""మనకు పెళ్ళయి ఎన్ని రోజులైంది కిన్నెరా? అక్కడికేదో ఏళ్ళ తరబడి పరిచయం ఉన్నట్లు ఈ అరా తియదమేమిటి? నేను బాగానే ఉన్నాను. నువ్వు అంతే!" మొహానికి నవ్వు పులుముకున్నాడు"
"కారు తీసుకువెళ్ళండి" అంది.
"ఫర్వాలేదు"
"డ్రైవింగ్ నేర్చుకున్నరుగా?"
"నేర్చుకుంటే మాత్రం తీసుకు వెళ్లాలని రూలేమన్నా ఉందా?"
"ఏమిటిలా మాట్లాడుతున్నారు?"
"అదిగో , అక్కడికి నేనేదో కూడనిది మాట్లాడుతున్నట్టు మొహం అలా పెట్టకు. నాకింకా అలవాటు కావాల్సింది చాలా ఉందిగా! ఆ తర్వాత చూద్దాం."
గదిలో నుంచి బయటికి వస్తుంటే కాలేజికి బయలుదేరుతున్న ఉదయ్ కనిపించాడు.
"నేను డ్రాప్ చేస్తాను" అన్నాడు.
"పెళ్ళయిన తర్వాత ఉదయ్ తో పట్టుమని పదినిమిషాలు మాట్లాడలేదు రాఘవ.
"ఓ.కె.!"
"ఏమిటి మొహమలా ఉంది?" అడిగాడు ఉదయ్ రాఘవ నిర్లిప్తంగా కారులో నుంచి బయటికి చూస్తుంటే.
అప్పటికే కారు అనకాపల్లి రోడ్డు మీదికి వచ్చింది. "ఇవన్ని మనకు పరిచయమైన పరిసరాలే. అంత కుతూహలంగా వాటిని చూడనవసరంలేదు."
నవ్వేశాడు రాఘవ.
నవ్వకపోతే ఇప్పుడు ఉదయ్ 'ముఖ కవళికలు, వాటికీ అర్ధాలు' అన్న టాపిక్ అనర్గళంగా మాట్లాడేటట్టున్నాడు.
"దాంపత్య జీవితం ఎలా ఉంది?" అడిగాడు ఉదయ్.
"అది భార్య మీద ఆధారపడి ఉంటుంది."
"అంటే మా చెల్లి నిన్నో అట అడిస్తోందన్న మాట."
"ఛ! ఛ! అదేం లేదే"
"నీ గురించి మా చెల్లికన్నా నాకే ఎక్కువ తెలుసు రాఘవా!"
"కానీ, నీకు ఈ జీవితం గురించి తెలియదుగా?"
"ఉన్నట్టుండి ఉదయ మోహంలో రంగులు మారాయి.
"అంతే. ఉదయకుమారా! అప్పుడు గాని గిల్లి కజ్జాల గురించి, ప్రణయ కలహాల ముచ్చట్ల గురించి నీకు అర్ధం కాదు. ఏమిటి? ఇప్పుడు నువ్వు మొహమలా పెట్టావు?"
నవ్వేశాడు ఉదయ్ నిర్వికారంగా. "పెళ్లన్నది మనుషుల్ని చాలా మార్చుతుందన్నది అర్ధమౌతోంది రాఘవా!"
"కరెక్టే. పెళ్ళికి ముందు కవితలా ఉన్న మగాడు అయ్యాక వచన కవిత్వంలా తయారవుతాడు."
"ఆ టాపిక్ గురించి నాకంతగా తెలియదు"
"అందుకే అర్జెంట్ గా పెళ్ళి చేసేసుకో"
ఆ తర్వాత అకస్మాత్తుగా ఇద్దరి మధ్య చర్చ ఆగిపోయింది. బ్యాంక్ దగ్గర రాఘవను దింపాడు ఉదయ్.
"హలో!"
ఎవరో పలకరించినట్టయి చూశాడు బ్యాంకులో అడుగు పెడుతూ. రమణి యూనివర్సిటీ లో అప్పుడు తన స్నేహితుడు రాజారావు ప్రేమించిన అమ్మాయి. సుమారు నాలుగేళ్ళవుతుందేమో . ఇంత కాలానికి కలుసుకున్నాడు మళ్ళీ.
"వాటే సర్ప్రయిజ్ !" అన్నాడు రాఘవ.
"ఏమిటి ఇలా వచ్చారు?"
"మీ బ్యాంకులో అకౌంట్ తెరుద్దామని"
"వెల్ కమ్ ! నేను సహాయం చేస్తాను"
నవ్వేసింది.
"ఎందుకు నవ్వుతున్నారు?"
"అప్పుడు కవితలు రాసి మీ స్నేహితుడికి సహాయం చేసేవారుగా అది గుర్తుకొచ్చింది."
నవ్వకుండా ఉండలేకపోయాడు. అవును నిజమే! రమణికి కవిత్వమంటే ఇష్టమని తెలిసి రాజారావు తనకు బీర్ కొట్టించి కవితలు రాయించుకునేవాడు. అవి తనే రాసినట్టు రమణి దగ్గర కోసేవాడు. అయితే చివరికి ఆ విషయం కనిపెట్టిన రమణి రాఘవతో ఓసారి యూనివర్సిటీ కాంపస్ లోనే అంది-- "ఐ లవ్యూ అండ్ యువర్ పోయిట్రీ" అని.
"చాలా రోజులయింది కదూ, మర్చిపోయాను"
"అంటే అమ్మాయిలను అంత తొందరగా మరిచిపోతుంటారన్న మాట!"
"అబ్బే! అదేం కాదు" టాపిక్ మర్చి ---" అవునూ , ఇంతకాలం తర్వాత ఇక్కడ ప్రత్యక్షమయ్యారేమిటి."
"మీ కవితల్ని ఈ మధ్య తరచుగా చదువుతున్నానని చెప్పటానికి" నవ్వేసింది మళ్ళీ. "మరేం లేదు. ఇక్కడ ఉమెన్స్ కాలేజిలో తెలుగు లెక్చరర్ గా చేరాను ఈ మధ్యనే. ఇక సమస్య లేదు, మిమ్మల్ని తరచూ కలవొచ్చు."
"మరే" అన్నాడు రాఘవ. అప్పటికి, యిప్పటికి ఆమెలో పెద్ద మార్పేమీ లేదు. అందం కాకపోయినా, ఆమె కళ్ళలో అదోలాంటి ఆకర్షణ వుంది. అందుకే రాజారావు లాంటి చాలామంది అబ్బాయిలు ఆమె వెంటపడేవారేమో కూడా. "సరే. ఈ ఫారాల మీద సంతకం చేయండి ఇక్కడ"
