Previous Page Next Page 
నేస్తం నీ పేరే నిశ్శబ్దం పేజి 41

   

    "నేనిలా వుండటం గొప్ప విషయంలా ఆలోచించను, అంగికరించమని ఎవరి మీద ఒత్తిడి తీసుకురాను, నా మాటలు కొంచెం కటువుగా వుండొచ్చు, అది కరెక్ట్ చేసుకోటానికి నాకు అభ్యంతరం లేదు, కానీ మా నాన్నగారు కూడా ఎదగాలి అంటే రాజీ పడాలి, అడ్జస్ట్ కావాలి అంటూ బ్రతికినంతకాలము నన్ను సాధించటానికే ప్రయత్నించారు తప్ప - నా పద్దతి యింతే అని సరిపెట్టుకోలేకపోయారు. ఇప్పటి సమాజంలో బ్రతకటానికి కొన్ని అర్హతలున్నాయంటు నన్ను ఆ దారిలో నడవమనేవారే తప్ప నేను నడిచేదోవ ఎందుకు తప్పో చెప్పలేకపోయారు. నా జీవితంలో వైపల్యాలు గురించి భాధపదేవారే తప్ప వేల వైపల్యాల తర్వాతనే ఎడిసన్ ఈ ప్రపంచానికి వెలుగు నిచ్చాడంటే ఒప్పుకునే వారు కాదు....." తండ్రి చనిపోయినరోజున రెండు కన్నీటి బొట్లయిన రాల్చకుండా నిబ్బరంగా నిలబడ్డ ధన్వి ఇప్పుడు పసిపిల్లాడిలా తన ముందు ఆవేదన్ని వ్యక్తం చేస్తుంటే ఎంతో గర్వమనిపించింది. "మీ ఆలోచనల్ని కాదనలేను ధన్వి కానీ రాజీ పడడం కూడా జీవితంలో భాగమని మీరు అంగికరించకపోవడాన్ని జిర్ణించుకోలేకపోతున్నాను."

 

    ఆమె గొంతులో స్వరాల విరామం.

 

    "అసలు రాజీపడటం అంటే ఏమిటి మధూళీ.....? బిడ్డకి తిండి పెట్టలేని స్థితిలో వున్న ఓ పేద తండ్రి, ఆకలేస్తుంది నాన్నా అనే బిడ్డకి నిజం చెప్పలేక కట్టు కధలు చెప్పి బుజ్జగించడం రాజీ పడటం అనిపించుకుంటుంది. అది తప్పనిసరి కూడా అవుతుంది. కానీ సంపాదించింది తాగుడికి ఖర్చు చేస్తూ భార్య పిల్లలకి అన్నం పెట్టని ఓ భర్తతో ఆడది ఏ రోజు బ్రతుకునిడ్చుతూ బ్రతికేయడం రాజీ అనిపించుకుంటుందనా! అది ఆత్మవంచన అవుతుంది. రాజీపడటానికి, ఆత్మవంచన చేసుకోటానికి మధ్య వున్న సన్నని సరళరేఖని తెలుసుకోనంతకాలం రెండింటికి వున్న తేడాని మనం అర్ధం చేసుకోలేం మధూళీ.....అసలు యుద్ధభూమిలో అడుగుపెట్టిన సైనికుడు చచ్చేదాకా పోరాడాలి తప్ప ఆత్మరక్షణ పేరిట వెన్ను చూపించడం పిరికితనం అవుతుంది తప్ప రాజీపడటం ఎలా అనిపించుకుంటుంది?"
    

    సో.... మీ నిఘంటువులో 'రాజీ' అనే పదం ఇక ముందూ వుండదంటారు."

 

    విస్మయంగా చూసింది మధూళీ.

 

    "నిస్వార్ధంగా అయితే" రెట్టించింది.

 

    "అది కాదు ధన్వి! నిస్వార్ధంగా రాజీపడే అవసరం కూడా వుంటుందా?"

 

    "నన్నో ఉన్మాదిగానో, పిచ్చివాడిగానో మీరు అనుకున్నా నాకు అభ్యంతరం లేదు మధూళీ. నేను నిస్వార్ధంగా కాలిపోవడం కొన్ని రాలిపోతున్న జీవితాలకి ప్రాణమిచ్చే అంశామైయితే అందుకు నేను ఆహుతి కావటానికి సిద్దపడతాను. పదిమందికి మేలు జరిగే అవకాశం వుంటే రాజీ పేరిట అగాదాల లోయలకైనా జారి మానవత్వమంతగా విస్తరిస్తాను."

 

    స్వాతికశయాలకి భేషజాలకి అతీతంగా మాట్లాడే ఈ మనిషి ఇంత కాలము తనకెందుకు పరిచయం కాలేదు? ముందు చూస్తే విరోదిలా మనసు తెరిస్తే వయోదిలా అనిపించే ఈ వ్యక్తీ దిగుతున్న కొద్ది లోతుగా అనిపించే ఇంతటి వివశత్వానికి గురి చేస్తున్నాడెం.....అసలు కొన్ని ఆలోచనల్ని ఇలా వ్యక్తం చేస్తే నలుగురూ నవ్వుకుంటారేమో అని ఆలోచించకుండా యింత నిర్భిరిగా మాట్లాడుతాడెం?

 

    "నమస్తే" చెదిరిన నిశ్శబ్దం.....

 

    సమీపంలో ఓ వ్యక్తీ నిలబడి వున్నాడు పలకరింపుగా నవ్వుతూ.

 

    "డిస్టర్బ్ చేశాను మిస్టర్ ధన్వి?"

 

    మూడు పదుల వయసులో అందంగా సంస్కరవంతంగా "మీకు ఇబ్బంది కాదు అనిపిస్తే నా కోసం ఓ అరగంట టైం స్పేర్ చెయ్యగలరా? మీకు విలైనప్పుడే" అన్నాడు అభ్యర్ధనలా.

 

    "ఓ.కె. ష్యూర్!" లేచాడు ధన్వి. " ఎలాగూ కలుసుకున్నాంగా......ఇప్పుడే మాట్లాడుకుందాం."

 

    ఒక అద్బుతమైన అనుభూతిలాంటి చర్చకి అవాంతరం ఏర్పడ్డ మధూళీ "ఓ.కె. నేను తరువాత కలుస్తాను" అంటూ ధన్వి దగ్గర శలవు తీసుకుని వెళ్ళిపోయింది.

 

    ఇప్పుడు ధన్విని పలకరించిన ఆ యువకుడు ఎవరో కాదు.

 

    సామ్రాజ్యం మాజీ భర్త.

 

    పేరు సంజీవి.

 


                                 *    *    *    *

 

    "నిజానికి మేం ఒకరినొకరం యిష్టపడి ప్రేమించి పెళ్ళి చేసుకున్న వాళ్ళం ధన్వి."

 

    ట్యాంక్ బండ్ రైలింగ్ ని అనుకుని నిలబడి వున్న సంజీవి యిరుకు చెరసాల లాంటి మనసు అరల్ని తెరచి అరమరికల్లేకుండా చెబుతున్నాడు. "మా దాంపత్య జీవితం కూడా చాలావరకు అపురూపంగా గడిచిపోయింది."

 

    అవిశ్రాంత పోరాటానికి అలవాటుపడ్డట్లు ఉదయ సూర్యుడి లేత కిరణాలు హుస్సేన్ సాగర్ పై పడి బుద్ధ విగ్రహాన్ని నవరత్న ఖచితంగా మార్చుతుంటే ధన్వి సూటిగా అడిగాడు "అసలు మీరెందుకు విడిపోయారు?"

 

    ఎంతోకాలం ఆనందంగా కలిసివున్న సంజీవి, సామ్రాజ్యం రెండేళ్ళక్రితం విడిపోవడం తెలుసు తప్ప కారణం తెలీదు.

 

    ప్రత్యేకించి ధన్వి కూడా సామ్రాజ్యాన్ని అడగలేదు, అడగడం అతడి అలవాటు కూడా కాదు.

 

    తానో సమస్యలో వున్నట్టు సామ్రాజ్యం ఏ రోజన్నా బాధపడితే బహుశా వివరాల్ని తెలుసుకునేవాడేమో కానీ ఒంటరిగా బ్రతకటాన్నే ఆమె యిష్టపడుతుంది.

 

    "ఒక రకంగా పొరపాటు నాదే మిస్టర్ ధన్వి."

 

    గిల్టిగా నేలచుపులు చూస్తున్నాడు సంజీవి.

 

    "ప్రేమించి పెళ్ళి చేసుకున్నాక ఒకరినొకరం అనుకుంటూ నిజాయితిగా కలిసి బ్రతకడం మొదలుపెట్టాక ఎవరినెవరు మోసం చేసినా మరొకరు భరించలేరుగా.....అలా నా అనుచిత ప్రవర్తనతో సామ్రాజ్యాన్ని బాధపెట్టాను. కారణం ఏమన్నా గానీ, ఎలా జరిగినా గానీ నేను నా కన్ స్ట్రక్షన్ బిజినస్ మొదలుపెట్టాక ఓ అమ్మాయితో సంబంధం పెట్టుకుని నిజంగానే సామ్రాజ్యానికి ద్రోహం చేశాను, ఎస్.....సామ్రాజ్యం నాతో కలిసి బ్రతకడం కుదరంది. అప్పటికి జరిగిన తప్పుని కరెక్ట్ చేసుకుంటానని ప్రాధేయపడ్డాను కూడా."

 

    సుమారు ఆరడుగుల అజానుభాహుడైన సంజీవి ఒకనాటి సంఘటన్ను మననం చేసుకుంటూ పశ్చాత్తాపంలాంటి భావాన్ని ప్రకటించడమే గాక ఆర్తితో స్వచ్చమైన మూర్తిగా మారిన ఆలోచనల్ని వ్యక్తం చేస్తున్నాడు.

 

    "సామ్రాజ్యం నా జీవితంనుంచి వెళ్ళిపోయాక ఒంటరిగా బ్రతకటానికి నిర్ణయించుకున్న నేను నా దుర్వసనాల్ని వదిలేసి బిజినెస్ మీద ఏకాగ్రత చూపించి ఆర్ధికంగా చాలా ఎదిగాను ధన్వి, బట్ సామ్రాజ్యాన్ని మాత్రం మర్చిపోలేక ప్రతిక్షణం నలిగిపోతూనే వున్నాను. ఈ ప్రపంచంలో యిక అమ్మాయిల్లేరా అని మీరడగవచ్చు, వున్నారు కానీ వాళ్ళలో ఏ ఒక్కరూ నా సామ్రాజ్యంకాలేరు. అది తెలుసుకున్న నేను సామ్రాజ్యం కోసం అడపాదడపా ఫోన్ చేస్తూనే వున్నాను. తెలిసిన వాళ్ళ చేత మధ్యవర్తిత్వంతో దగ్గర కావాలని ప్రయత్నిస్తూనే వున్నాను. మీకు తెలుసుగా, సామ్రాజ్యం ఏ ఒత్తిడికి లొంగదు, మీ మాటకి తప్ప......"

 

    ధన్వి విస్మయంగా చూశాడు.

 

    నేను అన్నది అతిశయోక్తిగా అనిపిస్తే క్షమించండి ధన్వి, కానీ ఇది నిజం. మా దాంపత్యం బాగున్న రోజుల్లోనే మీ గురించి గొప్పగా చెప్పేది. మీరో అసాధారణ వ్యక్తిత్వం అంటూ తెగ మేచ్చుకునేది. అందుకే ఇప్పుడు మీ సాయం కోరుతున్నాను. నాకు నా జీవితాన్ని ఇప్పించగలరా? ప్లీజ్......"

 

    ఒక అపశ్రుతి ఇద్దర్ని వేరుచేస్తే నిక్షిప్తమైన ప్రేమ యిప్పుడు వదిలిన గూటికే తిరిగి రావాలని ఆరడి చేస్తుంది. ఇంత పశ్చాత్తాప పడుతున్న సంజీవిని ఆమె క్షమిస్తుందని అనిపించిందేమో.

    "నా మీద మీకున్న నమ్మకానికి కృతజ్ఞతలు మిస్టర్ సంజీవి. ప్రతి మనిషి జీవితం ఆయా వ్యక్తుల సిద్దాంతాల మీద నిర్మించుకున్న భవంతి లాంటిదని నమ్మే నేను ఎంతవరకు సఫలం కగాలనో తెలీదు. కానీ సమయం చూసి సామ్రాజ్యంతో మాట్లాడటానికి ప్రయత్నిస్తాను."   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS