ఆ తరువాత సంజీవి తన కారులోనే ధన్విని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు.
బడలికగా యింట్లో అడుగుపెట్టిన ధన్వి ఓ మూల కూర్చుని వేదన మాటున వెలిగి వెలగని దీపంలా కంటతడి పెట్టుకుంటున్న తల్లిని చూశాడు.
నాన్నతో గడిపిన జీవితం గుండె గుహంతరాల్లో చెరగని చారికలా ఆమెను అందోళన పరుస్తుందన్న నిజం తెలుస్తున్నా యిలాంటి సమస్య అమ్మ జీవితానికి మాత్రమే పరిమితమైంది కాదుగా......ఎలా ఓదార్చాలో?
"ఇరవై నాలుగు గంటల్లో వస్తానని వెళ్ళినవాడివి యిప్పటికి తీరికైందన్నమాట" అంది సావిత్రి కళ్ళు తుడుచుకుంటూ. అమ్మ గొంతులో కోపం లేదు. తన ఒంటరితనం గురించి గుర్తు చేస్తున్నట్టుగా వుంది.
ఇంతకాలము అప్పుడప్పుడూ తన గురించి కంటతడి పెట్టుకునే అమ్మని బుజ్జగించడం మాత్రమే తెలిసిన ధన్వి హటాత్తుగా తనమీద మరేదో భాద్యత బరువు పడ్డట్టుగా అనిపించడంతో "నేను కూడా నీతో కూర్చుని కంటతడి పెట్టుకుంటే నీకు ఆనందంగా వుంటుందా?" అన్నాడు చిరుకోపంగా.
"నేను అడుగుతున్నది నువ్వు రెండు రోజులుగా ఎక్కడికి వెళ్ళావని....."ఉక్రోషంగా చూసింది సావిత్రి.
ఆ చూపులో ఏం కనిపించి అతణ్ణి వివశుడ్ని చేసిందో అమాంతం తల్లిని చేతుల్లోకి తీసుకున్నాడు.
"నేను వెళ్ళింది ఎక్కడికయినా గానీ నిన్నెలా మరిచిపోతాననుకున్నవే......నాన్నగారు నాకు భాద్యత అప్పచేప్పినప్పుడు అన్నీ సవ్యంగా నిర్వహించి మంచి కొడుకుని అనిపించుకోవాలిగా....."
"అంటే....." సావిత్రిలో ఏ ఆలోచన మెదిలిందో వెంటనే అడిగింది.
"అయన పోయేదాకా నికంటు బాధ్యతలున్నాయన్న విషయం నీకు అర్ధం కాలేదన్నమాట."
"తనకంటూ ఎన్ని భాద్యతలున్నాయో నాన్నగారూ చెప్పలేదు కాదమ్మా.....బహుశా నేను సమీపంలో వుంటే చెప్పేవారేమో....." నర్మ గంభీరంగా అన్నాడు తల్లిని ఏకాగ్రతగా చూస్తూ.
"అంతా మన తలరాతరా....." ఉన్నట్టుండి ఆమె నేత్రాలు నీటికుండలయ్యాయి. "చివరి క్షణంలో అయన ఎంత మదనపడింది నీకు తెలీదు. అసలు అయన ఏం చెప్పాలనుకున్నారో యిప్పటికీ నాకు భోధపడటం లేదు."
"చెప్పకపోతే మాత్రం నేను అర్ధం చేసుకోలేనా అమ్మా?" సాలోచనగా యింటి పై కప్పు చూస్తూ చెప్పాడు ధన్వి.
"ఆయన బాధపడింది చెప్పాలని ప్రయత్నించింది కట్టుకున్న భార్య గురించి."
అర్ధంకానట్టు చూసింది సావిత్రి.
"జీవితం పంచుకున్న ఆడదాని గురించి ఆలోచించడం తాళికట్టిన భర్తగా అయన భాద్యతేగా అమ్మా- అందుకే....." తన మాటల్లో ద్వంద్వాన్ని అర్ధం చేసుకోగలిగే శక్తి లేని పిచ్చిదని తెలిసి పరోక్షంగా నిజం చెప్పాడు. ఓదార్చటానికి అవకాశమూ తీసుకున్నాడు. "నికేవరున్నారమ్మా, నేను తప్ప.....బహుశా నేను నీ గురించి పట్టించుకోకుండా నా మొండితనంతో నిన్నెక్కడ బాధపెడతానో అని ఆలోచించి వుంటారు. ఆ హామీ నా దగ్గర తీసుకోవటానికి నాన్నగారు నాకోసం అడిగివుంటారు."
తండ్రి మరణం బ్రతుకు సముద్రంలో సృష్టించిన అల్పపీడనం గురించి ఆలోచిస్తూ ఓదార్చాడు.
"భయపడకమ్మా ! మీరంతా అనుకున్నట్టు నేను బ్రతకడం చేత కాని అసమర్దుడ్ని కాను. నేను బ్రతుకుతాను. నిన్ను సుఖంగా బ్రతికించుకుంటాను. నీ మీద ఒట్టమ్మా.....నువ్వు ఆనందించేట్టు , నాన్న ఏ లోకంలో వున్నా నన్ను చూసి గర్వపడేట్టు ఎదుగుతాను.....సరేనా?"
ఆర్తిగా చూసింది సావిత్రి.
ధన్వి ఎన్నోసార్లు తన జీవితం గురించి ఆశావాదం ప్రకటిస్తూ మాట్లాడేడు గానీ యిలా ఇంత ధైర్యాన్నిస్తూ మాటాడటం తొలిసారి . "నాన్నలాగా నన్నెప్పుడు బాధ పెట్టవుకదా?"
"ఛఛ......."
"నేనెందుకు బ్రతికున్నాను అని నేను బాధపడెట్టు చెయ్యవుగా" మనసు కలచివేసినట్టయింది. అంతకుమించి మాటలతో ఆమెను మరింత వూరడించాలనిపించింది.
నాన్నని నేను బాధపెట్టలేదమ్మా, తానే బాధపడ్డాను, నాన్నని నేనెంత ప్రేమించింది నాన్నకి తెలీకపోయినా నువ్వు గ్రహించివుంటావుగా నాన్న తాగి ఆరోగ్యం పాడుచేసుకుంటుంటే నేను నీ దగ్గర బాధపడ్డ విషయం నీకు తెలుసు. నాన్నకి కాళ్ళనొప్పులయితే కాళ్ళు పట్టి నేను సేవ చెయ్యడం నువ్వూ చుశావ్" సగటు మనస్తత్వం కల అమ్మ మనసు వూరట చెందాలి అంటే యిలానే మాట్లాడాలని నిర్ణయించుకున్న ధన్వి తన మాటల్ని చాలా ఆసక్తిగా వింటున్న తల్లి ముందు యింకా ఉద్వేగాన్ని ప్రదర్శించాడు. "చూడు నేను నిన్నిలా ఖాళిగా వుంచుతాననుకున్నావటే......పెళ్ళి చేసుకుంటాను అందరు కొడుకుల్లాగా. ఆ తరువాత పిల్లల్ని కంటాను, ఆ పిల్లల్ని సరిగా పెంచడం చేతకాకపోతే మా అమ్మని చూసి నేర్చుకోమని మా ఆవిడకి చెబుతాను. అమ్మ ప్రేమంటే ఎలా వుండాలో నిన్ను చూసి నేర్చుకోమని మా ఆవిడ్ని తిడతాను."
"తిడితే నేను వురుకుంటానట్రా" గయ్యిన లేచిన తల్లిని విప్పరితంగా చూశాడు. "నీ పళ్ళు రాలకోడతాను" సావిత్రి యింకా వుతికి అరబెట్టేదే. ;లాలనగా ఆమె తలనిమిరాడు.
ప్రతి అమ్మా యింత అల్పసంతోషిగానే వుంటుందా? లేక.....
బిడ్డల దగ్గర యిలా వుండటాన్ని కోరుకుంటుందా?
అమ్మ కళ్ళలో సంతృప్తిని మించిన గర్వం చూస్తుంటే ఆనందంగా వుంది ధన్వికి. అసూయ, ద్వేషం, స్వార్ధం తెలీని అమ్మ రేపు తను కొడుగ్గా ఏం అందిస్తాడో అన్న విషయం గురించి కాక అంతా తనకి అనుకూలంగా జరుగుతుందన్న నమ్మకంతో కొన్నేళ్ళ 'ప్లాష్ పార్వర్డ్' లోకి జారిపోయి తను యింకా రాయని రేపటి అధ్యాయంలోని ఓ పాత్రగా మారిపోయింది. ఇప్పటి నిస్సత్తువని, విరామాయ స్థితిని ఎదిరించుకుని అపుడు తను ప్రదర్శించబోయే ఆవేశానికి యిప్పుడే రూపమిచ్చి మంచి అత్తయ్యగా అనిపించుకోటానికి ప్రణాళిక సిద్దం చేసుకుంటుంది.
