Previous Page Next Page 
అందరూ దొంగలే పేజి 40

    నాలుగో రోజు దీప స్కూలుకి శెలవు. ఏ రాజకీయ నాయకుడి జయంతో, వర్ధంతో వచ్చింది ఆ రోజు.

    అంటే ఆ రోజు రాంబాబుకి, చిన్నారావ్ లకి పోలీస్ స్టేషన్ లో డ్యూటీ అన్నమాట.

    ఆ రోజునుండీ తన చరిత్ర మారిపోతున్నదని ఉదయానే లేచి అద్దంలో మొహం చూస్కుంటున్న ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కి తెలీదు.     


                                *    *    *    *


    పోలీస్ స్టేషన్ ముందు జీపు ఆగింది. అందులోంచి ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ఠీవిగా క్రిందికి దిగాడు.

    బూట్లు టక టక లాడించుకుంటూ లోపలికి వెళ్ళాడు. అక్కడి దృశ్యం చూసి అప్పారావ్ ఖంగుతిన్నాడు. తను చూసింది నిజమేనా అని కళ్ళు నలిముకుని చూశాడు.

    కానీ తను చూసింది నిజమే....

    రాంబాబు తన సీట్లో కూర్చుని వున్నాడు.

    ఎదురుగా చిన్నారావ్ కూర్చున్నాడు. మిగతా ముగ్గురు కానిస్టేబుల్స్ చోద్యం చూస్తూ నిల్చున్నారు.

    ఆఫ్టరాల్ ఒక హెడ్ కానిస్టేబుల్ తన సీట్లో కూర్చోడమా?

    "ఏంటది?" గర్జిస్తూ అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

    "కిడ్నీ...." అన్నాడు ఎటో చూస్తూ.

    "కుక్క...." అన్నాడు చిన్నారావ్ మరోవైపు చూస్తూ.

    "ఆపరేషన్" అన్నాడు రాంబాబు.

    అంతే....ఇన్స్ పెక్టర్ అప్పారావ్ కి చెమట్లు పట్టాయ్. తనకు కుక్క కిడ్నీ వుందని పోలీస్ డిపార్ట్  మెంట్ లో వీళ్ళిద్దరికీ తప్ప ఇంకెవరికీ తెలీదు. ఇప్పుడు వీళ్ళనేం అన్నా రహస్యం గురించి అందరికీ చెప్తారు. అంతేకాదు! వీళ్ళిద్దరూ పోలీస్ కమీషనర్ కాండిడేట్స్....తను వీళ్ళనేం చెయ్యలేదు.

    "హి....హిహి....హిహిహి...." ఏం చెయ్యలేక నవ్వాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

    "అవునూ ఇందాక దేని గురించి ఏంటిది అంటూ అడిగావ్?" రాంబాబు అడిగాడు.

    "అంటే మరీ....ఇది పోలీస్ స్టేషనేనా కాదా అని అనుమానం వచ్చి అడిగాను. కానీ మీ అందర్నీ చూడగానే నా డౌట్ తీరిపోయింది. అవును- ఇది పోలీస్ స్టేషనే!" అన్నాడు అప్పారావ్.

    "మరి నేనెవరు?" అడిగాడు రాంబాబు.

    "హెడ్ కానిస్టేబుల్!" చెప్పాడు అప్పారావ్.

    "కాదు....ఇన్స్ పెక్టర్! ఇన్స్ పెక్టర్  రాంబాబు!! ఎవరూ?"

    "ఇన్స్ పెక్టర్ రాంబాబు" గుటకలు మింగుతూ అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

    "మరి నువ్వు?" అడిగాడు రాంబాబు.

    "ఇన్స్ పెక్టర్!" చెప్పాడు అప్పారావ్.

    "కాదు....కానిస్టేబుల్ అప్పారావ్!!" ఏడుపు మొహంపెట్టి అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

    "సరేగానీ....నాకు చాలా ఆకలిగా వుంది. ఇరానీ హోటల్ కెళ్ళి బిర్యానీ తీసుకురా....తెస్తావ్ గా?" అడిగాడు రాంబాబు.

    "అలాగే తెస్తాను" అన్నాడు అప్పారావ్.

    "తెస్తాను గాదు....తెస్తాను సార్ అనాలి."

    "అలాగే సార్!"

    రాంబాబు జేబులోంచి పది రూపాయలు తీసి అప్పారావ్ కి ఇచ్చాడు.

    "రెండు మటన్ బిర్యానీ, రెండు చికెన్ సిక్స్ టీ ఫైవ్, ఆరు బటర్ నాన్, రెండు చిల్లీ చికెన్ తీసుకురా."

    ఇన్స్ పెక్టర్ అప్పారావ్ అయోమయంగా చూశాడు.

    "ఏం....ఏం తేవాలో అర్ధం కాలేదా?" అడిగాడు రాంబాబు.

    "అర్ధం అయ్యిందిగానీ పది రూపాయలకి ఇన్ని ఎలా వస్తాయ్?" అడిగాడు అప్పారావ్.

    "నువ్వు వేరే వాళ్ళకి పది రూపాయలిచ్చి ఇంతకంటే ఎక్కువ తెప్పిస్తావేమో కదా? కాబట్టి నా ఉద్దేశ్యంలో పది రూపాయల్లో ఇంకా చిల్లర మిగుల్తుంది....ఆ చిల్లర నువ్వు వుంచేస్కో."

    అక్కడున్న కానిస్టేబుల్స్ అందరికీ చచ్చేంత నవ్వొచ్చింది. జరుగుతున్నదంతా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

    ఎందుకంటే ఇన్స్ పెక్టర్ అప్పారావ్ తనక్రింద పనిచేసే అందర్తో అలానే ప్రవర్తిస్తాడు.

    కానీ అప్పారావ్ రాంబాబుకి ఎందుకు భయపడ్తున్నాడో వాళ్ళకి అర్ధంకావడంలేదు.

    "ఇంకా నిల్చున్నావేం....వెళ్ళి తీస్కురా...." అన్నాడు రాంబాబు.

    అప్పారావ్ ఇరానీ హోటల్ నుండి రాంబాబు చెప్పినవన్నీ తెచ్చాడు.

    అవన్నీ అక్కడున్న కానిస్టేబుల్స్ తో కలిసి పంచుకుని తిన్నారు రాంబాబు, చిన్నారావ్ లు.

    "ఇహ మనింటికి పోదాం పద" అన్నాడు రాంబాబు.

    "ఎందుకూ?" భయంగా అడిగాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

    "ఏం లేదు....అమ్మగారికి సేవలు చెయ్యాలి కదా?" అన్నాడు రాంబాబు వంకరగా నవ్వుతూ.

    ఇన్స్ పెక్టర్ అప్పారావ్ గుండెల్లో రాయి పడింది.


                               *    *    *    *
   

    రాంబాబు, చిన్నారావ్, ఇన్స్ పెక్టర్ అప్పారావ్ జేపులో అప్పారావ్ యింటికి బయలుదేరారు. అప్పారావ్ జీప్ డ్రైవ్ చేస్తుంటే రాంబాబు, చిన్నారావ్ లు ప్రక్కన కూర్చున్నారు.

    అప్పారావ్ కి క్షణం క్షణం టెన్షన్ ఎక్కువ కాసాగింది. ఇంట్లో రాంబాబు, చిన్నారావ్ లు ఏం అల్లరి చేస్తారోనని.

    జీపు డ్రైవ్ చేస్తున్న అప్పారావ్ వంక చూసి రాంబాబు, చిన్నారావ్ లు ఘోల్లుమని నవ్వారు.

    "ఏం....ఎందుకలా నవ్వారు? నా డ్రయివింగ్ బాలేదా?" అడిగాడు అప్పారావ్ విసుగుని అణుచుకుంటూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS