ప్రేమ్ లేచి నిలబడి "పనుంది మళ్ళీ కలుస్తా" అని వెళ్ళిపోయాడు.
ధృతికి నవ్వొచ్చింది ఏమిటీ మనసు? ఆయన మీద కోపం వచ్చినప్పుడు మనసులో విమర్శించుకున్నా ఎవరైనా ఆయన గురించి చిన్న మాటన్నా భరించలేకపోవడం ఎందుకూ?
బియ్యం పళ్ళెం తీసుకుని వంటింట్లోకి నడిచింది. లైట్ స్విచ్ వేసింది. ఒక్కసారిగా వెలిగి ఆరిపోయింది. ఇల్లంతా చీకటి అలుముకుంది. క్యాండిల్ ఎక్కడా లేదు. ఆమె తడుముకుంటూ బైటికి వచ్చి-
"సుబ్బరాజూ.....సుబ్బరాజూ" అని పిలవసాగింది.
"ఏమైంది?" సమీపంగా నవీన్ గొంతు విన్పించింది.
"కరెంట్ పోయింది. ఎంతసేపయింది నువ్వొచ్చి?"
"ఇప్పుడే ఆయన్ని దింపి వెళ్ళిపోదామనుకుంటూ వుండగా నీ గొంతు విన్పించి యిటు వచ్చాను."
"ఇంట్లో క్యాండిల్ కూడా లేదు."
"కరెంట్ వాళ్ళింట్లో వుంది. ఇక్కడ లేదు అంటే, బహుశా ఫ్యూజ్ పోయి వుంటుంది. పద! చూద్దాం" అన్నాడు ఆమె పక్కకి జరిగానని అనుకుందికానీ అతనికి సరిగ్గా అడ్డుగా వచ్చి నిలబడింది.
మొహానికి బలంగా ఆమె మొహం కొట్టుకోవడంతో నవీన్ కి ఒక్క నిమిషం ఏం జరిగిందో అర్ధం కాలేదు. అర్ధమయ్యాక అతను కదలలేదు. ఆమె మొహాన్ని అలాగే రెండు చేతులతో బంధించి తనకి దగ్గరగా తీసుకున్నాడు.
పెదవులు బిగించిన ధృతి నోటినుండి "వూ.....వూ...." అన్న శబ్దం ఒక్కసారి వెలువడి అంతలోనే ఆగిపోయింది.
"అధరాలు రెండూ ఆమనులాయే....
అలరారు పరువమే లహరులు రేపే" అన్నట్లు ఆమె భాషకందని భావంతో అచేతనత్వం పొందింది. ప్రేమించినవారికి దూరంగా వుండటం ఎంత బాధాకరమో, ఒక్కసారి దగ్గరయి విడిపోయాక కానీ తెలియదు.
నెమ్మదిగా అతని నుంచి విడిపడ్డాక "ఏమిటి నువ్వు చేసిన పని?" అంది సిగ్గో, కోపమో తెలియని స్థితిలో.
"ముందుకు వెళ్ళలేని ప్రతిబంధకం ఎదురయినప్పుడు ఆగి, అదేమిటో పరీక్షించడం నా అలవాటు."
అతను బహుశా మీసాల చాటున నవ్వు దాచుకుని వుంటాడు. చీకటివల్ల తెలియలేదు.
జేబులోంచి అగ్గిపెట్టె తీసి ఓ పుల్ల వెలిగించి 'మీటర్' బోర్డుదగ్గరికి వెళ్ళి 'ఫ్యూజ్' పరీక్షించసాగాడు. మళ్ళీ ఓ పుల్లగీసి "నా జేబులో చిన్న బాక్స్ వుంటుంది తీసియ్యి" అన్నాడు.
ఆమె అతని ప్యాంట్ జేబులు తడిమి బాక్స్ లాంటి వస్తువు తీసి ఇచ్చింది. అతనందులోంచి అతి జాగ్రత్తగా రాగి తీగ తీసి "అగ్గిపెట్టె తీసుకుని ఇంకో పుల్ల వెలిగించు" అన్నాడు.
ఆమె వెలిగించాక అతను ఫ్యూజ్ వేశాడు.
అతను బాక్స్ ఆమె చేతిలో వుంచి "నా జేబులో పెట్టు" అన్నాడు.
ఆమె అలాగే చేసింది.
అతను రెండడుగులు వేసి ఆమె భుజాలని బిగించి పట్టుకుని "మళ్ళీ ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఎదురయింది" అన్నాడు.
ధృతి ఏదో అనేలోపే పెదవులకి వెచ్చనిస్పర్స లభించింది. వాటికి అదెంతో నచ్చినట్లు యీసారి ఆమె నోటినుండి ఎటువంటి శబ్దాన్నీ బైటికి రానియ్యలేదు.
నిమిషం తరువాత నెమ్మదిగా వదిలిపెట్టి "మంచినీళ్ళు తీసుకురా" అన్నాడు.
"అగ్గిపుల్ల గియ్యి" అంది చీకట్లో తడుముకుంటూ.
"స్విచ్ ఎక్కడుందో చూసి వెయ్యి" తాపీగా చెప్పాడు.
"ఫ్యూజ్ వేశావా? మరి నన్నెందుకు ఆ బాక్స్...?" అనబోయి ఆగిపోయింది.
ఈలోగా నవీన్ లైట్ వేసి ఆమె కళ్ళల్లోకి చూసి నవ్వాడు.
అతనికి ఆరోజు మొదటిసారిగా తెలిసింది ధృతి చాలా అందంగా సిగ్గుపడుతుందని.
"గుడ్ నైట్!" చెప్పి వేగంగా వెళ్ళిపోయాడు.
గుమ్మంలో నిలబడి అతను గేటు దాటేవరకూ చూసి వెనుతిరిగింది ధృతి.
బాల్కనీలో నిలబడి పైప్ తాగుతున్న వ్యక్తి భ్రుకుటి ముడిపడింది ఆ దృశ్యం చూసి.
* * *
"నేను ఈ రోజు టిఫిన్ బాక్స్ తెచ్చుకోలేదు" అంది లీల.
"ఫరవాలేదు. షేర్ చేసుకుందాం" చెప్పింది ధృతి.
"హా....య్!" అంటూ ప్రేమ్ వచ్చాడు.
లీలా, ధృతి విష్ చేశారు.
"లంచ్ టైం అనుకుంటాను! బయట చేద్దాం వస్తారా?" అడిగాడు.
"ధృతి ఒక్కర్తినీ పిలుస్తున్నారా?" అడిగింది లీల.
"నో...నో...మీరు కూడా జాయిన్ అవచ్చు" చెప్పాడు చిరునవ్వుతో.
"థాంక్యూ పద ధృతీ" అంది లీల వెంటనే.
ఆమెకి తప్పలేదు. లేచి అతన్ని అనుసరించింది.
ముగ్గురూ క్రిందకి వచ్చేసైర్కి కారుని ఆనుకుని నిలబడి పేపర్ చదువుతూ నవీన్ కంటబడ్డాడు.
ధృతి ఆనందంగా అటు నడిచి "హాయ్! ఏమిటీ అంత దీక్షగా చదువుతున్నావు?" అంది.
అతను ఆమెనీ, మిగిలిన ఇద్దర్నీ చూసి చిరునవ్వుతో "నిన్నటి వరకూ 'ఎంప్లాయిమెంట్ న్యూస్' చూసేవాడిని మీ దయవల్ల నాలుగు రోజులనించీ ఆ పేజీ చూడటంలేదు" అన్నాడు.
"ఇప్పుడు 'మేట్రిమోనియల్' కాలమ్ చూస్తున్నారా?" అడిగేసింది లీల.
నవీన్ ఏం చెప్తాడోనని ధృతి అతనికేసి చూసింది.
