"అయితే మరో ప్రశ్న."
"బాబీ....నన్ను కాసేపు ఒంటరిగా వుండనివ్వవా? సీరియల్ రాసుకోవాలి" అన్నాడు.
"ఇదొక్కటే డాడీ!" గారాలుపోతూ అడిగాడు.
"సరే చెప్పు."
"ఒక ఇంగ్లీషు పదాన్ని తెలుగులోరాస్తే ఒక 'అక్షరం' అవుతుంది. అదే ఇంగ్లీషులో రాస్తే అయిదు అక్షరాలు 'లైను' కట్టినట్లుంటాయి. దాన్ని కొద్దిగా మార్పు చేస్తే హిందీలో మరో ప్రశ్న తయారవుతుంది. ఆ ప్రశ్న ఏమిటన్నదే నువ్వు జవాబు చెప్పాలి?" అన్నాడు బాబీ.
"ఏమిటీ?" ఏదీ సరిగ్గా అర్ధం కాలేదు భార్గవకు.
"అబ్బ__కరెక్ట్ జవాబు చెప్పావు డాడీ!" అన్నాడు బాబీ
"అదేవిట్రా__నేను జవాబెప్పుడు చెప్పాను" భార్గవ ఆశ్చర్యంగా అన్నాడు.
"ఏమిటి అన్నదే జవాబవుతుంది. ఎలాగో చెప్పనా? లైను అనే పదానికి మరో పేరు 'క్యూ' ఇది తెలుగులో రాస్తే అలా ఒకక్షరం ఇంగ్లీష్ లో రాస్తే అక్షరాలు లైను కట్టినట్లుంటాయి అన్నానా. అది రాయాలంటే QUEVE అని రాయాలి. 'క్యూ' అన్నదానిని కొద్ది మార్పులు చేస్తే హిందీ ప్రసన తయారవుతుంది అన్నానా__'క్యూ' వున్న కొమ్ముతీసి దీర్ఘం రాస్తే 'క్యా' అవుతుంది. తెలుగులో 'ఏమిటీ' అన్న ప్రశ్నే కదా__నీకు తెలీకుండానే నువ్వు జవాబు చెప్పావన్న మాట." బాబీ నవ్వేస్తూ మళ్ళీ అన్నాడు.
"అది కాదు డాడీ! మా స్కూల్లో రోజూ ఒక జోక్ జరుగుతుంది. దాన్నొక ఫజిల్ గా నీకు చెప్తాను. నువ్ విప్పాలి."
భార్గవ ఆలోచనలన్నీ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రయోగంవేపు మరలుతున్నాయి. బాబీ తర్వాత తన స్పెర్మ్ ద్వారా మరో బాబు పుట్టబోతున్నాడా? అతడు చివ్వున తల త్రిప్పి భార్య ఫోటోవేపు చూశాడు. నవ్వుతున్న కళ్ళతో వెక్కిరిస్తున్నట్టనిపించింది. గిల్టీగా క్షణంపాటు బాధపడ్డా - శరత్ అభ్యర్ధన గుర్తొచ్చి తల త్రిప్పుకున్నాడు.
"చెప్పండి డాడీ!" బాబీ గాడి గొడవకు అన్యమనస్కంగానే 'ఊ' కొట్టాడు.
"మా క్లాస్ రూమ్ లో ఇరవైమంది పిల్లలున్నారు టీచర్ అటెండెన్స్ తీసుకునేటప్పుడు పదహారో నంబర్ పిల్చేటప్పటికీ....ఇరవయ్యో నంబర్ అబ్బాయి 'ఎస్సార్' అనడానికి రోజూ ఉబలాటపాడుతుంటాడు కాని అనలేక ఇరవయ్యో నంబర్ కే' ఎస్సార్' అంటాడు. ఎందుకలా పదహారో నంబర్ కే పలకటానికి ఉత్సాహం చూపుతాడో చెప్పలేకపోతే తల వెయ్యిముక్కలగున్..."
ఆ ప్రశ్నకు సమాధానం దొరక్క భార్గవ బిక్కమొహమేసినట్టు ఫోజు పెట్టాడు. "పదహారో నంబర్ వాడి లక్కీ నంబర్ అయుంటుంది అందుకే అనడానికి ప్రయత్నించి...టీచర్ కు భయపడి అనలేకపోతాడు" చెప్పాడు చివరికి.
"తప్పు డాడీ...ఓడిపోయానని ఒప్పేసుకో...."
"ఊహు....తన నంబర్ రానిదే. మరొకడి రూల్ నెంబర్ పలకడానికి ఎప్పుడూ ఉబలాటపడడు. నువ్వేదో తప్పుగా అడిగినట్టున్నావ్"
"కాదు...ఓడిపోయానని ఒప్పుకో" రోషంగా అన్నాడు బాబీ.
"సరే"
"ఇరవయ్యవ రూల్ నంబర్ విద్యార్ధి పదహారో నంబర్ కే ఎస్సారంటున్నాడంటే....లక్కీ నంబరు కాదు. వాడికి నత్తి వుందని అర్ధం. ఇరవయ్యో నంబరు వచ్చేసరికి నత్తివాడు ఒక్కసారిగా ఎస్సార్ అనలేడు. కాబట్టి పదహారో నంబరు నించి ఎ.... ఎ.... ఎ.... ఎ... అంటూండే సరికి ఇరవయ్యో నంబరు వస్తుంది. ఎస్సార్ అంటాడు చెప్పాడు బాబీ
వాడి ఫజిల్ కి నవ్వాగలేదు భార్గవకు. పెద్దగా నవ్వాడు. చాలా చాలా రోజుల తర్వాత....నవ్వుతుంటే, మరో నవ్వు గుర్తొచ్చింది.
ఆ నవ్వు మౌనికది....
క్షణాల్లో నాలుక పిడచకట్టుకుపోయింది. బాబీని ప్రక్కలో పొదివి పత్తుకునిఒ నిద్రలోకి జారాడు.
* * * * *
"నైటింగేల్ నర్సింగ్ హోం"
అతి పెద్దదయిన ఆ ఆస్పత్రి ముందు వాళ్ళ కారాగింది. అందులోంచి దిగారు శరత్, భార్గవ. డాక్టర్ లక్ష్మి సాదరంగా వాళ్ళని ఆహ్వానించింది. శరత్, భార్గవను పరిచయం చేశాడు సెమన్ డోనర్ గా.
"డాక్టర్ల మీద 'సున్నం కొట్టిన సమాధులు' నవల రాసింది మీరే కదా" అంది నవ్వుతూ డాక్టర్ లక్ష్మి. తెల్లటి చీరలో హుందాగా కన్పించే లక్ష్మిని చూడగానే ఏ పేషంటుకయినా దేవతలా కన్పిస్తుంది.
అప్పుడామె గాజుగ్లాసు కిందనున్న ఒక మొక్కను పరిశీలిస్తూ అంది. "ఇదో టెస్ట్ ట్యూబ్ మొక్క. పొటాలోని, టామాటోని క్రాస్ చేసి దీన్ని సృష్టించారు. దీని వల్ల మంచి లాభముంది.
"ఎలా డాక్టర్" శరత్ అడిగాడు.
"ఎలాగంటే....భూమిలోపల పొటాటోలు కాస్తుంది. భూమి పైన టమాటోలు కాస్తుంది" ఆ మొక్కని వాళ్ళిద్దరూ వింతగా చూసారు.
"టెస్ట్ ట్యూబ్ ప్రయోగాలు మొక్కలనుంచి జంతువులకు వచ్చాయి. ఆ తర్వాత మనుషుల్లో కూడా సఫలమయ్యాయి." వివరిస్తూ నడుస్తుంటే డాక్టర్ లక్ష్మిని అనుసరించారు వాళ్ళు.
ఆమె తన సృష్టి కార్యానికి పేర్చుకున్న యజ్ఞవాటికలాంటి ఫెర్టిలిటీ క్లినిక్ లోకి తీసుకెళ్ళింది.
ఆ లాబ్ నిండా రసాయనాలు....పరీక్షనాళికలు విరివిగా వున్నాయి. ఆ ఫెర్టిలిటీ క్లినిక్ లోని కంప్యూటర్ లు....పరికరాలు చూశాక మనం సైన్స్ యుగంలోనే వున్నాం అనిపించింది ఇద్దరికీ.
ఆ క్లినిక్ లో ఓ మూలనున్న అందమైన పాప ఫోటో చూసి "డాక్టర్....ఈ పాప మీ పాపా?" అనేసి లక్ష్మికి ఇంకా పెళ్ళి కాలేదని గుర్తొచ్చి నాలుక్కరుచుకున్నాడు భార్గవ.
ఆ పాపెవరో.... ఆ ఫోటో అక్కడెందుకుందో శరత్ క్కూడా అర్ధం కాలేదు.
లక్ష్మి నవ్వింది భార్గవ ప్రశ్నకు.
"సారీ డాక్టర్" ...అన్నాడు భార్గవ తడబడి.
