ఏ తల్లి దుఃఖాన్నయినా మరిపిమ్చడం యింత సులభమయితే ఎందరో కొడుకులు ఎందుకు విఫలమౌతున్నట్టు! ఇక ఒంటరి చేపలా వున్న అమ్మ రేపటి బ్రతుకు రూపాన్ని వుహించుకుంటు సంతోషపడుతుంటే నవమాసాలు మోసి, కని దశాబ్దాలపాటు పెంచిన తల్లికి యింత స్వల్పమైన అనందం యివ్వడంలో తప్పేమిటి అనుకున్నాడు.
మాసిన చొక్కాని కొక్కేనికి తగిలించినట్టు నిన్నటి విషాదాన్ని తాత్కాలికంగా అయినా మరిచిపోయిన అమ్మ "నిన్న మీ నాన్నగారు పని చేసే ఆఫీసు స్నేహితులొచ్చార్రా. నా దగ్గర ఏవో సంతకాలు తీసుకెళ్ళారు. మీ నాన్నగారు వాడేసిన ప్రావిడెంట్ ఫండ్ , మిగతా అప్పులు పోగా రెండు లక్షలు దాకా వస్తాయట" అంది.
రెండు లక్షలు.
అక్కడ క్షితిజ పెళ్ళికి అవసరమైన డబ్బు కూడా రెండు లక్షలే......కానీ ఎలా అమ్మని ఒప్పించగలడు? నాన్న అమ్మని ఒక రకంగా వంచించితే యింకో రకంగా తనూ మోసం చేసి వాళ్ళకి ఎలా సాయం చెయ్యగలడు? తండ్రి చేసింది తప్పో ఒప్పో అని కాదు ధన్వి ఆలోచిస్తున్నది. తనూ ఎమోషనల్ గా మాటిచ్చాడు. నాన్న చివరి కోరిక తిర్చాలన్నట్టుగా....ఎలాగన్నా ఆ రెండు లక్షలు సర్దాలి.....
'మరిచిపోయానురా......నిన్న నీకేదో కవరోచ్చింది'
సావిత్రి గదిలో నుంచి ఓ ఎన్ వలప్ ని తెచ్చిచ్చింది.
ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ అపాయింట్ మెంట్ ఆర్డర్, అవకాశమన్నది కేవలం అవినీతి మార్గంలోనే దక్కించుకోవాల్సిన అవసరం లేదని నిరూపించిన అందమైన ఉదాహరణ. కానీ చూడటానికి నాన్నలేరు. "నాకు ఉద్యోగం వచ్చిందమ్మా.....డిల్లీలో, నెలకి పదిహేను వేలు జీతం."
సావిత్రి కళ్ళనుండి బొటబొటా నీళ్ళు రాలేయి. ఆ క్షణాన్ని పంచుకోవటానికి భర్త లేడని గుర్తుకొచ్చి బాదే అనిపించిందో లేక కొడుకు సాధించిన గర్వమే అనిపించిందో ధన్వి బుగ్గలు ముద్దాడింది. ;దేవుడు కరుణించాడు ఇంత కాలానికి.'
అలా అనుకోవడమే ఆమెకి సంతృప్తినిచ్చే విషయమైతే ఆమెకి పరిమితమైన చిన్న ప్రపంచంలోకి అడుగుపెట్టి ఆమెకు అర్ధం కాని ధియరీ మాట్లాడం అతడికిష్టం లేదు.
అప్పుడతడికి ముందు గుర్తుకొచ్చింది సామ్రాజ్యం.
* * * *
"బుల్ షిట్.....నీ సంజాయిషీ నేను వినదలచుకోలేదు, సంజీవి..... డోంట్ కాల్ మి! ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవేం" ఆవేశంగా ఫోన్ రిసీవరుని హుక్ మీద వుంచిన సామ్రాజ్యం ఆ తరువాత బెడ్ రూంలోకి నడిచి ఫ్రిజ్ లోని విస్కీ బాటిల్ అందుకుని గడగడా రెండు పెగ్గుల్ని తాగేసింది అసహనంగా.
అప్పుడు గుండెకన్నా ఎక్కువగా గొంతు మండుతోంది.
"సామ్రాజ్యం."
ఉలిక్కిపడింది సామ్రాజ్యం. ధన్వి యీ వేళలో వచ్చాడే?
వెంటనే బయటికి నడవలేకపోయింది.
ఎప్పుడో నిద్ర రాని రాత్రి వేళల్లో తను తాగడం గురించి ధన్వికి తెలుసు.
కానీ యిప్పుడు ఉదయం పది గంటలు కావస్తుంది.
ఈ వేళలో తను తాగి వుండటం తెలిస్తే ధన్వి ఏమనుకుంటాడు?
ఇలా ఆలోచించింది అరక్షణమే.
అప్పటికే మత్తు ఆమెను ఓడించి నిబ్బరాన్ని మించిన వివశత్వాన్ని కలిగిస్తుంటే.....
ఇంకోసారి పిలిచిన ధన్వి కంఠం వింటూ గది దాటి హాల్లోకి వచ్చింది.
ధన్వి అప్రతిభుడై చూడటం తెలుస్తూనే వుంది.
కారణం ఏం చెప్పేదో కానీ అంతలోనే ఫోన్ రింగయింది.
కోపం, ఉక్రోషం ఆమెను చుట్టుముడుతుంటే మళ్ళీ ఫోన్ చేసి డిస్ట్రబ్ చెయ్యాలనుకుంటున్న సంజివికి బుద్దిచెప్పాలని సామ్రాజ్యం ఆవేశంగా రిసీవర్ అందుకుంది. "హల్లో" అరిచింది కోపంగా.
"నేను మధూళీని."
చిత్రమైన విరామం.
"సారి!.....మధూ" నవ్వింది సామ్రాజ్యం. కనురెప్పలు బరువుగా వాలిపోతుంటే.....
"ఎంటదోలా వున్నారు?" మధూళీ అడిగింది విస్మయంగా. ఎందుకు ఫోన్ చేసినా గానీ మధూళీకిప్పుడు తను దొరికిపోయింది. అయినా తానెందుకు భయపడాలి? "బాగానే వున్నానే."
"అబద్దం చెబుతున్నారు."
మధూళీ అన్నది చనువుతో అయినా అది తను కోరని కవ్వింపులా అనిపించి ప్రస్తుతం వున్న మానసిక స్థితిలో ప్రశాంతంగా జవాబు చెప్పలేకపోయింది సామ్రాజ్యం.
"మీ అభిమానానికి థెంక్స్ మిస్ మధూళీ......నేను నిజంగానే మీకు అబద్దం చెప్పాను.....ఎందుకంటే నిజంలో బ్రతకడం మిస్ అయిన ఆడదాన్ని కాబట్టి."
సామ్రాజ్యంలో అదోలాంటి అసహనం. "ఏం చేయను మధూళీ......నేను వదిలేసిన గతం నన్ను మళ్ళీ వెంటాడుతుంది. నేను కోరుకున్న వర్తమానం నన్ను పరిహాసంగా పరీక్షిస్తుంది. తప్పదుగా, గెలిచేదాకా పోరాడాలి, జీవితంగా....." అంది కాంక్షగా ధన్విని చూస్తూ.
"మీ గురించి నాకు ముందే చెప్పారు సామ్రాజ్యం, కానీ గతం వెంటాడ్డమా వర్తమానం పరిక్షించడంమూ అన్న వాక్యాలను మాత్రం నేను అర్ధం చేసుకోలేకపోతున్నాను."
"సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను మధూళీ!"
బలవంతంగా నవ్వుని అభినయిస్తూ "చెప్పండి, హటాత్తుగా ఫోన్ చేశారు. ఏదన్నా విశేషమా....." అంది ధన్విని చూస్తూ.
గొప్ప విశేషంలా మీకు చాలా చెప్పాలనే ఫోన్ చేశాను సామ్రాజ్యంగారూ! కానీ మీ మూడ్ సరిగా లేదుగా?"
