Previous Page Next Page 
మట్టి మనిషి పేజి 41


    వడ్లపురి పక్కన కాటా నిలబెడ్తున్న కూలీలను చూసి "రెండు రోజుల తర్వాత వస్తానన్నారుగా, ఇవ్వాళే వచ్చారేం?" అన్నాడు.
    వెంకటపతి పక్కన నిలబడి పురి పగలగొట్టించాడు. కూలీలు వడ్లు కాటా వేసి బస్తాలు నింపుతున్నారు. ఎప్పుడు పట్టిన బస్తాలను అప్పుడే లారీలోకి ఎక్కిస్తున్నారు. వెంకటపతిని చూసి "వీడెప్పుడొచ్చాడూ?" అనుకున్నాడు సాంబయ్య. బస్తీలో వుంటున్నాడుగా? ధాన్యం అమ్మింది తెలుసుకొని, మళ్ళీ డబ్బు గుంజుకు పోవటానికి వచ్చి వుంటాడు. డబ్బు అవసరం అయినప్పుడే వీడికి ఇల్లూ, వూరూ, తండ్రీ గుర్తొస్తారు. ఏమైనా వీడికి ఈసారి చిల్లిగవ్వ ఇచ్చేదిలేదు. దృఢనిశ్చయం చేసుకొన్నాడు సాంబయ్య.
    ఇంట్లోకి వెళ్ళి మంచినీళ్ళు తాగి తిరిగొస్తున్న వెంకటపతితో "ఏంరా? రేటు ఏమన్నా పెరిగిందేమో విచారించావా? లేకపోతే నాలుగు రోజులు ఆగి తోలుకెళ్తామన్నవాళ్ళు ఈ రోజే ఎందుకొస్తారు?" అన్నాడు సాంబయ్య.
    "రేటెడ పెరిగింది? రోజుకు రోజు తగ్గిపోతుంటే!" తనలో తనే అనుకుంటున్నట్లు అని లారీల దగ్గిరకెళ్ళి బస్తాలు లెక్కపెట్టడం మొదలుపెట్టాడు.
    "నీ కొకటి పట్టిందీ ఇది పట్టటానికి? ధర పడిపోతుంటే మిల్లువాళ్ళు తొందర పడతారా ఏం?" అంటూ కాటా దగ్గర్నుంచి లారీ ముందుకెళ్ళాడు సాంబయ్య.
    లారీ నిండుగా ధాన్యం బస్తాలు వేసి వున్నాయి. కూలీలు తలగుడ్డలు దులుపుకున్నారు. కాటా వాసాలూ, బల్లలూ మడిచి, రెండో పురిపక్కన గోడవారగా మళ్ళీ కాటా నిలబెట్టారు. కాటామేస్త్రీ మొత్తం "డెబ్బై నాలుగు' బస్తాలని లెక్క చెప్పాడు గుమాస్తాకు.
    గుమాస్తా లారీడ్రైవర్ తో అన్నాడు - "ఒక లారీ చాలదు. నాలుగు ట్రిప్పులు వేసినా ఇవ్వాళ ధాన్యం అంతా చేరేట్టులేదు. ఇంకా మూడు పురులు వున్నాయి. కనకయ్యగారితో చెప్పు - ఇంకొక లారీ మాట్లాడి పంపమని. రెండూ కలిసి మూడు ట్రిప్పులేస్తే సరిపోతుంది".
    "ఆగు!" లారీ స్టార్టు చేస్తున్న డ్రైవర్ని చూసి కేకవేశాడు సాంబయ్య.
    వెంకటపతికి గుండెలు చల్లబడ్డాయి!
    "ఏ మిల్లుకయ్యా ధాన్యం తోలేది?" గుమాస్తాను అడిగాడు.
    "మన కనకయ్యగారి మిల్లుకే!"
    "ఛత్! ఆపండి. కనకయ్య మిల్లుకైతే గింజకదలటానికి వీల్లేదు. పరమేశ్వరీ మిల్లు తాలూకు రామావతారానికి నేను మాట ఇచ్చింది, కనకయ్యకు కాదు." సాంబయ్య ఉద్రేకపడుతూ అన్నాడు. కనకయ్య గుమాస్తా ఖంగారుపడ్డాడు.
    "ఇదేమిటండీ వెంకటపతిగారూ?" వెంకటపతిని చూసి అన్నాడు గుమాస్తా.
    "నేను కనకయ్యను నెలకిందే మాట ఇచ్చాను. కొంత పైకం కూడా తీసుకున్నా." తండ్రికేసి చూడకుండానే తండ్రితో చెప్పాడు వెంకటపతి.
    కోపంతో సాంబయ్య నిలువెల్లా వణికిపోయాడు.
    "ఎవడ్నడిగిచ్చావురా?" అంటూ సాంబయ్య కూలీలను సమీపించి "దించండి! ఊఁ అట్లా చూస్తారేం? చెప్పేది మీక్కాదూ?" అన్నాడు.
    "లారీ పోనీయండి గుమాస్తాగారూ!" అన్నాడు వెంకటపతి. అంతధైర్యం వెంకటపతికి ఎక్కడనుంచి వచ్చిందో! సాంబయ్య కొడుకుని గుడ్లెర్రజేసి చూశాడు.
    "లారీ కదలటానికి వీల్లేదు. ఎట్లా పోతుందో నేను చూస్తాను." సాంబయ్య లారీకి అడ్డంగా వెళ్ళి నిలబడ్డాడు.
    లారీడ్రైవర్ కు ఎటూతోచక ఇంజన్ ఆపుచేశాడు.
    "ఏమిటండీ ఇది వెంకటపతిగారూ? నాకెందుకీ గొడవంతా? ఆ కనకయ్యనే పిల్చుకొస్తా!"
    "నువ్వాగవయ్యా!" గుమాస్తాను విదిలించేసి వెంకటపతి లారీ ముందు నిలబడ్డ తండ్రి దగ్గిరకొచ్చాడు.
    "నువ్వు తప్పుకో! లారీ పోనియ్!"
    కొడుకుమీదకు తండ్రి కర్ర ఎత్తాడు. "గాడ్దికొడకా, నువ్వు పెళ్ళాం మాటలు విని....." సాంబయ్య మాట పూర్తికాలేదు. వెనక్కు విరుచుకుపడిపోయాడు.
    తనయుడు తండ్రిని లారీముందునుంచి తోసేశాడు!
    సాంబయ్య కిందపడ్డాడు! కొడుక్కేసి చూశాడు--
    వెంకటపతికి అప్పటికికాని తెలియలేదు- ఆ పడింది తన తండ్రి కాదు-- నేననీ ఆ పతనం తనదేననీ!
    లారీ రొదచేస్తూ వెళ్ళిపోయింది. డ్రైవర్ పక్కన కూర్చున్న వెంకటపతికి లారీ తన గుండెల మీదనుంచే వేలుతున్నట్లుగా అనిపించింది. తనేం చేశాడు?
    కూలీలంతా ఎక్కడివాళ్ళు అక్కడ బిగిసిపోయి నిలబడ్డారు. కనకయ్య గుమాస్తా వచ్చి కిందపడ్డ సాంబయ్యను లేవదీయబోయాడు. సాంబయ్య గుమాస్తా చేతుల్లోనుంచి తన రెక్క విదిలించుకొని పౌరుషంగా చూశాడు. తనే లేవడానికి ప్రయత్నించి లేవలేక మళ్ళీ కూలిపోయాడు. అంపశయ్యమీద ఉన్న భీష్ముడిలా కనిపించాడు గుమాస్తాకు సాంబయ్య!
    ఎరువుతోలి తిరిగి వచ్చిన జీతగాడు రాముడు - బండితొట్లోనుంచి కిందకు దూకాడు. సాంబయ్యను లేవదీసి ఇంట్లోకి తీసుకెళ్ళాడు.
    సాంబయ్య మళ్ళీ ఇంట్లో నుంచి బయటకు రాలేదు. చీకటి పడేసరికి రెండు లారీలమీద ధాన్యం అంతా బస్తీకి చేరింది. వెంకటపతి తిరిగిరాలేదు. కనకయ్య గుమాస్తాయే ధాన్యం అంతా కాటా వేయించి మిల్లుకు తోలాడు. మొదటిలారీలో మిల్లుకు చేరిన వెంకటపతి; ధాన్యం అంతా మిల్లుకు చేరిందాకా మిల్లులోనే కూర్చున్నాడు. ఆ రోజంతా తలెత్తి మాట్లాడలేదు. కనకయ్య డబ్బు లెక్కకట్టి, ఐదువేలు మినహాయించి, మిగతాది ఇచ్చాడు. వెంకటపతి డబ్బు లెక్క పెట్టుకోకుండా, వెళ్తానని అయినా చెప్పకుండా ఇంటికి వచ్చాడు.
    పొద్దుపోయి, దిగాలుపడి వచ్చిన భర్తను చూసి వరూధిని అనుకొన్నది, అతను వెళ్ళిన పని అయివుండదు. ముసలాడు ఆయన్ను గెలవనిస్తాడా? తండ్రికి చాలని వాజమ్మ. చెవులు ఆడించుకుంటూ వచ్చాడు. ఆ ముఖం చూస్తేనే తెలియడంలా?
    "చాతకానివాడిని ఎందుకు వెళ్ళాలి? నెత్తిన గుడ్డేసుకొని నా దగ్గిర ఏడవటానికి ఎందుకు వచ్చావ్? అదేదో మీ అయ్యముందే కానివ్వకపోయావూ?"
    "నోర్ముయ్!"
    "తండ్రి నోరు మూయించటం చాతకానివాడివి పెళ్ళాం నోరు మూయిస్తావా?"
    నోట్ల కట్టలు వచ్చి వరూధిని ముఖానికి ఫెడీల్మని తగిలాయి! వెంకటపతి ముఖంలోకి చూసిన వరూధిని వళ్ళంతా చమటలు పట్టింది! గదిలోకి వెళ్ళి ముడుచుకొని పడుకొంది.
    ఒక గంట గడిచాక వెంకటపతి నీళ్ళు పోసుకొని డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. పనిపిల్ల ప్లేట్లో అన్నం పెట్టి - ఒక గిన్నెలో కోడి పులుసూ, మరో ప్లేటులో కోడివేపుడూ తెచ్చి పెట్టింది. కోడికాలు మాంసం ముందుపళ్ళతో పీకుతుంటే వరూధిని గుర్తొచ్చింది. వరూథినికి ఆ మాంసం అంటే తగని ఇష్టం.
    పనిపిల్లను పిల్చి "అమ్మగారు అన్నం తిన్నదా?" అని అడిగాడు వెంకటపతి.
    "లేదు, బాబూ! అమ్మగారు ఎందుకో ఏడుస్తూ పడుకొన్నారు."
    వెంకటపతి కోడికాలు పళ్ళెంలో వదిలి, ఎంగిలి చేత్తోనే భార్య గదిలోకి వెళ్ళాడు. భర్తచేత ఓ పావుగంట బతిమాలించుకొని వరూధిని అలకపాన్పు వదలి అన్నం ముందు కూర్చుంది.
    
                           16
    
    వీధిలో సాంబయ్య తలెత్తుకు తిరగడంలేదు. సాంబయ్య రామాలయం దగ్గరకు గానీ, రచ్చబండ దగ్గిరకు గానీ వెళ్ళి మూడునెలలు అయింది. తప్పనిసరిగా పొలం వెళ్ళాల్సివస్తే పోలేరమ్మ గుడిమీదుగా చుట్టు తిరిగి వెళ్తున్నాడు. పొలాన అంతగా చేసే పనులు కూడా ఏమీలేవు. జేతెహగాడు రాముడే అంతా చూసుకొంటున్నాడు. ఇంట్లోనే మంచం మీద కాసేపూ, విసుగుపుడితే పడకకుర్చీలో కాసేపూ కూర్చొని కాలాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు. గొడ్లచావిడీ ఇల్లూ తప్ప వేరే లోకమేలేదు. రోజూ కనిపెట్టుకొనివుండే జీతగాడూ, అడపాదడపా వచ్చిపోయే చింతడూ, బిచ్చాలూ తప్ప మనుష్యులు కనబట్టంలేదు.
    చూడి ఆవు ఈని వారంరోజులయింది. సాంబయ్యకు మంచి కాలక్షేపం దొరికింది. చావిట్లోనే మంచం వేసుకొని ఆవుదూడను మంచం కోటికి కట్టుకొని అస్తమానం దాంతోనే ఆడుకొన్నంతపని చేయసాగాడు. నిగనిగలాడుతున్న ఆవుదూడ ముట్టెను పొదువుకొన్నప్పుడు, దూడ గుండెల్లో కుమ్ముతుంటే సాంబయ్యకు పరమానందంగా ఉండేది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS