Previous Page Next Page 
మళ్ళీ వచ్చిన వసంతం పేజి 41

 

       "వెళ్ళు - రామానికి చెప్పు - షేర్ మార్కెట్ లోకెళ్ళి కోటీశ్వరురాలు కాబోతోంది ఈ శారద అని చెప్పు అందరు ఆడవాళ్ళలాంటిది కాదు ఈ శారద అభిమాని కొత్త బతుకులో ప్రవేశిస్తున్న ధైర్యశాలి అని చెప్పు వెళ్ళు చెప్పు. శారద ఆవేశంతో అరుస్తోంది. లలిత నోటమాట రాలేదు. అలాకూచుంది.
   
    ఓ లలితా ఆ జేబులో వున్న ఫోటో జేబులోనేకాకుండా, ఆ రామం చేత మెళ్ళో తాళికట్టించుకో - "శారద గొంతుగాద్గదికమైంది. లలితకి శారదనిచూస్తే జాలేసింది. ఇదేనేమో హిస్టరియా అంటే. లేకపోతే ఈ అరుపులేమిటీ -
   
    'శారదా - ఎందుకావేశపడతావ్ - రామంతో కలసి జీవించ లేననుకున్నావ్ - విడిపోయావ్ రామం ఎవర్ని పెళ్ళి చేసుకుంటే నీకెందుకూ - మనసు స్థిమితపరచుకో. లలిత మాటలువింటూ శారద బల్లమీద తలాన్చింది.
   
    'శారదా - ఈ రాత్రికి ఇక్కడే వుండనా నీకు తోడుగా - ఒక్కర్తివీ - అసలే చిరాగ్గా వున్నావుకదా - నీకు అన్నంవండిపెడతానుండు - పోనీ నీరజని కాని దినేష్ ని కానీ రమ్మనిఫోను చేయి - ఆ నెంబరియ్యి నేను చేస్తాను - నిజంగా లలితకి శారదని చూస్తే బాధనిపించింది....శారద మనసు ఎందుకంత బాధ పడుతుందో అర్ధంకాలేదు - అంత ధైర్యంగా, అహంకారంగావున్న శారద, తను రామాన్ని చేసుకుంటుందేమోనని కోపమెందుకూ.
   
    శారదలోపలకెళ్ళి ముఖం కడుక్కువచ్చింది. ఓ నిముషం సిగ్గేసింది లలిత ముందు అలా అరిచినందుకు.
   
    'లలితా ఏమీ అనుకోకు - నాన్నగారి దగ్గర నుంచీ ఈరోజు ఉత్తరం వచ్చింది. పిన్ని అమెరికా వెళ్ళిపోతోందిట. ఈవయసులో నన్ను చూసేందుకు ఎవరూ లేరు - వృద్దాశ్రమంలో చేరాలనుకుంటున్నానని రాశారు. నా మనసు చాలా ఆవేదనపుడుతోంది. ఏం చేయనూ - ఏమనుకోకు - నువ్వు వెళ్ళు - పొద్దుపోతోంది - శారద నవ్వుతూ మాట్లాడింది. లలితని గేటు దాకా వచ్చిసాగనంపింది.
   
    లలితకి శారద మాటలు చాలా అర్ధంకాలేదు. రామం జేబులో తన ఫోటోవుండటమేమిటీ - రామనాథం వకీలు తన పెళ్ళి విషయం రామంతో మాట్లాడటమేమిటీ - తనకివేమీ తెలియకపోవటమేమిటీ - రోడ్డుననడుస్తున్న లలితకి ఇరవైరోజుల నాటి విషయం గుర్తొచ్చింది.
   
    ఆ రోజు తను, నాన్న శంకరు అన్నయ్య ఇంటికెళ్ళటం, మీ ఇంట్లో అద్దెకుంటున్న రామాన్ని చూడకూడదా అని అన్నయ్య అనటం, తన ఫోటో జాతకం అన్నయ్యకి యిచ్చి, ఎవరికైనాముందు ఫోటోనచ్చితే, జాతకం కుదిరితే పిల్లని చూపిద్దామని నాన్న అనటం ఒకటొకటీ గుర్తొచ్చాయి - ఓహో, ఇదంతా శంకరం అన్నయ్య తన మేలుకోరి చేస్తున్నాడన్నమాట. ఫోటోనచ్చిందని రామం చెప్పాక అందరినీ ఆశ్చర్యపరిచేట్టుగా విషయం చెప్పాలనుకున్నాడన్నమాట - అందుకేనేమో రామం తల్లి వచ్చింది. తనని నఖశిఖపర్యంతం చూసింది. "మా అబ్బాయి మీ అందరికీ చెప్పలేదా" అన్న సంగతి ఇదే అయివుంటుంది - ఆఖరి నిముషం వరకు రహస్యంగా వుంచాలనుకున్నాడా అందుకే తల్లి వచ్చింది. నన్ను చూసింది వెళ్ళిపోయిందీ - అందుకే 'నీకు పెళ్ళయిందా అంది' చమత్కారంగా రామం తల్లి - అంటే ఆవిడ ఉద్దేశం రామం ఆవిడకి చెప్పకుండా తనని పెళ్ళిచేసేసుకున్నాడా అనే విషయం తెలుసుకుందుకేమో - ఏమో - లలిత మనసు ఆనందంతో నిండిపోయింది. అందుకే రామం తన ముఖం చూసి చూడనట్టు తప్పించుకు తిరిగుతున్నాడు. ఎన్నిరోజులు తిరుగుతాడూ - శంకరు అన్నయ్య పెళ్ళిముహూర్తాలు పెట్టే వరకూను.
   
    లలిత ఇంటికెళ్ళగానే తండ్రితో అంది శంకరు అన్నయ్యని ఒకసారి కలుస్తే బాగుంటుంది కదూ అని.
   
    'ఊళ్ళోలేడు - పదిహేనురోజులవరకు రాడట' -
   
    లలిత మాట్లాడలేదు. రామాన్నే అడిగితే "నీ జేబులోదాచుకున్న ఫోటో ఎవరిదీ, అని - ఛీ, బాగుండదు - అన్నీ అవే తెలుస్తాయినెమ్మదిగా - లలిత ఆ రాత్రి  గాఢ నిద్రపోయింది.
   
    ఆఫీసునించి సినిమాకెళ్ళి చాలాపొద్దుపోయివచ్చాడు రామం. తెల్లారాక' నీకో ఉత్తరం వచ్చిందోయ్ అని వెంకట్రామయ్య ఉత్తరం చేతికిచ్చాడు.
   
    మేష్టారి దగ్గర నుంచి గాయత్రి తనతో మాట్లాడాలనుకుంటోందిట - ఒక్కసారి వచ్చివెడితే బాగుంటుందని - ముహూర్తం పదిహేనురోజుల్లో వుందికనక మాట్లాడుకోవలసిన మాటలు మాట్లాడుకోవటం మంచిదని రాశారు. గాయత్రి తనతో ఏం మాట్లాడుతుందీ !! రామం గుండెలు దడదడాకొట్టుతున్నాయి - తను డైవోర్సీ - ఆమె విడో - మాటలేమున్నాయి - ఇద్దరం కలవటం విధి తప్ప !! - రామం ఆ రాత్రే ఊరెళ్ళిపోయాడు.
   
    రామం ఇంట్లో అడుగుపెట్టగానే యశోదమ్మకి అర్ధమయిపోయింది కృష్ణమూర్తి మేష్టారింటి కెళ్ళడానికే వచ్చాడని రామం స్నానం చేసి డ్రస్ చేసుకున్నాడు. బూట్లు నిగనిగలాడేట్టు పాలిష్ చేసుకున్నాడు. మళ్ళీ మళ్ళీ అద్దంలో చూసుకున్నాడు. హడావిడిగా వెళ్ళి పోయాడు.
   
    రామం కోసం గాయత్రి ఎదురుచూస్తోంది. రామాన్ని మేడ మీద గదికి తీసుకెళ్ళింది. ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో రామానికి తెలియటం లేదు.
   
    'నాన్నగారు అన్నీ చెప్పారు కదూ' అంది గాయత్రి.
   
    'ఆ' - రామం అన్నాడు.
   
    'పిల్లవాని గురించి కూడా'
   
    "ఆ"
   
    గాయత్రి నవ్వింది. తెల్లని పలువరుసమల్లెలు విచ్చుకున్నట్టే అనిపించి ఆనవ్వు.
   
    "గాయత్రీ - నువ్వెక్కడుంటే ఈ పసివాడు అక్కడేవుంటాడు - నీకా బెంగవద్దు, అంతేకాదు - నామొదటి భార్య, అదే విడాకులు తీసుకున్న శారద ఉద్యోగస్థురాలు కనక నేను ఆమెకేమీ డబ్బు పంపక్కర్లేదు. పిల్లలు లేరు కనక ఏ సమస్యలూ రావు. ఇంక "ఏమైనా వున్నాయా చెప్పు' అన్నాడు రామం.
   
    "నువ్వేమీ అనుకోకపోతే మన పెళ్ళి చాలా సింపుల్ గా గుడిలో చేసుకుందాం"
   
    'ఓ.కే' - ఇంకా' -
   
    'మరి - పెళ్ళి అయ్యాక నేను ఈ ఊర్లో ఒక్కరోజుకూడా వుండను. ఈ ఊరు నాకు చేదుజ్ఞాపకాలు మిగిల్చింది. అందుకే పెళ్ళయిన తెల్లారి నీతో అక్కడికి వచ్చేస్తాను - నేనీమాట ఎందుకంటున్నానో అర్ధం చేసుకుంటావు కదూ. 'గాయత్రి రామం చొక్కామీద కదులుతున్నా చీమను చేత్తోతీస్తూ అంది ఆ చేయి గట్టిగా పట్టుకున్నాడు రామం. 'ఇది నేనున్నంతవరకూ వదలను' గాయత్రి అప్రయత్నంగా రామంకౌగిలిలో ఒదిగిపోయింది.
   
    మనిద్దరం ఇలా కలవాలని దేవుని నిర్ణయం. కాకపోతే నీకు ఆ పెళ్ళేమిటి - నాకు ఆ పెళ్ళేమిటి -


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS