Previous Page Next Page 
నవ్వితేనవ్ రత్నాలు-2 పేజి 41

                                                 పాపం... తెలుగు హీరోయిన్
    సరోజని అనుకోకుండా అదృష్టం వరించింది. ఆ అమ్మాయి హఠాత్తుగా హిరోయిన్ అయిపోయింది.
    అదెలాగంటే...
    ఆరోజు సరోజ తన స్నేహితురాలి పెళ్లికి శ్రీనగర్ కాలనీకి వెళ్లింది. అప్పటికే పెళ్లిపందిరి అంతా జనంతో నిండి వుండడంచేత చివరగా ఉన్న ఓ కుర్చీలో కూర్చుంది సరోజ.
    కాస్సేపు పెళ్లి చూడ్డంలో సీరియస్ గా మునిగిపోయింది.అలా ఏకాగ్రతతో స్నేహితురాలి పెళ్లిచూస్తున్న సరోజ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
    "అమ్మా..."
    తనపక్కనే గేదె అరిచింది. ఛీఛీ... పెళ్లి పందిట్లోకి గేదెలు జొరబడిపోతుంటే ఎవ్వరూ పట్టించుకోరేం?అని విసుక్కుంటూ పక్కకి తిరిగి చూసింది.
    అక్కడ గేదెలేదుగానీ గేదెలాంటి మనిషి ఒకతనున్నాడు. సరోజ తనవంక చూడగానే అతను చెవులదాకా నవ్వాడు.
    "నువ్విప్పుడు ఇక్కడికి గేదె వచ్చిందేమోనని చూశావ్ కదూ... ఇందాక అమ్మా అని పిల్చింది నేనే..." గుడగుడా నవ్వాడు అతను.
    "నేన్నమ్మను...ఇందాక అమ్మా అని అన్నది గేదే... హబ్బా! నన్నే బురిడీ కొట్టించాలని అనుకుంటూన్నారేం?..."అంది సరోజ తల, కళ్ళూ తిప్పుతూ.
    ఆయన పొట్ట పట్టుకుని కింద కూర్చుండిపోయి మళ్లీ గుడగుడా నవ్వాడు.
    తర్వాత కిందపడి లేచి బట్టలకంటిన మట్టిని దులుపుకుంటూ అన్నాడు."నాకు తెల్సమ్మా... ఆ నిజాన్ని నువ్వు నమ్మలేవు... కావలిస్తే నిన్ను మళ్లీ పిలుస్తా చూడూ..."
    "పిలవండి చూద్దాం"
    "అమ్మా!"
    అరే!... ఆయనలా పిలుస్తుంటే అచ్చు గేదె అరచినట్టుగానే వుందే!!...
    సరోజ ఆశ్చర్యంతో నోరు తెరిచింది.
    ఆయన హఠాత్తుగా నేలమీద దభీమని కుప్పకూలిపోయాడు.
    సరోజ కంగారుపడిపోయింది.
    "అరెరె... ఏమైందండీ?" అని ఆత్రుతగా ముందుకువంగి అతనిని ప్రశ్నించింది.
    "నువ్వు ఆశ్చర్యంగా నోరుతెరిచావ్ గా! అందుకు నా బుర్ర తిరిగి కిందపడ్డా... సరేగానీ నువ్వు పళ్లు దేంతో తోముకుంటావమ్మా?" సరోజవంక అయోమయంగా చూస్తూ కిందపడి లేచి నిలబడి అడిగాడు ఆయన.
    ఆ మాట వింటూనే సరోజ సిగ్గుపడిపోయింది.
    "దేంతోనో తోముకుంటాలెండి... సరేగానీ నన్ను గేదెలా ఎందుకు పిలిచారూ?..."మెల్లగా అడిగింది.
    "చూడమ్మా... నీ కనుముక్కు తీరు బాగుంది... నీకు సినిమాల్లో వేషం వెయ్యడం అంటే ఇష్టమేనా?" అడిగాడు ఆయన.
    "ఇంతకీ మీరెవరు?" సందేహంగా అడిగింది సరోజ.
    "నన్ను సినిమా పత్రికల్లో చూడలేదామ్మా? నేను సినీ దర్శకుడిని - వీరబ్రహ్మం నా పేరు..."
    సరోజ అతని మొహం వంక తేరిపారచూసింది.
    "ఇందాకట్నుండీ ఈ మొహాన్ని ఎక్కడో చూశానని అనుకుంటున్నా... అయితే ఆయన ప్రముఖ దర్శకుడు వీరబ్రహ్మం అన్నమాట!!"
    సరోజ సంతోషంతో ఒక్క గెంతు గెంతింది.
    "ఏమ్మోవ్!... ఇలాగైతే నీకు సిన్మాలో ఛాన్సివ్వనంతే..." వీరబ్రహ్మం గట్టిగా అరిచాడు.
    "ఇప్పుడు నేనేం తప్పుచేశానబ్బా"అని ఆశ్చర్యపోతూ కళ్ళు తెరిచి చూసి నాలుక కరుచుకుంది.
    ఆమె వీరబ్రహ్మం భుజాలమీద వుంది.
    కంగారుగా ఆయన భుజాలమీదినుండి కిందికి దూకి "సారీ అండీ"అంది సరోజ.
    "ఏం సారీనో... నాగూళ్ళు బద్దలయిపోయాయ్. ఎంత సంతోషం అయితే మాత్రం అంతగా ఎగరాలా? ఎగిర్తే ఎగిరావ్... నా భుజాలమీద పడేలా ఎగరాలా?"అన్నాడు వీరబ్రహ్మం మెడ రుద్దుకుంటూ.
    "సారీ అండీ..." అంది సరోజ మరోసారి.
    "ఇంతకీ మీ సినిమాలో నాకు ఏ వేషం ఇవ్వాలని అనుకుంటున్నారండీ?" కుతూహలంగా అడిగింది.   
    "ఉండు...ఇప్పుడే చెప్తా..."అని చెప్పి దూరంగా వెళ్లి అక్కడినుండి చెప్పాడు వీరబ్రహ్మం.
    "నీకు హీరోయిన్ వేషం ఇద్దామని అనుకుంటున్నా..."
    సరోజ సంతోషం పట్టలేక గిలగిల్లాడిపోతూ "హెయ్య..."అంటూ పెద్ద గెంతు గెంతింది.
    "హమ్మనాయనో..." అంటూ పెద్దగా కేకపెట్టాడు డైరెక్టర్ వీరబ్రహ్మం."ఇంతదూరం వచ్చి చెప్పినా మళ్లీ నా భుజాలమీదికే గెంతేశావ్ కదమ్మా... ఇంకా చూస్తావ్?... కిందికి దిగూ..."
    "సారీ అండీ..."అంటూ అతని భుజాలమీదినుండి కిందికి దూకింది సరోజ.
    ఆ విధంగా సరోజ ఓ తెలుగు సినిమాలో బుక్ అయి హీరోయిన్ అయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS