మరోసారి ఆమెను దగ్గరకు లాక్కోబోతుంటే "ఇక చాలు" అంది.
"అలసటగా వుందా?"
"నలిపేశావుగా.....రేపు టీనేజ్ లవ్ స్టోరీ సాంగ్ లో నటించాలి.....మరీ నీరసంగా వుంటే ఫ్రెష్ నెస్ వుండదు."
ఇక్కడ నరేంద్ర చేసిన పొరపాటు ధనుంజయ ఫోన్ గురించి రమ్యశ్రీకి చెప్పకపోవడం.
* * * *
సరిగ్గా యిదే సమయానికి....
సుదర్శనరావు గెస్ట్ హౌస్ బాత్ రూంలో నుంచి బయటికి వచ్చింది పావని అలసటగా.
"బాగా టైర్డయిపోయావా" చిరుగర్వంగా అన్నాడు ప్రముఖ దర్శకుడు సుదర్శనరావు.
"బాప్ రే మిమ్మల్ని తట్టుకోవడమంటే మాటలు కాదు" బడలికగా బెడ్ మీద వాలిపోయింది.
ఏ రచయితో వ్రాసిన సీన్స్ లో నటించే హీరోయిన్స్ కి సంభాషణా చాతుర్యానికి కొదవ వుండదు. పైగా తల్లి కామాక్షి గైడైన్స్ తో పావని చాలా సదునెక్కి పోయింది యిప్పటికే.
"ఓ వారంపాటు యిక మనిషిని కాలేనేమో" అంది గోముగా సుదర్శనరావు భుజంపై తలానించి.
అందులో నిజమెంతో ఆలోచించలేదు సుదర్శనరావు. ఇప్పుడిప్పుడే యవ్వనంలో అడుగుపెడుతున్న పావనిలాంటి అమ్మాయిలు తన ధాటికి తట్టుకోవడం నిజంగా కష్టమేనని బలంగా నమ్మాడు. నిజానిజాల గురించి కన్నా అలా నమ్మడం చాలా ప్రేరణ కలిగించే విషయం.
"నువ్వు చాలా పైకి రావాల్సిన ఆడపిల్లవి పావనీ. ఓ సినిమా మేగజైన్ లో నీ స్టిల్ చూడగానే అనిపించింది."
"థాంక్స్ సర్....." పులకించిపోయింది పావని. ఇప్పుడు సర్టిఫికెట్ యిచ్చింది సామాన్యుడు కాదు. ఇండస్ట్రీలో నెంబర్ వన్ దర్శకుడు అనిపించుకుంటున్న వ్యక్తి. "కానీ ఒకటి మాత్రం నిజం."
"తక్కిన రెండూ నో" టక్కున అన్నాడు సుదర్శనరావు ద్వంద్వర్ద సినిమా సంభాషణ ఫక్కీలో తెల్లమొహం వేసుకు చూస్తున్న పావనితో.
"ఇప్పుడు అయ్యింది మూడోసారి అయితే ఒక్కటి మాత్రమే నిజమంటావేం?" అన్నాడు నవ్వుతూ.
ఫకాల్న నవ్వింది అతడంటున్నదేమిటో అర్ధమైన పావని. మామూలుగా కాదు. పడీ పడీ నవ్వింది. ఆ రేంజ్ లో నవ్వకపోతే అంత పెద్ద దర్శకుడూ యింప్రెస్ కాడని అనిపించడంలో అవసరానికి మించి నవ్వి "మీరు చేతల్లోనే కాదు మాటల్లోనూ ఉద్ధండులే" అంది పారవశ్యంగా.
సుదర్శనరావుకి హఠాత్తుగా నారాయణశెట్టి గుర్తుకొచ్చాడు. ఆ తరవాత సీరియల్ ఆర్డర్ లో సుకృతి, శివ వాళ్ళ ప్రోజక్ర్ట్ జ్ఞప్తికొచ్చాయి.
"నువ్వు శివ డైరెక్ట్ చేసే సినిమాలో నటిస్తున్నావా?"
"తప్పదుగా...." అక్కడికి తనేదో తప్పు చేసినట్టు తల వంచుకుని అంది. "మీ స్థాయి దైరెక్టర్ల దగ్గర నటించే అవకాశం లేనప్పుడు కనీసం మీ శిష్యుల దగ్గరయినా నటించాలి."
"త్వరలోనే నా సినిమాలో కూడా నువ్వు నటించబోతున్నావు."
"నిజంగా!?" అమితమైన ఆశ్చర్యంతోబాటు దారుణమైన ఆనందాన్ని నటించింది. "నమ్మలేకపోతున్నాను."
"మీ అమ్మనడుగు"
"ఏ విషయం సర్?"
"సుదర్శనరావు మాట పట్టింపుగురించి."
"అడగాల్సిన అవసరంలేదు సర్..... బెడ్ మీద మీ పట్టు చూసినప్పుడే తెలిసింది మీరు పట్టుబడితే ఓ పట్టాన వదిలే మనిషికాదని....."
హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
"చెప్పండి సర్.....నన్నేం చేయమంటారు. శివ చిత్రంలో నటించ వద్దంటారా?"
సుదర్శనరావు ఆలోచిస్తున్నాడు.
"మీరివ్వబోయే సినిమా ఆఫర్ కి కాల్ షీట్స్ అడ్జస్టు కావడం కష్టమనుకుంటే అక్కడ మానేస్తాను."
"మానొద్దు. ఎందుకంటే మన సినిమాకి యింకా టైముంది."
"మరి"
"అందులో నటించు"
విస్మయంగా చూసింది. వద్దనేట్టుగా బిల్డప్ యిచ్చి యిప్పుడు మళ్ళీ నటించమని ఎందుకంటున్నాడో అర్ధంకాలేదు.
"నువ్వు చాలా పైకి రావాల్సినదానివి పావనీ......రావాలీ అంటే నాలాంటి వాళ్ళ అండకావాలి."
"ఏం చేయమంటారో చెప్పండి."