Previous Page Next Page 
మిసెస్ కైలాసం పేజి 41

 

                        మా వూరు (తరం) మారింది.


    దాదాపు పదిహేను సంవత్సరాల తర్వాత మా వూరి గడ్డ మీద కాలు పెట్టబోతున్నాను. ఊరు దగ్గిరౌతుంటే చిన్ననాటి స్మృతులు కూడా మనస్సుకు చేరువవుతున్నాయి. ఉద్యోగరీత్యా డిల్లీలో ఉంటున్న నేను ఈ పదిహేను ఏళ్ళలో ఒక్కసారి కూడా మా ఊరు రాలేదు. కారణం మా ఊరంటే నాకు పెద్దగా అభిమానం లేదు. ఆ ఊరు నాకు ఏమీ ఇవ్వలేదు. బాల్యజీవితం తాలుకూ స్మృతులు బాధనే కలిగిస్తాయి. ఒక విధంగా మా పల్లెటూరి జీవితాన్ని తలుచుకొని , ఆ ఊళ్ళో నన్ను ఎలా స్వీకరిస్తారోనని భయం కలిగింది.
    నా చిన్నప్పుడు మా ఊళ్ళో ముఖ్యంగా మా కులంవాళ్ళు , గుర్రబ్బండిగ్గాని ఏ బండిగ్గాని తెరలు కట్టుకోకుండా ఆడవాళ్ళు బయలుదేరే వారు కాదు. నేను మాత్రం యేది యేమయినా తెరలు కట్టుకొని వెళ్ళకూడదనుకున్నాను. వేజెండ్ల స్టేషన్ లో దిగి గుర్రబ్బండి కట్టించుకొని బయలుదేరాను. అందరూ నాకేసి చిత్రంగానూ, నిరసనగానూ చూస్తారని నాకు తెలుసు. అసలు నేను కష్టపడి ప్రవైటుగా మెట్రిక్ పాసయిఉద్యోగానికి వెళుతున్నానంటే అందరూ తలోరకంగా నిందించారు. చెయ్యరాని మహాపరాధం ఏదో చేస్తున్నట్లు భావించారు. అందుకే నాకు ఆ ఊరంటే భయం. ఉద్యోగానికి వెళ్ళిన కొత్తలో ఒకసారి కాబోలు మా ఊరికి వచ్చాను. నా చిన్ననాటి స్నేహితురాళ్ళు కూడా కళ్ళు పెద్దవి చేసుకుని వింత జంతువును చూసినట్లు చూశారు.అంతే మళ్ళీ ఆ ఊళ్ళో అడుగు పెట్టలేదు.
    బండి ఊళ్ళో ప్రవేశించింది. ఆ బజారు నాకు సుపరిచితమైందిగా తోచలేదు. ఎన్నో మేడలూ, దుకాణాలూ లేచాయి. ముఖ్యంగా తెరలేని బండిని ఎవరూ నోళ్ళు తెరచుకొని చిత్రంగా చూట్టం లేదు. బజారులో కూడా రద్దీ ఎక్కువగానే వుంది. వూరు బాగా పెరిగినట్లనిపించింది. ముఖ్యంగా నన్ను ఆశ్చర్యపరచిన దృశ్యం - రోడ్డుకు అవతల వైపు నుంచి వయస్సులో వున్న ఆడపిల్లలు పుస్తకాలు చేతుల్లో పట్టుకుని నిశ్చింతగా హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నడవటం.
    ఇరవై సంవత్సరాల క్రితం అదే స్కూలు అక్కడే వుండేది. అప్పుడది మిడిల్ స్కూల్. ఇప్పుడు హైస్కూలు. తేడా అంతే! మధ్యలో ఇరవై సంవత్సరాల కాలం మాత్రం తన ప్రభావాన్ని విడిచి వెళ్ళిపోయింది. నాకుచిన్నతనంలో బాగా చదువుకోవాలనే అభిలాష ఉండేది. బస్తీ కెళ్ళి కాలేజీలో చదవాలనీ, బాడ్ మింటన్ ఆడాలనీ, ఉద్యోగం చేయాలనీ , ఏవేవో , ఎన్నెన్నో తెలిసీ తెలియని వయసులో కలలు కన్నాను. వీధి బడి చదువుతోనే ఇంట్లో కూర్చోవలసి వచ్చింది. కనీసం వూళ్ళో ఉన్న స్కూల్లో ధర్డ్ ఫారం వరకయినా చదివి తీరతానని పట్టు పట్టాను. ఏడ్చాను. కాని ఫలితం లేకపోయింది. పదేళ్ళు వచ్చిన ఆడపిల్ల రోడ్డు అవతల వున్నా స్కూలుకు వెళ్ళి చదువుకోవటం మన ఇంటా వంటా లేనిపని అంటూ పెద్దవాళ్ళు మందలించారు. నాకంటే పెద్దయిన అన్నయ్య కూడా నా మీద కేకలు వేశాడు. కాని ఆ అన్నయ్య ఈనాడు తన కూతుర్ని గుంటూరు కాలేజీలో చదివిస్తున్నాడంటే నేను నమ్మలేకపోయాను. ఆనాడే కనక నాకు చదువుకొనే అవకాశం లభించి ఉన్నట్లయితే ?
    అన్నయ్య కూడా ధర్డు ఫారంతోనే చదువుకు స్వస్థి చెప్పి వ్యవసాయంలో ప్రవేశించాడు. మా నాన్నగారు పోయి చాలా కాలం అయింది. కాని మా నాయనమ్మ ఇంకా బతికే వుంది. నాయనమ్మంటే నాకెంతో యిష్టం! తెల్లగా, పొట్టిగా , పల్చగా వుండే నాయనమ్మ చిన్నప్పుడు నాకేన్నెన్నో రాజకుమారుల కధలు చెప్పేది.
    ఎంతోకాలం తరవాత వచ్చిన నన్ను అందరూ ఎంతో ఆదరంగా ఆహ్వానించారు. అమ్మ సంతోషానికి అంతులేదు. ఏడు నుంచి రెండు సంవత్సరాల పిల్లలుగా నాకు తెలిసిన నా మేనకోడల్లూ , మేనల్లుళ్ళూ ఇప్పుడు నాకంటే పొడవుగా వున్నారు. నాకంటే పెద్దచదువులు చదువుతున్నారు. నేను వస్తున్నానని తెలిసి వాళ్ళు కూడా వూరికి వచ్చారు. వాళ్ళ మధ్యలో నాకు పల్లెటూళ్ళో వున్నట్లుగానే అనిపించలేదు. ఆ ఊళ్ళో చాలా మంది ఆడపిల్లలు పెద్ద చదువులు చదువుతున్నారని తెలిసింది. ఊరికే ఉబుసుపోక కబుర్లు చెప్పుకొనే పల్లెమనుషులు - ముఖ్యంగా ఆడవాళ్ళు -- ఏ పత్రికలో చదువుతూ తీరికవేళల్ని గడుపుతున్నట్లు కూడా గమనించాను. నేను ఇరవై సంవత్సరాల తర్వాత పుట్టి వుంటే ఎంత బాగుండేది అనిపించింది. అలా అయితే ఇప్పుడు దాదాపు పదిహేను పదహారు సంవత్సరాల వయస్సు వుండేది. ఎంత చక్కగా స్కూలుకూ, కాలేజీకి వెళ్ళి చదువుకునేదాన్ని! మా వూళ్ళో ఒక పెద్ద లైబ్రరీ సినిమాహాలు కూడా ఏర్పడింది.
    ఆ రోజు మా మేనకోడలూ, మేనల్లుళ్ళూ గుంటూరు వెళ్ళి పోయారు.
    ఏమీ తోచక దొడ్లోకి వచ్చాను. బావి దగ్గర చప్టా మీద అమ్మా, నాయనమ్మా కూర్చొని ఏదో దీర్ఘంగా చర్చిస్తున్నట్లు కనిపించారు. నేనూ వాళ్ళ దగ్గిర కెళ్ళి కూర్చున్నాను. ఎవరూ నన్ను పలకరించలేదు. వాళ్ళ ముఖాల్లోకి పరిశీలనగా చూశాను. అమ్మ కళ్ళు వాచి వున్నాయి. నన్ను చూడగానే మళ్ళీ కళ్ళల్లో నీరు తిరిగినట్లుంది. అక్కడ నుంచి గబుక్కున లేచి లోపలకు వెళ్ళిపోయింది.
    నాయనమ్మ ద్వారా తెలిసింది. కోడలు అమ్మను బొత్తిగా ఖాతరు చేయడం లేదట. అమ్మ వూరుకోలేక ఏదో చెప్పబోతుందట! వదిన విదిలించి పెడుతుందట!
    "అయినా వాళ్ళు ఎలా ఖర్చు చేసుకుంటే మీ అమ్మ కేందుకే! మాట వినని వాళ్ళకు చెప్పడం ఎందుకు?" అంది నాయనమ్మ.
    అమ్మని అలా అన్నందుకు నాకు నాయనమ్మ మీద కోపం వచ్చింది. "నువ్వు మాత్రం మా అమ్మ మీద యెంత పెత్తనం చెలాయించలేదు! పాపం మా అమ్మ ఒక్కనాడయినా పెదవి కదిపిందా?" అన్నాను.
    "మీ అమ్మను నేను బాధపెట్టేనటే! నేను పడిన బాధలో మీ అమ్మ ఎన్నో వంతు చూసిందే! మీ అమ్మకు అన్నం సరిగా పెట్టలేదా? వేరే అన్నం వండి పెట్టానా?" అంది రోషంగా నాయనమ్మ.
    నాయనమ్మకు నిజంగానే కోపం వచ్చింది. ఎలాగయినా మాటల్లో దించాలనే ఉద్దేశ్యంతో అన్నాను." "అయితే మీ అత్త నీకు పొట్ట నిండా అన్నం కూడా పెట్టలేదా?"
    "అవునే అమ్మాయ్! మా అత్త గురించి నీకేం తెలుసే నన్నెంత కాల్చుకు తిందో!"
    "ఎప్పుడో ఒకసారి మీ అత్తగారు మంచిదని చెప్పావ్!"
    "ఇప్పుడు మాత్రం కాదన్నానంటే?"
    "రెండూ నువ్వే చెబుతావ్. మీ అత్త మంచిదో కాదో నేనే నిర్ణయించుకుంటా గాని అసలు కధ చెప్పు" అన్నాను.
    కధ చెప్పటం అంటే నాయనమ్మకు ఎక్కడ లేని ఓపిక వస్తుంది.
    "ఇప్పుడు నా కెన్నెళ్ళూ అమ్మాయ్?"
    "నీ ఏళ్ళ గురించి ఇప్పుడెందుకులే. మీ అత్తగారి గురించి చెప్పు" అన్నాను కొంచెం విసుగ్గా.
    "అంత విసుగయితే ఎట్లాగే! ఇప్పుడు నాకు డెబ్బై ఏళ్ళు అనుకుంటా. అవును బందరు గాలివానకు ఐదేళ్ళ పిల్లనంట! నా పదమూడో ఏట కాపరానికి వెళ్ళాను. అంటే ఎన్నేళ్ళనాటి సంగతో నువ్వే లెక్కేసుకో !" అనేసి నాయనమ్మ బోసినోటిని చప్పరించసాగింది.
    ఇలా లాభం లేదని నేనే ప్రశ్నలు వేశాను.
    "నాయనమ్మా! నువ్వు మా తాతయ్యతో పగలు మీ అత్తగారి ముందు మాట్లాడేదానివా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS