Previous Page Next Page 
శతదినోత్సవం పేజి 41

 

    తెల్ల మొహం వేశాడు రాఘవ. "ఇదేం ప్రశ్న? మందార నూనె ఎలా తయారు చేస్తారు? మటన్ కుర్మా ఎలా వండుతారు? ఇవి ఐక్యూ చెక్ చేసే ప్రశ్నలు కావంతే!"


    "దేనికైనా జవాబు చెబుతానన్నారు."


    అర నిమిషం గదిలో అటూ ఇటూ పచార్లు చేశాడు.


    అందోళనగా చూస్తుంది కిన్నెర.


    "తెలియదు" అన్నాడు చివరికి.


    ఆమెలో అలజడి చల్లారింది.


    "అయితే ఈరోజుకు మీరు బుద్దిగా పడుకుంటారు."


    "అదేం కుదరదు. అయిదు ప్రశ్నలకు జవాబు చెప్పానుగా?"


    "మీరు మొత్తం జవాబులు చెబుతానన్నారు."


    "ఫర్సెంటేజ్ లెక్క చూసినా 83.3 శాతం నేగ్గేశాను.'

    "మీరు చెప్పిందానికి నేను ఒప్పుకోవాలంటే మీరు నూరు శాతం నెగ్గాలి."


    మొహం అదోలా పెట్టేశాడు.


    "మంచి రాఘవ కదూ!" బుజ్జగిస్తున్నట్టుగా అంది.


    "అసలు నీకైనా ఆ జవాబు తెలుసా?"


    "చెప్పమంటారా?" గండం గట్టేక్కినంత ఉత్సాహంగా అంది-


    "మందార నూనె తయారీకి వాడేవి కొబ్బరి నూనె, ముద్ద మందారాలు, వట్టివేరు, కావాల్సిన సువాసన నూనె. వట్టి వేరును దంచి అరనిస్తే తేమ పూర్తిగా పోతుంది. మందార పువ్వులను మాత్రం నీడలో ఆరబెట్టాలి. ఓ అల్యూమినియం పాత్ర తీసుకుని అందులో కొబ్బరి నూనె......"


    ఆమె చెప్పడం ఇంకా పూర్తి కాలేదు. "అపెసేయ్!" అన్నాడు ఉడుక్కున్నట్లుగా.


    అనడమే కాదు. ఆవేశంగా మంచమెక్కెశాడు.

    
    "ఏమైంది?"


    "నిద్రొస్తోంది."

    
    "కాదు, బహుశా కోపం వచ్చి ఉంటుంది."


    "వచ్చినా నేనేం చేయగలను కిన్నెరా?"


    ఆమె గుండె కలుక్కుమంది.


    "నీ మీద దౌర్జన్యం చేసి నిన్ను గెలవలేనుగా?"


    హటాత్తుగా నిశ్శబ్దం ఆవరించింది.


    "నా మీద గెలుపు సాధించడమే నీ ధ్యేయమైతే నిన్ను ఓడించడం నా తరం కాదు కిన్నెరా! నీ కిలా తృప్తి పడటమే ఆనంద మనిపిస్తే కానీయ్!"


    దుప్పటి కప్పేసుకున్నాడు మొహం దాకా.


    అయిదు నిమిషాలు గడిచాయి.


    ఆమెకు తెలిసిపోయింది.


    రాఘవ బాధపడుతున్నాడు. కాదు: తనే దారుణంగా హింసిస్తున్నది.


    ఏమిటిదంతా?


    అతన్ని బాధపెట్టడమే ధ్యేయంగా తనెందుకిలాంటి పందేనికి సిద్దపడింది?


    అహాన్ని మరిచిపోయింది. కళ్ళ నీళ్ళు రాలుతుంటే కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడింది.


    అలా ఎంతసేపు చీకటిలోకి చూస్తూ ఉండిపోయిందో ఆమెకు గుర్తులేదు. భుజం పై చేయి పడగానే తేరుకుంది.


    సమీపంలో నిలబడి ఉన్నాడు రాఘవ.


    "ఛ!ఛ! ఏమిటి ఇప్పుడేదో కొంపలు మునిగినట్టు. సారీ అంటున్నాగా? కళ్ళు తుడుచుకో ముందు."


    తను కంట తడిపెట్టుకుంటే చూడలేని అతడి మనస్తత్వం మరింత కలవర పెడుతుంటే తల వంచుకుని ఉండిపోయింది.


    "చూడు!" వాతావరణాన్ని తేలిక పరుస్తూ అన్నాడు - :నేనూ వెర్రి వేంగళాయి నేం కాదు. తప్పకుండా నిన్ను ఓడించి అప్పుడు నా తడాఖా చూపిస్తాను. ఈ ఒక్క రోజే కాదు, రేపు, ఎల్లుండి....ఇలాగే నా ఐక్యూని పరీక్షించు. అభ్యంతరం లేదు, కాని, కాస్త తెలివైన ప్రశ్నలు అడుగు. బస్. అంతే!"


    ఆ క్షణానికి ఆమె బాధపడకూడదని ఏదో అనేశాడు కాని, ఆ రాత్రి రాఘవకి నిద్ర పట్టలేదు.


    కిన్నెర ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? ఆడపిల్ల కుండే సహజమైన కోరికలకు ఆమె అతితురాలా? లేక తనను తప్పని పరిస్థితుల్లో పెళ్ళి చేసుకున్నదుకు దగ్గర కలేకపోతోందా?


    ఇలాంటి సెల్ఫ్ సిటి అతడి ఆలోచనల్లో చోటు చేసుకోవడం బాధాకరమే అయినా ఎందుకో తన స్థితికి తన మీద తనే జాలి పడకుండా ఉండలేకపోతున్నాడు?


    ఎంత మానసిక పరిణతి ఉంటేనేం, అతడు మగాడేగా?


    ఉదయం లేవగానే ముభావంగానే ఉన్నాడు తప్ప అనుకున్నంత ఉత్సాహాన్ని కావాలనుకున్నా ప్రదర్శించలేకపోయాడు.


    "ఏమిటి అదోలా ఉన్నారు?" అంది కిన్నెర బ్యాంకుకు బయలు దేరుతున్న రాఘవను చూస్తూ.


    "ఎలా ఉన్నాను?"


    "రోజులా లేరు."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS