Previous Page Next Page 
అష్టపది పేజి 41

 

    లోకేశ్వరరావు కొడుకు నుదుటి మీద ప్రేమగా అంటీ అంటనట్లుగా మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ తర్వాత...
    
    "నమస్కారం చిన్న బాబుగారూ!"
    
    "చిన్న బాబుగారు చాలా మారిపోయారు"
    
    "చాలా చిక్కి పోయారు చిన బాబుగారు."    

 

    "వినయ విధేయతల విషయంలో చిన్న అయ్యగారు ఏమీ మారలేదు."    

 

    నౌకర్లంతా తలోమాట అని పలకరించారు.

   
    ఇదంతా చూస్తూ శీతల్ అతన్ని పరికించి చూసింది.    

 

    కుందన్ సామాన్యమైన ఎత్తులో వున్నాడు. కాళ్ళూ చేతులు సన్నగా వున్నట్టు తెలిసిపోతున్నాయి. దానికి తోడు తల ఉండే సైజు కన్నా పెద్ద సైజులో వుంది. శరీరం దృఢంగా వుంటే పెద్ద తలకాయ అయినా కొంతలో కొంత కవర్ అవుతుంది. అలా లేకపోవడంవల్ల కొట్టొచ్చినట్లు తెలిసిపోతున్నది. దొప్ప చెవులు కూడా వుండడంతో పెద్ద తలకాయకి చెవులు తగిలించినట్లుగా వుంది. వత్తుగా మీసాలు వున్నాయి ఫ్యాషన్ గా సైడ్ లాక్స్ తో కలసి గడ్డం పెంచాడు. పాలిపోయిన తెలుపు వర్ణం. కుందన్ ది చాలా సామాన్యమైన రూపం అంతేకాదు ఒకసారి చూస్తే మరచిపోనీ రూపం కూడా. చూసి చాలా రోజులైనా గుర్తు పట్టవచ్చు తేలికగా మనిషిరూపం ఏమోగానీ మర్యాదగానే వుంది ప్రవర్తన..." అనుకుంది శీతల్.
    
    "అలా అని నమ్మటానికి లేదు." అని అప్పుడే మరో మాట అనుకుంది.
    
    శీతల్ ని తన కొడుక్కి పరిచయం చేసి శీతల్ తో "శీతల్! వీడు నీ బావ, నీకు పరాయి వాడుకాదు సుమా" అన్నాడు లోకేశ్వరరావు.  

 

    బావ ఆ మాట ఎందుకో ఎలర్జీగా అనిపించింది శీతల్ కి. ప్రస్తుతానికి ఏ కామెంటు చేయక తల వూపి ఊరుకుంది.
    
    "వీరిని నేనెప్పుడూ చూడలేదు నాన్నగారూ మర్యాదగా అన్నాడు కుందన్.    

    
    "వీరేమిటిరా కుందన్! వీరు వారునూ నీకు మరదలు పేరు శీతల్ రాణి. నీకన్నా వయసులో చిన్నది. రాణి అనో శీతల్ అనో పిలువు." కుందన్ తో అని శీతల్ వైపు తిరిగి "శీతల్! నీ యిష్టం వీడిని బావ అని పిలుస్తావో నీ యిష్టానికి వదిలేస్తున్నాను. మీ యిద్దరు నాకు రెండు కళ్ళులాంటి వాళ్ళు." అన్నాడు లోకేశ్వరరావు.    

 

    "నాకు వరసలు పెట్టి పిలవటానికి రావు." కొన్ని విషయాలు ముందే చెపితే మంచిదని శీతల్ చెప్పేసింది.    

 

    లోకేశ్వరరావు ముఖం లిప్తపాటులో ముడుచుకుని అంతలోనే మామూలు అయింది. "నీ యిష్టం తల్లీ! నీకేది బాగుంటే అలానే కానియ్యి." అన్నాడు.    

 

    కుందన్ హళ్ళు పెళ్లుగా లేడు. నౌకర్లని కూడా మార్యాదగా ప్రేమగా పలకరించాడు. గడ్డాలు మీసాలు విషయం వదిలేస్తే ధరించిన దుస్తుల విషయంలో కూడా నిరాడంబరంగా వున్నాడు. కళ్ళకి లైట్ బ్లూ కలర్ కళ్ళద్దాలు పెట్టుకున్నాడు.
    
    కుందన్ శీతల్ ని మర్యాదగా ఒక్క ముక్కలో పలకరించి ఊరుకున్నాడు.
    
    కుందన్ ఎలాంటి వాడన్నది శీతల్ కి తెలియలేదు.
    
    కుందన్ వచ్చిన సందర్భంలో ఆ పూట సరదాగా గడిచిపోయింది.
    
    శీతల్ జీవితంలో ఓ కొత్త వ్యక్తి ప్రవేశించాడు.
    
    ఇహపై ఏం జరుగుతున్నది శీతల్ కి తెలియదు. అలా తెలియక పోవటం కూడా ఓ విధంగా మంచిదే. కొన్ని విషయాలని కాలమే తెలియజేస్తుంది. అందాకా వేచి వుండటమే నయం.
    
                                24
    
    కుందన్ వచ్చి నాలుగు రోజులు అయింది.
    
    ఈ నాలుగురోజులు శీతల్ కి బాగానే గడిచాయి.
    
    కుందన్ ని శీతల్ అని పిలుస్తుంటే శీతల్ కుందన్ ని కుందన్ అని పేరుపెట్టి పిలుస్తున్నది. అతను నిదానంగా  తూచి తూచి మాట్లాడుతుంటే ఏమిటో తెచ్చి పెట్టుకుని మాట్లాడినట్లు వుంది.
    
    శీతల్ కి అతనిలో ఏవో లోపాలు కనిపిస్తున్నాయి. అదేమిటన్నదే ఇంకా తెలియలేదు. ఏదైనా వుంటే కనిపెట్టాలిఅనుకుంది.
    
    సాయంత్రం అయిదు గంటల వేళ ఇంటిముందు లాన్ లో కుర్చీలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ కుందన్ శీతల్ కూర్చున్నారు లోకేశ్వరరావు బయటికి వెళ్ళాడు.
    
    "నీకు సైటుందా కుందన్!" శీతల్ అడిగింది అతను పెట్టుకున్న కళ్ళజోడుని చూస్తూ.
    
    "ఊహూ" అన్నాడు కుందన్.
    
    "మరెందుకు ఎప్పుడు విడవకుండా జోడు పెట్టుకుంటావ్!"  

 

    "కారణం వుంది." ముక్తసరిగా జవాబిచ్చాడు కుందన్.
    
    "కారణమా!"
    
    "ఎస్."
    
    "చెప్పరానిదా!"
    
    "కాదు!"
    
    "అలా ముక్తసరిగా మాట్లాడకపోతే ఇంకొక్కమాట ఎక్కువ మాట్లాడితే నీ నోటి ముత్యాలు రాలుతాయని భయమా కుందన్!" 

   

    "అలాంటిదేమి లేదు."
    
    "అయితే చెప్పు నాకు కాస్త కాలక్షేపంగా వుంటుంది. కళ్ళజోడు వాడటం పెద్ద కథ కాకపోయినా నాకు కాసేపు కాలక్షేపంగా వుంటుంది. ఏ కాలక్షేపం లేదు బోర్ గా వుంది." కాలక్షేపం అనేమాట ఒకటికి రెండుసార్లు తన మాటల్లో వాడుతూ అంది శీతల్.
    
    "నాకు చిన్నప్పటినుంచి వర్షం అంటే చాలా ఇష్టం వర్షంలో తడుస్తూ గంతులు వేసేవాడిని. అలా తడవ వద్దు జలుబు చేస్తుంది అంటూ నాన్నగారు కోప్పడేవారు నాన్నగారు ఏ మాట చెప్పినా కాదనకుండా వినేవాడ్ని. వర్షంలో తడిసే విషయం మాత్రం వినేవాడిని కాను. చిన్నప్పటి నా యిష్టం పెద్దయినా తగ్గలేదు. క్రితం సంవత్సరం వర్షంలో తడుస్తూ రోడ్డుమీద నడుస్తున్నాను. దూరాన ఎక్కడో పిడుగు పడింది. నాకు చాలా దూరాన ఆ పిడుగు పడటం జరిగినా ఆ క్షణంలో నేను తలఎత్తి ఆకాశంలోకి చూడటం ఆ పిడుగు యొక్క కాంతి నా కళ్ళని తాకటం వెంటనే నేను తల తిరిగినట్లయి కొద్దిసేపు తెలివి తప్పి పడిపోవటం జరిగింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS