Previous Page Next Page 
అందరూ దొంగలే పేజి 41

    "ఏంలేదు....నువ్వు కుక్కలా నాలిక బయటపెట్టి డ్రయివ్ చేస్తుంటే దార్లో అందరూ నిన్నే చూస్తున్నారు వింతగా" అన్నాడు రాంబాబు.

    "హబ్బా!" అప్పారావ్ స్టీరింగ్ వదిలేశావేంటి....యాక్సిడెంట్ అవుతుంది....స్టీరింగ్ పట్టుకో. కావాలంటే నీకు మేం హెల్ప్ చేస్తాంగా" అన్నాడు కంగారుగా చిన్నారావ్.

    అప్పారావ్ గబుక్కున స్టీరింగ్ పట్టుకున్నాడు.

    "అయితే నా నాలుక ఇలా బయటికి రాకుండా ఏదైనా మార్గం చెప్పి నాకు హెల్ప్ చేస్తారా?" ఆశగా అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

    "రాంబాబు, చిన్నారావ్ లు హఠాత్తుగా ఇన్స్ పెక్టర్ అప్పారావ్ మీద పడి ఠకా ఠకా డజను మొట్టికాయలు మొట్టేశారు.

    ఈ హఠాత్ సంఘటనకి ఇన్స్ పెక్టర్ అప్పారావ్ బిత్తరపోయాడు.

    "మేం హెల్ప్ చేస్తామన్నది ఈ మొట్టికాయల విషయంలో.... పాపం....నువ్వు రిస్కు తీస్కుని స్టీరింగ్ వదిలి మొట్టికాయలేస్కుంటున్నావ్ కదా" అన్నాడు రాంబాబు.

    అది విన్న ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కుమిలిపోయాడు. ఇదిలానే కంటిన్యూ అయితే తనకి పిచ్చెక్కడం ఖాయం అని అనుకున్నాడు.

    మరో అయిదు నిముషాల్లో జీపు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ఇంటి ముందు ఆగింది. ముగ్గురూ జీపు దిగి లోపలికి వెళ్ళారు.

    అప్పారావ్ భార్య మదన మనోహరి రాంబాబు, చిన్నారావ్ లని చూసి ఇంతెత్తున లేచి మండిపడింది.

    "ఏంటి....ఇన్నాళ్ళూ ఏమయ్యారు? ఉతకాల్సిన బట్టలు బండెడు తయారయ్యాయ్" అంటూ రంకెలు వేసింది.

    "అందుకే కదా మరి మేం వచ్చింది?" అన్నాడు రాంబాబు చిరునవ్వు నవ్వుతూ.

    "ఇంట్లో వస్తువులమీద కూడా బాగా దుమ్ము పడింది....దుమ్ము బాగా దులపాలి" అన్నాడు.

    "బూజులు కూడా దులపాలి!" అంది మదనమనోహరి.

    ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కంగారు పడిపోసాగాడు. భార్య మాటలకి వాళ్ళిద్దరూ ఎలా రియాక్ట్ అవుతారోనని!

    "మనోహరీ! మరొకసారి ఇలారా....నీతో మాట్లాడాలి" అని ఆమె జబ్బ పట్టుకుని లోపలికి లాక్కెళ్ళాడు.

    "మనం మనవాళ్ళకి ఫోన్ చేద్దామా?" అని అడిగాడు రాంబాబు.

    "ఓ...." అన్నాడు చిన్నారావ్ హుషారుగా.

    రాంబాబు అక్కడే వున్న ఫోన్ రిసీవర్ తీసి నర్సింగ్ హోమ్ నెంబర్ డయల్ చేశాడు.

    ఫోన్ సరోజ లిఫ్ట్ చేసింది.

    "ఓ....నువ్వేనా....సాయంత్రం పార్కులో కలుద్దాం. నువ్వేం భయపడకు, ఈసారి బాగానే మాట్లాడ్తాలే...." అన్నాడు రాంబాబు.

    "ఈవేళ కుదర్దు....సాయంత్రం రెండు ఆపరేషన్ కేసులున్నాయ్. రేపు తప్పకుండా కలుద్దాం. ఇప్పుడు కూడా బిజీగానే వున్నాం నేనూ సునీతా! రేపు డైరెక్టుగా పార్కులోనే కలుద్దాం" అంటూ ఫోన్ పెట్టేసింది సరోజ.

    రాంబాబు, చిన్నారావ్ లు కమీషనర్ క్యాండిడేట్ లనీ, వాళ్ళతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనీ, వాళ్ళు తలుచుకుంటే ప్రమోషన్ ఇప్పించ గలరనీ, లేదంటే సస్పెండ్ కూడా చేయించగలరని మదనమనోహరికి గదిలో నచ్చజెప్పి బయటికి తీస్కొచ్చాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

    "మరిక పని స్టార్ట్ చేద్దామా?" అని అడిగాడు రాంబాబు మదన మనోహరిని.

    "వద్దులెండి....నేనే చేస్కుంటా!" అంది ఆమె.

    "సరే....మేమిద్దరం కాఫీతాగి వెళ్ళాక చేస్కుందువుగాని!" అన్నాడు రాంబాబు.

    "కాఫీ చాలా స్ట్రాంగా వుండాలి!" అన్నాడు చిన్నారావ్.

    మదనమనోహరి ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కి సైగచేసింది. అప్పారావ్ లోపలికి వెళ్ళబోతే "కాదు....కాఫీ నువ్వే కాచి తేవాలి!" అన్నాడు రాంబాబు.

    ఆమె ఇద్దర్నీ మనసులో బాగా తిట్టుకుంటూ లోపలికి వెళ్ళింది.

    అయిదు నిముషాల తర్వాత రెండు కప్పుల్లో వేడి వేడి కాఫీతో వచ్చింది.

    "సారీ! సడెన్ గా మా అభిప్రాయం మారిపోయింది. మాకిప్పుడు టీ తాగాలని వుంది. వెళ్ళి టీ పట్టుకురా" అన్నాడు చిన్నారావ్.

    మదనమనోహరి వాళ్ళిద్దర్నీ బండబూతులు తిట్టుకుంటూ లోపలికెళ్ళి టీ కాచుకుని వచ్చింది.

    వాళ్ళిద్దరూ టీ తాగి కప్పులు టీపాయ్ మీద పెడ్తుండగా ఫోన్ మోగింది.

    ఇన్స్ పెక్టర్ అప్పారావ్ రిసీవర్ తీసి "హలో!" అన్నాడు.

    అవతలినుండి కమీషనర్ లింగారావ్ "హలో....అప్పారావా?" అని అడిగాడు.

    కమీషనర్ గొంతు వినగానే అప్పారావ్ బూటుకాలు నేలకేసి గట్టిగా తాకించి సెల్యూట్ చేసి "హలో....నమస్కారం సార్....నేనే సార్....చెప్పండి సార్...." అన్నాడు కంగారుగా.

    "స్టేషన్ కి నువ్వు రాంబాబు, చిన్నారావ్ లని తీస్కుని ఇంటి కెళ్ళావని చెప్పారు. ఓసారి రాంబాబుకి ఫోనివ్వు!" అన్నాడు లింగారావ్.

    అప్పారావ్ రాంబాబుని దగ్గరికి రమ్మని సైగచేసి "కమీషనర్గారు!" అంటూ రిసీవర్ రాంబాబుకి అందించాడు.

    రాంబాబు కూడా సెల్యూట్ చేసి "గుడాఫ్టర్ నూన్ సార్!...." అన్నాడు.

    "ఏం లేదోయ్! రేపు మా దీప బర్త్ డే వుంది. సాయంత్రం పార్టీకి నువ్వూ, చిన్నారావ్ ఇద్దరూ రావాలి!" అన్నాడు లింగారావ్.

    రాంబాబుకి వెంటనే సరోజ గుర్తొచ్చింది. మర్నాడు సాయంత్రం తప్పకుండా పార్కుకి రమ్మంది. వెళ్ళకపోతే చాలా కోపం వస్తుంది....ఇవతల బిగ్ బాస్, అవతల ప్రేయసి....ఎలా?

    "ఏంటి ఆలోచిస్తున్నావ్?" అడిగాడు లింగారావ్.

    "పోనీ పొద్దున్నే వచ్చి విషెస్ చెప్పి వెళ్ళొచ్చా సార్?" అడిగాడు రాంబాబు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS