Previous Page Next Page 
నరుడా ఏమి నీ కోరిక పేజి 41

 

    యమధర్మరాజు ఆకాశం వైపు చూసాడు.


    వాయుదేవుడ్ని పిలిచాడు.


    వాతావరణంలో ఒక్కసారిగా మార్పొచ్చింది.


    సత్తిపండు అరచేతిలో వున్న నోటు బలమైన గాలికి ఎగిరిపోయింది. యధాలాపంగా పట్టుకుని వున్న సత్తిపండు భయంగా శ్రీచంద్ర వైపు చూసాడు.


    "గురూ! పదిరూపాయల నోటు" అంటూ గాలిలో ఎగురుతున్న నోటును పట్టుకునే ప్రయత్నం చేయసాగాడు కంగారుగా సత్తిపండు.

 

    శ్రీచంద్ర పరుగు మొదలుపెట్టాడు.


    ఆ పదిరూపాయల నోటు గాలిలో గిరికీలు కొడుతూనే వుంది. అలా ఎగిరి ఎగిరి ఓ చోట పడింది.


    యమధర్మరాజు వరుణదేవుడు వైపు చూసాడు. ఒక్కసారిగా వర్షం మొదలైంది. ఆ పది రూపాయల నోటు వున్న పరిసర ప్రాంతంలోనే వర్షం కురిసింది. శ్రీచంద్ర గబగబా అక్కడికి వెళ్ళేసరికి ఆ పది రూపాయల నోటు వర్షానికి తడిసింది.


    ఆ వర్షానికి తడిసిన జనం అటు ఇటు పరుగులు తీస్తుంటే ఆ నోటు వాళ్ళ కాళ్ళ కింద పడి చిరిగి పనికిరాకుండా పోయింది. ముక్కలు ముక్కలుగా తడిసి ముద్దయి పనికిరాకుండా పోయినా నోటుని అలాగే చూస్తుండిపోయాడు.


    "సారీ గురూ! ఇలా జరుగుతుందనుకోలేదు. కొట్టు గురూ.....నా నెత్తిమీద దొంగదెబ్బ కాదు. నీ చేతి దెబ్బే కావాలి గురూ. పాపిష్టివాడిని, నాకే కాదు, నీకూ పుడ్డు లేకుండా చేసాను" అన్నాడు బాధతో కదిలిపోతూ సత్తిపండు.


    శ్రీచంద్ర సత్తిపండు భుజం మీద చేయెసి "పర్లేదు పండూ పద ఘనపదార్ధమైన అన్నం దొరకనప్పుడు ద్రవ పద్దర్ధమైన నీరు తాగి కడుపు నింపుకోవాలన్నాడు స్వామి శ్రీచంద్ర. పద అదే చేద్దాం" అంటూ పంపు దగ్గరకి నడిచాడు.


    "వద్దు గురూ. నన్ను కొట్టు." శ్రీచంద్ర చేతిని తన చెంప మీదకు చేర్చాడు కొట్టమన్నట్లు.


    శ్రీచంద్ర అ చేతిని భుజం మీదకి చేర్చి "పద" అన్నాడు.


    ఒక్కోసారి కోపం కన్నా క్షమాగుణమే మనిషిని బాధపెట్టి గుండెను బరువెక్కిస్తుంది.


    ఆ నగ్నసత్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించాడు సత్తిపండు.

 

                                                               * * *


    "నారదా!"


    "చెప్పండి సమవర్తి!"


    "ఆ మానవుడిని చూసినావా? అతన్ని తినకుండా చేద్దామని మనం ప్రయత్నిస్తే నీళ్ళతో కడుపు నింపుకున్నాడు. ఎంతటి దైర్యం!"


    
    "ఆ మానవుడు ధీరోధాత్తుడు యమధర్మరాజా! సామాన్యుడు కాడు!" అన్నాడు నారదుడు.


    
    "ధీరోదాత్తుడే దీనంగా నా ముందు మోకరిల్లి నన్ను నీ పాశంతో గొనిపోమ్మను బేల హృదయుడో చూద్దాం" అన్నాడు యమధర్మరాజు.


    నారదుడు నవ్వి ఊరుకున్నాడు.


    యమధర్మరాజు మరో పధకం ఆలోచిస్తున్నాడు.


    శ్రీచంద్రను శారీరకంగా ఆకలికి గురిచేసి ఏమి చేయలేకపోయాడు. మానసికంగా ఇప్పుడు భయపెట్టాలి. బ్రతుకుమీద విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించాలని అనుకున్నాడు యమధర్మరాజు స్థిరంగా.

 

                                                            * * *


    కిచెన్ రూమ్ లో దీక్షగా కాఫీ చేస్తోంది మడి కట్టుకున్న భువన.


    ఈసారి భర్తకు పాదపూజ చేయడానికి వెరైటిగా కాఫీని ఎంచుకుంది.


    కాఫీతో పాదపూజ ఎలా వుంటుందన్న ఆలోచన ఆమెకు అర్ధరాత్రి రెండు గంటలకు వచ్చింది.


    తెల్లారే తన పాదపూజను కాఫీతో చేయాలని నిశ్చయించుకున్నది.


    స్టవ్ మీద పెద్ద బేసిన్ పెట్టి అందులో పావుకేజీ కాఫీపొడిని వేసింది. తగినంత షుగర్, పాలు కలిపి గరిటెతో తిప్పింది. బేసిన్ లో వేడివేడి కాఫీని సిద్దం చేసింది.


    తనకొచ్చిన ఆలోచన తనకే భేషుగ్గా అనిపించింది. ఎంతైనా పతివ్రతను కదా నాకు కాక ఇలాంటి మంచి ఆలోచనలు మరెవరికొస్తాయి అనుకుంది.


    వేడివేడి కాఫీ వున్న బేసిన్ గుడ్డతో పట్టుకుని భర్త గదివైపు నడిచింది.

 

                                                                  * * *


    త్రిలోకం సీలింగ్ ప్యాను వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు. అప్పటికప్పుడే అతనికి వింత ఆలోచన రావడం మొదలెట్టింది.


    ఆ ఆలోచనే ట్రాఫిక్ కానిస్టేబుల్ అయినట్టు.


    తను హెడ్ కానిస్టేబుల్ డ్రెస్ వేసుకుని ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తూ వుంటే ఎలా వుంటుంది?


    ఆ ఆలోచన రావడంతోనే అతనికెంతో నచ్చిందది. ఆ గదిలో రకరకాల దుస్తులు హేంగర్స్ కు వేలాడుతున్నాయి. ఎప్పుడే వెరైటి ఆలోచన వస్తే ఆ ఆలోచనకు ఆ క్యారెక్టర్ కు తగ్గట్టు వేసుకోవడానికి కాస్టుమ్స్ రెడీగా వుంటాయి.

 

    మంచమ్మిద నుంచి లేవడానికి ఉద్యుక్తుడవుతుండగా ఘుమఘుమలాడుతూ కాఫీ వాసన వచ్చింది. ఇన్నాళ్ళకు నా భార్యకు మొగుడికి మంచి కాఫీ ఇవ్వాలనే ఆలోచన వచ్చిందని సంతోషపడుతుండగా సరిగ్గా అప్పుడే భువన బేసిన్ తో లోపలికి వచ్చింది "ఏమండీ" అంటూ.


    త్రిలోకం ఉలిక్కిపడ్డాడు.


    అతని అంతరాత్మ వార్నింగ్ యిష్యు చేసింది.


    "ఒరే త్రిలోకం నువ్వయిపోయావ్రా" అంటూ!


    "ఏంటి భువనా?" బలవంతంగా నవ్వును పెదాల మీద పులుముకుని అడిగాడు.


    "ఈరోజు మీరు నన్ను మనస్పూర్తిగా ఆశిర్వదించాలి" అంది భువన.


    
    "నేనెప్పుడు నిన్ను మనస్పుర్తిగానే ఆశిర్వదిస్తాలే!" అన్నాడు ఏమనాలో తోచక.


    "ఏం కాదు . నేనెంతో ఇష్టపడి , కష్టపడి చేసున్న ఈ పూజని ప్రతివారం తిడుతూనే వుంటారు. ఈసారి ఘుమఘుమలాడే కాఫీతో చేస్తున్నాను. నన్ను తిట్టకండి ప్లీజ్!" అంది.


    ఒక్కసారిగా పెద్దగా గావుకేక వేసాడు త్రిలోకం. ఆ కేకతో భువన కంగారుపడి బేసిన్ వదిలేసింది. కాఫీ మొత్తం త్రిలోకం మీద పడింది జల్లులా. వెంటనే బాత్రూంలోకి పరుగెత్తాడు.


    "చీ....చీ....చీ" అంటూ బట్టలు విప్పి షవర్ తిప్పాడు.


    "అదేమిటండి పతివ్రతను......నన్ను ఆశిర్వదించకుండానే బాత్రూంలో దూరారు!" అంటూ బాత్రూంలోకి జొరబడి బలవంతంగానైనా భర్త ఆశీర్వాదం తీసుకోవాలనుకుని భర్త విశ్వరూపం చూసి పెద్ద కేకేసింది బయటకు పరుగెత్తుతూ.


    "పీడా విరగడయింది. నాకు భయపడకున్నా నా విశ్వరుపానికి ఝడుసుకుంది" అనుకున్నాడు.


    అతనికెంత కసిగా ఉందంటే భార్య కనిపించినప్పుడల్లా ఇలాగే ఆమె ఎదురుగా నిలబడి కసి తిర్చుకోవాలన్నంత.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS