"అసలు నీ ఉద్దేశ్యం ఏమిటో చెప్పు?"
"నా ఉద్దేశ్యం ఏమిటి?"
"ఈ పెళ్ళి నీ కిష్టమైనా?"
ఆమె చప్పున సమాధానం యివ్వలేదు.
"పోనీ అతనంటే నీ కిష్టమేనా?"
"అంకుల్! యిష్టమంటే ఏమిటి? ఇష్టానికి నిర్వచనం ఉందా?"
ఆయన తడబడ్డాడు.
"అతనంటే నాకు సదభిప్రాయం ఉంది!"
"పాయింట్ వన్!"
"రెండో పాయింట్ ఏమిటి?"
"అది మీరే చెప్పాలి?"
"ప్రేమ!"
"ప్రేమ-ప్రేమంటే ఏమిటో చెప్పలేం. నిర్వచించలేం. కాని అంకుల్ నేను యింతవరకూ ఎవరినీ ప్రేమించలేదు. అందుకని అమ్మమ్మ కోరిక ప్రకారం అతన్ని పెళ్ళి చేసుకుంటాను. తర్వాత ప్రేమిస్తాను."
పకపక నవ్వాడతను "బావుంది నువ్వెక్కడోవెయ్యేళ్ళ నాటి అమ్మాయిలా ఉన్నావు. ఈ రోజుల్లో__అందులో కాలేజీలో చదివిన అమ్మాయివి యిలా అంటే చిత్రంగా ఉంది. అలాగే స్వప్నా! నీమాట ప్రకారం అతనికి రేపు ఫోన్ చేస్తాను. అతనూ అడ్డు చెప్పడనే అనుకుంటాను!"
స్వప్న మాట్లాళ్ళేదు.
"నిజానికి ఈ పరిస్థితి కన్నెపిల్లకి రాకూడదు. అమ్మ అమ్మమ్మ పోయి, తండ్రి ఎటో వెళ్ళిపోయి ఏదీ తెలియని అయోమయ పరిస్థితులలో ఓ వ్యక్తిని నమ్మి పెళ్ళి చేసుకోవలసి రావటం కొంత బాధాకరమే కానీ చిత్రమేమిటంటే అతను నీకు బంధువు. వరసయినవాడు. పుటం పెట్టి మేలిమి తేల్చినట్టు, వొరువుపెట్టి రత్నం విలువ నిర్ణయించినట్టు అమ్మమ్మగారి నిర్ణయం మనం కొట్టేయ తగ్గదికాదు. ఆమెని మెప్పించటం సామాన్యమా? మనుషుల్ని కాచి వడబోసేది ఆమె!"
"మరి వెంకట్రామయ్య విషయం?" హఠాత్తుగా అడిగింది స్వప్న.
"అతని విషయమా? అమ్మమ్మ అతన్నేనాడూ పూర్తిగా విశ్వసించలేదు. నావద్ద ఓ ఫైలు వుంది చూడు. అందులో అతనిచ్చిన ఓచర్స్ లో ఎంతెంత కాజేసి వుంటాడో ఆమె ఊహించి రాసేసింది. దాదాపు ఇరవయ్యయిదువేల దాకా తినేశాడు. నేనోసారి అతన్ని రెడ్ హాండెడ్ గా పట్టుకుని దండిద్దాం అన్నాను. అప్పుడు అమ్మమ్మగారేమన్నారో తెలుసా?"
కుతూహలంగా చూసింది స్వప్న.
"మనం అన్నీ స్వయంగా చూసుకోలేం. మార్కెట్ కి మనిషిని పంపితే కూరగాయల్లో పావలో అర్ధో సర్దేస్తాడు పనిమనిషి. అలాటప్పుడు ఎవరినో ఒకరిని నమ్మి ఆ పొలం పనులకి పంపాలి. ఎవరయినా అంతే! ఇతను బీదవాడు. అయినవాడు, న్యాయానికి యీ ఆస్తి ఎంతో అతని ఆస్తీ అంతే! అయితే అది తరిగింది. ఇది పెరిగింది. తిననీ ఎంత తింటాడు. వడ్లగింజపై పొట్టు. అంతేనా? అసలుకి ఎసరు పెట్టేవరకూ భయపడక్కర్లేదు. అలా జరిగిన రోజున తోక కత్తరించేస్తే సరి!" అంది. ఆమెది అంత దూరదృష్టి, అంతటి దయాదృష్టి!"
స్వప్న సమాధానం యివ్వలేదు. ఆమె మనస్సులో అమ్మమ్మ అంటే ఆరాధనా భావం పెరిగిపోతోంది.
"స్వప్నా! మరి వస్తాను. ఆలోచనలు పెట్టుకోవద్దు!" కదిలేడు విశ్వేశ్వరంగారు.
"బై!"
"బై! బై"
ఆయన గేటుదాటే దాకా అలాగే చూస్తూ, వుండిపోయిన స్వప్న తిరిగి యింట్లోకి వచ్చింది.
వరండా దారి హాలులోకి వచ్చేసైర్కి అక్కడ రవి లేడు.
అతను అవుట్ హవుస్ కి వెళ్ళిపోయాడు.
30
నిజానికి కాలాని కన్నా చిత్రమయింది ఏది ఉంది?
అది తలుచుకుంటే మహారాజుని మామూలు మనిషిని చేస్తుంది.
మామూలు మనిషిని మహారాజుని చేస్తుంది.
గారడీ వానికంటే ఎక్కువే చిత్రవిచిత్రాలు చేయటంలో.
ఈరోజు గద్దెఎక్కినావారు రేపటిదాకా నిలవటం లేదు ఈరోజు గద్దె దిగినవారు మళ్ళీ రేపే గద్దె ఎక్కగలమని కలలో కూడా అనుకోలేదు.
కానీ చిత్రం! కాలగతి తన క్రమంలో అన్నిటిని తమాషాగా చేస్తుంది. మనుషులని ఆటాడిస్తుంది.
ఈ తత్త్వం తెలియని వాళ్ళు అది తన గొప్ప అనుకుంటారు. తమ ప్రతిభ పండించిన ఫలం అనుకుంటారు.
అదే చావుదెబ్బతిన్నవాళ్ళు మాత్రం ఆఁ మనచేతిలో ఏం వుంది. అంతా భగవంతుడి నిర్ణయం. వాడు ఎల్లా ఆడిస్తే అల్లా ఆడాలి. అంతే? విధి అంటే విధి అంటారు అప్పుడవుతుంది వాళ్ళకి తాత్కాలిక జ్ఞానోదయం.
మళ్ళీ అధికారమో ఐశ్వర్యమో హస్తగతమయిందా ఇంకేముంది మళ్ళీ ప్లేటు ఫిరాయిస్తారు. అంతా తమ మేధో విలాసమే అంటారు, అనుకుంటారు.
ఇప్పుడు వెంకట్రామయ్య స్థితికూడా అలాగే అయింది. అతని స్థితి రెంటికి చెడిన రేవడిలా అయింది. అతని మనస్సు మొద్దుబారినట్టయి పోయింది తాత్కాలికంగా.
తలవాచేట్టుగా చివాట్లేస్తోంది పారిజాతం.
కిక్కురు మనటంలేదు వెంకట్రామయ్య.
"ఎంత అవమానం? ఎంత అవమానం! అనుకున్నది జరగలేదు. ఉన్న ఆధారం పోయింది. పైగా నలుగురిలో తలవంపులు. అవ్వ! అవ్వ! ఇదేమన్నా బావుందా? అయినా వాళ్ళకిది ఎలా తెలిసింది? ఆ సమయానికి పోలీసులు ఎలా వచ్చారు."
