Previous Page Next Page 
ప్రియా.....ప్రియతమా పేజి 42


    "ఎంతమాటన్నావ్ ప్రియా."
    "ఓవరాక్షన్ వద్దు బావా..." అంది ప్రియ సీరియస్ గా చూస్తూ.
    "సరే...మరి మీ అమ్మా నాన్నా..."
    "లేదు....మార్కెట్ కి కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళారు."
    "వాటే అదృష్టం.... వాటే అదృష్టం....మరి మీ అక్క...."
    "బాత్రూంలో వుంది. అబ్బ....తగిన కాఫీ చాలుగానీ, నన్నెత్తుకో బావా..." అంది దగ్గరగా వచ్చి ప్రియ.
    ఎవరూ లేరన్నమాట..." అన్నాడు హుషారుగా.
    "అంటే ఎవరూ లేకపోతే సిగ్గూ, ఎగ్గూ లేకుండా దాన్ని ఎత్తుకుంటావా?"
    "అదేంటి ప్రియా....టోన్ మార్చావు...అచ్చు మీ అక్కలా, బావురు కప్పలా మాట్లాడుతున్నావు..." అన్నాడు శ్రీచరణ్.
    "ష్ అటు..... అటు.... అ....క్క...." మెల్లిగా అంది ప్రియ.
    "అక్కా....పనసపండు తొక్కా....ఎప్పుడు చూసినా ఆఫీసు, బాత్రూం....కిచెనూ.... అయినా మీ అక్కేంటి ప్రియా...ఎప్పుడు చూసినా పాత చింతకాయపచ్చడి చీరలూ, బామ్మలకాలంనాటి బ్లౌజులు....నువ్వే కొద్దిగా బెటర్..." అని ఆముదం తాగిన ఎక్స్ ప్రెషన్ మొహం పెట్టిన ప్రియని చూసి డౌటొచ్చి, తలని కొద్దిగా పైకెత్తి చూసి ఖంగుతిన్నాడు.
    ఎదురుగా ఎప్పుడొచ్చిందీ....ద్వారానికి అడ్డుగా నిలబడి ఓ చేతిని డోర్ కు అటువైపు ఆన్చి, మరోచేయి నడుం మీదకు చేర్చి కోపంగా ఇటే చూస్తోంది.
    "అరె....నువ్వా ప్రనూషా...ఎప్పుడొచ్చావు....మీట్ మై మరదలు ప్రియ.... ప్రియా....ఆవిడ నా భార్య..." అన్నాడు.
    "పరిచయాల దరిద్రపు మేళం ఆపుతారా?" అంది కోపంగా ప్రనూష"
    అయిపోయాన్రా శ్రీచరణూ....ఇలా బుక్ అయిపోయావేంట్రా..." అంటూ శ్రీచరణ్ అంతరాత్మ లబోదిబోమంది.
    "ప్రియ.... నువ్వు నీ గదిలోకి వెళ్ళు" అంది. బుద్దిగా ప్రియ తన గదిలోకి నడిచింది  తలొంచుకొని!
    "మీకు....మీకసలు సిగ్గుందా?" ప్రియ వెళ్ళి పోవడంతోనే కోపంగా శ్రీచరణ్ దగ్గరికి వచ్చి అరిచేసింది ప్రనూష.
    "ఇందాకే మీ చెల్లెలు నా దగ్గర బోల్డు సిగ్గు స్టాక్ వుందని కన్ఫర్మ్ చేసేసింది" బుద్దిగా చెప్పాడు శ్రీచరణ్.
    "సిగ్గు లేకపోతే.... సరి.... హవ్వ....వయసులో వున్న ఆడపిల్లతో ఆ సరసాలేంటి? డానికి లేకపోయినా మీకుండక్కర్లేదా బుద్ది?"
    "వయసులో వున్నా పిల్లతో కాక, మీ అమ్మతో సరసాలాడితే ఏం బావుంటుంది?" సిన్సియర్ గానే అన్నాడు శ్రీచరణ్.
    "చంపుతా.....జోకులొద్దు...సీరియస్ గా చెబుతున్నా...ఇలాంటి పిచ్చివేషాలు వేస్తే వూర్కోనంతే....అయినా ఎవరూ చూడకపోతే ఫర్లేదా?....దాన్నెత్తుకుంటారా? ఏంటి. అమ్మాయిల్ని ఎత్తుకోవడంలో మీకంత ఎక్స్ పీరియన్స్ వుందా?" కోపంగా అడిగింది.
    "అయిపోయిందా క్లాసు ఇంకేమైనా వుందా?" తాపీగా రెండు చేతుల మీద నుండి చేతులు తీసేసుకుంటా అన్నాడు శ్రీచరణ్.
    "ఏంటి నేనింత సీరియస్ గా మాట్లాడుతూంటే, మీకసలు చీమకుట్టినట్టు కూడా లేదా?" అంది ప్రనూష.
    "నువ్వే ఓ పెద్ద మలేరియా దోమని.... నీ ముందు చీమలే పాటి? అయినా ఏంటి ఒక్కటే పెత్తనం చలాయిస్తున్నావ్.... నా మరదలు నా యిష్టం....తనకు లేని అభ్యంతరం నీకేంటిట?" అన్నాడు వళ్ళుమండిన శ్రీచరణ్.
    "ఏంటి....ఏది మళ్ళీ అనండామాట. ఈసారి సేమ్యాలో ఎలుకల మందు పోసిస్తా..."
    హమ్మో నువ్వు కాలాంతకురాలివే బాబూ...అన్నంత పనీ చేసేయిగలవు. ఛస్తే నీ చేత్తో ఏదిచ్చినా తాగను..." అన్నాడు.
    "తెలిసిందిగా....టేక్కేర్. ఇంకెప్పుడూ నా చెల్లెల్తో పెట్టుకోకు...." తర్జని చూపి బెదిరిస్తూ వెళ్ళిపోయింది ప్రనూష.
    "ఏయ్.....ప్రియా....నీకసలు బుద్ది వుందా? బావతో ఆ సరసాలేంటే?
    "ఏ సరసాలు?" అమాయకంగా అడిగిందిప్రియ.
    "సిగ్గులేకపోతేసరి. నాతోనే చెప్పించాలా ఆ పాడు మాటలు."
    పోనీ...నువ్వాడు ఆ సరసాలు. నేను సైడైపోతా..."
    "ఏంటే నువ్వనేది?" ఆశ్చర్యంగా అంది.
    "అదే బావతో నువ్వు సరసాలాడితే... నేను సైడయిపోతానంటున్నా... నువ్వు సరసాలాడక.... నన్ను సరసాలాడనీయక."
    "ఆహా క్యాడైలాగ్ హై." ఆ గది కిటికీ తలుపులు తెరిచి....లోపలికి తలపెట్టి అన్నాడు శ్రీచరణ్ నాలుక బయటకు పెట్టి!
    ప్రనూష చురచుర చూసింది శ్రీచరణ్ వైపు!
    "ఏంటక్కా....అలా షాకవుతావు. నువ్వెలాగూ బావతో సరసాలాడవు. మొగుడి వరసే అయినా.... దూరంగానే వుంటున్నావు....పోనీ నేను కాసేపు సరసాలాడిపెడదామని..."
    "ప్రి.....యా...." కోపంగా అరిచింది ప్రనూష.
    "అరిస్తే పోయేది మన పరువే అక్కా.....నాకు తెలియదనుకోకు.....నేను..... వచ్చినప్పట్నుంచి చూస్తున్నా.... బావా, నువ్వూ వేరువేరుగా ఉంటున్నారు. మీ ఇద్దరి మధ్యా భార్యాభర్తల మధ్య వుండాల్సిన సంబంధాల్లేవని అర్ధమైంది. కానీ, ఆ సంబంధాలు ఎందుకు లేవో అర్ధం కాలేదు. ఈ విషయం నాన్నకు తెలిస్తే..."
    "వద్దు తెలియొద్దు..."
    "పోనీ...నాకైనా చెప్పక్కా...."
    ప్రనూష ఆలోచనలో పడింది.
    తన మీద ప్రియకు డౌటొచ్చింది. అది క్లారిఫై అయ్యేవరకూ వదలదు. చెప్పెయడమే బెటర్ అనుకుంది ప్రనూష!
    "అదీ ప్రియా జరిగింది.... ఇద్దరి అభిప్రాయాలూ వేరు....ఎవరికీ వచ్చిన దారిలో వారెళ్ళాలీ....అందుకే ఇద్దరం ఓ అండర్ స్టాండింగ్ కు వచ్చి....ఓ అగ్రిమెంట్ రాసుకున్నాం. సంవత్సరం తర్వాత....ఎవరికీ నచ్చిన వాళ్ళను, వాళ్ళు పెళ్ళి చేసుకోవచ్చు" జరిగిందంతా చెప్పింది ప్రనూష.
    "మీరిద్దరూ తప్పు చేస్తున్నారేమో ననిపిస్తోందక్కా."
    "ప్రియ"
    "అవునక్కా....మంచో, చెడో...ఇద్దరికీ పెళ్ళి జరిగిపోయింది. హాయిగా ఒకరినొకరు అర్ధం చేసుకొని వుండొచ్చు. బావ చెడ్డవారేం కాదు.
    "ఆ విషయంలో నువ్వేం సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓ భావుకత్వం తెలియదు.
    సున్నితత్వం తెలీదు.....ప్రేమను ఎలా వ్యక్తం చేయాలో తెలియదు.....వెన్నెల రాత్రుల గురించి కవిత్వం చెప్పలేడు" నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే వుంది ప్రనూష.
    "అక్కా....నాకెందుకో నువ్వు రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నాననిపిస్తోంది. నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్నీ బావలో లేకపోవచ్చు. కాకపోతే, నువ్వు చెప్పిన వే"ఇద్దరు వ్యక్తులను సన్నిహిత్వం చేసే క్వాలిటీస్" అని నేను నమ్మలేకపోతున్నాను.
    "కొందరు కొన్ని భావాలను వ్యక్తం చేయకపోవచ్చు. వ్యక్తం చేసే శక్తి లేకపోవచ్చు. అంతమాత్రం చేత, అ ఆవ్యక్తిని ప్రేమించే గుణం లేదంటే ఎలా చెప్పు?
    "నీకు తెలీదు ప్రియా ప్రేమించి పెళ్ళి చేసుకుంటే, అందులో వుండే ఎఫెక్షనేవేరు" అంది ప్రనూష.
    "అక్కా....ఒకప్పుడు నీలో భావుకత్వాన్ని చూసి సంతోషపడేదాన్ని. మా అక్కలో మంచి భావకురాలు వుందని.....ఇప్పుడనిపిస్తోంది. ఆ భావుకత్వం మాటున అమాయకత్వం కూడా వుందని....అది మా అక్కను పక్కదారిలోకి లాగుతోందని...
    ప్రేమను వ్యక్తం చేయడానికి భావుకత్వం ఒకమార్గమే కావచ్చు. కానీ భావుకత్వమే (ప్రేమకు ప్రత్యామ్నాయం, పర్యాయ పదమూ కాదు..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS