ఆమెకి సుధాకర్ ను వదిలి వెళ్ళడమంటే,ఏదో తను చచ్చిపోవడానికి వెళుతున్నట్లుంది. అయినా ఆడపిల్ల న్నాక పెళ్ళిచేసుకుని, అత్తవారి ఇంటికి వెళ్ళిపోవాల్సిందికదా అని తనను సర్దిచెప్పుకుంది.
అయితే ఆమెలాంటి అమ్మాయిలకు ప్రేమ, పెళ్ళి ఆలోచనరాదు. అందుకే ఆమెకీ సుధాకర్ ను పెళ్ళి చేసుకోవాలన్న ఆలోచన రాలేదు. ఐతే మాత్రం దానికి కారణాలు చాలానే ఉన్నాయి. ఆమె కులం, చుట్టూ వున్న వాతావరణం, పదో తరగతికి మించిన చదువు-
ఇలాంటి కారణాలవల్లే ఉమలాంటి అమ్మాయి ప్రేమ మిషన్ షెడ్ వరకు పరిమితమైపోతుంది.
అందుకే నిశితంగా గమనిస్తే, ప్రేమ పెళ్ళి ళ్ళు చేసుకునే అమ్మాయిలు ఎక్కువుగా అగ్రకులానికే చెందినవారుగా వుంటారు. అందులోనూ రాజకీయంగా, సాంఘికంగా, ఆర్ధికంగా బాగా వున్న రెండు మూడు కులాలకు చెందిన అమ్మయిలు మాత్రమే వుంటారు.
దీనికి కారణం చిన్నప్పట్నుంచ వాళ్ళు పెరిగిన వాతావరణం, సంఘాన్ని ఎదిరించి పెద్దలకు చెప్పా పెట్టకుండా ప్రేమించినా వాడ్ని పెళ్ళి చేసుకోవాలంటే ప్రపంచజ్ఞానంతో కూడుకున్న ధైర్యం ,తెగువా కావాల్సి వస్తాయి. చిన్నప్పట్నించీ భయం గా పెరిగే ఉమలాంటివాళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడాలంటే చాలా మార్పులే జరగాలి. తాము అన్నిట్లోనూ తక్కువన్న ఇన్ ఫీరియారిటీ కాంప్లేక్స్ వల్లతామై ముందుకు రాలేకపోతారు. అందుకే ఎలాంటి పశ్చాత్తాపాలూ, ప్రాధేయపడడాలూ లేకుండూ ఉమ దాసూ దగ్గర మెడవంచి మూడు ముళ్ళూ అతనిచేత వేయించుకుంది.
మొదటిరాత్రి అతను తొడ దగ్గర ఏర్పడిన గా గురించి ప్రశ్నిస్తాడన్న భయం ఆరాత్రి తెల్లవారేటప్పటికి లేకపోయింది. చెట్టు నుంచి పడ్డానన్న ఆమె చెప్పినదాన్ని అతను పూర్తిగా నమ్మాడు.
ఇక రోజునుంచీ వాళ్ళ దాపత్యం అన్ని కాపురాల్లాగానే సంతోషంగా ప్రారంభమైంది. రోజులు గడిచేకొద్దీ భార్యాభర్తలకి భ్రమలు తొలగి పోవడం ప్రారంభమయ్యాయి. పై పెచ్చు తానిలా వుండడానికి ఎదుటివ్యక్తే కారణమని నమ్మడం ఆరంభమయ్యింది దాసూకి.
తమ సంసారం ఇంత నిస్సారంగా వుండడానికి కారణం తమకు మినిమమ్ గా అయినా డబ్బు లేకపోవడమేనని ఆమె కనిపెట్టింది. అందుకు గల ప్రత్యామ్నాయాలను కూడా ఆలోచించి పెట్టింది.అందులో ఒకటి, గోపాల్రావును బుట్టలో వేసుకోవడం. అంతకంటే గౌరవప్రదమైనమార్గం కనపడలేదా మెకి.
ఎక్కడైనా తనలా శరీరం కష్టం చేసుకుని బతకగలిగే స్త్ర్రీలకు అత్తింట్లో ఎందుకుండాలో , మొగుడనేవాడ్ని ఎందుకు భరించాలో అర్దంకాలేదామెకి.
అందుకే మొదట్లో అయితే భర్తను వదిలి పెట్టి పుట్టింటికి వెళ్ళిపోవాలనుకుంది. కానీ అలా తెంచుకుపోలేక పోయింది. తిరిగి వెళ్ళలేనంత దూరం తను ప్రయాణించానన్న నిజాన్ని గుర్తించగలిగింది.
మూలం ఏమిటో తెలిపోయింది. ఆమెకి అది డబ్బు. దానిని పొందే మార్గం కూడా క్లియర్ గా కనిపించిందామెకి. ఆ దారి గోపాల్రావు.
ఆరకంగా అనుకున్నప్పట్నీంచి స్త్రీ గా తను ఎంతవరకు చెప్పగలదో అంతవరకు చూపుల్లో , పైట సర్దుకోవడాల్లో చెప్పింది.
అతను గుర్తించినట్టు, గుర్తించనట్టూ కనిపించాడు. స్పష్టంగా బయటపడింది. ఈరోజే. తమ కష్టాలన్నీ తీరిపోయినట్టనిపించింది. చాలా రోజుల తరువాత సంతోషం తాలూకు తీపి గుండెల్లో మొదలైంది. ఉమ కళ్ళు మూసుకుంది. రంగురంగుల కలలు మరికొంతసేపటికి మొదలయ్యాయి.
* * * *
"నా వల్ల కాదయ్యా సురేషూ!" అంటూ రెండు చేతులూ జోడించింది చింతామణి.
"ఏమైందో ఏమోనని అతను కంగారుపడ్డాడు. ఆమె డ్రాప్ అయితే ఇ క ఇంతే సంగతులు . తనకీ , శశిరేఖకీ మధ్యన ఏర్పర్చుకున్న వంతెన కూలిపోతుంది.
అప్పటివరకు ఎంతో జాలీగా వున్న అతను ఒక్కసారిగా గాలి తీసిన బిలూన్ లా అయిపోయాడు.
అప్పుడే పొలంనుంచి ఇంటికొచ్చాడు. స్నానం చేసి శుభ్రంగా తయారయ్యాడు. తన రూమ్ లో వచ్చి కూర్చున్నాడు. అతని రూమ్ ని చూస్తూనే అతని అభిరుచులు ఎలాంటివో చెప్పేయచ్చు. ఆగది అంత శుభ్రంగా, అందంగా వుంటుంది. రకరకాల ఫోటోలు, బీరువాలనిండా పుస్తకాలు, పెయింటింగ్స్,ఇలా ఆగదిని చూస్తేనే ఓ రకమైన ఫీలింగ్ కలుగుతుంది.
"ఏమైంది?" తను రాస్తున్న పుస్తకాన్ని మూసివేసి అడిగాడు- ప్రేమమీద, విరహంమీద గొప్ప గొప్ప వాళ్ళు రాసిన గేయాలు, పద్యాలు ఓ పుస్తకంలోరాస్తున్నాడు. వాటినెప్పుడో ఒకప్పుడు శశిరేఖకు వినిపించాలని అతని తాపత్రయం. ఒకరికోసం ఒకరు పరితపించడాన్ని ఎంత గొప్పగా చెప్పారో ఆమెతో చర్చించాలనుకుంది.అందుకే ఆపుస్తకాన్ని తయారుచేసే పనిలో వున్నాతను.
మొదటగా గాలిబ్ రాసిన గేయాన్ని ' నేను మరణింప; ఆమె చింతించ దొదగె: ఎంత తొందరగా కరుణించె నన్ను ' రాశాడు. శశిరేఖను తలుచుకుంటూ అలా రాస్తుంటే గుండెంతా ఏదో తెలియని భావావేశంతో సాగుతున్నట్టు అన్పిస్తోంది అతనికి.
అలాంటి సమయంలో చింతామణి వచ్చి అలా అనడంతో నిరుత్సాహంతో మనసేకాదు. శరీరంకూడా ముడుచుకుపోయినట్లనిపించింది.
ఏదో బాధ యాక్సాబ్లేడ్ లాగా గుండెను రెండు ముక్కలుగా కోస్తున్నట్టు విలవిల్లాడిపోయాడతను.
" మొన్న మాట్లాడానుగదా-ఎంత మంచి మనిషో! అలాంటి అమ్మా యిని నేనింతవరకూ ఎక్కడాచూళ్ళేదు. నీ పాట్లేవో నువ్వు పడు. నా సంబంధం వద్దు. నీవు ఇచ్చిన రెండెకరాలూ నాకొద్దు- అందులో నేను అనాధ మహిళకోసం ఆశ్రమం కట్టాల్సిన పనేలేదు" అంటూ చేతులు మళ్ళీ జోడించింది చింతామణి. అప్పటికి వూపిరి వదిలాడు అతను. రిలాక్స్ గా ఫీలయ్యాడు.
" అదేనా- ఇంకా ఏదో అయ్యిందని అదిరిపడ్డాను. మంచమ్మాయికాబట్టే ప్రేమిస్తాం" అన్నాడు.
అతను అలా మెలికపెట్టడంతో ఆమె దగ్గర ఎలాంటి జవాబూలేదు." అయితే ఇందులో నిమిత్తమాత్రురాలినే. మరీ నా మీద ఆధారపడి పోవద్దు."
" అక్కర్లేదు- నువ్వేదీ చేయద్దు- అలా వుండు చాలు."
ఆమె ఇక ఏమీ అనలేకపోయింది. అతను ఆమెను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో మొదట తాను ఆ మాట అనడంతో ఎంతగా గిలగిల్లాడి పోయాడో కనిపెట్టింది. అందుకే వెంటనే మెత్తబడిపోయింది.
"సరే వస్తా- నేను ఇప్పుడు అక్కడికే వెళుతున్నాను. మీకోసం మాత్రం కాదు. ఎందుకనో ఆమె అంటే నాకూ చాలా యిష్టం కలిగింది. కాసేపు ఆమెతో మాట్లాడాలనిపించింది" ఆమె లేచింది చింతామణి.
అతనూ నవ్వుతూ లేచి నిలబడ్డాడు. ఆమె అక్కడ్నించి బయటపడింది.
"శశిరేఖ ఇంటికి వెళ్ళేటప్పడికి ఆమె వూహించినట్టుగానే గంగారత్నం గుడికి వెళ్ళింది. శశిరేఖ నవ్వుతూ చింతామణిని ఆహ్వానించింది.
"సాయంకాలంపూట వేడి వేడి కాఫీ తాగడం బావుంటుంది.... కూర్చోండి" అంటూ నాలుక్కురుచుకుని " బహూవచనం వద్దన్నావు కదా- కూర్చో" అంటూ సవరించింది.ఇద్దరూ వరండాలో కూర్చున్నారు.
