Previous Page Next Page 
సంధ్యాకళ్యాణం పేజి 40

    "జానకక్క నిన్నుపంపించి చాలా పుణ్యం కట్టుకొంది. నువ్వొచ్చాక పిల్లల విషయంలో చాలా నిశ్చింత ఏర్పడింది నాకు. నేను సిలోన్ వెడుతున్నాను. తిరిగి రావడానికి రెండువారాలు పడుతుంది. ఈలోగా పిల్లలకేం కావాలన్నా కొనిపెట్టడానికి యీ డబ్బు నీ దగ్గరుంచుకో" డబ్బున్న పర్సు తన ముందున్న టేబుల్ మీదుంచాడు.

    సంధ్య మెదలకుండా చూస్తూంది అతడిని.

    "ఇది నీ స్వంత ఇల్లులా ఉండొచ్చు. పిల్లల్ని తీసుకొని సినిమాకు వెళ్ళొచ్చు. కారు ఇక్కడే ఉంటుంది. పిల్లల్ని తీసుకొని నీఇష్టమున్న చోటికి వెళ్ళవచ్చు. పిల్లల్ని సాధ్యమైనంత సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించు. ఇంతా చెబుతున్నాడు, జీతం గురించి మాట్లాడడేం అనుకొంటున్నదా? జీతం అయిదువందల రూపాయలు. అది నీకు సంతృప్తి అనిపించకపోతే ఇంకా ఇస్తాను. పిల్లలకి తల్లిలేదన్న లోటు కనిపించకూడదు. ఆ బెంగ వాళ్ళ దరిదాపులకు కూడా రాకూడదు. అదే నీనుండి నేను కోరేది."

    అతడి మాట సంస్కారయుతంగా, మనిషి సంస్కారవంతుడిగా కనిపిస్తూంటే, సంధ్యకి సగం భయం తీరినట్టుగా అయింది. "జీతం అయిదు వందల రూపాయలు. ఇంకా ఎక్కువ కావాలన్నా ఇస్తాను" అంటే ఏదో రెండు రోజులుండి పిల్లలకి తల్లిలేనిలోటు చూడటం కాదన్నమాట. తను చేస్తున్నది సహాయంకాదు, ఉద్యోగమన్నమాట. జానకమ్మత్త తెలివిగా తననిక్కడ ఆయాగా కుదిరించినట్టు చెప్పక, ఆపదలో ఉన్నారు, కాస్త సాయం అంటూ ప్రవేశపెట్టింది.

    "నేను ఉద్యోగమని రాలేదు. తల్లిపోయి దైన్యస్థితిలో ఉన్న పిల్లల్ని రెండు రోజులు కనిపెట్టి చూడడానికి వచ్చాను. జానకమ్మత్తకూడా అలాగే చెప్పింది" అని చెప్పాలనుకొందిగాని, గొంతు పట్టేసినట్టుగా మాట పెగల లేదు. పర్సు అందుకొని నిశ్శబ్దంగా లోపలికి వచ్చేసింది.

                          *        *        *

    అరుణ్ ఊరినుండి వచ్చాడు.

    వచ్చాక బట్టలు మార్చుకొని, ముఖం కడుక్కొని టీ తీసుకొన్న తరువాత సంధ్యఉన్న గదిలోకి వచ్చాడు. సంధ్యలేదు. సంధ్య సామాను లేదు. అసలు సంధ్య ఉన్న గుర్తులేవీ లేవు.

    "సంధ్య ఏదమ్మా?"

    "సంధ్య సంగతి తరువాత చెబుతాగాని, ఒకరోజు శ్రీపతి మామయ్య వచ్చాడురా! నువ్వు సంధ్యని వెంటేసుకు త్రిప్పడం బాగాలేదన్నాడు. సాధ్యమైనంత త్వరగా సంధ్యని ఇక్కడినుండి పంపించివేస్తే మంచిదన్నాడు!"

    "ఆయనెవరు ఆ మాట చెప్పడానికి?" అరుణ్ దూకుడుగా అడిగాడు.

    "ఎవరంటే నీకు పిల్లనివ్వబోతున్నా మామగారు!"

    "సంధ్యవల్ల ఆయనకేం ఇబ్బంది ఏర్పడిందట?"

    "పెళ్ళికాని పిల్లని ఇంట్లోతెచ్చి పెట్టుకొంటే పిల్లనివ్వబోతున్న వాడు ఎలా ఊరుకొంటాడురా?" జానకమ్మ కోపంగా అడిగింది.

    "అందుకని సంధ్యని వాళ్ళ ఊరికి పంపించి వేశావా?"

    "ఊరికి పంపించెయ్యలేదు కాబట్టి సంతోషించు. చక్రపాణి మామయ్య భార్య పోయింది తెలుసా? మామయ్య పిల్లల్ని చూడడానికి పంపించాను. ఆపదలో ఉన్నవాళ్ళకి ఒక ఆసరా చూపినట్టూ, యీ పిల్లకి ఒక ఆధారం చూపినట్టూ అవుతుందని."

    "సంధ్యని ఆయాగా కుదిరించావన్నమాట?" అరుణ్ కళ్ళు ఎర్రబడ్డాయి.

    "మనం ఏ పేరు పెట్టుకొంటే ఆ పేరు!"

    "నీ స్నేహితురాలి కూతురికి పట్టెడన్నం పెట్టలేని స్థితిలో ఉన్నావన్నమాట!"

    "పట్టెడన్నం కోసం కాదు, నీ భవిష్యత్తుకోసం. నా కొడుకు క్షేమం తరువాతే నా కెవరైనా!"

    "స్వర్గంలో ఉన్న నీ స్నేహితురాలి ఆత్మ చాలా సంతోషపడుతుంది, నువ్వు చేస్తున్న పనికి."

    "అరుణ్! నేను చాలా ఖచ్చితంగా చెబుతున్నాను చూడు! సంధ్యకి దగ్గరకావాలని చూశావా, ప్రతిమతో నీ పెళ్ళి జరగకపోయిందా నా శవమే చూస్తావు."

    "ఏమిటమ్మా ఇంత అన్యాయం? సంధ్యని నీ కోడల్ని చేసుకుంటానని, సంధ్య పుట్టకముందే రుక్మిణత్తకి మాటిచ్చావా లేదా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS