పదిహేను రోజుల తరువాత హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యి ఇంటికి వచ్చాడు పృధ్వీ.
అతడొచ్చేలోపలే ఎక్కడా ఒక్క అద్దం కూడా లేకుండా గదులన్నీ వెదికి తీసేసింది తల్లి కాంతం.
చంద్రుడికైనా మచ్చ వుంటుందేమోగాని తన కొడుకుది మాత్రం మచ్చలేని అందమని మురిసేది. 'చందూ' అని ముద్దు పేరుతో పిలుచు కొనేది. అంత అందగాడైన కొడుక్కి తల్లి అయినందుకు గర్వపడేది.
ఇప్పుడు........మరి ఇప్పుడు వాడి ముఖం చూడ్డానికే ధైర్యం చాలడం లేదు. దురదృష్ట వశాత్తూ ఒక కన్ను కాలిపోయినా రెండో కన్ను బాగుంది. చెంపల మీదా, ముక్కుమీదా పడిన ఏసిడ్ అక్కడ చర్మాన్నీ, మాంసాన్నీ కాల్చివేసింది.
ఆ భాగంలో గుంటలు పడి అసహ్యంగా, చూసే వాళ్ళకి వికారంతో కడుపులో త్రిప్పేలా తయారైంది. మొన్నటి దాకా చందమామలా వెలిగిపోయిన ఆ ముఖం.
వాడు అద్దంలో తన ముఖం చూచుకొన్నాడా వాడి గుండె బ్రద్దలవడం ఖాయం. ఇప్పటికే వాడు సగం చచ్చిన పాములా దైన్యంగా వున్నాడు. వాడిని ఆ స్థితిలో చూస్తుంటే తన గుండె తరుక్కు పోతోంది. దీనికంతా కారణం స్త్రీ వ్యామోహం.
అదే వాడిని నలుగురిలో నగుబాటు చేసింది.
అలాంటి కొడుకును కన్నందుకు తల్లిగా సిగ్గు పడాల్సి వస్తోంది.
తన స్టూడెంటునే ఎత్తుకు వచ్చి తమ గెస్ట్ హౌస్ లో మానభంగం చేయబోయాడని సి.ఎం. పాల్గొంటున్న పబ్లిక్ మీటింగ్ లో వెల్లడి అయ్యి తండ్రిని తలదించుకొనేలా చేసింది. ఆయనకున్న పవరూ, పలుకుబడితో అరెస్ట్ అయినా బెయిల్ మీద విడిపించగలిగారు.
లేకపోతే ఈ సరికి జైలు ఊచలు లెక్కబెడుతూ చిప్పకూడు తింటుండేవాడు.
భర్తతో తన హృదయభారాన్ని పంచుకొందామని ఉదయం నుండి ప్రయత్నిస్తూనే వుందామె.
కాని, మాధవరావు బయట గదిలో తన అనుయాయులతో మంతనాలు సాగిస్తూ మధ్యాహ్నం భోజనంకూడా వాళ్ళతోపాటే చేశాడు.
రాత్రికి గాని ఆయనతో మాట్లాడే అవకాశం కలుగలేదామెకు.
"మీరు రాజకీయాల్లోకి వెళ్ళాక మీరు నాకెంత దూరమయ్యారో ఈ రోజు మొదటిసారిగా తెలిసిందండీ! ప్రొద్దుటి నుండి నా మనసు ఎంత అల్లకల్లోలంగా వుందో మీకు తెలియదు. నా బాధ మీతో పంచుకుందామంటే ప్రొద్దుటి నుండి ఒక్కసారి కూడా లోపలికి రాలేదు" కాంతం నిష్టూరంగా అంది.
"లోపలికి వచ్చి నీతో ముచ్చట్లాడుతూ కూర్చుంటే పనులవుతాయా? నా సంకటం నాకుంది. అవతల నా పరిస్థితి ఎంత గుడ్డుగా తయారైందో నీకేం తెలుసు? ఎంతో శ్రమపడి రాజకీయంగా మహావృక్షంలా ఎదిగిపోయిన నన్ను కూకటి వ్రేళ్ళతో పెళ్ళగించి వేసేలా వుందా పిల్ల! ఈ గడ్డు పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలా అని సతమత మౌతంటే నీ సొద ఏమిటి? నీ కొచ్చిన బాధ ఏమిటి?" అతడి స్వరంలో అలసటా, విసుగు రెండూ ధ్వనించాయి.
చివుక్కుమన్నట్టుగా అయింది కాంతానికి. "పదవులూ, రాజకీయాలే ముఖ్యమా మీకు? ఇంట్లో భార్యా బిడ్డల సంగతి పట్టదా.......?" కోపంగా అడిగింది.
"ఇప్పుడు ఏం కష్టమొచ్చిందని అడుగుతున్నాను కదా?"
"అడుగుతున్నారు లెండి కావలసినంత వెటకారంతో"
"అయితే ఏమిటట?" వస్తూన్న కోపాన్ని అదుపులో పెట్టుకొంటూ అడిగాడు.
"నీ కొడుకు చేసిన పనికి పబ్లిక్ లో తలెత్తుకోలేని పరిస్థితి వచ్చిందే కాంతం. ప్రతి పక్షాలు, పత్రికలు రేపుతున్న దుమారంలో నాకు మతి పోతోంది. ఈ తుఫాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఒకటే సతమతమవుతున్నాను."
"ఒక్కగానొక్క కొడుకుని గారాంగా పెంచిన ఫలితమిది. ఇలా చేశాడని వాడి మీద కోపం పెంచుకుంటే ఏం లాభం? ఎంత చెడ్డవాడైనా కొడుకు కొడుకే కదండీ?"
"ఉపోద్ఘాతం వద్దు. విషయంలోకి డైరెక్ట్ గా వచ్చెయ్యి. ఇప్పటికే బాగా అలసిపోయివున్నాను.
"చందూ ముఖంలోకి చూడాలంటేనే భయం వేస్తూందండీ"
"కన్నతల్లి అనాల్సిన మాటేనా?"
"కన్న తల్లికే గగుర్పొడిచేలా వుందా ముఖం."
"ఏం చేస్తాం? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా! ఆ పిల్ల ముఖం ఏసిడ్ పోసి కాలుస్తానన్నాడు నీ కొడుకు. ఆ పిల్లే కాల్చి చూపించింది తన సత్తా! ఒకవేళ ఆ పిల్లకే ఇలా జరిగివుంటే ఇంతబాధా ఆ పిల్లా, ఆ పిల్లను కన్నవాళ్ళూ పడేవాళ్ళు కదా?"
"ఆ పిల్ల తరపున వకాల్తా పుచ్చుకొమ్మని అడగలేదు!"
"వకాల్తా కాదు! ఉన్న విషయం మాట్లాడాలి కదా?"
"జరిగిందేదో జరిగింది. ఇప్పుడు జరగాల్సింది చూడండి."
"జరగాల్సిందేమిటి?"
"చందూకి ప్లాస్టిక్ సర్జరీ చేయించండి. కన్నుపోతే కన్ను పెడుతున్నారటగా డాక్టర్లు?"
"ఆఁ పెడుతున్నారు, ఎవరైనా నేత్రదానం చేస్తే,. నీ కన్నిస్తావా?"
"ఐ బ్యాంక్ వాళ్లు ఇశ్తారటకదండీ!"
"అబ్బా! తెలిసే......."
"మరీ అంత మొద్దావతారాన్ని ఏం కాదులెండి. నేనూ పత్రికలవీ చదువుతుంటాను."
అందమేకాని అక్షరం ముక్కరాని కాంతానికి మాధవరావు చేసుకున్నాక ఇంటి దగ్గర టీచర్ని పెట్టి చదువు చెప్పించాడు.
"కానీ వాడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించను! కన్ను కూడా పెట్టించను. వాడలా వుండిపోవాల్సిందే"
"ఎందుకండీ అంత నిర్దాక్షిమ్యం కొడుకు మీద?" ఆమె కంటనీరు తిరిగింది.
"నా కొడుకును కురూపిని చేసి, నన్ను పదవీచ్యుతుడిని చేసిన ఆ పిల్లనూ వూరికే వదిలిపెట్టను. ఆ పిల్లను సాధించడానికి నీ కొడుకు కురూపిగా వుండాల్సిందే. ఇంకా కురూపి అయినా ఫర్వాలేదు."
