హాల్లోని జనం, స్టేజిమీది జనం అందరూ లేచి మౌనంగా నిలబడ్డారు.
ఓ పదిక్షణాలు గడిచాయో లేదో మైకులో హోరున పాట వినిపించింది.
"లకుముకి పిల్లా
చెకుముకి బిళ్ళా
రావే నీ యవ్వా
దరిచేరవే నా డవ్వా"
పొన్నారావు లబలబ మొత్తుకుంటూ స్టేజిపక్కకి వెళ్లి రికార్డు ఆపేసి మైకువాడిని బండబూతులు తిట్టాడు.
"హర్రె!గట్టంటె ఎట్లసాబ్... నాకేం తెల్సు... అందరూ నప్పుడు సెయ్యకుండుంటే ప్రోగ్రాం గిట్ట షురూ చెయ్యలేదని అన్కున్నా..." విసుక్కుంటూ పొన్నారావుతో అన్నాడు మైకువాడు.
మౌనంగా నిల్చున్న ఆ రెండు నిమిషాలూ స్టేజిమీది వక్తలూ, ముఖ్యఅతిథీ సభాధ్యక్షుడూ రకరకాల విన్యాసాలు చేశారు.
ఒక వక్త బుర్ర గోక్కుంటూ నిలబడ్డాడు. ఒక వక్త మనసులో పాటేదో పాడుకుంటూ ఆ పాటకి అనుగుణంగా ఓ కాలుని లూజ్ గా పెట్టి జవజవ ఊగించాడు.
ముఖ్య అతిథి మినిష్టర్ అబ్బన్న చిటికెన వేలుని ముక్కులో పెట్టుకుని గిరగిర తిప్పసాగాడు. మరో వ్యక్తి గోళ్లలోని మట్టిని గోళ్లతో తీస్కోసాగాడు.ఇంకో వక్త చేతివేళ్ళని "ఠక్...ఠక్"మని విరుచుకోసాగాడు.
రెండు నిమిషాలు వ్యవధి కాగానే హాల్లోని అందరూ ఒక్కసారిగా తేలిగ్గా నిట్టూర్చినందుకు నిదర్శనంగా బుస్ స్ స్ మని శబ్దం వచ్చింది.
అందరూ వారివారి సీట్లలో సాధ్యమైనంత గట్టిగా శబ్దం చేస్తూ కూర్చున్నారు.
"ఇప్పుడు సభాధ్యక్షులు లక్కా చెక్కారావుగారు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు..."మైకులో చెప్పి స్టేజి మీద ఉన్న కుర్చీల్లో చివరి కుర్చీలో కూర్చున్నాడు పొన్నారావు.
సభాధ్యక్షులు తన ముందున్న మైకుని అప్యాయంగా దగ్గరికి లాక్కుని ఓసారి మైకు మీద"బుర్ ర్ ర్ ..." అని ఊది రెండు మూడు సార్లు చిటికెలువేసి మైకు బాగానే పనిచేస్తుందని గ్రహించి ఒకసారిగా ఘెల్లుమని ఏడ్చి, రెండు నిమిషాల తర్వాత ఏడుపాపి, అయోమయంగారు నాకు ప్రాణమిత్రులు... వారిలా అర్థాంతరంగా మరణించాడు నాకెంతో బాధగా ఉంది..."
ఆర్గనైజర్ పొన్నారావు నెత్తికొట్టుకుంటూ పరుగెత్తుకుని వచ్చి లక్కా చెక్కారావు చెవిలో మెల్లగా గొణిగాడు.
"కవిగారి పేరు అమాయకశ్రీ కాదు... అయోమయంశ్రీ..."
లక్కా చెక్కారావు నాలుక కొరుక్కుని ప్రేక్షకుల్ని చూసి ఓ వెర్రినవ్వు నవ్వి "మరేమో ఆయనేమో నాకు క్లోజు ఫ్రండంటే... ఆయన పోవడం నాకెంతో బాధతో... అందరూ ఏడ్చిన తర్వాత ఆఖర్న నేనేడుస్తా... ముందుగా ప్రముఖ కవి మర్కటశ్రీ వంక చూసి కళ్లెగరేశాడు.
మర్కటశ్రీ సీట్లోంచి లేచి మైకు దగ్గరికి వెళ్లాడు.
ఓసారి దీనంగా మొహంపెట్టి ప్రేక్షకుల వంక నాలుగు క్షణాలు చూసి తర్వాత బుర్రకాయ్ ని అయోమయంశ్రీ ఫోటోవంక తిప్పి బాధపడాలని ప్రయత్నించాడు. కానీ అయోమయంశ్రీ ఫోటోని చూడగానే మర్కటశ్రీ కి నవ్వొచ్చేసి కిసుక్కున నవ్వాడు. వెంటనే కంగారుపడిపోయి నోటిని రెండు చేతుల్తో గట్టిగా నొక్కేసుకున్నాడు నవ్వు బయటికి రాకుండా. ఎంత ప్రయత్నించినా అతనికి లోపల్నుండి నవ్వు తన్నుకొచ్చేస్తుంది.కారణం అయోమయంశ్రీ. అంటే మర్కటశ్రీకి పడదు. కవిత్వం ఫీల్డులో మర్కటశ్రీకి ప్రత్యర్థి అయోమయంశ్రీ సినిమావాళ్లు పాటలు రాయించాలంటే అతని దగ్గరికి వెళ్తారు.ఇప్పుడు అయోమయంశ్రీ చచ్చాడు గనుక అందరూ సినిమాలకి పాటలు మర్కటశ్రీ చేతే రాయిస్తారు.అదీ అతని సంతోషం.
అట్లా నోటిని గట్టిగా నొక్కుకుని నవ్వుని ఆపుకున్న మర్కటశ్రీ చేతులూ నోటిమీది నుండి తీసేసి ప్రేక్షకుల వంక దీనంగా చూసి "నాకు గాఠిగా ఏడుపొచ్చేస్తుంటే నోటిమీద చెయ్యిపెట్టి ఏడుపు ఆపుకుంటున్నానన్నమాట!... మరి ఏడుపు నాకు రాక ఎవరికొస్తుంది?... తోటి కవి మరణిస్తే ఏ కవిహృదయం కకావికలు కాదు?... అయోమయంశ్రీ పోవడం నిజంగా సాహిత్య ప్రపంచానికే తీరని లోటు..."
ఆ విధంగామర్కటశ్రీ అయిదు నిమిషాలపాటు మాట్లాడి కిసుక్కున నవ్వి తన సీట్లో కూర్చున్నాడు.
తర్వాత మినిష్టర్ అబ్బన్నగారి ప్రసంగం..
"సోదర సోదరీమన్లారా... నా హృదయం బాధతో కొట్టుకుంటూ వుంది... నాకు మాటలు వస్తలేవు... ఆయన... ఆయన... ఆయన...?..."
"అయోమయంశ్రీ..."ఎవరో అందించారు.
"ఆ!...అయోమయంశ్రీ!!ఆయన చాలా మంచి కవి అని అందరూ సెప్తుంటే ఇని చాల సంతోషంచినా... నేను ఎక్కువ సద్వుకోలేదు.ఆయన పుస్తకాలు కూడా సద్వలేదు... ఇంతమంది ఏడుస్తా ఉండారు... ఈడ సబ కూడా పెట్నారు కాబట్టి ఆయన మంచి కవే అని బావిస్తా ఉండా... ఇందాక ఆయన సెప్పినట్టు అయోమయంశ్రీగారు పోయి సాహిత్య పెపంచికానికి శాలాలోటు సేసేసినారు.ఇప్పట్నుండీ కవులుపోతే ఆరు రాసిన కవితలన్నీ పుస్తకాలుగా ముద్రించడానికయ్యే కర్సులన్నీ కవుల భార్యలకి గవర్నమెంట్ సేత ఇప్పిస్తానని మనవి సేస్కుంటున్నా.... ఆవిధంగా చనిపోయినోళ్ల సాహిత్యం వెలుగులోనికొచ్చి ఆ చనిపోయినోళ్లని అమరులుగా ఉంచిద్దని నా భావం"
అందరూ ధనాధనా చప్పట్లు కొట్టారు.
మినిస్టర్ అబ్బన్న తన స్పీచిని మరో పది నిమిషాలపాటు కొనసాగించి ముగించే ముందు తమ పార్టీ ప్రజలకు ఏవిధంగా సేవ చేస్తుందీ చెప్పి కూర్చున్నాడు.
తర్వాత ఒక్కో స్పీకరూ ఈ విధంగానే మాట్లాడారు.
సభ సమాప్తం అయ్యింది.
* * *
