అరగంటపాటు సబ్బు మొత్తం అరగదీసి పాదాలు కడుక్కున్నాడు.
"చీ....చీ....రోజురోజుకి పిచ్చి ముదిరిపోతోంది దీనికి?" అనుకున్నాడు భార్యనుద్దేశించి.
బాత్రూంలో నుంచి బయటకు రాగానే తనకొచ్చిన వింత ఆలోచన గుర్తుకొచ్చింది.
అంతవరకూ భార్యని తిట్టిన త్రిలోకం వెంటనే ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్రెస్ వేసుకుని ఠీవిగా బయల్దేరాడు త్రిలోకం.
ఎవరి పిచ్చి వారికానందం అంటారందుకే!
* * *
డిస్కోధేక్ ముందు అటూ ఇటూ పచార్లు చేస్తున్నాడు గరుడాచలం.
జీన్స్ ప్యాంట్, పూలచొక్కా, నెత్తిమీద హ్యాట్......అతని గెటప్ వెరైటిగా ఉంది.
తన గాళ్ ఫ్రెండ్ పీలూ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో అతని టైం టేబుల్ మొత్తం మారిపోయింది.
ఉదయమే లేచి ఎక్సర్ సైజులు చేస్తున్నాడు. జాగింగ్ చేస్తున్నాడు. ఆసనాలు చేస్తున్నాడు. కాస్త డైటింగ్ కూడా మొదలుపెట్టాడు. ఉన్న చిరుబొజ్జని తగ్గించుకోవాలని.
తెల్లవెంట్రుకలను నల్లగా చేసుకుంటున్నాడు. అబిడ్స్ సెంటర్ లో చూసిచూసి గాగుల్స్ ఇంపోర్టెడ్ ఫేర్ ఫ్యుమ్ ని సింగపూర్ లో కొన్నాడు.
ముఖం స్మూత్ గా అవ్వాలని పొద్దునే నిమ్మకాయ రసాన్ని ముఖానికి పట్టించాడు. గోరువెచ్చని నీటితో కడిగేస్తున్నాడు. ఇలా రకరకాల చిట్కాలు ఉపయోగించి యంగ్ మెన్ లా కనపడాలని తాపత్రయపడిపోతున్నాడు.
"నువ్వందంగా ఉన్నావు గరుడా డియర్!" అన్న పీలూ మాటల ప్రభావం అది.
తన లాల్చీలు , పైజామాలు, పంచెలో, కండువాలు అన్నీ భార్యని పిలిచి "ఇవన్ని స్టీలు సామానువాడికిచ్చి సామాను కొనుక్కో" అన్నాడు.
చెర్మాస్ కి వెళ్లి జీన్ ప్యాంట్, పూలపూల టీ షర్టు తెచ్చుకున్నాడు.
ఈ మార్పులన్నీ ఆ ఇంటిల్లిపాది ఆశ్చర్యంగా గమనిస్తూనే ఉన్నారు.
ఓ రోజు డిస్కోథక్ కు రమ్మని ఇన్వయిట్ చేసింది పీలూ. వెంటనే నీట్ గా తయారై వచ్చాడు.
సరిగ్గా మరో అయిదు నిముషాల తర్వాత పీలూ వచ్చింది.
"హయ్ గరుడా డియర్" అంది వస్తూనే.
"పీలూ డాళింగ్" అన్నాడు ఎదురెళ్ళి పళ్లన్నీ ఇకిలించి గరుడాచలం.
ఇద్దరూ ఒకరి చేతిలో మరొకరు చేయి వేసుకుని డిస్కోదేక్ లోకి వెళ్లారు.
ఆ హాలు మొత్తం సెంట్రలైజ్ డ్ ఎసి, డిమ్ లైట్స్ వెలుగుతున్నాయి. స్టిరియోలో నుండి హోరెత్తేలా పాప్ మ్యూజిక్ వినిపిస్తూ వుంది.
ఆ మ్యూజిక్ అనుగుణంగా అదా మగా తేడా లేకుండా తాగుతున్నారు, తులుతున్నారు, పాడుకుంటున్నారు.
కొందరు డాన్స్ మొదలు పెట్టారు.
వయసు తారతమ్యం లేకుండా అదా మగా బేధం లేకుండా ఒకరినొకరు వాటేసుకుంటుంటే కొద్దిగా ఇబ్బంది అనిపించింది గరుడాచలానికి.
"అదేంటి డియర్! అలా స్టాట్యులా ఉండిపోయావు. కమాన్ మూవ్.....ఎంజాయ్" అంటూ ఓ టేబుల్ దగ్గరికి గరుడాచలాన్ని తీసుకెళ్ళింది.
విస్కీ ఆర్డర్ చేసింది. ఓ పక్క తాగేవాళ్లు తాగుతున్నారు.
"నాకొద్దు డియర్! పొద్దునే గ్లాసుడు కాఫీ తాగా, మధ్యాహ్నం రెండు గ్లాసుల మజ్జిగ పుచ్చుకున్నాను" అన్నాడు గరుడాచలం.
ఓ అయిదు నిముషాలు నాన్ స్టాప్ గా పగలబడి నవ్వింది పీలూ.
"కాఫీలు, మజ్జిగ ఏంటి గరుడా డియర్. ప్చ్.....మారాలి నువ్వు చాలా మారాలి అంది పీలూ.
తల తీసేసినట్టయింది గరుడాచలానికి, పౌరుషం పొడుచుకు వచ్చింది.
"అయితే నాకు విస్కీ తెప్పించు" అన్నాడు తన గాళ్ ఫ్రెండ్ తనని అలా అనడం నచ్చక.
"దట్స్ గుడ్" అంటూ విస్కీ ఆర్డర్ చేసింది.
మొదటి రౌండ్ లో పొలమారింది. నోరంతా చేదుగా అనిపించింది. విషం మింగిన ఫీలింగ్ కాకరకాయ రసం తాగిన అనుభూతి.
పీలూ మాత్రం మహా ఆనందంగా అమృతం తగినట్టు తాగుతోంది. పైగా మోహంలో అదోలాంటి ఆనందపు ఎక్స్ ప్రెషన్.
"ఇంకా ఫస్ట్ రౌండ్ లోనేనా?" అంది పీలూ.
గడగడా బాటిల్ ఎత్తి తాగేసాడు పోరుషంతో గరుడాచలం.
గొంతులో మంటగా అనిపించింది. తగిన కొద్ది థ్రిల్ మొదలైంది.
కడుపులో ఏదో వార్ మొదలైనట్టుంది. నోరు అదుపు తప్పింది. తన ప్రమేయం లేకుండానే తనకు తెలియకుండానే మాటలు రావడం మొదలయ్యాయి. స్వరపేటిక రెచ్చిపోయింది.
పీలూ వైపు చూసాడు.
డార్క్ బ్లూ, మిడి, దానిపైన పొడవాటి బ్లౌజ్. అది స్లివ్ లెస్. పలుచని పెదాలకు లిప్ స్టిక్ అక్కడక్కడ తెల్లవెంట్రుకలు మెరుస్తున్నాయి. ఎడమ చేతికి స్టోన్స్ చేసిన వాచి, కుడి చేతికి ఓకె ఒక బ్యాంగిల్ సింపుల్ గా, మెళ్ళో సన్నటి చెయిన్.
"ఒసే పీలూ! నీ మొహం మండ. నీ పేరు అలాగుందెమిటి?" అన్నాడు త్రాగిన నిషా నెత్తికెక్కి.
"వాట్ డియర్! భాష మారింది."
"భాషంటే నా బ్రతుకే మారిందే. నేనెప్పుడైనా షారా....ఛఛ.....తారా.....షి....షి....షి....సారా కూడా తాగలేదు కదే. ఇప్పుడు కుష్కి....చీ...చీ....విస్కీ తాగిస్తున్నావు. నువ్వు సమాన్యురాలివి కాదే" అన్నాడు ఎమోషనల్ గా.....
"గరుడా డియర్ ఇప్పుడు నువ్వు నన్ను తిట్టావా? పోగిడావా?"
"అది నాకేం తెలుసే టక్కులాడి. అది తెలిస్తే నీ వెంటెందుకు కుక్కలా తిరుగుతానే. నా పర్సులో డబ్బులు నీకోసం ఎందుకు ఖర్చుపడతానే" మరింత హుషారుగా అన్నాడు.
"నీకు నిషా తలకెక్కింది" అంటూ బెరర్ ని పిలిచి నాలుగు గ్లాసుల నిమ్మరసం, మజ్జిగ కలిపి తీసుకురమ్మంది. ఇంకా మరిన్ని పెగ్గులు తాగిస్తే తనని బండ బూతులు తిదతాడని అర్ధమైపోయింది షిలుకి.
కాసేపటి తరువాత గరుడాచలానికి నిషా కొద్దికొద్దిగా దిగితోంది. పీలూతో కలిసి డాన్సు చేస్తున్నాడు. నడుము కలుక్కుమంటున్నా, కాళ్ళు పికుతున్నా లెక్కచేయాలేదతను.....
ఎంతో మెత్తగా ఆమె శరీరం తగులుతుంటే థ్రిల్లింగ్ గా వుంది గరుడాచలానికి.
ఆమెతో కలిసి డాన్స్ చేయడం అతనికి గమ్మత్తుగా అనిపించింది.
అలా డాన్స్ చేసి చేసి అలసిపోయాడు.
"పీలూ! నేనిక డాన్స్ చేయలేను డాళింగ్.....చిన్నప్పుడు డ్రిల్లు మాస్టర్ డ్రిల్లు చేయించినప్పుడు కూడా అన్నీ నొప్పులు లేవు" అన్నాడు చెమట్లు కక్కుతూ.
"నాలుగురోజులైతే నీకే అలవాటవుతుంది డియర్" అంది.
పన్నెండువందల బిల్లుతో ఆ డిస్కోదేక్ నుంచి బయటపడ్డారు ఇద్దరూ.
గరుడాచలం గుండె గుభేలుమంది. నెలంతా ఈ పన్నెండువందలు వుంటే ఎన్నో వాటికీ ఉపయోగపడేది. ఎంతో పొదుపుగా వాడేది తన భార్య. అలాంటిది ఓ రెండు గంటల సేపట్లో ఆ హొటల్ వాడి ముఖాన అంత పెద్ద అమౌంట్ పెట్టినందుకు ఏడుపోక్కటే తక్కువ అతనికి. మనసంతా అదే పీకుతోంది.
