Previous Page Next Page 
బేబి!ఓ బేబి!! పేజి 41

    ఆమె నవ్వింది_

    "ఈ సైన్స్ యుగానికి మొదటి బిడ్డ ఆ పాప.... ప్రపంచ తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ లూయీసీ" అంది. పరీక్షగా చూశారు వాళ్ళు. ఎర్రగా, బొద్దుగా, చూడగానే ముద్దొచ్చే మొహం, అమాయకమైన కళ్ళు....అందమైన విదేశీ పాపలాగే వుంది లూయీసీ. అందుకే ఆఫోటో ఆ లాబ్ లో వుందనుకున్నారు.

    "నిజమే...సైన్స్ ఇంతగా ఎదిగిందంటే....ఒక్కోసారి నమ్మశక్యం కాదు" అన్నాడు శరత్. "టెస్ట్ ట్యూబ్ బేబీలేం ఖర్మ? సెక్సువల్ చెంజెస్ కూడా సైన్స్ ద్వారా సాధ్యమవుతూంటే..." అంది లక్ష్మి.

    "పురాణాల్లో కూడా ఈ బేబీలు, సెక్స్ వల్ చేంజెస్ కూడా జరిగినట్లు తెలుస్తుంది. ఈ సైన్స్ అప్పుడే ఎదిగిందేమో?" అన్నాడు భార్గవ.

    "నిజమా" అన్నారిద్దరూ.

    "అవును పురాణాల్లో సెక్స్ వల్ చేంజెస్ వున్నాయి. వైవసత్వుడనే మనువు సంతానంలేక వసిష్టుల్ని మార్గం చెప్పమంటాడు. కొడుకే కావాలనుకుంటే యజ్ఞం చేయమంటాడు వసిష్టుడు. ఇతే వైవసత్వుడి భార్యకు కూతుర్ని కనాలనే కోరిక వుంటుంది. ఆ కోరికతోనే 'హోతా'ను ప్రార్ధించి మాట తీసుకుంటుంది. ఆ తర్వాత కూతుర్ని కని 'ఇల' అని పేరు పెడతారు. కాని కొడుకు పుట్టనందుకు యజ్ఞం నిష్పలమయిందే అని రోజురోజుకూ క్రుంగిపోతాడు వైవసత్వుడు. శిష్యుడి మనోవేదన అర్ధం చేసుకున్న గురువు వసిష్టుడు ఈశ్వరుడ్ని ప్రార్ధించి, అమ్మాయిని కాస్త అబ్బాయిగా మార్చాడు 'ఇల'గా వున్న ఆ అమ్మాయి 'సుద్యుమ్నుడు' అనే అబ్బాయిగా మారిపోతాడు. ఇది సెక్స్ వల్ చేంజే కదా!" అన్నాడు భార్గవ.

    "అలా అయితే టెస్ట్ ట్యూబ్ బేబీలు కూడా పుట్టుండాలి పురాణాల్లో" అంది లక్ష్మి నవ్వుతూ.

    సరయిన రీజనింగ్స్ దొరక్క పోవచ్చుగాని....అలాంటి కథలు కూడా వున్నాయి. శారీరకంగా కలియకుండానే గర్భాలు ధరించటం, ఆంజనేయుడి ద్వారా మృత్యువల్లభున్ని కనడానికి ఒకామె అలాంటి గర్భం ధరించినట్టు కథలున్నాయి" అన్నాడు భార్గవ.

    "లక్ష్మి! మరిలాంటి ప్రయోగాలు ఎక్కువగా ఎలుకలమీద, కుందేళ్ళ మీద చేస్తారు కదా! కేవలం మొక్కలమీదే చేసారా?" అడిగాడు భార్గవ.

    "లేదు. మొక్కల తర్వాత ఎలుకల మీదకూడా పదహారు సంవత్సరాల క్రితమే ఈ ప్రయోగాలు చేశారు. ఆడ ఎలుక అండాన్ని, మగ ఎలుక వీర్యంతో బాహ్య వాతావరణంలో పొదిగిస్తే...ఆ ప్రయోగాలు విజయవంతమయ్యాయి"

    "నందిగా పుట్టి నాలుగేళ్ళు బ్రతక్కపోయినా, ఈ సైన్స్ యుగంలో ఎలుకగానయినా పుడితే సార్ధకత! ఎలుక ఎంత అదృష్టమైన జంతువు? పురాణయుగంలో వినాయకుడి వాహనమై పోయిందో లేదో గాని కలియుగములో మాత్రం రాకెట్ రోదసీలో మొట్టమొదట ప్రయాణించింది" అన్నాడు భార్గవ.

    "అయితే ఈ ప్రయోగాలవల్ల అన్ని దేశాలమధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి. బ్రిటన్ బాబ్రాహం అనే పట్టణంలో Agricultural Re Search Council Of Animals Genetics Laboratory వారు మేలురకమైన మేకల్ని, పందుల్ని ఇతర ముఖ్య జంతువులని విదేశాలకు ఎగుమతి చేసేది. ఏకబిగిన జంతువులకు జంతువుల్నే విదేశాలకు ఎగుమతి చేయడం చాలా ఖర్చుతో కూడిన పని కాబట్టి....ఒకే వంశావళికి చెందిన మగ, ఆడ జంతువుల (పే డిగ్రీ పేరెంట్ ఏనిమల్స్) యొక్క వీర్యమును, స్త్రీ బీజకణంను పొదిగించి ఏర్పడిన బ్లాస్టోసిస్ (పెరిగే పిండములో ఒక దశ)ను కుందేళ్ళ గర్భాశయంలో "తాత్కాలికంగా పొదిగించి" వేరే దేశాలకు ఎగుమతి చేసేవారు. ఎగ్జాంపుల్ గా ఆడ, మగ మేకల బ్లాస్టోసిస్ట్ ను కుందేళ్ళ గర్భాశయంలో టెంపరరీగా పెట్టి పంపేవారన్న మాట. దాంతో విదేశాలకు చేరిన ఆ కుందేళ్ళకు హార్మోన్స్ ఇంజక్షన్స్ ఇచ్చి దాని మృతగర్భంనుండి బ్లాస్టోసిస్ట్ ను తీసి ఆ పిండానికి సంబంధించిన వారి దేశపు జంతువుల గర్భాశయాల్లో ప్రవేశపెట్టుకుంటారు. గర్భాశయంలో పెరిగి అవి పిల్లలయేవి. ఆ లాబరేటరీ ఈ నూతన పద్దతుల్లో జంతువుల ఎగుమతి దిగుమతులు జరుపుతూంది" చెప్పింది డాక్టర్ లక్ష్మి.

    "ఫెంటాస్టిక్ గా వుంది. ఈ ఆలోచన మాత్రం..." మెచ్చుకోలుగా అన్నాడు శరత్.

    "రానురాను ఇలాగే మనుషుల్లో కూడా జరుగుతుందేమో? అమెరికాలో వున్న భర్తకూ, ఇండియాలో వున్న భార్యను పిల్లల్ని కనాలన్పించి భర్త స్పెర్మ్ ని పోస్ట్ లో పంపితే ఇండియాలో భార్య తన అండాలతో పొదిగించుకుని....పిల్లల్ని కంటుంది...ఇలా జరిగినా ఆశ్చర్యపోవద్దు" చెప్పాడు భార్గవ.

    ఆ మాటకు మిగతా ఇద్దరూ నవ్వారు.

    "అలా జరగక పోవచ్చుగాని....ఇంకోలా జరిగే ప్రమాదముంది" అంది లక్ష్మి. వాళ్ళు విస్మయంగా చూసి "ఏ విధంగా....?" అడిగారు ఇద్దరూ ఏకకంఠంతో.

    "ఏ తల్లయినా, పుట్టబోయే బిడ్డ గొప్ప వ్యక్తి కావాలని, అదికంగా తెలివితేటలు కలవాడై వుండాలనుకోవడం సహజం. ఒక కొడుకులో ఒక తల్లి కోరేది అదే. అలాగే ఒక తల్లికి...ఇది ఊరికే చెపుతున్నాను టూకీగా" అంది నవ్వి లక్ష్మి.

    "చెప్పండి...చెప్పండి" భార్గవకి ఇంట్రస్ట్ గా వుంది.

    "అలాగే ఒక తల్లి సునీల్ గవాస్కరంతటి క్రికెట్ ప్లేయర్ ను కనాలనుకుంటుంది అనుకోండి! జీన్స్ లోని క్రోమోజోముల ప్రకారంగా తల్లిదండ్రుల లక్షణాలు అనువంశికంగా పుట్టబోయే బిడ్డకు వస్తాయి నూటికి ఎనభై శాతంగా, అయితే క్రికెట్ ప్లేయర్ ని కనాలనుకున్నప్పుడు గొప్ప క్రికెటర్ జీన్స్ కావాలి గదా! అలాంటి బిడ్డను కనాలనుకున్న తల్లి, ఎక్కడో వున్న సునీల్ గవాస్కర్ ను కనలేకపోతుంది. ఎదురుపడ్డా అతగాడు సంభోగానికి విముఖత చూపొచ్చు...."

    "అవునవును. ఏ దేశం ఆటకోసం పోయినా, ఆయనగారి భార్య ఎప్పుడూ వెంటే వుంటుంది మరి! ఆయనొప్పుకున్నా, భార్య ఒప్పుకోదు గదా!" అన్నాడు భార్గవ నవ్వేస్తూ.

    "అందుకని రానురాను గొప్ప గొప్ప మేధావుల సెమన్ ని స్మగ్ లింగ్ చేసే అవకాశాలే ఎక్కువున్నాయి. సునీల్ గవాస్కర్ సెమన్ కూడా మార్కెట్లోకి వచ్చిందని తెల్సి, బ్లాక్ లో కొని, శాస్త్రజ్ఞుల సాయంతో పరీక్షా నాళికల్లో ఒక అమాయక తల్లి తన అండంతో పొదిగించుకుని, తర్వాతః గర్భాశయంలో ప్రవేశపెట్టించుకొని నవమాసాలు మోసి కనేసిందనుకుందాం....వాడు కాస్తా పెరిగి క్రికెట్ కాదుగదా కనీసం 'గిల్లిదండ'లో కూడా చొరవ చూపించక ఎందుకూ పనికిరాని బడుద్దాయిలా తయారయ్యేడంటే...అది ఖచ్చితంగా గవాస్కర్ సెమన్ కానట్టే లెక్క. దీంట్లో మోసం జరిగి ఎవడో జులాయ్ వెధవ సెమన్ తో మరో జులాయ్ వెధవ పుట్టినట్టే లెక్క" అంది లక్ష్మి నవ్వి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS