Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 41


    ఇప్పటికి అర్ధమయింది ధీరజకు. తండ్రి అవసాన దశలో తను అయన దగ్గర లేకపోవడం వల్లనే విష్ణు ఇలా బాధపడుతున్నాడని ..........
    మరో పది రోజులలో ఫైనల్ ఇయర్ పరీక్షలు....
    కుప్పకూలిపోయాడు విష్ణు.
    
                                                  *    *    *    *

    దూరంగా ఉవ్వెత్తున ఘోషిస్తున్నాయి కడలి కెరటాలు!
    ఆ ఇంటి ముందు మూగివున్న జనం విష్ణుమూర్తిని చూసి పక్కకు తప్పుకున్నారు. అలసి సొలసి విశ్రమిస్తున్నట్టూగా వుంది అక్కడ అవధాని కట్టే!
    "రారా నాన్నా.....నీ కోసమేరా నా అంతిమ ఘడియలలో తపించి పోయాను. ఈ క్షణం వస్తుందనీ, రావాలనీ ప్రతి కన్న తండ్రీ ఆశిస్తుంటాడు. కడుపునా పుట్టిన పుత్ర ధర్మాన్ని నేరవేర్చుకోరా నా చిట్టితండ్రి....నీ చేత అగ్నిశిలలో కాలిపోవదానికేరా ఈ కట్టే ఇంతసేపు ఎదురు చూసింది.... నీ స్పర్శతో నాకు ఈ భవబంధాల నుంచి విముక్తిని ప్రసాదించు.....ప్రతి తండ్రీ కోరుకునే పున్నామ నరకం నుంచి నన్ను తప్పించరా బాబూ...!"
    ఎక్కడో , ఎవరో లీలగా అన్నట్టు......అస్పష్టంగా తన తండ్రే తన చెవులలో సంభాషించినట్టు విష్ణుమూర్తి శరీరం జలదరించి......ఒక్కసారిగా తండ్రి శవంపై పడి భోరున విలపించాడు.
    అప్పుడు పడింది అతని భుజంపై ఒక చల్లని స్పర్శ.
    ఆ స్పర్శ ఎవరిదో అతనికి తెలుసు....యుగయుగాల అనుబంధం.......ఆత్మీయత ఆ హస్తాలలో వుందనీ తెలుసు!
    అందుకే , అతను తల పైకెత్తి చూడలేదు.
    మృదువయిన ఆ రెండు హస్తాలు ఈసారి విష్ణుమూర్తిని పట్టి పైకి లేపాయి.
    మోడరన్ డ్రస్ లో వున్న లేబ్రాయపు పరువాల బొమ్మ , ఆమె భవాని, తన చిన్ననాటి నేస్తం!
    ఆమె ముఖంలో కళాకాంతులు వున్నాయి కానీ రంగు మాత్రం చామనచాయ.......అయితే నేమి ఆమె లాలింపులో విష్ణుమూర్తి పసివాడిలా రోదిస్తున్నాడు.....
    
                                                       *    *    *    *

    "అమ్మా నందినీ! మనకు నిండా డబ్బు వుండవచ్చు దేనికయినా డబ్బుతో కొనుక్కోవచ్చానే నీ అభిప్రాయాన్ని నేను తప్పు పట్టడం లేదు, కానీ ఆడపిల్ల అన్న తరువాత కొన్ని కట్టుబాట్లు వుంటాయి. కనీసం వాటికి విలువా, గౌరవం ఇవ్వకపోతే ఎలా?' అంటూ కూతురికి హితభోద చేస్తున్నాడు గోవిందయ్య.'    "వాట్ డాడ్.....ఇంకా పాత చింతకాయ సెంటిమెంట్లు పట్టుకు వెళ్ళాడామంటావా నన్ను.....నో........నో....... ఐ హెట్ దట్ బ్లడీ  సెంటిమెంట్స్.........నాకు ఎం తక్కువ అని అణిగి మణిగి వుండాలి. అందం లేదా? ప్రపంచ సుందరి కూడా నా ముందు దిగదుడుపే......ఆస్తి అంతస్థు అంటావా? మనకు ఎంత ఆస్తి పాస్తులున్నాయో లెక్కలు వేసుకోవాలంటే కనీసం నెలరోజులన్నా పడుతుంది. అన్ని హంగులు కలిగి వుండి చీప్ గా లేబర్ లా వుండడానికి నేనొప్పుకోను......నందిని చాలా ఫాస్ట్ గా రియాక్టయింది.
    "అది కాదమ్మా..........ఆడపిల్లకు వుండవలసిన  అణుకువ, సభ్యత , సంస్కారం, భర్త పట్ల అనురాగం ......ఇవి .......ఇవి తెలుసుకోమంటున్నాను......"
    "వొహ్....పూర్ డాడ్........అని చూసుకోవడానికి నువ్వున్నావు. నేనంటే ఇష్టపడేవాడిని , మన అస్తిపాస్తులకు కుక్కలా కాపలా పడి వుండే వాడిని, నా అందానికి తగ్గ మొగుణ్ణి నువ్వే వెదుకు........నీ ఇష్టానికి అడ్డు చెప్పకుండా నేను తాళి కట్టించుకుంటాను.......' ఇక ఇంకొకమాట మట్టాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మేడ మెట్లు ఎక్కి పైకెళ్ళి పోయింది నందిని.
    తన కూతురి ప్రవర్తనను మెచ్చుకోవాలో, లేక ఆమె అహంకారానికి విచారించాలో అర్ధం కాక అయోమయంలో పడిపోయాడు గోవిందయ్య.
    తల్లిలేని పిల్ల అని తను చేసిన అతి గారాబం ఇలా చెడగొట్టలేదు కదా అన్న సందేహం తొలిసారిగా అప్పుడు కలిగిందతనిలో........
    ఆ ఆలోచనలతోనే తను షాపుకు చేరుకున్నాడతను.
    అప్పటికే గోవిందయ్య కోసం వచ్చి వున్నాడు విష్ణుమూర్తి.
    అతన్ని చూడగానే ఆప్యాయంగా పలకరించాడతను.
    "ఏమిటోయ్ విష్ణు......ఇలాంటి సమయంలో నువ్వు దిగులుపడ కూడదు. తండ్రి పోవడం బాధ కలిగించేదే అయినప్పటికీ నీ కుటుంబానికి మిగిలిన మగదిక్కువు ఇప్పుడు నువ్వు మాత్రమే, నువ్వే ఇలా డీలా పడిపోతే నీ తల్లి నీ అయిదుగురు అక్కల పరిస్థితి ఇంకెలా వుంటుందో ఒకసారి ఆలోచించు......." అంటూ అత్మీయుడిలా భుజం తట్టి అనునయించాడు.
    విష్ణు మూర్తికి మాటలు పెగలడం లేదు.
    అసలు ఎలా మొదలు పెట్టాలో, ఏమని మాట్లాడాలో , ఏమని అడిగితే ఏం అనుకుంటాడో ననే సంశయం అతనిలో దోబూచులాడుతున్నది......
    గోవిందయ్య అది గమనించాడు.
    "ఏమిటి విష్ణు......నన్ను ఏదో అడగాలని వచ్చినట్టున్నావు కాని మొహమాటపడుతున్నావు. ఫరవాలేదు చెప్పు.....నేనేమీ నీకు పరాయి వాడిని కాదులే.....నీ తండ్రి నా చిన్నప్పటి స్నేహితుడే. అందుకే వాడ్ని నా దగ్గర పనిలో పెట్టుకున్నాను. అంతమంది ఆడపిల్లలతో ఎలా నెగ్గుకువస్తున్నాడో నాకు ఆ మాత్రం తెలియదూ......
    "ఎప్పుడూ ఏదో ఒక ఖర్చు వుంటూనే వుండేది పాపం.....సరిగ్గా వాడు కూడా అలాంటప్పుడు ఇదిగో నీలానే మొహమాటపడుతూ నిలుచునేవాడు. నేనే వాడి పరిస్థితి తెలుసుకుని డబ్బు సర్దుబాటు చేసేవాడిని, అంతెందుకు ఎన్నో సార్లు నీ చదువు కోసం అవసరమైన డబ్బులు నా దగ్గరే చేబదులుగా తీసుకుని నీకు పంపేవాడు.   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS