"నీవు మాట్లాడవద్దు!" కఠినంగా అని రావుగారు లెటర్ చదవటం మొదలుపెట్టారు.
కిరణ్ వెర్రివాడిలాగా చూస్తూ నిలుచున్నాడు.
25
"ఇదంతా నిజమే కదూ!" రావుగారు అడిగారు.
సమాధానంగా కిరణ్ దోసిట్లో మొహం దాచుకుని భోరున ఏడ్వడం మొదలుపెట్టాడు.
"డేరింగ్, డేషింగ్, ఎరోగెంట్, ఈ లక్షణాలను మాత్రమే కిరణ్ లో చూసిన రావుగారు మొట్టమొదటి సారిగా కిరణ్ ఏడ్వడం చూశాడు. చూసి ఒక ప్రక్క ఆశ్చర్యము మరోప్రక్క ఆందోళనతో సతమతమవుతూ చూశారు రావుగారు.
"కిరణ్! వద్ద మనం పైకి వెళ్ళి మాట్లాడుకుందాం! అక్కడయితే ఎవరూ రారు."
కొద్దిసేపు ఆగి కిరణ్ ఏడ్వటం ఆపిన తరువాత అన్నారు.
రావుగారు వెనుకనే కిరణ్ తలవంచుకుని వెళ్ళాడు.
ఇరువురు వెళ్ళి టెర్రస్ మీదకు వెళ్ళి కూర్చున్నారు.
సాధారణంగా పూర్తి మేడమీదకు ఎవరూరారు. అక్కడయితే వీళ్ళ మాటలు ఎవరూ వినరు.
"కిరణ్! ఇలాంటిది ఏదో జరిగివుంటుందని, నీవు కామినీని పెళ్ళి చేసుకువచ్చిన రోజునే వూహించాను. ఆ తరువాత మరికొన్ని చర్యల ద్వారా నా అనుమానం నిజమే అని నిర్ధారణ చేసుకున్నాను. నీవు ఆపదలో వుంటే రక్షించుకునే ప్రయత్నము చేద్దామనే ఎన్నోసార్లు నిన్ను అడిగాను. ఎన్ని విధాల అడిగినా నీవు చెప్పలేదు.
కామినీ నీ మీద పోట్లాడటము, తనిష్టాను సారం నిన్ను తిప్పటమూ చేసింది. అదీ నేను గమనించాను. నౌకరు అయినా సరే మురికి గుడ్డలు వేసుకొస్తే నీవు భరించలేవు. నీకు గుర్తుందో లేదో ఒకసారి వంటవాడి చేతికి మసి వుంచుకొని వడ్డిస్తే, మురికి చేత్తో అన్నం వడ్డిస్తావా! అని ప్లేటుని వాడి మీదకు విసిరేశావు. ఆలాంటి నీవు బెగ్గర్ లాంటి దామోదరం గాడ్ని, జిడ్డు ఓడుతున్న మొహంతో మెయిలు దూరానికి కంపు కొట్టే దుస్తులతో, వచ్చి నీ బెడ్ మీద కూచుని బీడీ తాగుతుంటే నువ్వు చూస్తూ మౌనంగా వుండి భరించావు అంటే విషయం ఎంత జటిలమైనదో అప్పుడే గ్రహించాను. ఇలాంటిదేదో వుంటుందనుకున్నాను కాని, నీవే ఇలా చేస్తావని అనుకోలేదు" హత్య అనే మాట వుపయోగించకుండా రావుగారు అన్నారు.
కిరణ్ పెదవి కదపకుండా తలవాల్చుకుని కూర్చున్నాడు.
"మన మాటలు ఇక్కడ ఎవరూ వినరు. ప్రకృతికి చూడటానికి కళ్ళు ఆకాశానికి చెవులూ వుంటే అవి వినాలి ఇక నా దగ్గర నువ్వు భయపడాల్సిన పనేమీ లేదు! జరిగింది జరిగినట్టు ఒక్క అక్షరం పొల్లుపోకుండా చెప్పు."
క్షమించండి డాడీ!" గొంతు పెగాల్చుకుని ఎలాగో ఆ మాట అనగలిగాడు.
"కామినీని నువ్వు పెళ్ళిచేసుకొచ్చిననాడే నిన్ను క్షమించడం జరిగింది. ఇప్పుడు క్షమించడాలు, కన్నీళ్ళు పశ్చాత్తాపాలూ లాంటివి కాదు కావాల్సింది నేరం నుంచి బయటపడేమార్గం. ఆ మార్గం నేను చూడాలి అంటే ఆరోజు నుంచి ఈరోజువరకూ ఏం జరిగిందీ ప్రతి చిన్నమాట వదలకుండా నీవు నాకు చెప్పాలి."
"లాభం లేదు డాడీ!"
"లాభం వుందో లేదో అనాల్సింది నేను."
"నాకు చావు ఒక్కటే శరణ్యం. నేను ఊబిలో మెడదాకా కూరుకుపోయాను. నాకు తెలుసు" కిరణ్ అన్నాడు.
"ఏ సమస్యకీ చావు పరిష్కారంకాదు. తలనొప్పులూ ఒళ్ళునొప్పులూ, జ్వరం, కీళ్ళనొప్పులు అన్నీ వున్న రోగి "డాక్టరుగారూ నా వ్యాధి నాకు తెలుసు బ్రతకను" అని పేషెంటు డాక్టరుగారితో చెప్పినట్టుగా వుంది నీ తీరు. నీవు వున్న పరిస్థితి నిన్నిలా భయపెడుతున్నది. ఒకవేళ నువ్వు నీటిలో మునిగినా నేను ఒడ్డున వున్నాను. నా చేయి నీకు అందించి నీటిలోనుండి పైకి లాగుతాను. డోంట్ వర్రీ మైసన్ ఆప్యాయంగా కిరణ్ భుజం తడుతూ అన్నారు రావుగారు.
రావుగారు లోలోపల చాలా కలవరపడుతున్నారు. హత్యానేరం ఎంత క్లిష్టమైనదో రావుగారికి బాగా తెలుసు. ఈతరానివాడు నీటిలోపడ్డా బ్రతకవచ్చు. ఎంతో ప్లాన్ తో హత్య చేసిన నరహంతకుడు కూడా హత్యానేరం నుండి బయటపడలేడు. రావుగారు భయపడుతున్నారు. కలవరపడుతున్నారు. తను భయపడ్డట్లుగాని, బాధపడ్డట్లుగానీ కిరణ్ కి తెలిస్తే నిజం చెప్పడని రావుగారు ఈ విషయాన్ని చాలా తేలికగా తీసుకున్నట్లు నటిస్తూ మాట్లాడారు.
విషయం బయటపడ్డతర్వాత దాచి ప్రయోజన మేముంది? అయినా తను చాలా అలసిపోయిన స్థితిలో ఏ మార్గమూ కానరాక మరణమే శరణ్యము అనుకుంటూ ఉండగా ఈ విషయం ఎలానో బయటపడింది. ఎన్నో వ్యవహారాలు చాకచక్యంగా సమర్ధవంతంగా నిర్వహించే తన తండ్రి తనను రక్షించవచ్చు. అనుకున్న కిరణ్ మొదటినుండీ జరిగింది అక్షరం పొల్లుపోకుండా ప్రతి చిన్న విషయమూ గుర్తుంచుకుని ఈరోజు పోష్టులో లెటర్ అందినవరకూ మొత్తం చెప్పాడు.
అంతావిని రావుగారు క్షణకాలం మాత్రమే ఆలోచించారు.
"కామినీకి వాళ్ళ బాబాయ్ అంటే అంత ఇష్టమా!"
"ఇప్పుడు నన్ను ఏడిపించడానికి వాళ్ళ బాబాయ్ తో చెయ్యికలిపింది. వాళ్ళిద్దరిమధ్యా పొంగిపొరలే ప్రేమ ఏమీ లేదు. నన్ను ఏడిపించడానికి దామోదరాన్ని ఆయిధంగా వాడుకుంటున్నది కామిని. ఈమధ్య వాళ్ళిద్దరూ ఏదో విషయంలో వాదులాడుకోడం గమనించాను. అతని రహస్యం నీ చేతుల్లోవుంటే నీ రహస్యం నా చేతుల్లో వుంది. ఇద్దరు లంజలు బజారుకెక్కితే వాళ్ళు బూతు పురాణాలు బయట పెట్టుకుంటారు. మనమెక్కినా జరిగేది అదే. నా నష్టం నీ నష్టం అది గుర్తుంచుకో అని దామోదరం కామినీతో అంటూ వుండగా విన్నాను. అసలు వాడు నోరుతెరిస్తేచాలు వాడి నోటిలోనుండి వచ్చేది పచ్చి బూతుల వర్షమే. అందువలన వాళ్ళ మాటలని పట్టించుకోలేదు" అన్నాడు కిరణ్.
"కిరణ్ చాలా మంచి విషయం చెప్పావ్. ఈ లెటర్ రాసింది దామోదరం" రావుగారు అన్నారు.
వాడెందుకు రాస్తాడు డాడీ!"
"ఈ విషయం కామినీకి ఒక దానికే తెలుసన్నావ్! కామినీవలన తెలుసుకున్నాడో వాడే తెలుసుకున్నాడో మొత్తానికి ఈ రహస్యం తెలుసుకున్నాడు. ఈమధ్య కామిని వాడికి సరీగా డబ్బు ఇవ్వటం లేదని చెప్పావు. అంతకన్నా ఆధారం ఏం కావాలి. కామినీకి తెలియకుండా దామోదరమే ఈ లెటర్ రాశాడు. డబ్బుకోసం బ్లాక్ మెయిలర్ గా మారాడు.
"అంతేనంటావా, డాడీ!"
"నీకు అనుమానం అక్కరలేదు కిరణ్!"
"అయితే కామినీకి ఈ విషయం చెబుతాను. కామినీయే వాడిరోగం కుదురుస్తుంది."
