Previous Page Next Page 
సంధ్యాకళ్యాణం పేజి 41

   
    "ప్రతిమని నా కోడల్ని చేసుకొంటానని శ్రీపతికి కూడా మాటిచ్చానురా!"

    "ఇది అన్యాయమనిపించడం లేదా నీ మనసుకు?"

    "ఏమిటన్యాయం? నాకుతగ్గ సంబంధం నేను చేసుకొంటాను. నువ్వెవడివిరా నాకు బుద్ధి చెప్పడానికి?" ఆవిడ గయ్ మని లేచింది.

    ఆవిడతో ఇంక వాదించడం అనవసరమనిపించింది అరుణ్ కు. అప్పటికప్పుడు సంధ్య దగ్గరికి బయల్దేరాడు.

    "నీ విషయంలో అమ్మ ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందనుకోలేదు సంధ్యా!" అన్నాడు బాధపడుతూ.

    సంధ్య నిర్లిప్తంగా, "అత్త నన్ను వీధిలోకి వెళ్ళగొట్టలేదు కదా? ఒక పని చూపించింది" అంది.

    "నిన్ను దాసీని చెయ్యడంకోసమా వూరినుండి తీసుకువచ్చాను?"

    "ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు?"

    "పద! నిన్ను ఏదైనా లేడీస్ హాస్టల్లో చేర్పించివస్తాను."

    "ఇంత అర్ధాంతరంగా ఎలా? చక్రపాణిగారు వూళ్ళో లేరు. వాళ్ళు క్రొత్త ఆయాని వెదుక్కొనే అవకాశమైనా ఇవ్వాలికదా?"

    ఆ మాట నిజమేననిపించింది అరుణ్ కు.

    "అత్త నన్ను ఏ ఉద్దేశ్యంతో పంపించివేసిందో నేను గ్రహించాను అరుణ్! నన్నులేడీస్ హాస్టల్లోనో, ఎక్కడో ఉంచి నువ్వు తిరగడం అస్సలు బాగుండదు. నా మంచికే అత్తకీ బుద్ధి పుట్టిందనుకొంటున్నాను. బి. ఎ.లు, ఎమ్. ఎ. లు చదివినా దొరకని ఉద్యోగం నాకు దొరికింది. నెలకి అయిదువందలిస్తానన్నారు చక్రపాణిగారు. ఇంకా ఎక్కువే ఇస్తానన్నారు! దానికి ప్రతిఫలంగా తల్లిలేని తన పిల్లల విషయంలో నిశ్చింత ఏర్పడేట్టు చేయాలి. అంతే."

    "సంధ్యా, నువ్వు వెటకారం చేస్తున్నావా? మనస్ఫూర్తిగా అంటున్నావా?"

    "మనస్ఫూర్తిగానే అంటున్నాను! నేను వూరు విడిచినప్పుడు పూర్తిగా నిన్నే నమ్ముకొన్నమాట నిజం. కాని, ఇక్కడికి వచ్చాక నీమీద నాభారం వేయడమంత తెలివితక్కువతనం లేదని గ్రహించాను. దారినపోతున్న కంపను తగిలించుకొన్నట్టుగా నావల్ల నువ్వు బాధపడకూడదు!"

    "నిజంగా..... నిజంగా నీ మనస్సుకు తృప్తిగా, శాంతిగా ఉందా సంధ్యా? ఆయాగా చేయడం నీకు సంతోషంగా ఉందా?"

    "పరిస్థితులకు అలవాటు పడిపోవడం నాకు ఎప్పుడో అలవాటైపోయింది అరుణ్! పరాయిపంచన బ్రతుకు వెళ్ళదీయడం అమ్మపోయినప్పుడే నాకు అలవాటైంది!" సంధ్య ఉదాశీనంగా అంది.

    అరుణ్ మనసు కలుక్కుమన్నట్టుగా అయింది ఆ మాటలకు.

                         *        *        *

    దాదాపు రెండు నెలలు గడిచిపోయాయి.

    చాలారోజుల బిజినెస్ టూర్ తరువాత ఒకరోజు చక్రపాణి ఇంటి దగ్గరున్నాడు. ఆరోజు పూర్తిగా పిల్లలదగ్గర గడపాలనుకొన్నాడు. ఉదయం  లేస్తూనే శ్రీకాంత్ ని, ప్రేమను పిలిచి, "ఇవాళంతా మీతో ఉంటాను. మీకేమేం కావాలో చెప్పండి!" అన్నాడు.

    "ఏం కావాలన్నా మాకు సంధ్య తెప్పిస్తుందిగా! ఇవాళ మమ్మల్ని జూకి తీసికెళ్ళండి డాడీ!" అన్నాడు శ్రీకాంత్. జూలోకోతుల్ని చూడాలంటే వాడికి చెప్పలేనంత ఇష్టం.

    "అలాగే! సాయంత్రం వెడదాం. తనుకూడా రావాలని మీ సంధ్యతో చెప్పండి! అవును గాని ఆవిణ్ణి అలా పేరుపెట్టి సంధ్య అని పిలవొచ్చా?"

    "మరి ఏమని పిలవాలి?"

    బాగా బ్రతికిన ఇంటిపిల్ల! ఆయా అంటే బాధపడుతుందేమో! 'ఆంటీ' అనండి" అని చెప్పాడు.

    "అలాగే డాడీ!" శ్రీకాంత్ బుద్ధిగా అన్నాడు.

    "అలాగే, డాడీ!" చిలుకలా పలికింది ప్రేమ.

    జూకి రావాలని ముందే చెప్పి పెట్టారు పిల్లలు సంధ్యకి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS