Previous Page Next Page 
ఎండమావులు పేజి 41


    "చూడండి టీచరుగారూ పరిస్థితులు తెలియక పూర్వం పట్టింపు లుండవు. పరిస్థితులు తెలిసాక పట్టింపులకన్నా పర్యవసానమే ఆలోచించవలసిన విషయం. ఇన్నాళ్ళుగా మా కుటుంబంలో ఒకరుగా మీకూ తగిన స్థానం ఉంచుకున్నారు. నేటితో ఆ పరిస్థితులు తారుమారైనవి. ఇంక ఇన్ని మాటలూ అనవసరమే. ఈ రోజునుంచి పిల్లలకు ట్యూషను అక్కర్లేదు. మా కుటుంబంతో మీరు చెయ్యగలిగిన స్నేహమూ లేదు. వెళ్ళిరండి. ఒక్క మాట. మా జ్యోతిని కూడా మీరు మర్చిపొండి. ఇంక మా ఇంటికి మీరు రావద్దు. మీ ఇంటికి మా జ్యోతి రాదు." అన్నారాయన.
    స్వాతి మొఖం వెలవెల పోయింది. కాళ్ళాడలేదు. భూమి కంపించి తాను అధః పాతాళలోకానికి పోతున్నట్లనిపించింది. నాలుక తడారిపోయి వడదెబ్బ తగిలినవాళ్ళలా పిడచగట్టుకు పోయింది. స్వేద బిందువు లతో ముఖమంతా నిండిపోయి ఎంతో అలసట చెందిన దానిలా అయింది. ఆ పరిస్థితుల్లో ఏం మాట్లాడాలో ఆమె కేమీ తోచలేదు. 'జ్యోతిని ఒక్కసారి చూడనిస్తారా' అని అడగాలనుకుంది గాని అడగలేక పోయింది. గొంతు పెగిలి రాలేదు. మెల్లిగా వెనక్కు తిరిగి, వచ్చే రిక్షాను చెయ్యెత్తి ఆపి అందులో కూర్చుని ఇంటికి చేరింది.
    అంతరాంతర కల్లోల పూరితమైన ఆమె హృదయంలో చెలరేగిన పెనుగాలి తాకిడికి ఆమె తట్టుకో లేక మంచంమీద వాలి చిన్నపిల్లలా వెక్కివెక్కి ఏడువసాగింది. ఈ పరిస్థితి ఏమీ కృష్ణమూర్తికి అర్ధంకాలేదు. మెల్లిగా వెళ్ళి ఆమె భుజం తట్టి ఏం జరిగిందని అడిగాడు.
    కారణ మేమిటో తె;లియంది తను మాత్రం ఏం చెపుతుంది?
    "స్వాతీ ఎందుకట్లా కన్నీరు పెట్టుకుంటావ్. ఎవరే మన్నారు. మన జీవితంలో కొత్తగా జరిగిన సంఘటనలేం లేవే" అన్నాడు.
    "ఏమీ లేదండి. నా కేమీ ప్రమాదం జరగలేదు. మీరు మనస్సులో బాధపడకండి. ఆయాసం వస్తుంది." అన్నది స్వాతి మంచంమీద నుంచే లేచి కూర్చుని. ఆమె ముఖం చూసేసరికి కృష్ణ మూర్తికి ఖంగారు జాస్తీ అయింది.
    "ఎవరే మన్నారు స్వాతీ. నాకు చెప్పవూ" అన్నాడు మళ్ళీ ఆయాసపడుతూ.
    "ఏమీ లేదండీ. తాసీల్దారుగారు ఇంకా ట్యూషను అక్కర్లేదు రావద్దన్నారు" అన్నది కళ్ళు తుడ్చుకుంటూ.
    "ఇంతమాత్రానికేనా స్వాతీ. వాళ్ళ ట్యూషను లేకపోతే మనం బ్రతకలేకపోతామా. దాని కింత విచార మెందుకు స్వాతీ, ఏమిటో అనుకున్నాను. పిచ్చిదానా" అంటూ నవ్వుతూ ఆమె బుగ్గలు తుడిచి ఆమె తలను తన గుండెలకు ఆనించున్నాడు. భర్త హృదయంలో కరిగిపోయింది స్వాతి.

                                *    *    *

    "చిన్నతనంలోనే అభమూ, శుభమూ తెలీని వయస్సులో భర్తను పోగొట్టుకున్న బాల వితంతు వులు పునర్వివాహం చేసుకోవటం తప్పా శ్రీలక్ష్మీ" అన్నది జయలక్ష్మి.
    "నువ్వెవరనైనా ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావా జయా" అన్నది శ్రీలక్ష్మి ఆశ్చర్యంగా చూస్తూ. ఇవాళ హఠాత్తుగా ఈ ప్రశ్న ఎందుకు వేసిందో ఎంత ఆలోచించినా అర్ధం కాలేదు.
    "నా విషయమై కాదు. నీ ఉద్దేశ్యం అడుగుతున్నాను. అభిప్రాయాలు చెప్పటంలో తప్పేమీ లేదుగా." అన్నది జయలక్ష్మి.
    "వైధవ్య ప్రేమ కూడా తప్పు కాకపోతే ఇంక తప్పుకాని దేముంది. నీ చదువూ సంస్కారమూ, డిగ్రీలు అవి తప్పు కాదని చెపితే ఇంక నాబోటిదాన్ని అడగవలసిన పనేముంది" అన్నది శ్రీలక్ష్మి.
    జయలక్ష్మి ముఖం జేవురించింది. ఆమె ఆశించిన సమాధానం శ్రీ లక్ష్మి వద్ద నుంచీ రాదని తెల్సు అయినా తన మనస్సులోని భావాలను ఏదో రకంగా వ్యక్తపర్చాలి.
    "నేను వితంతువుననీ, జీవితాన్నంతా మోడులా గడపవలసిందేననీ భగవంతుడు నా నొసట వ్రాశాడంటావు. కన్న తల్లిదండ్రులు దారిద్ర్య బాధ వల్ల చేసిన తప్పుకు శిక్ష అనుభవించమని కూడా ఈ పరమేశ్వరుడే వ్రాశాడా."
    జయలక్ష్మి మనస్సును అర్ధం చేసుకుంది. శ్రీలక్ష్మి నిప్పులేందే పొగ రాదు. మనస్సులో ఆలోచన లేందే అభిప్రాయాలు పైకి చెప్పరు. ఒక నిర్ణయానికి రాందే అదే విషయాన్ని తర్కవాదనకు తీసుకురారు.
    ఈ పరిస్థితులన్నీ అర్ధం చేసుకుంది శ్రీలక్ష్మి.
    "జయా, నువ్వు పసిపిల్లవు కావు. నీ బాగోగులు నువ్వు పూర్తిగా ఆలోచించుకునే ఒక నిర్ణయాని కొచ్చావు. ఇంతవరకూ వచ్చాక ఇంక ఇతరుల అభిప్రాయాలతో పనిలేదు. నీ జీవితాన్ని ఈ రకంగా ఒక మలుపుకు తిప్పుకుందామని నీ మనస్సులో అభిలాష ఉంటే ఎవరు కాదంటారు. పాప పుణ్యం సంగతీ, సిద్దాంతాల సంగతీ, ధర్మా ధర్మాల సంగతీ మనస్సు ఒక రకమైన పరిణతి చెందే స్థితికి రానంతవరకే ఆచరణయోగ్యమైనది కాని, మనస్సులో ఒక నిర్ణయం పాతుకుపోయాక ధర్మశాస్తాలను ఏకరువు పెట్టినా ఏమీ లాభం లేదు. ఏదయినా గుప్పెట్లో వస్తువు మూసి ఉన్నంతవరకే దాని విలువ. గుప్పెట తెరిచాక ఎంత విలువగల వస్తువు కయినా ఏమాత్రం విలువా ఉండదు." అన్నది శ్రీలక్ష్మి.
    జయలక్ష్మి ఉత్తేజితురాలైంది.
    "అవును నిజమే, సంఘంలోని ప్రతి వాళ్ళూ తన బుద్ధిని వినియోగించి విమర్శిస్తుంటే సంఘ మెట్లా నిలువలేదో, వ్యక్తిగత జీవిత విషయాల్లోనూ అంతే. అన్యాయాలు చెయ్యటం చేతనయి నప్పుడు అలాంటి వ్యక్తులకి ఎదుటివారి హృదయా లను తెల్సుకునే అవుసరం గాని, అనుభవం గాని ఉండదు. ఆ రీతిగానే ఒక సాంఘిక నియమానికి కట్టుబడి ఉండే వ్యక్తులకు ఎదుటివారి కష్టసుఖాలు అర్ధంకావు. శ్రీలక్ష్మీ నేను కేవలం ఐహిక వాంఛలను మనస్సులో రేపుకునే ఈ నిర్ణయానికి రాలేదు. నువ్వు వితంతువునైనా నీ జీవితం వెళ్ళబుచ్చటానికి తల్లిదండ్రులున్నారు. తోడబుట్టినవాళ్ళున్నారు. వాళ్ళ నీడన నువ్వు తల దాచుకో గలవు. కాని, నాకా యోగ్యత లేదు. నేను ఎవరి నీడన ఉంటాను. కాలేజీ చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేసుకున్నా, తింటూ కూర్చున్నా ఒంటరి జీవితాన్ని ఈ సంఘమూ, ప్రజలూ నన్ను గడప నిస్తారా? తమ అవుసరాలకు నన్ను బలిచేస్తారు. నన్ను వంచించి అధఃపతితురాల్ని చేస్తారు. ఆ నికృష్ణ జీవితం గడిపేకన్నా నా ఈ నిర్ణయమే సరైన నిర్ణయ మనుకుంటాను. ఏమంటావు శ్రీలక్ష్మీ" అన్నది జయలక్ష్మి.
    శ్రీలక్ష్మి మాన్పడిపోయింది. ఆమె నోటివెంట ఏ మాటా రాలేదు. ఏదో మాట్లాడుదా మనుకుంటున్న సమయంలోనే జానకిరాం వచ్చాడు.
    "జయా నువ్వు చెప్పిన మాటలన్నీ నిజమేవమ్మా, నేను సంపూర్ణంగా నీ అభిప్రాయాలతో ఏకీభవిస్తాను. ఆ అదృష్టవంతుడు జ్యోతి బావ, తాసిల్దారిగారి మేనల్లుడు మురహరి కదూ" అన్నాడు.
    జయలక్ష్మి ఉదాసీనత వహించింది. ఆమె హృదయంలో వీస్తున్న తుఫానుగాలి సర్దుమణిగి, సన్నటి వానజల్లు పడుతున్నది. ఆ వాన జల్లులో తడుస్తున్నాడు మురహరి. శ్రీలక్ష్మి ఇదేమీ అర్ధంకాక జానకిరాం వైపు చూసింది. కథంతా చెప్పాడు జానకిరాం.
    జయలక్ష్మి హృదయాన్ని అర్ధం చేసుకున్న జానకిరాం ఆమె కళ్ళల్లో నీళ్ళు చూసి ఆవేదన పడ్డాడు. ఈ తల్లిదండ్రుల్లేని నిర్భాగ్యురాలికి ఒక తోడూ నీడా అవసరమే. ఇంతకాలానికి ఈ నిర్ణయానికి రావటం హర్షదాయకమే. సంఘాన్ని, సమాజాన్ని, సాంఘిక నైతిక విలువలను ఒకే దృక్పధంలో నిలుపుకుని చూస్తున్న శ్రీలక్ష్మికి, జయలక్ష్మికి పరిస్థితి అర్ధంకాదు. జానకిరాం అర్ధం చేసుకో గలిగినా, జయలక్ష్మి అభిప్రాయం సహేతుక మైనదైనా, మురహరినే జయలక్ష్మి ఎంచుకునేసరికి అతని మనస్సులో లీలగా జ్యోతి కనిపించింది. ఈ ఒక్క సమస్యనీ, పరిస్థితినీ ఆ పరమాత్ముడే విడదీస్తాడనే అభిప్రాయానికి వచ్చాడు.
    "జయా ఆ పరమేశ్వరుడు నిన్ను రక్షించుగాక" అని కళ్ళు తుడ్చుకుని వెళ్ళిపోయాడు. మనస్సు లోనే హర్ష పులకాంకితమై అన్నగారికి నమస్కరించింది జయలక్ష్మి.

                                 *    *    *

                                  30

    జయలక్ష్మి వచ్చేసరికి స్వాతి మంచంమీద పడుకునుంది. అప్పటికి రెండు రోజులైంది ఆమె ధారకం తీసుకుని. జ్వరం ఎక్కువగా లేకపోయినా ఎవరు పలకరించినా ఏం మాట్లాడటంలేదు. కృష్ణమూర్తి పక్కనే కూర్చున్నాడు. మందు తెచ్చినా తాగనంటుంది. ఎప్పుడూ శూన్య దృక్కులతో కళ్ళార్పకుండా చూస్తుంది. ఆ చూపులోని అర్ధం ఏమిటో కృష్ణమూర్తికి కూడా తెలియదు. పాలు గాని, పళ్ళ రసంగాని ఏదీ వద్దంటుంది.
    "నీ పట్టుదలతో నన్ను దూరం చేసుకోదల్చుకున్నావా స్వాతీ" అన్నాడు కృష్ణమూర్తి ఆమె పట్టుదలను వారించదలచి. ఆ మాటలకు ఒక్క నిట్టూర్పు విడిచి మెల్లిగా నిరాశగా నవ్వుతుంది.
    జయలక్ష్మిని చూడంగానే మెల్లిగా లేచి కూర్చుని "వచ్చావా జయా, నువ్వు రావేమో అనుకున్నాను. నాయందు కరుణ ఉంచినందుకు చాలా "సంతోషం" అన్నది.
    ఈ రెండు రోజులకే పీక్కుపోయిన ముఖమూ, తైలసంస్కారం లేని జుట్టూ, వూడిపోయిన జడా, మాసిపోయిన చీరె, జాకెట్టుతో ఉన్న స్వాతిని చూసే సరికి జయలక్ష్మికి మతిపోయినంత పనయింది.
    "వదినెకు ఇంత జబ్బుగా ఉంటే కబురయినా చెయ్యలేదేం అన్నయ్యా. కన్నవారు దూరమైనా ఈ జయలక్ష్మి మాత్రం ఎప్పుడూ దూరం కాదు. ఇట్లాగే చూస్తూ వూరుకుంటే ఈ జబ్బు ఎంత ప్రమాదకరముగా పరిణమిస్తుందో" అన్నది జయలక్ష్మి స్వాతి జుట్టును సరిచేస్తూ ముఖంలోకి తేరిపారజూస్తూ.
    "మొన్నటి రోజున జ్యోతి వాళ్ళింటికి మామూలు గానే ట్యూషనుకు వెళ్ళింది. వెళ్ళిన పదినిమిషాలకే వాళ్ళు వద్దన్నారంటూ ఖిన్నురాలై వచ్చేసింది. ఆ రోజున నేను ట్యూషను వద్దన్నారేమో అంత మాత్రం చేత మనం బ్రతకలేకపోతామా అని తేలికగా చెప్పేశాను. కాని స్వాతి హృదయంలో అగ్ని పర్వతం బ్రద్దలయింది. దాని పరిణామమే ఇది. కారణమేమిటో ఎంత అడిగినా చెప్పటంలేదు జయా. పోనీ నీకయినా చెపుతుందేమో అడుగు." అని ముందు గదిలోకి వెళ్ళాడు కృష్ణమూర్తి.
    "నాతో చెప్పవు వదినా, నిన్నెవరయినా అవమానించారా. కాని మాటలేకమైనా జ్యోతి తల్లి అన్నదా" అన్నది జయలక్ష్మి.
    "ఒకళ్ళు కాని మాటలంటే అవమానంపొందిన వాళ్ళ మవుతామా జయా. భగవంతుడే మన నొసట వక్రగతిని జీవితం గడపాలని రాసినప్పుడు ఎవరో ఏదో అన్నారని కింద పట్టం ఎందుకు. పోనీలే నన్ను గురించి నాకు ఏ బెంగాలేదు. ఒక్క సంగతి చెపుతావా" జయలక్ష్మి కుడిచేతిని తన అరచేతులోకి తీసుకుని అడిగింది స్వాతి.
    "నువ్వు అడగబోయే ప్రశ్న నాకు తెలిసినదే వదినా. మురహరిని మభ్యపెట్టి, కాని పన్లతో ప్రోత్సహించి నావెంట తిప్పుకోవటం లేదు. జ్యోతి అతని మేనమామ కూతురని నాకు మొదట్లో తెలీదు. ఒకరి జీవితాన్ని నాశనంచేసి నేను అందల మెక్కి కులుకుదామనే కాంక్ష నాకెప్పుడు లేదు. ఈ రోజుకయినా మురహరి ఆలోచించుకుని తన నిర్ణయాన్ని మార్చుకుని జ్యోతిని చేసుకుంటానంటే నేను మీ అందరికన్నా ఎక్కువగానే హర్షిస్తాను. కాని వదినా అన్ని బాధలూ పడినదానివి. అన్ని అనుభవాలూ పొందినదానివి. నాబోటి నిర్భాగ్యురాలి మనస్సు నువ్వుకూడా అర్ధం చేసుకోలేకపోతే, అసలు స్త్రీవై ఉండికూడా స్త్రీ హృదయాన్నే అర్ధంచేసుకోగల మానసిక పరిణామం నీలో లేదేమో ననుకోవాల్సి వస్తుంది. ఇంతకు మించినేను చెప్పగలిగేదేమీ లేదు. ఏం చెప్పినా చర్విత చరణమే అవుతుంది. జ్యోతి యందు నాకు న్యూనతగానీ, కోసంగాని ఎన్నడూ లేదు. పసి వయస్సులో పసిడి భావాలు కల కన్నెపిల్ల జ్యోతి. ఆమె సిగ్గు మొగ్గలు తొడుగుతుంది. ఆమె భావాలు తామరకొలనిలోని విచ్చీ విచ్చని తామర పువ్వులాంటివి. బావనే ప్రేమించింది. బావనే తన మనస్సులో నిలుపుకుని పసిడి భావాలతో పుత్తడి బొమ్మలా అయి బంగారు పుష్పాలతో పూజించింది. నాబావ నాభర్త కావాలని మనసారా ప్రార్ధించి వళ్ళంతా కళ్ళు చేసుకుని బావరాకకోసం ఎదురుచూసేది. ఆమె కలువ కన్నియ. కన్నెముత్తైదువు. మేనరికంలోని మెత్తని మనస్సును తన సొమ్ముగా చేసుకున్న కన్నెపిల్ల. రాగాలతో, భోగాలతో, రాణింపజేసి రమణీయకతను సృష్టించగల కలభాషిణి జ్యోతి. కాని వదినా, ఇవన్నీ ఇక్కడికి వచ్చిం తర్వాత తెలుసుకున్న యదార్ధ విషయాలు. జ్యోతి మాదిరిగా ప్రేమించే హక్కు నాకులేదు. మేన బావ అని చెప్పుకునే చుట్టరికపు బాంధవ్యం నాకులేదు. తెలి మబ్బులలో తేలిపోతూ, చిరు సిగ్గును తన సొమ్ముగా ఒలకబోస్తూ, ప్రధమ వీక్షణంలోనే ప్రేమించానని కాలానుగుణ్యంగా చెప్పుకునే స్తోమత లేనిదాన్ని. మూడేళ్ళుగా చదువుకుంటున్నాము. ముఫ్ఫై సంవత్సరాల ఎరికగా మనస్సులు విప్పి మాట్లాడుకుని ఒకరినొకరం అర్ధం చేసుకున్నాము. అన్నింటినీ మించి నేను బాల్యంలోనే భర్తను పోగొట్టుకున్న నిర్భాగ్యురాలినని తెలుసు. ఆ విషయాన్ని నేనే చెప్పాను. అన్నీ తెలిసే నన్ను ఎంచుకున్నాడు మురహరి. మనస్సులు మాట్లాడుకున్నయ్యి. హృదయాలు అన్ని విషయాలు చర్చించుకున్నయ్యి. ఇతదాకా నచ్చాక నేనేం చెయ్యాలో నువ్వే ఆలోచించి ఒక మార్గం చూపిస్తే ఆ మార్గాన వెళ్ళటానికి నాకేం సందేహం లేదు. జ్యోతి నాకు ఈ రోజుకూ చెల్లెలే. ఆమెయందు నాకు ఏ ద్వేషంగాని, కోపం గాని, అసూయగాని లేదు. ఏది ఎవరి కర్తవ్యమో నువ్వు సూచిస్తే అక్షరాలా పాటిస్తాను. ఆ రకంగా నడ్చుకుంటాను. కర్తవ్యం ఉపదేశించటం నీ వంతు. కార్యాచరణ వాసంతు. ఇద్దరికీ ఈ స్వాతి వదినే శ్రీరామరక్ష." అంటూ ఆమె పాదాలకు నమస్కరించి కన్నీటితో అభిషేకం చేసింది జయలక్ష్మి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS