రాయుడు అనుమతికోసం ఎదురుచూడకుండా గబగబా అడుగులు వేస్కుంటూ వెళ్ళి ముందు నడుస్తున్న తన భార్య గౌరిని కల్సుకున్నాడు.
"ఏవండీ మీరా?" భర్తని అడిగింది గౌరి.
"ఔను నేనే... ఇక్కడ నువ్వేం చేస్తున్నావ్?" విసుగ్గా అడిగాడు సంతానం.
"అరికాళ్ళల్లో దురదపుట్టి ఊర్కే ఊరంతా తిరుగుతున్నా!" సమాధానం చెప్పింది ఆమె.
"అఘోరించలేకపోయావ్! త్వరగా ఇంటికి పద" కంగారుపెట్టాడు సంతానం.
వాళ్ళిద్దరూ కనుమరుగయ్యేదాకా రాయుడు అక్కడే నిలబడ్డాడు.
సమయం రాత్రి తొమ్మిది గంటలు.
సంతానం, గౌరి అప్పటికే భోజనం చేసేసారు. అతను మంచం మీద కూర్చుని ఉంటే గౌరి అతని ఎదురుగా కూర్చుని తమలపాకులకు సున్నంరాసి, వక్కపొడివేసి తాంబూలాన్ని అతని నోట్లో పెట్టింది.
అతను తాంబూలాన్ని నోటితో అందుకుంటూ కసిక్కున ఆమె వేలుని కొరికాడు.
"హబ్బా!" బాధగా అంది గౌరి.
"హిహిహి" కేరింతలు కొడుతూ నవ్వాడు అతను.
"ఛీ...! ఎంత చిలిపివారండీ మీరు?" సరసంగా ఓ జల్లకాయ్ కొట్టింది గౌరి. ఆ దెబ్బకి అతని టెంకి 'ఫాట్' మని శబ్దం చేసింది.
"నీకు మాత్రం చిలిపితనం ఏమైనా తక్కువుందా?" టెంకి రుద్దుకుంటూ అన్నాడు
"హి... హిహి... హిహిహి" నవ్వింది గౌరి.
అతను తాంబూలాన్ని మేకలా కసకసా నమిలేసాడు.
"ఏదీ? మీ నాలిక చూపించండి?" అడిగింది ఆమె.
అతను నాలుక చాపాడు. అది ఎర్రగా పండింది.
"హమ్మో! ఎంత ఎర్రగా పండిందో!! అంటే నా మీద చాలా ప్రేముందన్న మాట!" కళ్ళు పెద్దవిచేసి చూస్తూ అంది ఆమె.
"మరి నీకు నా మీద ఎంత ప్రేముంది?" అతను అడిగాడు.
"నాకు తాంబూలం కట్టి ఇవ్వండి చెప్తా."
"నువ్విప్పుడు తాంబూలం తిని నీ నాలుకనేం చూపించనక్కరలేదు గానీ- మామూలుగా చెప్పు నా మీద ఎంత ప్రేముందో."
"మీ మీద నాకు చాలా ప్రేముందండీ" సిగ్గుపడుతూ చెప్పింది ఆమె.
"హబ్బ...హబ్బ!! ఎంత సిగ్గో?" ఆమెను దగ్గరకు తీసుకుంటూ అన్నాడు అతను.
సరిగ్గా అప్పుడే ఎవరో వీధి తలుపు దబదబా బాదారు.
"ఈ టైములో మన ఇంటికి ఎవరొస్తారబ్బా?" అన్నాడు బుర్రకాయ్ గోక్కుంటూ.
"ఏమో! వెళ్ళి తలుపుతీసి చూసిరండి." అంది గౌరి అతని మంచంమీది నుండి ఒక్క దూకు దూకుతూ.
అతను వీథి తలుపు తెరిచాడు.
ఎదురుగా రాయుడు.
"బాబుగారూ మీరా?: ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు అతను.
"ఔన్రా నేనే!"
"రండి బాబూ రండి!" గుమ్మానికి అడ్డు తొలిగాడు అతను. రాయుడు హాల్లో కూర్చున్నాడు.
"ఏంటి బాబూ! మీరు శ్రమపడి ఇంతదూరం రావాలా? కబురుపెడితే నేను రెక్కలు కట్టుకుని వాలేవాడిని కదండీ" అన్నాడు అతను.
"అబ్బో... అబ్బో ఏం స్వామిభక్తి? ఆ మాత్రం రెక్కలు నాకూ ఉన్నాయి లేవో...కొంపదీసి మీ ఇంటికిరావడం నీ కిష్టంలేదా ఏంటి?ఆ? హాహాహా" నవ్వాడు రాయుడు.
"అయ్యోరామా! అదేంటిబాబూగారూ అలా అంటారు? ఇది మీ ఇల్లు మాత్రం కాదంటండీ?" అతను మెలికలు తిరిగాడు.
"సరేగానీ... ఊరికే గెడకర్రలా నిల్చోడమేనా లేకపోతే దాహానికి ఏమైనా ఇచ్చేదుందా?"
"అరెరె.... మీరు ఇంటికొచ్చారన్న కంగారులో, ఆనందంలో ఆ విషయమే మర్చిపోయా... ఉండండి ఒక్క క్షణంలో చల్లటి మజ్జిగ తెస్తాను."
సంతానం లోపలికి పరుగెత్తి పెద్ద గ్లాసుతో మజ్జిగ తెచ్చి రాయుడికి ఇచ్చాడు.
రాయుడు గ్లాసు పైకెత్తి మజ్జిగని గటగటా తాగేశాడు.
"సరేగానీ... మజ్జిగ నువ్వు తెచ్చి ఇచ్చావేంటి? ఇంట్లో నీ పెళ్లాం లేదా?" మూతి కండువాతో తుడ్చుకుంటూ అన్నాడు రాయుడు.
"ఉందండీ.... కానీ అది పరాయిమగాళ్ళు ఎవరున్నారోయ్. నేను మీ వాడినే కదా" అన్నాడు రాయుడు నవ్వుతూ.
సంతానం ఇబ్బందిగా తల గోక్కున్నాడు.
"అన్నట్టు వచ్చిన పని మర్చిపోయా" రాయుడు జేబులోంచి మడతపెట్టిన ఓ కాగితం తీసాడు.
"ఇదిగో ఈ ఉత్తరం పక్కూరికి సైకిల్ మీద వెళ్ళి మా బామర్దికి ఇచ్చిరా."
సంతానం రాయుడి చేతిలోని కాగితాన్ని అందుకున్నారు.
"చిత్తం. రేపు తెల్లారి కోడి కూయగానే వెళ్ళి ఇచ్చేస్తానండీ బాబుగారూ" అన్నాడు.
"రేపు తెల్లారా? బలేవోడివే. ఇది శాలా అర్జంటు ఉత్తరం. ఉన్నపళంగా ఇప్పుడు బయల్దేరి ఇచ్చేసిరా."
"కానీ ఇంట్లో నేను, మా యావిడా తప్ప ఎవరూ లేరండీ. దానికి రాత్రిళ్ళు ఒంటరిగా ఉండాలంటే చాలా భయం బాబుగారూ" నసుగుతూ చెప్పాడు సంతానం.
ఆ మాట వింటూనే ఫెళ్ళున నవ్వాడు రాయుడు.
"నీకేం భయంలేదు నేనందుకేగా వచ్చాను. నువ్వెళ్ళిరా. నేను మీ యావిడికి తోడుగా ఉంటాను."
"బాబుగారూ" అరిచాడు సంతానం.
"ఏంట్రా కొంపలు మునిగేలా అలా గావుకేకలేస్తావ్? నాక్కూడా ఏం తోచడంలేదు. ఇక్కడుంటే మీ యావిడతో నాక్కూడా కాలక్షేపం అవుతుంది. ఊర్కే మాట్లాడ్తాను.... అంతేలే..."
"బాబుగారూ! మీకు ఏం తోచకపోతే చిత్రాంగి దగ్గరికి వెళ్ళండి. అంతేగానీ ఇలా కోరడం మీకు న్యాయంకాదు..." కోపంగా అరిచాడు సంతానం.
రాయుడు పకపకా నవ్వాడు.
"న్యాయమా? ఊళ్ళోని ఆడాళ్ళకి మాయమాటలు చెప్పి నాకప్పజెప్పినప్పుడు ఈ న్యాయం ఏమైంది? మర్యాదగా నువ్వు బయటికి నడువ్. నేను లోపలికెళ్తా. నీకు తెల్సుగా? ఈ రాయుడి కన్ను ఎవరిమీదైనా పడిందంటే ఓ పట్టాన వదలడని?" రాయుడు కుర్చీలోంచి లేచి లోపలి గదిలోకి వెళ్ళబోయాడు.
"ఒరేయ్ రాయుడూ."
సంతానం గట్టిగా అరిచి పరుగున వెళ్ళి రాయుడి పీక పట్టుకున్నాడు.
34
జరిగిన హఠాత్పరిణామానికి రాయుడు ఒక్క క్షణంపాటు కొయ్యబారిపోయాడు. సంతానం పీక పుచ్చుకుంటాడని రాయుడు ఊహించనేలేదు.
తేరుకున్న రాయుడు సంతానం చేతుల్ని విదిలించి కొట్టాడు.
"నా ఉప్పుతిని నా పీకే పట్టుకుంటావురా" గర్జిస్తూ సంతానం చెంప చెళ్లు మనిపించాడు.
"ఒరేయ్ రాయుడూ" దెబ్బతిన్న పులిలా రాయుడిమీదికి దూకాడు సంతానం.
"ఒరేయ్ రండర్రో. ఈడు నా ప్రాణం తీసేలా ఉన్నాడు" గట్టిగా అరిచాడు రాయుడు.
రాయుడి కేక వినగానే అప్పటిదాకా బయట నిలబడ్డ నల్గురు రౌడీలు బిలబిలా లోపలికి వచ్చి సంతానాన్ని పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు.
ఆ గోలకి లోపలి నుండి గౌరి పరిగెత్తుకు వచ్చింది.
"ఏవండీ ఏవిటండీ ఇదీ? వీళ్లు ఎందుకండీ మిమ్మల్ని పట్టుకున్నారు?" ఆందోళనగా అడిగింది గౌరి.
రాయుడు పకపకా నవ్వాడు.
"ఎందుకా? ఎందుకంటే మరి నేను నీతో సర్దాగా గడుపుదామని అనుకుంటుంటే అడ్డు తగుల్తున్నాడుగా మరి? అందుకని బయటికి ఈడ్చిపారెయ్యడంకోసం పట్టుకున్నారు."
"ఛీ.... నీచుడా... మారీచుడా.... నేనెవరనుకున్నావ్ రా- పవిత్రభారత నారిని!... భారతనారి భర్తని తప్ప అందర్నీ కొలుస్తుంది రా" ఆవేశంగా అంది గౌరి.
"గౌరీ ఆవేశంతో నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకే తెలీడం లేదు. అన్నీ తప్పులు తడకలు మాట్లాడుతున్నావ్. భారతనారి భర్తని తప్ప అందర్నీ కొలుస్తుందా?" ఆవేదనగా అడిగాడు సంతానం.
గౌరి నాలుక కర్చుకుని తర్వాత గట్టిగా చెంపలేస్కుంది. ఆ తరువాత రాయుడితో ఆవేశంగా ఇలా అంది.
