Previous Page Next Page 
శతదినోత్సవం పేజి 40

 

    "భర్తకు లొంగడము ఓడిపోవటమే నంటావా?"


    "ఖచ్చితంగా!"


    "అయితే ఇక జన్మలో మనకు శోభనం కాదు!"


    "అవుతుంది. మీరు సహకరిస్తే"


    "నిజమా?" ఉత్సాహంగా బాసింపట్టు వేసుక్కుచున్నాడు. "ఏం కావాలి చెప్పు."

    
    "మీ ఐక్యూ తో నన్ను ఓడించగలగాలి. అప్పుడు నేను మీకు లొంగిపోతాను."


    "మరి చెప్పవేం?" 'అదెంత పని' అన్నట్టుగా చూశాడు. "అడుగు కాదు కురిపించు ప్రశ్నల వర్షం! చకచక నేను చెప్పే జవాబులు విని అనక మీరెంత మేదవులండి అంటూ నన్ను కావలించుకో. ఆ మిగతాది నా కొదిలేయ్!"


    నిర్లిప్తంగా చూసింది రాఘవ వేపు. "అయితే మీరు నన్ను ఓడిస్తానంటారు!"


    "అవును"


    "నన్ను ఓడించి గెలుచుకుంటా నంటారు."


    "తప్పకుండా!"


    "అయితే ఆరు ప్రశ్నలు అడుగుతాను. జవాబులు చెప్పాలి.'


    "కానియ్!"


    అర నిమిషం నిశ్శబ్దం.


    "కాని మరి! తొందర చేశాడు.


    కిన్నెర అడగడం ప్రారంభించింది.


    "మధ్యాహ్నం భోం చేసిన తర్వాత ఓ గంట పడుకుంటే ఆ మనిషి ఎఫిషియన్సీ పెరుగుతుందా, తరుగుతుందా?"

    ఇదేం ప్రశ్నన్నట్టుగా చూశాడు.


    "అలా మొహం పెట్టడం కాదు. ఆరు ప్రశ్నలకు జవాబు చెప్పాలి చెబితే ఆ తర్వాత మీ ఇష్టం."


    పకాల్న నవ్వాడు......."ఇదెంత పని కిన్నెరా? ఇహ చూస్కో నా ఇక్యూ అదరహో!"


    గొంతు సవరించుకున్నాడు జవాబు చెప్పటానికి ఉద్యుక్తుడవుతూ.


    "రిసెర్చి స్టడీస్ ను బట్టి మధాహ్నం లంచ్ అయ్యాక ఓ గంట పడుకునే విద్యార్ధులు నిద్రపోకుండా ఆ గంట కూడా చదువుకు కేటాయించిన విద్యార్ధులకన్నా చదువులో మెరుగనిపించుకున్నారు" చెప్పాడు రాఘవ.


    ఉలిక్కిపడింది కిన్నెర.


    తనకు తెలిసిన జవాబు కూడా అదే కావడంతో 'అబద్దం' ఆనలేక పోయింది.


    "రెండో ప్రశ్న అడుగు"


    "రాత్రి నిద్రకు ముందు వేడిగా ఉన్న ద్రవపదార్ధాలు తాగితే బాగా నిద్రపాడుతుందంటారు కొందరు. అది నిజమేనా?"


    "పచ్చి అబద్దం! బ్లెడర్ పై ఆ ద్రవ పదార్ధాల ఒత్తిడి ఇబ్బందికి గురి చేస్తుంది. రాత్రి పడుకోబోయే ముందు మాట అటుంచు - సాయంకాలం సైతం కొద్దిపాటి ద్రవ పదార్ధాలు తీసుకోవాలి. లేకపోతే అవి కూడా రాత్రి నిద్ర పట్టకుండా చేస్తాయి. ఇది సైన్సు.'


    "రైట్!" క్షణం ఆగింది. "అయిదు సెకండ్లలో జవాబు చెప్పగలగాలి. కూడినా, గుణించినా ఒకే ఫలితం వచ్చే మూడు అంకెలు చెప్పండి.'


    "వన్, టు, త్రీ కరెక్టేనా? వహ్వా!" అన్నాడు ఉత్సాహంగా.


    కిన్నెర కంగారు పడిపోతోంది. "ఏ గ్రహం పై ఏడాది జైలు శిక్షంటే అన్ని గ్రహాలపై కన్నా సుదిర్ఘమైనది అవుతుంది?"


    "గొప్ప ప్రశ్నడిగావు కిన్నెరా! నీ ఇక్యూ కూడా అసాధారణమని ఈ ప్రశ్నే చెబుతుంది."


    హడావుడి చేస్తుంటే చేతిని అడ్డం పెట్టింది. "ముందు జవాబు చెప్పండి."


    "అన్ని గ్రహాలకన్నా దూరంలో ఉన్న ఫ్లూటో అది. మన ఏడాది కాలం అక్కడ కేవలం 248 గంటలు మాత్రమే కాబట్టి అక్కడ ఏడాది జైలు శిక్షంటే లంగేస్ట్ పనిష్మెంట్ అవుతుంది."


    కిన్నెర సన్నగా కంపిస్తోంది . "టొమాటో అన్నది పండు అనిపించుకుంటుందా కాయ అవుతుందా?"


    "లీగల్ గా అయితే టమాటోని పండు అంటారు. హర్టికల్చరల్ గా అంటే కాయ అంటారు."


    లాభం లేదు. తొలి ప్రయోగంలోనే తను పూర్తిగా ఓడిపోయేట్టుంది ఎలా? ఇక మిగిలింది ఆఖరు ప్రశ్న. దానికి కూడా జవాబు చెప్పేస్తే....."


    "అదేమిటి కిన్నూ! మొహమేమిటి అలా పెట్టావ్? భర్త ఐక్యూకి అదిరిపడే ఏ అమ్మాయైన ఇలాంటప్పుడు ఎలా ఉండాలి? "హా, నాధా! నీ కింత జనరల్ నాలెడ్జి ఎలా అబ్బిందోయీ!" అంటూ అమాంతం అక్కున చేర్చుకోవాలి కాని, నువ్వు నెర్వస్ అయిపోతున్నావేం?"


    దొరికిపోయి నందుకు కంగారు పడుతూనే మొహానికి నవ్వు పులుముకుంది. "రియల్లీ గ్రేట్!" అభినందించింది గొంతు వణుకుతుంటే "ఈ చివరి ప్రశ్న కూడా చెప్పేయగలగాలి.'


    "ఓకే, కెరీ అన్."


    "మందార నూనె తెలుసుగా?"


    "తెలుసు."


    "అందులో ఏయే వస్తువులు వాడతారు? ఎలా తయారు చేస్తారో చెప్పండి?"       


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS