Previous Page Next Page 
అష్టపది పేజి 42


    
    మళ్ళీ తెలివి వచ్చేసరికి నేను ఆసుపత్రిలో వున్నాను. కళ్ళు తెరిచి చూస్తే కళ్ళు మసకమసకగా అనిపించాయి. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది పెద్దగా చెప్పేదేమిలేదు. డాక్టర్లు పరీక్ష చేశారు మందులు ఇంజక్షన్లు వాడారు. నీవు చాలా అదృష్టవంతుడివి. దగ్గరనుంచి పిడుగుపాటుని చూసినట్లయితే పూర్తిగా అంధుడివి ఆయె వాడివి. చాలా దూరాన చూసి చూడనట్లు పిడుగుపాటు వెలుగుని చూడటం వల్ల లైట్ గా చూపు దెబ్బతింది. కొన్ని వారాలు ఐ లోషన్ కళ్ళలో వేసుకుంటే చాలు. అన్నారు. వాళ్ళు చెప్పినట్లు చేశాను. కళ్ళు చక్కగా వున్నాయి. ఒక ఏడాది పాటు విపరీతమైన వెలుగు చూడకుండా లైట్ బ్లూ కలర్ గ్లాసెస్ జోడు వాడండి. వాడకపోయినా ఫరవాలేదు. వాడితే మంచిది అన్నారు. ఇంకో రెండు నెలలు వాడితీసేస్తాను. నాకు జాగ్రత్తలు ఎక్కువ." అంటూ కుందన్ వివరంగా చెప్పాడు.
    
    "నీవు చాలా అదృష్టవంతుడివి" అంతా విని శీతల్ అంది.
    
    కుందన్ నవ్వి వూరుకున్నాడు.
    
    "నీవు వచ్చి నాలుగు రోజుల తర్వాత ఇంత సేపు మాట్లాడటమన్నది చూశాను" శీతల్ తానూ నవ్వుతూ అంది.    

 

    కుందన్ మరొకసారి చిరునవ్వు నవ్వి వూరుకున్నాడు.
    
    లోకేశ్వరరావు అప్పుడు వచ్చాడు. "ఏం చేస్తున్నారు?" అంటూ వచ్చి వాళ్ళ ఎదురుగా ఓ కుర్చీలో కూర్చున్నాడు.
    
    ముగ్గురూ మాట్లాడుకుంటూ వుండగానే అక్కడ ఇద్దరు పెద్దవాళ్ళు వచ్చారు.
    
    వాళ్ళని మర్యాదగా ఆహ్వానించి కూర్చో పెట్టారు లోకేశ్వరరావు. శీతల్ లేచి వెళ్ళబోతుంటే కూర్చోండని చెప్పాడు.
    
    వచ్చిన వాళ్ళిద్దరూ కోటేశ్వరులని వాళ్ళూ లోకేశ్వరరావు మాట్లాడుకునే మాటల వల్ల శీతల్ కి తెలిసింది వాళ్ళు కుందన్ ని మెచ్చుకున్నారు. పెళ్ళి ప్రస్తావన తెచ్చారు.
    
    "అంతా కుందన్ యిష్టం. పెళ్ళి విషయంలో సర్వ హక్కులు మావాడికి ఇచ్చాను. కులం, మతం, బీద, బిక్క ఇదేమి చూడను. పూర్తిగా కుందన్ ఇష్టం. తండ్రిగా ఆమోదం ఆశీర్వాదం నా నుంచి కుందన్ కి లభిస్తాయి. అయినా ఇప్పుడే ఈ విషయాలు దేనికి! కుందన్ వచ్చి ఇంకా వారం కూడా నిండలేదు..."    

 

    లోకేశ్వరరావు వాళ్ళతో అలామాట్లాడి వికలాంగుల సహాయ నిధికి తను రెండు లక్షలు విరాళంగా యిస్తున్నట్లు ఫలానావాళ్ళకి చెప్పి వాళ్ళని పంపించమని...కోరాడు. ఆ తర్వాత ఏవేవో షేర్ల గురించి, బిజినెస్ గురించి మాట్లాడుకోటం జరిగింది.
    
    మధ్యలో నౌకరు టీ తీసుకొచ్చి ఇచ్చాడు.
    
    మరో పావుగంట వుండి వాళ్ళు వెళ్ళిపోయారు.
    
    ఆ కొత్తవాళ్ళు ఇద్దరు వచ్చి మాట్లాడి వెళ్ళటంతో శీతల్ ఓ విషయం తెలిసింది.
    
    అతి ముఖ్యమైన ఆ చిన్న విషయాన్ని శీతల్ తన అంతరంగపు అట్టడుగు పొరల్లో అతి పదిలంగా దాచుకుంది.    

 

    మరి కొద్దిసేపు కూర్చుని కబుర్లు చెప్పుకుని ముగ్గురు లేచి ఇంట్లోకి వచ్చేశారు.
    
                                   25
    
    రాత్రి    


    పదకొండు యాభై.
    
    శీతల్ తన రూమ్ లో పడుకుని తీవ్రంగా ఆలోచిస్తున్నది.
    
    దరీ తెన్నూ లేని ఆలోచనలవల్ల కూడా నిద్రపట్టదు శరీరానికి తగిన శ్రమ లేకపోయినా కూడా నిద్రపట్టదు శీతల్ ఇలాంటి దేదో జరుగుతుందని చూచాయగా ముందే వూహించింది. కాని ఇంత తొందరగా డైరెక్ట్ గా ఇలా ముఖాన అడిగేస్తాడు అనుకోలేదు.
    
    శీతల్ ఎప్పుడు మాట్లాడినా కుందన్ ఊ...అ...తో మాటలు సరిపుచ్చటం, లేకపోతే ముక్తసరిగా మాట్లాడటం చేస్తుండేవాడు.    

 

    అలాంటి కుందన్ మాటల మధ్యలో పెళ్ళి ప్రేమా దగ్గరకు వెళ్ళి "శీతల్ నేను ఇప్పుడప్పుడే వివాహంమాట తలపెట్టరాదు అనుకున్నాను. నాన్నగారి కయితే ఈ క్షణాన నా పెళ్ళి చేయాలని వుంది. నేను కాదన్నాను, సరే నా యిష్టం అన్నారు. నిన్ను చూడంగానే పెళ్ళాడాలనిపించింది నాకు తగిన లైఫ్ పార్టనర్ వి నీవేననిపించింది. నీకు ఇష్టమైతే చెప్పు నాన్నగారితో చెపుతాను. నీకు నాపై ఇష్టం లేకపోవచ్చు. అలాంటప్పుడు బలవంతం ఏమీలేదు. నో అని చెప్పినా మన పెళ్ళి విషయంలో నిన్ను నేను బలవంతంపెట్టను. వన్ సైడ్ లవ్ వన్ సైడ్ ఒపీనియన్ నాకు ఇష్టం వుండదు. నీకు ఇష్టం లేకపోతే ముఖమాటం లేకుండా చెప్పు. నేనేమి అనుకోను. దీంతో మన మధ్య బేదాభిప్రాయాలురావు. ముక్కుసూటిగా మాట్లాడేవాళ్ళని నేను లైక్ చేస్తాను." అంటూ తన మనసులో మాట చెప్పేశాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS