Previous Page Next Page 
చిత్రం భళారే విచిత్రం పేజి 40

    "హమ్మా"
    గోపి కటకటాలకేసి గట్టిగా కొట్టుకున్నాడు.
    అలా ఆవేశపడిపోకు బాబూ... ఆ రాయుడు నా శీలాన్ని ఇప్పుడుకాదు ఎప్పుడో దోచుకున్నాడు. అప్పుడు నేనింకా పెళ్ళికాని కన్నెపిల్లను! అభంశుభం తెలియని కన్నెపిల్లను బాబూ కన్నెపిల్లను!"
    ఒరేయ్ రాయుడూ... నీ అంతు చుస్తాన్రా... నిన్ను కత్తికొక కండగా నరికి పోగులు పెడ్తాన్రా" పిడికిలి బిగించి ఆవేశంతో ఊగిపోతూ అన్నాడు గోపి.
    "బాబూ... అంతపని చేయకు బాబూ..." కంగారుగా అంది సరస్వతి.
    "నీ శీలాన్ని దోచుకున్నవాడిని ఊరికే వదిలిపెట్టమంటావా అమ్మా? ఆ దుర్మార్గుడిమీద ఎందుకమ్మా అంతజాలి? వాడిని చంపితేగానీ నాకు మనశ్శాంతి ఉండదమ్మా"
    సరస్వతి ఘొల్లుమంది.
    "బాబూ... వద్దుబాబూ ..... నువ్వు రాయుడిని చంపకూడదు బాబూ"
    "ఎందుకు చంపకూడదు? చెప్పమ్మా చెప్పు?"
    "అది ఒక ఘోరమైన రహస్యం బాబూ"
    "ఆ!... మళ్ళీ ఇంకో రహస్యమా?"
    విలవిల్లాడిపోయాడు గోపి "చెప్పమ్మా ఏంటా రహస్యం?"
    "అదిమాత్రం నన్ను అడక్కుబాబూ..." ఘొల్లుమంది సరస్వతి.
    "నువ్వు చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే" గోపి కొంటెగా చూస్తూ అన్నాడు.
    "ఎంతపని చేశావ్ బాబూ" నెత్తి పట్టుకుంటూ అంది సరస్వతి.
    "చెప్పమ్మా. ఏంటా రహస్యం?"
    సరస్వతి కళ్ళు తుడుచుకుని, ఓసారి ఊపిరితిత్తులనిండా గాలి పీల్చుకుని తర్వాత ఇలా అంది.
    "ఆ రాయుడిని నువ్వుగనక చంపితే, కన్నతండ్రిని చంపిన దోషం నీకు చుట్టుకుంటుందేమోనని నాభయం బాబూ"
    "హమ్మా! ఏంటమ్మా నువ్వు అంటున్నది?" ఆశ్చర్యంగా అన్నాడు గోపి.
    "అవును బాబూ. అప్పుడు నాకు అద్దెనిమిదేళ్ళు. నాకు మీ నాన్నగారితో పెళ్లి నిశ్చయం అయింది. పెళ్లికి ఒకరోజు ముందు నేను అడవిలాంటి ప్రదేశంలో మారుమూలగా వున్న కనకదుర్గ గుడిలో అర్చన చేయించడానికి ఒంటరిగా వెళ్ళాను.అర్చన చేయించి తిరిగి ఇంటికి వెళ్తుంటే రాయుడు మార్గంమధ్యలో నన్ను అటకాయించి పొదలమాటుకు లాక్కెళ్ళి - ఉహు - ఉహు - ఉహు - ఉహు" నోటికి కొంగును అడ్డుపెట్టుకుని కుమిలిపోయింది సరస్వతి.
    "హయ్యో!" జుట్టు పీక్కున్నాడు గోపి.
    "అసలు నువ్వా అడవిమార్గంలో ఒంటరిగా గుడికి ఎందుకు వెళ్ళావమ్మా? నీ భక్తి మంటెట్టా."
    "అంతా నా ఖర్మబాబూ నాఖర్మ. అలా జరగాలని వుంది జరిగిపోయింది. ఆ మర్నాడే నాకు మీ నాన్నగారితో పెళ్ల జరిగిపోయింది. తొమ్మిదినెలలు నిండిన తర్వాత నువ్వు పుట్టావు బాబూ. కాబట్టి నువ్వు రాయుడి కొడుకువో, ఆయన కొడుకువో నాకే తెలీదుబాబూ. ఇదేబాబూ ఇంతకాలం నా గుండెల్లో దాచుకున్న భయంకరమైన రహస్యం" ఊపిరి తీస్కుంది సరస్వతి.
    అది వినగానే గోపి పకపకా నవ్వాడు. అతనలా నవ్వుతుంటే, కొంపదీసి మతిగానీ చెలించిందేమోనని సరస్వతి భయపడింది.
    "హయ్యో అమ్మా! అనవసరంగా ఎంత బాధ పడుతున్నావే. ఆ రాయుడు నాకు తండ్రి కానేకాదు. నేను ఆ రాయుడుకి పుట్టలేదు" అన్నాడు నవ్వాపుకుంటూ.
    "ఆ...నిజమాబాబూ? తల్లినైన నాకే తెలియని ఈ విషయం నీకెలా తెలిసింది?" ఆశ్చర్యంగా ప్రశ్నించింది సరస్వతి.
    "వెరీ సింపుల్ - నిజంగా నేను అతనికే పుట్టివుంటే, నేను మొదటిసారి అతన్ని కలిసినప్పుడు నా గుండెల్లో వీణలూ, సితార్లూ మోగాలికదా? కానీ అవేమీ మోగలేదు కాబట్టి వాడు నాకు తండ్రికాదు-"
    "ఆ... అవునుబాబూ. ఎంతటి చల్లటివార్త చెప్పావురా? నేనింకా ఆ దుర్మార్గుడు ఎక్కడ నీకు తండ్రవుతాడో అని భయపడి చచ్చా" కిలకిలా నవ్వుతూ అంది సరస్వతి.
    గోపీకూడా పకపకా నవ్వుదామని అనుకున్నాడు కానీ అంతలో తన కర్తవవ్యం గుర్తుకువచింది.
    "ఒరేయ్ రాయుడూ! నా తల్లిశీలాన్ని కొల్లగొట్టిన నిన్ను కుళ్ళబొడుస్తానురా, నీ అంతు చూస్తానురా" పిడికిళ్ళు బిగించి గట్టిగా అరిచాడు గోపి.
                                                                      33
    రాయుడు, సంతానం పొలం గట్లమ్మట మెల్లగా నడుస్తూ వున్నారు.
    "హబ్బ! నాకెంతో సంతోషంగా ఉంది సంతానం" అన్నాడు రాయుడు. ఆ మాట అంటున్నప్పుడు అతని మొహం వెలిగిపోయింది.
    "ఎందుకండీ - ఏంటి విశేషం? ఈవేళ మీకు నడ్డినొప్పి లేదా? అయితే చిత్రాంగి ఇంట్లో భజన కార్యక్రమం పెట్టిస్తారన్నమాటే!" అన్నాడు సంతానం సంబరంగా.
    "నోర్ముయ్... నీ తెలివితేటల్తో నా దుంప తెంచుతున్నావ్. అయినా నాకు భజన కార్యక్రమం అయితే నీకెందుకూ అంత సంబరం? కొర కొరా చూస్తూ అడిగాడు రాయుడు.
    "మీకు ఆనందం అయితే నాకు మాత్రం ఆనందం కాదా బాబూ మీరు మరీనూ" అన్నాడు సంతానం నసుగుతూ.
    "చాల్లే! నా ఆనందానికి కారణం వేరే ఉంది."
    "ఆ! తెలిసింది! చిత్రాంగి నెలతప్పి ఉంటుంది. అంతే కాదు బాబూ?"
    "కాదు.... సంతానం భార్య ముండ మోసింది!"
    రాయుడు పళ్ళు కొరికాడు. సంతానం బిక్కమొహం వేశాడు.
    "చిత్రాంగి నెలతప్పితే నా పీక్కి చుట్టుకుంటుంది! ఇప్పటికే దానివల్ల నాకు వూపిరాడడం లేదు" అన్నాడు రాయుడు.
    "మరి ఎందుకు బాబుగారు! మీకు ఆనందంగా ఉంది?' భయపడుతూ అడిగాడు సంతానం.
    "ఎందుకేంటి? ఆ గోపిగాడు జైల్లో పడ్డాడు... మన కిప్పుడు ఈ ఊళ్ళో ఎదురేలేదు."
    "ఔను బాబుగారూ! మళ్ళీ పూర్వపు వైభవం వచ్చేసింది... అందుకే మీ మొహం చింతపండుతో తోమిన రాగిచెంబులా మెరిసిపోతూంది."
    "పాపం! ఆ పోలీసులు వఠ్ఠి వెర్రి వెధవాయ్ లు. సీతాలును రేప్ చేసి చంపింది ఆ గోపీగాడే అని అనుకున్నారు."
    "ఎలాగయినా మీ బుర్రే బుర్ర బాబుగారూ!" అన్నాడు సంతానం రాయుడ్ని పొగుడుతూ.
    కానీ రాయుడు ఏమీ ఉలకలేదూ, పలకలేదూ. అంతేకాదు... నడుస్తూ వున్న వాడు కాస్తా ఠకీమని ఆగిపోయాడు.
    సంతానం కూడా ఆగి రాయుడివంక చూసాడు. రాయుడు నోరు మొత్తం పూర్తిగా తెరిచి కొయ్యలా నిలబడిపోయాడు.
    "ఏంటి బాబుగారూ!నోరు మొత్తం అలా తెర్చుకుని నిల్చున్నారు. కొంపదీసి కృష్ణుడిలా విశ్వాన్ని మొత్తం నాకు మీ నోట్లో చూపించాలని ప్రయత్నిస్తున్నారా? ఎంత ఈ గూడేనికంతటికి మీరు గొప్ప అయినా మరీ మీకు మీరే దేవుడనుకుంటే ఎలా బాబుగారూ?"మెలికలు తిరుగుతూ అన్నాడు సంతానం.
    "ఆపరా నీ ఎదవ సోది..... ఓసారి ఆ వైపుకు చూడు... ఆ పిట్ట ఎలా పిటపిట లాడిపోతోందో? దాని వొంపు సొంపులు చూస్తే నువ్వు నా కంటే పెద్దగా నోరు చాపుతావ్ " అన్నాడు రాయుడు.
    సంతానం రాయుడు చూపించిన దిక్కుకి చూసాడు.
    "హబ్బ..... ఓసారి దానితో చెమ్మచెక్కలాడ్తే ఈ జీవితం ధన్యం అయిపోతుందిరా సంతానం."
    "బాబుగారూ!"
    గావుకేకపెట్టాడు సంతానం. రాయుడు ఉలిక్కిపడ్డాడు.
    "అదేంట్రా అలా అరుస్తావ్! అదేదో నీ భార్య అయినట్టూ" అన్నాడు రాయుడు.
    "భార్య అయినట్టూ ఏంటి బాబూ? అది నా భార్యే" జవాబు చెప్పాడు సంతానం.
    "నీకింత అందమైన భార్య వుందని మాటవరసకయినా ఎప్పుడూ చెప్పలేదేంట్రా సంతానం?" పొలాల గట్లమ్మట వెళుతున్న సంతానం భార్యకేసి చొంగకారుస్తూ చూస్తూ అన్నాడు రాయుడు.
    "బాబుగారూ! మీరిట్టా మాట్లాడ్డం అన్యాయం బాబుగారూ"
    "ఇప్పుడు నేనేమన్నాననిరా అలా బాధపడిపోతున్నావ్? నీ పెళ్ళాం అందంగా వుందని మెచ్చుకున్నాను... అంతేకదా?" నవ్వుతూ అన్నాడు రాయుడు.
    "బాబుగారూ!"
    "సరే.... సరే - ఈ వేళ నీ పరిస్థితి ఏం బాగోలేనట్టుంది! ఇంటికి పోదాం పద."
    "వద్దులే బాబూ! నేను మా ఇంటికి పోతాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS