Previous Page Next Page 
శ్రీ శ్రీ సంసార ప్రస్థానం పేజి 41


    "పిలవకండి. నే నీ పూటకి రాను. ఉదయం కలుసుకుందాం. గుడ్ నైట్" అని చెప్పేసి, భోజనాల ప్లేట్లు తీసుకొని వెళ్ళిపోయాను.
    వేసిన ఆకలి కూడా చచ్చిపోయింది. ఆవిడన్న మాటలే చెవిలో గింగురు మంటున్నాయి. కానీ శ్రీశ్రీగారన్న మాటలతో నాకెంత సంతోషం, ధైర్యం కలిగిందో చెప్పలేను.
    ఆవిడ తప్పకుండా నన్ను టెస్టే చేశారు. ఈ విషయం శ్రీశ్రీగారి మాటల వల్ల తేటతెల్లమౌతోందనుకుంటూ.
    తలుపులూ, కిటికీలూ బిగించేశాను. అమ్మా, నేనూ ఆకలి లేకున్నా భోజనాలు చేశాం.
    అమ్మ పడుకుంది. నేను మళ్ళీ స్క్రిప్ట్ పెట్టుకుని కూర్చున్నాను. తెల్లవారు ఝామున నాలుగు గంటలయ్యేసరికి పూర్తి చేసేశాను. అంతే - తర్వాత హాయిగా నిద్రపట్టేసింది.
    తెల్లవార్లూ కూర్చొని రాశానని అమ్మకి తెలుసు. కాబట్టి నన్ను లేపలేదు. తొమ్మిది పది గంటల మధ్య లేచాను. స్నానం చేసి టిఫిన్ తెప్పించుకొని తిన్నాను.
    పక్క రూమ్ లో మాటల అలికిడి అవుతోంది.
    నేను ఊరికే మంచం మీద నడుం వాల్చాను.
    డ్రైవర్ పైకి వచ్చి "కారు తీసుకొచ్చాన"ని చెప్పాడు.
    ఆవిడ ఆఫీసుకి రానని చెప్పేశారు. మా అమ్మని కూడా ఉండి పొమ్మన్నారు. నేనొప్పుకోలేదు.
    "మేము గంటలో వచ్చేస్తాం. తలుపులు వేసుకు పడుకోండ"ని చెప్పాను.
    "గంటలో ఎలా వస్తావు సరోజా! సెన్సార్ స్క్రిప్ట్ రాయాలికదా?"
    "రాద్దాంలెండి" - అనేశాను.
    
                                                *    *    *
    
                                     శ్రీశ్రీగారి చివాట్లు
    
    నేనూ, శ్రీశ్రీ గారూ ఆఫీసు గదిలో కూర్చున్నాం.
    రెండు కాపీలు విడివిడిగా వారి ముందు పెట్టాను.
    "ఏఁ,మిటాపని" అడిగారు.
    "తెలుగు సెన్సార్ కాపీలు అన్నాను.
    నిజంగా వారు ఆశ్చర్యపోవడంతోపాటూ ఓ విధమైన ఎక్స్ ప్రెషనిచ్చారు చూడండి జీవితంలో మరచిపోలేను.
    "అయితే ఈ రెండు రోజులూ రాత్రి నిద్ర పోలేదన్నమాట".
    "నెత్తి మీద పనివుంటే నాకు నిద్ర రాదండీ" అన్నాను.
    "వెరీగుడ్ అయితే మనం ఈ రోజే వెళ్ళిపోదాం" అన్నారు.
    "మీ ఆవిడ చంపేస్తుంది" అన్నాను. నవ్వారు.
    వెంటనే శంకర్ సింగ్ గారిని పిలిపించి, "ఇవిగో రెండు సెన్సార్ కాపీలు" అని వారి చేతికిచ్చారు. శంకర్ సింగ్ గారు నిశ్చేష్టులయిపోయారు.
    "అదేమిటమ్మా? ఎప్పుడు రాశారు?" అనడిగారు.
    "ఇక్కడికి వచ్చిన తర్వాతే సార్!" అని నవ్వేశాను.
    ఇంకా రెండు మూడు రోజులౌతుందనుకున్నారాయన. త్వరగా పని పూర్తయిపోయిందన్న సంతోషంతో వెయ్యి రూపాయిలిచ్చారు నాకు. నేనలాగే శ్రీశ్రీగారి చేతికిచ్చాను.
    "నాకెందుకు?" అది నీ కష్టం" అన్నారు.
    "మీ కష్టంలో ధన భాగం నేను పంచుకోలేదా?" అన్నాను.
    చురుగ్గా కళ్ళలోకి ఒక్కసారి చూశారు.
    శంకర్ సింగ్ గారితో, "ఈరోజంతా మీ కారు మాకు ఇచ్చెయ్యాలండీ" అన్నారు.
    "ఓ తప్పకుండా" అన్నారాయన.
    "పోతే రాత్రి కొత్త పిక్చర్ ఒకటి చూడాలి. ఆ వేళకి వచ్చేస్తాం. మీ డ్రైవర్ తో మైసూర్ లో చూడాల్సిన ముఖ్య ప్రదేశాలన్నీ చూపించమని చెప్పండి" అంటూ.
    కారులో కూర్చొని, "నీతో ఏం దారి సరోజా!" అన్నారు.
    "ఏం చేశానండి"
    "ఒళ్ళు హూనం చేసుకొని అంత త్వరగా పూర్తి చెయ్యకపోతే ఏఁవి?".
    'అమ్మయ్య' అనుకోని, "ఏదీ ఆ మాట నిజంగా నా ముఖం చూసి చెప్పండి" అన్నాను.
    "సర్లే! ఇప్పుడేమిటి ప్రోగ్రాం?".
    "మొదట మీ ఆవిడని పికప్ చేసుకోవడం".
    "నువ్వు నిజంగానే రాక్షసివి".
    "ఉత్త రాక్షసినేనా?" - అన్నాను నవ్వుతూ.
    "కాదు బ్రహ్మ రాక్షసివి"
    "నేం చేశానని నాకా బిరుదు?"
    "రెండు రాతిల్లు మేలుకొని రాశావంటే బ్రహ్మ రాక్షసివికాక మరేమిటి? నీకీ జన్మకి బుద్దిరాదు. స్పీడు తగ్గించు, తగ్గించమంటే నా మాట వినవుకదా".
    "పని విషయంలో మీ మాట విననండి. చేతిలో ఉన్న పని పూర్తిచేస్తే అదృష్టం బాగుండి మరేదైనా పిక్చర్ వచ్చిందనుకోండి. మీకేం పోయింది - నేను చస్తాను. అందుకనే త్వరగా పనులు చేసుకొని కూర్చోడం.' అన్నాను.
    "ఇంకా ఎన్ని పిక్చర్లు కావాలి సరోజా?".
    "పది పిక్చర్లు కావాలండి. వస్తాయా? అలా అడుగుతారేఁ? రెండు పిక్చర్లు పూర్తిచేశాం. ఒక పిక్చర్ చేతిలో వుంది. ఇంకొకటి వచ్చేదాక చెప్పలేం. స్క్రిప్ట్ చేతిలో పడేదాకా నమ్మొద్దని మీరేగా అంటూ వుంటారు" - అన్నా.
    నిజానికి ఈ సెన్సార్ స్క్రిప్ట్ పూర్తిచెయ్యడం ఆయనకి చాలా సంతోషంగా, రిలీఫ్ గా కూడా వుంది. కానీ బైటి కాభావం వెలిబుచ్చరు.
    
                           *    *    *
    
    లాడ్జికి చేరుకున్నాం. ఆవిడ హాయిగా నిద్రపోతున్నారు. కొంతసేపటికి అందరం తయారయి బయలుదేరాం.
    మైసూరులో ముఖ్యమైనవి చూసి, వచ్చేదారిలో మైసూరు సిల్క్ దుకాణానికి వెళ్ళాం. ఆవిడ అరడజను చీరలు కొనుక్కున్నారు. నేనేఁమీ కొనలేదు.
    ఆలస్యమయినందువల్ల, అలాగే కొత్త పిక్చర్ ప్రొజక్షన్ కూడా చూసుకొని లాడ్జికి చేరుకున్నాం.
    నాకు నిద్ర వస్తోంది. త్వరగా నిద్రపోతానని ముందుగానే అప్లికేషన్ వేశాను.
    "రేపు వెళ్ళిపోదామా" అని అడిగారు శ్రీశ్రీగారు.
    "వెళ్ళిపోదామా అని అడుగుతున్నారు. మరి 'వణంగాముడి' పిక్చర్ మాటలు, పాటలు ఇక్కడే రాస్తానని వాళ్ళతో చెప్పారే! దాని సంగతేం చేస్తార"ని అడిగాను.
    వెంటనే వాళ్ళావిడని చూసి, "ఏయ్, ఏం చేద్దాం? మరో రెండు రోజులుందామా? వెళ్ళిపోదామా?" అనడిగారు.
    "మీ ఇష్టం. నాకేం తెలుసు?" - అన్నారావిడ.
    "నువ్వు చెప్పు సరోజా?" అన్నారు.
    "కనీసం పాటలయినా రాయకపోతే బాగుండదండీ" అన్నాను.
    "పాటల టేపు తెచ్చావా?".
    "తెచ్చానండి".
    "అయితే ఇప్పుడు కూర్చుందామా?".
    "ఈరోజుకి నన్ను వదిలెయ్యండి, రేపు ఉదయం కూర్చుందాం" అన్నాను.
    "మరి డైలాగ్స్ సంగతి ఏం చేద్దాం?.
    "దాని గురించి మీరేం బాధపడకండి. మొదట తెలుగులోకి అర్ధంతోసహా రాసేస్తాను. డైలాగ్స్ ఎంతసేపు?" అన్నాను.
    నేను భోంచేసి హాయిగా నిద్రపోయాను.
    మర్నాడు పది గంటలకి పాటలు రాయడానికి కూర్చున్నాం. నాకు పాటల ట్యూన్ తెలియదు. టేప్ రికార్డర్ లేదు.
    శంకర్ సింగ్ గారిని అడిగితే ఇచ్చేవారే! మరచిపోయాం. శ్రీశ్రీగారు చిరాకు పడ్డారు.
    "మద్రాసులో రాసుకుందాంలే" అన్నారు.
    "అలాగంటే ఎలాగండీ" అన్నాను.
    "ఎలాగేమిటి సరోజా! నువ్వడగ్గానే రాయడానికి ఇవేం పాటలనుకున్నావా, లేక...." "నాకు తెలుసండీ, ఫోన్ చేసి టేప్ రికార్డర్ పంపమని చెప్పనా?" అనడిగాను.
    "ఏమీ అక్కర్లేదు సరోజా! నేను రాయను" అనేశారంతే. ఇక వారితో మొత్తుకున్నా లాభంలేదని నాకు తెలిసిన విషయమే.
    వారు నాకు చీవాట్లు పెడుతున్నందుకు, నామీద విసుక్కుంటున్నందుకు ఆవిడ తనలో తనే నవ్వుకుంటున్నారు.
    "అయితే నేను స్క్రిప్ట్ వర్క్ ప్ర్రారంభిస్తానండి" అన్నాను.
    "అసలు 'వణంగాముడి (తలవంచని వీరుడు) అరవ పాటలు తెలుగులోకి అర్ధంతోపాటు రాశావా?" అనడిగారు.
    తప్పు నాదే! రాయకుండానే పాటలు రాద్దామని కూర్చున్నాను. నేను రాసేశాననే అనుకుంటున్నారాయన. ఆ సంగతి మరచిపోయాన్నేను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS