Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 41


    మొదటి పేరా అంతా లీల అందం, గుణగణాలూ, ఆమెయందతని ప్రేమ గురించీ, రెండవ పేరా తన ఇంటి పరిస్థితుల గురించీ, మూడవ పేరా పెళ్ళయ్యాక లీలా, తనూ పంచుకోవాల్సిన బాధ్యతల గురించీ రాశాడతను.
    
    అంతా చదివి దీర్ఘంగా నిట్టూర్చింది ధృతి.
    
    "ఉత్తరం చదువుతుంటే నీకేమనిపిస్తోంది?" అడిగింది లీల.
    
    "ప్రేమా, స్పందనా లాంటి మాటల బురఖా వేసుకున్న పక్కా మెటీరియలిస్టనిపిస్తోంది.
    
    "నాకు ఏమనిపించిందో తెలుసా?" అని ఓ క్షణం ఆగి, తిరిగి "నీకు కష్టాలుపడటం ఎలాగూ అలవాటేగా, పెళ్ళయ్యాక కొత్తలేకుండా మళ్ళీ కష్టాలుపడు. నీ ఖర్మ యింతే! అని రాసినట్లుగా వుందది" అంది.
    
    ధృతి నవ్వేస్తూ "మరి రిప్లయ్ ఇవ్వలేదా?" అనడిగింది.
    
    "ఇస్తాను! అందుకే నిన్ను పిలిచింది" అంటూ పర్సులోంచి మరో కవర్ తీసింది. "ఇది నేను రాసిన జవాబు, ఎలావుందో చదివి చెప్పు" అంది.
    
    ధృతికి ఆ ఉత్తరం చదువుతుంటే నవ్వాగలేదు.
    
    "డియర్ బాధామూర్తిగారూ! సారీ కృష్ణమూర్తిగారూ!
    
    మీ ఉత్తరం చదువుతుంటే బాధతో నా మనసు వేయి ముక్కలై పోయింది. ఆర్ధికంగానూ, అన్ని విధాలుగానూ కూడా మీకు అనేక బాధలున్నట్లు రాశారు. తల్లి గయ్యాళి కాబట్టి ఆవిడ మాటకు ఎదురుచెప్పలేరు. అక్కలూ, బావలూ సతాయిస్తుంటే నోరు మెదపకుండా పాపం భరిస్తున్నానన్నారు మీ అమ్మగారికీ, నాన్నగారికీ నెలనెలా మందుల కెంతవుతుందో, మీ చెల్లెలి షోకులకెంత ఖర్చుపెడుతుందో అన్నీ వివరంగా రాసి మంచి పని చేశారు. నన్ను ప్రేమిస్తున్నానన్నారు కాబట్టి, ఓ పనిచేద్దాం. మీరు వెంటనే మీ బట్టలు తీసుకుని మా యింటికి వచ్చెయ్యండి. మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని కష్టాలన్నీ తప్పించుకుని హాయిగా వుందాం. మా యింట్లో వాళ్ళకి పేయింగ్ గెస్ట్ లా డబ్బిస్తే చాలు పట్టించుకోరు. నేను అన్నివిధాలా మిమ్మల్ని చక్కగా చూసుకుంటాను. నా నీడలో మీ జీవితం సాఫీగా గడిచిపోతుంది.
    
                                                                                                                       లీల.
    
    ఉత్తరం చదవడం పూర్తిచేసి "బాగుంది" అంది ధృతి.
    
    "కృష్ణమూర్తి పాపం మంచివాడే కానీ ధైర్యం లేని మంచితనం అంగవికలత్వంతో సమానం" అంది లీల.
    
    "ఇతను నిన్ను ప్రేమిస్తున్నానూ అని వ్రాయకుండా వుంటే బాగుండేది. ప్రేమ అంటే అసంకల్పితంగ జరిగే చర్య వీళ్ళని ప్రేమించాలీ, అందువల్ల ఈ లాభాలున్నాయని బేరీజు వేసుకుని ప్రేమలో పడటం జరిగే పనికాదు. అప్పుడసలు దాన్ని ప్రేమ అనరు. ముందు వెనకా ఆలోచించుకుని మంచీ, చెడూ తర్కించుకునీ వివాహం చేసుకోవడం మంచి పద్దతే! కానీ ప్రేమ విషయంలో అది అసాధ్యం అనాలోచితంగా, అసంకల్పితంగా జరిగిపోయేది ప్రేమలో పడటం."
    
    "మంచి అనుభ్వమతో చెపుతున్నట్లుగా వుంది. ఇంత అవగాహన వుందీ అంటే తప్పకుండా ప్రేమలో పడేవుంటావు" అంది లీల.
    
    ధృతి సీరియస్ గా మొహం పెట్టి "ప్రేమ మీద గొప్ప అవగాహన వున్నవాళ్ళు ప్రేమలో పడలేరు. అదేంటో సరిగ్గా తెలియనివాళ్ళే అందులో పడిపోతుంటారు" అనేసి ఫక్కున నవ్వింది.
    
    లీల కూడా ధృతితో జత కలిపింది.
    
                                                                   * * *
    
    "నవీన్ కి ఉద్యోగం కావాలని నాకు చెప్తే ఏ కంపెనీలోనైనా మంచి ఉద్యోగం చూసేవాడిని కదా" అన్నాడు ప్రేమ్.
    
    బియ్యం ఏరుతున్న ధృతి చిన్నగా నవ్వి "ఏం! ఈ ఉద్యోగం మంచిది కాదా?" అంది.
    
    ప్రేమ్ మాట్లాడలేదు. ఆమె వైపు చూస్తూ వుండిపోయాడు.
    
    "ప్రతి కష్టంలోనూ అవకాశాన్ని చూస్తాడు ఆశావాది. ప్రతి అవకాశం లోనూ కష్టాన్నే చూస్తాడు నిరాశావాది. నవీన్ మంచి ఆశావాది" అంది.
    
    "అంకుల్ దగ్గర ఉద్యోగం చెయ్యడం అంటే మాటలు కాదు. ఆయన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకోవడం చాలా కష్టం. నాకు ఆయన గురించి బాగా తెలుసు కాబట్టి నెట్టుకొస్తున్నాను. చాలా మొండి మనిషి ఆయన" అన్నాడు రవ్వంత గర్వంగా.
    
    "తెలుసుకోవడానికీ, అర్ధం చేసుకోవడానికీ చాలా వ్యత్యాసముంది ప్రేమ్. ఒక వ్యక్తి గురించి చాలా సంగతులు తెలిసినంత మాత్రాన అతనిని 'అర్ధం' చేసుకున్నట్లు కాదు" అంది తలెత్తకుండానే.
    
    "ఏమిటీ ఆ వ్యత్యాసం? లక్షలు సంపాదిస్తారు. రేపటి కోసం దాచనక్కరలేదు. తినటానికి ఎవరూ లేరు. అటువంటప్పుడు ఈ పైసా పైసాకి లెక్కలు చూసుకోవడం పీనాసితనం, అందులో కాస్త తేడావస్తే అందర్నీ తూర్పార బట్టడం ఎందుకూ? అర్దరాత్రిదాకా నిద్రపోకుండా లెక్కలు చూసుకోవడం, రూపాయి నష్టం వచ్చినా ఎదుటి మనిషిని క్షమించలేక పోవడం, ఇదంతా తెలిసినవారు ఆ వ్యక్తిని గురించి ఏమనుకోవాలీ? పిసినారి అనా? అజ్ఞాని అనా?"
    
    "వారసత్వంగా సంక్రమించిన డబ్బుకంటే స్వయంకృషితో సంపాదించైనా దానిమీద తీపి ఎక్కువ వుంటుంది. ధనాన్ని సంపాదించినవాడు అంత తేలిగ్గా ఖర్చుపెట్టలేడు" చిరునవ్వుతో చెపుతున్నా ఆమె మాటల్లో వాడి అతనికి గుచ్చుకుంది.
    
    "ఆయన గురించి చాలా త్వరగా చాలా అర్ధం చేసుకున్నావే" అన్నాడు రవ్వంత శ్లేషగా.

    "ఔను! మానవుని సాంఘిక జీవన విధానాలే అతని ఆలోచనా విధానాన్ని నిర్ణయిస్తాయి. ఆయన చాలా కష్టపడి పైకి వచ్చారు కాబట్టి అందరూ తనలాగే కష్టపడి పైకి రావాలని కోరుకుంటారు. అయాచితంగా ఎవరికైనా ధనసహాయం చేస్తే వారికి జన్మలో దానం విలువ తెలిసిరాదు. దానం అవసరమయినప్పుడల్లా సహాయం కోసం ఎదురుచూస్తారు. ప్రతి మనిషీ తన అవసరాల గురించి ఆలోచించినంతగా తన సామర్ధ్యం గురించి కూడా ఆలోచించాలన్నదే ఆయన అభిప్రాయం కావచ్చు. నియమాలు వున్నప్పుడే శ్రేయస్కరంగా ఆలోచించగలుగుతారు."   


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS