Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 42


    
    "ఏడి వాడు" అంటూ పార్వతి గదిలోకి వెళ్ళింది కస్తూరి. అఅద్దం ముందు నిలబడి తల దువ్వుకుంటున్నాడు అప్పటికే బట్టలు వేసుకుని తయారయ్యాడు సోమసుందరం.

    "ఏంటి సుందరం....ఎక్కడికి బయల్దేరావు?" అంది కస్తూరి.

    ఆమెను చూసి కంగారుపడ్డాడు సుందరం. అది పైకి కనిపించనియకుండా "ఏంలేదు వదినా....ఎక్కడికి లేదు ఊరికే సెంటర్ వరకూ వెళ్ళివద్దామని" అన్నాడు మెల్లగా.

    "సెంటర్ వరకా, పట్నానికా?" అంది కస్తూరి.

    "పట్నానికా! లేదు వదినా ఎవరు చెప్పారు?" అంటూ శివపార్వతి వేపు ఉరిమి చూశాడు.

    "దాన్నేందుకురా అలా ఉరిమి చుస్తావూ....సెంటర్ లేదు గింటర్ లేదు ఎక్కడికి వెళ్ళకు. పండగపూట అందరూ ఇంట్లోనే వుండాలి. అసలు నువ్వు ఈరోజు గడప దాటటానికి వీల్లేదు" అంది కస్తూరి సీరియస్ గా.

    "అబ్బేలేదోదినా పట్నానికి కాదు....ఇక్కడివరకే" అన్నాడు నసుగుతూ.

    "పార్వతి, వీడు బయటకెళితే నాతో చెప్పు. అలాగని ఆ పిల్లని నువ్వేమైనా అన్నావో జాగ్రత్త. చెవులు మెలేస్తాను" అంది కస్తూరి లోపలికి వెళుతూ.

    పార్వతి నిశ్శబ్దంగా నవ్వింది.

    "ఏం మహాతల్లి పొద్దున్నే నామీద ఫిర్యాదు చేశావా? అసలు నిన్నూ-" అంటూ ఇంకా ఏదో అనబోతుంటే మళ్ళీ అక్కడకు వచ్చింది కస్తూరి.

    "ఏంటి ? ఏంటి దానిమీద ప్రతాపం చుపిస్తున్నావ్? నీ వేషాలన్నీ నాకు తెలుసు, గమ్మున నోరుమూసుకుని కూర్చో" అని గద్దించింది కస్తూరి.

    సోమసుందరం కంగారుపడ్డాడు. ఏంటి వదిన ఈరోజు నా మీద ఈ స్థాయిలో విరుచుకుపడుతుంది. కొంపతీసి ఇది నేను తాగుతున్న సంగతి చెప్పిందా! వరాలు విషయం కూడా తెలిసిపోయిందా? వరాలు విషయం తెలిస్తే అమ్మో! ఇంకేమైనా వుందా? ఎందుకొచ్చిన తంటాలే, ఈరోజు గమ్మున ఇంట్లో కాలక్షేపం చేయటమే మేలు అనుకున్నాడు.

    "ఏంటి అలా చూస్తున్నావు?" అని గుడ్లురిమింది కస్తూరి.

    "ఏం లేదు వదినా....పార్వతీ కాస్త కాఫీ ఇవ్వు" అన్నాడు మాట మారుస్తూ.

                                                       *    *    *    *

    సాయంత్రం ఆరు గంటల అవుతోంది.

    డాబా పైన , ఇంటి ప్రహరి గోదాపైనా అంతటా ప్రమిదలు పెట్టారు. దాదాపు ముడోందల ప్రమిదల వరకు ఆ ఆవరణలో వెలుగుతున్నాయి. సర్వోత్తమరావు, రామశేషు ఇద్దరూ పంచలో వాలుకుర్చీలో కూర్చుని చుట్టలు కాల్చుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు.

    పిల్లలు కేరింతలుకొడుతూ , కాకరపువోత్తులు, మతాబులు కాలుస్తూన్నారు. మాధవరావు, సోమసుందరం ఇద్దరూ వారిదగ్గర వుండి కాలిపిస్తున్నారు.

    ఆడవాళ్ళంతా డాబాపైన చేరారు.

    అక్కడే వాళ్ళు మతాబులు కాలుస్తూ ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్నారు.

    గిరిజ కూడా వాళ్ళతోనే ఉంది.

    సురేంద్ర పిల్లలతోపాటు డాబా పైకి రాకెట్లు పట్టుకుని వచ్చాడు.

    "బావా...బావా....రాకెట్లు కాల్చవా....అక్కడికి ఆ నక్షత్రాల దగ్గరికి వెళ్ళాలి మన రాకెట్లు " అంది వనజ.

    "అలాగే, మీరు గొడవచేయకుండా అలా దూరంగా వెళ్ళి నిల్చోండి" అన్నాడు.

    ఖాళి సీసాలో రాకెట్లు పెట్టి కాకరపువ్వోత్తితో రాకెట్ వోత్తికి అంటించాడు. అది క్షణాలలో ఆకాశంలోకి దూసుకెళ్ళి "డాం" అంటూ పేలింది. పిల్లలంతా 'హాయ్" అంటూ చప్పట్లు కొట్టారు.

    "ఇంకొకటి బావా...మళ్ళీ ఇంకా పైకెళ్ళాలి" అన్నాడు చంటి.

    "అలాగేరా" అంటూ మళ్ళీ మరొకటి కాల్చాడు.

    "సురేంద్ర మీ ఆవిడ్ని కాల్చమను. నువ్వు దగ్గర ఉండికాల్పించు అంది దాక్షాయణి.

    "అమ్మో! నాకు భయం పిన్ని. నేను కాల్చను" అంది గిరిజ.

    "నీ మొగుడు దగ్గర వుంటాడు కదా....భయమెందుకు?' అంది దాక్షాయణి.

    "వద్దు పిన్ని, నావల్లకాదు, నాకు వాటిని చూస్తేనే భయం" అంది గిరిజ.

    సురేంద్ర పెద్దగా నవ్వాడు. సురేంద్ర, గిరిజలు ఈమధ్య సఖ్యతగానే ఉంటున్నారు. ఎందుకంటే జయంతి అసలు దాదాపు వాళ్ళిద్దరితో మాట్లాడటమే మానేసింది. ఆప్పుడప్పుడు గిరిజే జయంతి దగ్గరకు వచ్చి కాసేపు మాట్లాడి పోతుంది. దాక్షాయణి, శివపార్వతి యిద్దరూ సురెంద్రతో కూడా మాట్లాడారు. అప్పటినుంచి సురేంద్ర హాయిగా ఉపిరి పీల్చుకున్నాడు. కానీ ఎప్పుడూ ఆటలుపట్టిస్తూ బావా....బావా అంటూ కబుర్లు చెప్పే జయంతి అలా ముభావంగా ఉండిపోవటాన్ని అతను తట్టుకోలేకపోతున్నాడు. తప్పనిసరి పరిస్థితుల్లో అలా ఉండాల్సివస్తుంది.

    "జయంతి నువ్వు కాల్చవే....నీకు ధైర్యం ఎక్కువకదా" అంది శివపార్వతి.

    "ఓ! కాలుస్తాను.....దీన్లో ఏముంది గొప్ప, కాలిస్తే నాకేమిస్తావు" అంది జయంతి.

    "పందెంలో నువ్వు గెలిస్తే ఈరోజు రాత్రికి భోజనాలు అందరికి నేను వడ్డిస్తాను, నువ్వు ఓడిపోతే నువ్వు వడ్డించాలి సరేనా?" అంది శివపార్వతి.

    "కాదు, వందరుపాయల పందెం అలాగైతేనే నేను రాకెట్ అంటిస్తాను" అంది జయంతి.

    "సరే...వందరుపాయల పందెం" అంది శివపార్వతి.

    "ఏయ్ జయంతి....వద్దు ఊరుకో...అవి చాలా ప్రమాదం" అంది కస్తూరి.

    "ఏం కాదులేమ్మా, నువ్వుండు.....నేనింకా చిన్నపిల్లనా ఏంటి" అంది జయంతి సీరియస్ గా.

    "పెద్దదానివి అయిపోయావా? అయితే పెళ్ళి చేసుకో" అంది దాక్షాయణి.

    "అమ్మో! చిన్నపిల్లనేలే....అయినా రాకెట్లు కాల్చగలను" అంటూ "బావా...ఒక రాకెట్ ఆ సీసాలో పెట్టు" అంది జయంతి. చాలా రోజుల తరువాత సురేంద్రని పలకరించింది. సురేంద్ర ఆ పిలుపుకి అనందపడిపోతూ.

    "ఇదుగో పెట్టాను" అన్నాడు. జయంతి కాకరపువ్వోత్తిని వెలిగించుకుని దూరంగా నిలబడి రాకెట్ కు అంటించింది. అది వెంటనే రయ్ మంటూ ఆకాశంలోకి దూసుకెళ్ళింది. అందరూ చప్పట్లు కొట్టారు.

    "ఏది చిన్నపిన్ని, వందరుపాయలు" అంది జయంతి.

    "ఇస్తా తల్లీ, మీ బాబాయ్ ని అడిగి రేపు ఇస్తాలే" అంది.

    "అట్లారా దారికి...నాతో ఎందుకు పిన్ని పందాలు" అంది నవ్వుతూ.

    "బుద్దొచ్చింది తల్లీ! ఇక ఎప్పుడూ నీతో పందెం కాయను" అంది శివపార్వతి. అందరూ నవ్వారు.

                                         *    *    *    *
    "జయంతి....అందరికి నీళ్ళు పెట్టమ్మా....మేము భోజనాలు వడ్డిస్తాము" అంది కస్తూరి.

    "పిల్లలూ...మీరంతా ఇలా కూర్చోండి వరుసగా" అంది జయంతి క్రింద చాపలు పరిచి.

    వాళ్ళు బిలబిలమంటూ వచ్చి కూర్చున్నారు.

    "అమ్మా! నాకు జిలేబి కావాలి" అన్నాడు నాని.

    "నోర్ముయ్ రా ఎన్ని తింటావు? ముందు అన్నం తిను, ఆ తరువాత జిలేబి అంది దాక్షాయణి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS