Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 41

 

    "అసలు బావమీద నాకలాంటి అభిప్రాయమే లేదు పిన్ని, పెళ్ళంటే నాకు అస్సలు ఇష్టంలేదు. కనీసం మూడు నాలుగు ఏళ్ళవరకు నేను పెళ్ళి చేసుకోదలుచుకోలేదు....అలాంటిది సురేంద్ర బావని నేను ఛా" అంటూ ఏడ్చింది మళ్ళి జయంతి.

    "ఊరుకో జయంతి! మాకు తెలుసు కదా నీ మనసు....ఇక ఆ విషయం మర్చిపో...ఎంచక్కా ఇంకేమైనా కబుర్లు చెప్పుకుందాం." అంది శివపార్వతి.

    జయంతి నిశ్శబ్దంగా ఏడుస్తుంది. దాక్షాయణి ఆమె తల నిముతుతూ ఓదార్చుతోంది.

    "ఏంటో ఇదంతా ఒక పీడకలయితే ఎంత బావుండనిపిస్తోంది....సురేంద్రబావతో, గిరిజక్కతో మాట్లాడకుండా నేనుండగలనా...."అనిపిస్తుంది" అంది జయంతి.

    "నిక్షేపంగా వుండగలవు....మేమంతాలేమా ఏంటి? పెద్ద గిరిజ లేకపోతే బ్రతకలేవా? నీ చదువులో మనసు లగ్నం చేయి, చక్కగా మంచి మార్కులతో పాసవటమే కాక, ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు రాకుండా ఉంటాయి" అంది శివపార్వతి.

    "అవును! పార్వతి చెప్పినట్లు చెయ్యి జయంతి, వాళ్ళ గురించి అసలు పట్టించుకోవద్దు సరేనా?" అంది దాక్షాయణి.

    సరేనన్నట్లు నవ్వుతూ తలూపింది జయంతి.

    "మా జయంతి నవ్విందొచ్" అంటూ ఆమెను ముద్దు పెట్టుకుంది పార్వతి.
                                              22

    ఆరోజు దీపావళి పండుగ!

    కస్తూరి హడావుడి చేస్తోంది.

    సమయం ఉదయం ఆరుగంటలు.

    అప్పటికే అందరి స్నానాలు ముగిశాయి.

    తలంటుస్నానాలు చేసి పూజ ముగించారు.

    పిల్లల హడావుడికి హద్దులేదు.

    కాళమ్మ వాకిలంతా శుభ్రంగా కల్లాపి జల్లింది.

    జయంతి మొట్టమొదటిసారిగా చీర కట్టింది.

    పసుపుపచ్చని పట్టుచిరే, నల్ల జాకెట్టు ధరించి తలకు తుండు కట్టుకుని వాకిలిముండు ముగ్గులు వేస్తోంది. వనజ అరుగు మీద కూర్చుని అక్కను గమనిస్తోంది.

    కస్తూరి, దాక్షాయణి, శివపార్వతి వంటగదిలో ఉప్మా చేస్తున్నారు.

    "ఎవరదీ ఓలమ్మో! మా జయంతే....ఎంతగా ఎదిగిపోయింది, నేనసలు గుర్తేపట్టలేదు. చీరకడితే కొత్త పెళ్ళికూతురులాగుంది" అంది కాళమ్మ.

    "నువ్వు నొరుముయ్యవే...ఎప్పుడు పెళ్ళిరందే" అంది జయంతి నవ్వుతూ.

    "నిజమే చిన్నమ్మాయిగొరూ! మీకు నా దిష్టే తగిలేటట్టుంది. ఇయ్యాల నీకు దిష్టు తియ్యాలసిందే" అంది నవ్వుతూ.

    జయంతి కాళమ్మ  మాటలకు నవ్వుకుంది.

    "అక్కా త్వరగా చీకటిపడితే బావుండు" అంది వనజ.

    "ఇప్పుడేకదే తెల్లారింది. అప్పుడే ఎలా చీకటిపడుతుంది?" అంది చెల్లెల్ని చూసి నవ్వుతూ.

    "ఏంటి ముగ్గువేయడం ఇంకా పూర్తీకాలేదా?' అంటూ వచ్చింది శివపార్వతి.

    "అయిపోయింది చిన్నపిన్ని! ఇంకెంత ఐదు నిమిషాలు" అంది జయంతి.

    "ఈ చీరలో నువ్వెంత అందంగా వున్నవో జయంతి...." అంది శివపార్వతి.

    "అబ్బా! అయితే వెంటనే ఈ చీర విప్పేసి మాములుగా లంగా వోణి వేసుకుంటాలే" అంది జయంతి.

    "ఎందుకు?" అంది ఆశ్చర్యంగా.
    "ఇప్పటివరకు కాళమ్మ వచ్చి ఎంత ఎదిగిపోయారు అమ్మాయిగారూ....పెళ్ళికళ వచ్చేసింది" అంటూ సంబరపడిపోయింది. నువ్వు కూడా అదే అంటున్నావు. నాన్నగారు చూశారంటే దానికిక పెళ్ళిచేసెయ్యాల్సిందే అంటూ పెళ్ళి సంబంధాలు చూస్తారు. నేను వద్దన్నా నువ్వే ఈ చీర కట్టించావు నాచేత" అంటూ చిరుకోపంగా అంది జయంతి.

    "అదా నీ భయం, సర్లే.....అననులే కానీ కాళమ్మ ఉన్నమాటే అంది" అంటూనవ్వుతూ చెప్పింది.

    "వనజా! ముగ్గు డబ్బా లోపలికి తీసుకెళ్ళు, పద పిన్ని వెళదాం" అంటూ లోపలికి వెళ్ళింది జయంతి.

    పదినిముషాల్లో చీరే మార్చుకుని మాములుగా లంగా వోణి వేసుకుని బయటకొచ్చింది జయంతి.

    శివపార్వతి అది చూసి పెద్దగా నవ్వింది.

    "ఏంటి పార్వతి ఎందుకు అలా నవ్వుతున్నావు?" అంది కస్తూరి.

    శివపార్వతి విషయం చెప్పింది. ఆ మాటలకు కూతుర్ని మురిపెంగా చూసుకుంటూ, "అవునే దానికి ఎక్కడ మనం పెళ్ళి చేస్తామో అని తెగ భయపడిపోతోంది. మరి ఆ చదువులు చదివి ఏం చేస్తుందో చూడాలి" అంది నవ్వుతూ.

    "చూద్దురుగాని ఏం చేస్తానో....అమ్మా ఆకలేస్తుందే, ఉప్మా అయిందా?" అంది జయంతి.

    "అయిపోయింది . వెళ్ళి తిను"అంది కస్తూరి.

    "పిల్లలకు పెట్టావా పార్వతి? అంది కస్తూరి.

    "పెట్టనక్కా....అయన కూడా తిన్నారు" అంది పార్వతి.

    "సుందరం స్నానం అయిందా?" అంది కస్తూరి.

    "అయిందక్కా! పట్నంలో ఏదో పనుందని బయల్దేరుతున్నారు" అంది శివపార్వతి.

    "పండగపూట ఏంపనే ఎక్కడికి వెళ్ళనియ్యకు. వదిన కోప్పడుతుందని చెప్పు వాడికి" అంది కస్తూరి.

    "నా మాట వింటేగా? మీరే చెప్పండి" అంది శివపార్వతి, బిక్కముఖంతో.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS