Previous Page Next Page 
మళ్ళీ వచ్చిన వసంతం పేజి 42

  

    'అంతే - భగవంతునిదయ - ఆరోజు నా పూలజడపీకావు గుర్తుందా'
   
    'ఆ - ఆరోజు నన్నుగిల్లావుగుర్తుందా' గాయత్రి రామం కిలకిలా నవ్వుకున్నారు. రాత్రిచాలా పొద్దుపోయింది -
   
    వారం రోజులయింది రామం వెళ్ళి - లలిత మనసు మనసులోలేదు - శంకరు అన్నయ్య కూడా ఇప్పుడే ఎందుకెళ్ళాడో  -లలిత తండ్రితో ఆరోజు శారద అన్నమాటలు చెప్పాలనుకుంది. కానీ తను తొందరపడటం దేనికీ, శంకరు అన్నయ్య వచ్చి ఆశ్చర్యపరిచి శుభవార్త చెప్పాడులే అని మనసుని ఒప్పించింది. రోజూకన్నా లలితకి ఆరోజు చాలా సంతోషంగా వుంది ఎందుకో! రామం తనని పెళ్ళి చేసుకోబోతున్నాడు - తన జీవితం ధన్యమయినట్లే - నిజానికి ముందుచూపులేక ఆరోజుల్లో రామాన్ని శారదకి పరిచయం చేసిందేతను - అయితే ఏమయిందిలే - చివరకి రామం తనవాడే అవుతున్నాడుగా లలిత వీధి గుమ్మంలో పెద్ద పెద్ద ముగ్గులు ఎంతో అందంగా వేసింది. గుమ్మాలకున్న కర్టెన్లు మార్చింది. ప్రత్యేకంగా శ్రద్దగా రెండు మూడు పదార్ధాలు ఎక్కువచేసింది - రామం వస్తాడు ఈ పూట ఎలాగైనా భోజనం తన యింట్లోనే పెట్టాలి - వాళ్ళమ్మ ఎందుకొచ్చిందో, మళ్ళీ తనెందుకు వెళ్ళాడో - అసలు ఆ హడావిడి ఏమిటో - అంతా మాటల సందర్భంలో రాబట్టాలి. ఫోటో విషయం, రామనాథం ప్లీడరు -ఒకటోకటీ చెప్పించాలి. శంకరావు అన్నయ్యనోటినుంచికన్నా, రామం నోటి నుంచే శుభవార్త వినాలి తనూ, నాన్న లలిత రోజుకన్నా అందంగా అలంకరించుకుంది వీధిలో ఏ ఆటో శబ్దమయినా రామమేవచ్చాడనుకొని గుమ్మందాకా పరిగెత్తింది.
   
    మధ్యాహ్నం రెండుగంటలవుతుంటే రామం వచ్చాడు. రామం చాలా హుషారుగా వున్నాడు. రామంతో బాటు మరోవ్యక్తి కూడా వచ్చాడు. అతను గాయత్రి అక్కభర్త రాధాకృష్ణ "అబ్బ, ఒక్కడే రాకుండా ఎవర్నో వెంటబెట్టుకొచ్చాడేమిటి" - లలిత ఉత్సాహం నీరుకారిపోయింది. అప్పటికే వండిన పదార్ధాలన్నీ చల్లారిపోయాయి.
   
    'నాన్నగారు లేరా' రామం నవ్వుతూ పల్కరించాడు లలితని.
   
    'ఆ - పిలుస్తాను' లోపలకెళ్ళింది లలిత.
   
    'లలితా నిద్రలేపకు'-
   
    లలిత ఒళ్ళు ఝల్లుమంది. అతని నోటినుంచి వచ్చిన 'లలిత' అన్న మాట ఎంతో మధురంగా అనిపించింది ఆరోజు.
   
    వెంకట్రామయ్య నిద్రలేచాడు.
   
    'వీరెవరూ' అన్నాడు రామంతో పక్కనున్న అతన్ని చూస్తూ రామం ముసిముసిగా నవ్వుతూ గాయత్రి బావగారు అన్నారు.
   
    గాయత్రి ఎవరూ 'వెంకట్రామయ్య అన్నాడు నిద్రకళ్ళతో ఆవులిస్తూ మీ రామం చేసుకుంటున్న పిల్ల - కాబోయే భార్య' అన్నాడు రాధాకృష్ణ గుమ్మంలో నుంచున్న లలిత పడబోయి తలుపు పట్టుకుంది. కాళ్ళకింద నేలకదలిపోయింది. తన చెవులను తాను నమ్మలేకపోయింది గుండె ఆగినట్టే అయింది. గాయత్రి, ఆ భర్త పోయిన పిల్ల, ఆ పిల్లాడితల్లి, ఆ పదోతరగతి చదివిన పిల్ల- గాయత్రి !!! - లలిత గుండెచప్పుళ్ళు ఆమెకే వినిపిస్తున్నాయి.
   
    'ఏమిటి గాయత్రి. కృష్ణమూర్తి మేష్టారి అమ్మాయి సరే - బావుందినాయనా. శుభస్య శీఘ్రం. 'వెంకట్రామయ్య అన్నాడు ఎటో చూస్తూ 'ఎల్లుండేనండీ పెళ్ళి - శుభలేఖలు వేయవద్దనుకున్నారు. అందుకే నేను మిమ్మల్ని పిలవడానికొచ్చాను' - రాధాకృష్ణమూర్తి వెంకట్రామయ్యతో అన్నాడు 'తప్పకుండా రావాలి - లలితను కూడా తీసుకురండి రామం గొంతుకలిపాడు.
   
    'లలితా, లలితా, ఓ లలితా - ఇటురా, పెళ్ళిపిలుపుకొచ్చాడు రామం - గాయత్రి అదే కృష్ణమూర్తి మేష్టారమ్మాయి - వీళ్ళకి కాఫీ తీసుకురా" వెంకట్రామయ్య ఎంతపిలిచినా లలిత లోపల నుంచి రాలేదు.
   
    వీధిలో ఆటోవుంది. వెళ్లొస్తాను బాబుగారూ' రామం, రాధాకృష్ణ వెళ్ళిపోయారు. "ఎవరికెక్కడ రాసాడో దేముడు, మనకేం తెలుసు' - ముసలాయన తనలోతాను అనుకున్నాడు.
   
    ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయింది లలిత. శారద చెప్పినమాటలన్నీ అబద్దాలేనా జేబులోఫోటో పెట్టుకు తిరుగుతున్నాడని ఇంతకీ తనకి పెళ్ళిరాత లేదన్నమాట -మొగుడుపోయిన గాయత్రికి పెళ్ళేమిటి రామంతో, మొగడొదిలిన శారదకి పెళ్ళేమిటి ? తనకి పెళ్ళికాదా - ఇలా ఈ ముసలాడికి సేవచేస్తూ తను ముసలిదయిపోతుందంతే ! అంతే ! చేతులో వున్న గ్లాసువిసిరికొట్టింది. గూట్లోవున్న అద్దం విసిరికొట్టింది !! -
   
    శారద దగ్గరకెళ్ళాలి - దానినోరు మూయించాలి - దినేష్ ఎంత దొంగో చెప్పాలి - దాని పెళ్ళికాకుండా చెయ్యాలి - అప్పుడు కానీ తనకసితీరదు - ఎన్నిమాటలు కల్పించింది - రామం తనని చేసుకుంటాడేమోనని ఎంత ఏడ్చిందో దాని ఏడుపేతనకి కొట్టింది - !!
   
    లలిత పరిస్థితి ఊహించగలిగిన వేంకట్రామయ్య దైవప్రార్ధనచేస్తూకళ్ళు మూసుకున్నాడు.
   
    'చూసావా నాన్నా - రామం ఎంత మోసం చేసాడో ఒక్క మాటయినా మనకి చెప్పాడా ముందు - శంకరు అన్నయ్య ఇంకారానేలేదు - లలిత ముక్కుతుడుచుకుంది.
   
    "చూడుతల్లీ - శంకరు అన్నయ్యకి రామనాథంగారు ఫోటో ఇచ్చేసారు - శంకరు అన్నయ్య ఆ ఫోటో నాకిచ్చేసాడు - శంకరు అన్నయ్య ఎక్కడికీ వెళ్ళలేదు - ఊళ్ళోనేవున్నాడు" నెమ్మదిగా తండ్రి అంటుంటే విని, నవ్వింది లలిత 'ఏదారెటుపోతుందో ఎవరికీ తెలియదు' కదునాన్నా-అంతే తల్లీ, అంతే - వెంకట్రావు కళ్ళలో తిరిగిన నెలలు పిల్లచూడకుండా పక్కకి తిరిగి తుడుచుకున్నాడు.
   
    'పోన్లే నాన్నా నీకు నేను తోడు, నాకు నువ్వుతోడు' - అంతే - లలితతో కలిగిన నిరాశని గుర్తించలేనివాడుకాదు తండ్రి - శారదతో రామం నన్ను పెళ్ళిచేసుకోలేదని వెళ్ళి చెప్పాలి - నవ్వుతుందా, - ఏడుస్తుందో - చూస్తాను' లలిత శారద ఇంటికి బయలుదేరింది కానీ ఎందుకో వెళ్ళబుద్దికాక, వెనక్కి తిరిగి వచ్చేసింది లలిత.
   
    ఇంటికొచ్చిన లలిత భోజనం చేయకుండా కూర్చుంది. మనసు పరిపరివిధాలపోయింది. జరిగిన రోజులు ఒక్కసారి కళ్ళముందు కదిలాయి. రామం తనింట్లో అద్దెకి చేరినప్పటి నుంచీ నేటి వరకూ కూడా తనని ఒకే భావంతో చూసాడన్నది నిజం తనలో ఆశలు రేకెత్తించి, తనను రెచ్చకొట్టి, తనను ప్రేమించానని నటించి మోసగించాడా ! - లేదుకదా - లలిత ఊపిరిబిగపట్టి తనకుతానుగా ఆత్మవిమర్శ చేసుకోటం మొదలుపెట్టింది. రామం ఏనాడైనా తన పెళ్ళి విషయం మాట్లాడాడా కల్పించుకుని - లేదే - ఏరోజైనా, పరోక్షంగా కూడా తనపై అలాంటి భావనలోలేడు - కేవలం ఒక స్నేహితురాలిగా, ఒక శ్రేయోభిలాషిగా వున్నాడు - శారద విడాకుల విషయంలో ఎన్నో సందర్భాలలో తననే సలహా అడిగాడు - ఈ రోజు రామం పెళ్ళి చేసుకుంటుంటే కోపం దేనికీ తనకి - అతనిపై ఈ మధ్య అనవసరమైన ఆశలు తను కల్పించుకుంది - తన మనసు చేసిన గారడీ ఇది - ఇంకేంలేదు - ప్రశాంతంగా వున్న మనసును చెడగొట్టుకున్నది తనే - ఇందులో ఎవరి తప్పూలేదు -లలితకి రామం మీద కలిగిన కోపం పోయింది ఆ నిముషంలో - మనసు చాలా తేలికపడింది లలితకి - సంస్కారం మనసును ముందుకు నడిపింది.
   
    "నాన్నా -నిద్రలేవండి - మనం రామం పెళ్ళికెళ్ళద్దూ" - అంది వెంకట్రామయ్యని నిద్రలేపుతూ" మళ్ళీ బస్సువెళ్ళిపోతే కష్టం - బయల్దేరాలిత్వరగా" అంది వేంకట్రామయ్య కొంచం ఆశ్చర్యపోయినా, లలితకూడా వస్తున్నందుకు సంతోషించాడు.
   
    'మనం రామం పెళ్ళికి మనం వెళ్ళకపోతే ఎలా' - వెంకట్రామయ్య కండువాసరిచేసుకున్నాడు. "అవును మన రామం - పైగా అతనికి అక్కలు చెల్లెళ్ళు లేరు - నేనే ఆడబిడ్డని" గలగలా నవ్వింది లలిత, స్వచ్చమైన గంగానదిలా గలగలా - నవ్వింది - పసిదానిలా నిర్మలంగా నవ్వింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS