని ఆలోచన"
    
    తల్లి తండ్రి తన గురించి ఏమనుకుంటున్నారు?
    
    తెలియదు.
    
    తన మీద బెంగతో వాళ్ళిరువురు...!
    
    ఏదైనా జరగవచ్చు.
    
    అదీ తెలియదు.
    
    ఈ లంకేశ్వరుడు మాత్రం తఃనకి అంకులు కాదు పెంకులు కాదు. ఇదో నాటకం, నాటకంలో అంతర్ నాటకం. ఈరోజు కుందన్ పెళ్ళి మాట ఎత్తాడు కాబట్టి...ఇది నాటకంలో ఒక భాగమో, కొత్త కథకి నాందీయో అయి వుంటుంది.  

 

    కుందన్ ని వచ్చినప్పటి నుంచి చూస్తున్నది. అతని రూపంలో, ప్రవర్తనలో, మాట తీరులో ఏదో కుత్రిమత్వం తొంగి చూస్తుంటుంది. అదేమిటనేదే తను కనిపెట్టలేకపోయింది.
    
    ఈరోజు అంతే డేరింగ్ గా పెళ్ళి మాట ఎత్తాడు తను. కాదనేసరికి కొద్దిసేపు మౌనం వహించి, ఆ వెంటనే ఏమీ జరగనట్లు మామూలయిపోయాడు.
    
    ప్రతిది అంత తేలికగా తీసుకుంటాడా కుందన్!
    
    ఉహూ
    
    ఇదీ నాటకంలో ఒక భాగమే!
    
    తను తెర వెనక్కి వెళ్ళగలిగితే గాని నిజానిజాలు తెలియవు ఏదైనా తెలుసుకోవాలంటే ఇలా మీనమేషాలు లెక్క పెడుతూ కూర్చోకూడదు. ఎప్పటికప్పుడు వాచ్ చేస్తుండాలి. పగలు తను వెయ్యి కళ్ళతో చూస్తూ వుంది. తన వెర్రి గాని, పగలు వాళ్ళు వెయ్యిన్నర జాగ్రత్తలతో వుంటారు. ఎలా బైట పడతారు?
    
    రాత్రిళ్ళు తను లేచి తిరిగితే వాళ్ళు చూస్తే... వాళ్ళకి అనుమానం వస్తే? ఈ ఆలోచనతోనే తను ఇన్నాళ్ళు ఆగింది. ఇంక ఆగకూడదు.
    
    ఈ మాట అనుకోవటమే తడవు శీతల్ నలువైపులా చూసి బెడ్ మీద నుంచి పైకి లేచింది. నెమ్మదిగా కిటికీ దగ్గరకు వెళ్ళి బైటికి చూసింది, వరండాలో పడుకునే నౌకరు రాఘవుడు కూర్చుని అటు తిరిగి బీడీ తాగుతున్నాడు. తను ఇదివరకు కూడా ఓసారి ఎందుకో లేచి కిటికీ లోంచి ఇలాగే చూస్తే ఇదే ఫోజులో రాఘవుడు వున్నాడు.
    
    "నిద్ర పట్టక బీడీ తాగుతూ కూర్చుని వుంటారు" అని తాను ఆ రోజు అనుకుంది. ఇది నిద్రపట్టక పోవటం కాదు. అడిగినా కూడా సమాధానం ఇదే వస్తుంది.
    
    పేరుకి ఈ ఇంటికి నౌకరు అయిన రాఘవుడు నిజంగా నౌకరు కాదు, కాపలాదారుడు.
    
    శీతల్ కి ఈ మాట గమనింపుకి రాగానే మరింత జాగ్రత్తగా వుండటం మంచిదనుకుంది. పక్క మీద దిండ్లు బారుగా పెట్టి, దుప్పటి ఆ దిండ్ల మీద కప్పి మనిషి పడుకున్నట్లు చేసింది.
    
    ఇప్పుడు కిటికీ లోంచి ఎవరైనా చూసినా తను పక్క మీద పడుకున్నట్లు వుంటుంది.
    
    అలా అనుకుని తృప్తి చెంది తల పంపించిన శీతల్ నెమ్మదిగా ఆ రూమ్ కి అటు పక్కనున్న తలుపు తీసుకుని బైటికి వచ్చింది.
    
    అప్పుడు సమయం పన్నెండు ఇరవై అయింది.
    
                                     26
    
    రాజ్ మహల్ లాగా వున్న ఆ ఇంటికి పూర్వంలాగా వరండాల్లో స్తంభాలు వున్నాయి. ఆ స్తంభాలకి తీగలా, వత్తుగా పాకిన పూలచెట్లు అందంగా నిండుగా వున్నాయి. అక్కడక్కడ షోగ్గా అమర్చిన దిమ్మెలు. వాటిపై పూల కుండీలు వగైరా చాలా రాకలేవున్నారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS