హతాశుడై చూస్తూ కూర్చున్నాడు. మురహరి.
29
ఆ రాత్రి తాసిల్దారు గారు మేనల్లుడినడిగాడు. "మురహరీ, నవ్వూ జయలక్ష్మీ ఆ డ్రింకు షాపులో నుంచి వస్తున్నారు కదూ, అక్కడినుంచి ఎక్కడికి వెళ్ళారు?"
"ఏం మావయ్యా ఇట్లా అడుగుతున్నారు."
"నా ఇంట్లో ఉంటూ, నా తిండి తింటూ ఉన్నంత కాలం నీ బాగోగులు విచారించవలసిన బాధ్యత నాకు ఎంతైనా ఉంది. ఫలాని తాసీల్దారు గారి మేనల్లుడు ఎవరో కాలేజీ అమ్మాయితో తిరుగుతున్నాడంటే నాకు మాత్రం నామర్దా కాదా" రెట్టించి అడిగాడు మళ్ళీ.
"మావయ్యా అనవసరంగా ఉద్రేక పడకండి. ఈరోజున వెళ్ళిపొమ్మన్నా వెళ్ళిపోతాను. ఒక్క మాట. నాకు జ్యోతి నిచ్చి చేసి మీ అల్లుడు చేసుకోవా లనుకుంటున్నారు. ఆ ఉదేశ్యంతోనే ఇంతకాలం నుంచి మీరు నన్ను దగ్గరకు తీసి నా మంచి చెడ్డలూ, బరువు బాధ్యతలూ వహిస్తున్నారు. అందుకు సర్వదా కృతజ్ఞుడిని. కాని ఆ ఆశ మాత్రం పెట్టుకోవద్దని నా మనవి. జ్యోతిని నేను పెళ్ళి చేసుకో దల్చుకోలేదు. నేను జయలక్ష్మినే పెళ్ళి చేసుకో దల్చుకున్నాను. కోపగించుకోక నా కోరిక మన్నించండి." అన్నాడు మురహరి.
ఆయన తన నరికేసినట్లయింది. కప్పు కూలి పోయినట్లుగా కుర్చీలో కూర్చున్నాడు. ఆయన మనస్సులోని ఆశలన్నీ ఒక్కొక్కటే ఎగిరిపోసాగినయ్యి.
"అంతవరకూ వచ్చిందన్నమాట. ఈ సంగతి ఇంతవరకూ నాతో ఎందుకు చెప్పలేదు" మనస్సు లోని వ్యధను వెనక్కు నెట్టి అన్నాడు.
"అవుసరం లేకపోయింది. ఇప్పుడు మీరు అడిగారు గనుక చెప్పుకున్నాను" అన్నాడు మురహరి.
"జయలక్ష్మి ఎవరమ్మాయి. ఆమె తల్లిదండ్రులెవరు. కులగోత్రాలు, మాన మర్యాదలూ ఉన్న పిల్లేవా" ఈ ప్రశ్న లడుగుతుంటే ఆయన కంఠం పూడిపోయింది.
మేనమామ ఆ మాట లంటుంటే మురహరి మనస్సు ఉడికిపోయింది.
"ఈ కులగోత్రాల సమస్య, పట్టుదలా ఆ టీచరు గారు స్వాతికి పంక్తి భోజనం పెట్టి విందు చేసేటప్పుడు ఏమైందో" అన్నాడు మురహరి.
విస్తుపోయాడాయన.
"ఏమిటి మురహరీ నువ్వంటున్నది. స్వాతి ఏ కులస్థురాలు. నువ్వనేదేదో సూటిగా చెప్పరాదూ'
"సూటిగానే చెపుతున్నాను. స్వాతి హరిజన కులస్థురాలు. ఆవిడ మన జ్యోతికి వదినె. మీలాంటి పెద్దలే ఇలాంటి విషయాల్లో పట్టింపులు లేకుండా ప్రవర్తిస్తుంటే, సాటి కులస్తురాలయిన ఒక బాల వితంతువును నేను పెళ్ళాట్టంలో తప్పులేదు. ఒక అభాగ్యురాలి జీవితానికి శాంతి సౌఖ్యాలను ఇవ్వటమే గాకుండా ఆమెను సుమంగళిగా స్వీకరిస్తున్నాను." అన్నాడు మురహరి ఆవేశంతో.
ఇదంతా ఏదో అర్ధంలేని, అర్ధంకాని అభూత కల్పన మాదిరిగా, కలగా కనిపించింది.
ఈ మాటలన్నీ పక్క గదిలో ఉండి వింటూనే ఉన్నది జ్యోతి. ఆమె హృదయం వెయ్యి ముక్కలయింది.
"జ్యోతీ" కోపంతో బుసలు కొడుతూ పిలిచాడు కూతుర్ని.
భయంతో, నిరాశతో, నిస్పృహతో వణికిపోతూ వచ్చింది జ్యోతి.
"స్వాతి ఎవరు, ఏ కులస్తురాలు."
"అన్నీ బానే చెప్పాడుగా నాన్నా, ఆవిడ ఎవరైనా మనకు అనవసరం. ఒక మనిషి యొక్క మంచితనాన్ని, మాట పొందికతనాన్ని, సత్ప్రవర్తననూ కులగోత్రాల ప్రాతిపదికగా ఎంచకూడదు నాన్నా. కాకపోయిమా మన ఇంట్లో ఏర్పడిన ఈ తుఫానులోకి ఆమెను ఈడ్చుకురావటం వెర్రితనమే అవుతుంది. తన దోషాన్ని కప్పిపుచ్చుకోవటానికి బావ ఎన్నో అప్రమత్తత వాక్యాలు చెప్పొచ్చు. నన్ను బావ చేసుకోలేకపోవటనికే, స్వాతి వదినె వ్యక్తిగత విషయాలకూ ఏమీ సంబంధంలేదు. ఆవిడను దూషించటం ఎందుకో నాకు అర్ధం కావటంలేదు." అన్నది జ్యోతి మురహరివైపు చూస్తూ. ఆమె ముఖంలోకి చూడలేక తల వంచుకున్నాడు మురహరి.
"బావా" ఆప్యాయంగా అన్నది జ్యోతి.
"వూ."
"నువ్వు జయలక్ష్మినే పెళ్ళి చేసుకోవాలను కుంటున్నావా."
"జ్యోతి ఏమిటా ప్రసంగం ఎట్టా చేసుకుంటాడో నేనూ చూస్తాను" అన్నాడాయన.
"అంత కోప మెందుకు నాన్నా నీ కోసం చూసి బావ తన మనస్సు మార్చుకుంటూ డనుకున్నావా. ఏం బావా, నీ నిర్ణయం నేను తెల్సుకోవచ్చుగా."
"అవును జ్యోతీ. జయలక్ష్మినే చేసుకోవాలనుకుంటున్నాను. ఆమెను ప్రేమిస్తున్నాను. మా ఉభయులకూ ఇష్టమే."
"విన్నావుగా నాన్నా. కలసిన మనస్సులు విరుగవు. విరిగిన మనస్సులు కలువవు. బావను బలవంత పెట్టవద్దు." అని వెళ్ళింది జ్యోతి. ఇదంతా అర్ధంకాక తల పట్టుకుని హతాశుడై కూర్చుండిపోయాడాయన. మురహరి మెల్లిగా వెళ్ళిపోయాడు.
"నేను నెత్తీ నోరూ బాదుకుంటూంటే విన్నారా, మేనల్లుడు మేనల్లుడంటూ మీ ఉబలాటమే గాని అతనేమయినా మంచీ మర్యాదా చూపించాడా మీయందు. ఇదంతా ఎవరో కాదు ఆ టక్కులాడి స్వాతి చేస్తున్నదే. ఈ రోజునుంచీ ఆవిడ నా గడప తొక్కటానికి వీల్లేదు. నా పిల్లలకూ ఈవిడ ప్రైవేటు అక్కర్లేదు. ఇంకానయం. నా బిడ్డ గొంతు కొయ్యకమునుపే అన్ని విషయాలూ, కుండ పగుల గొట్టినట్లుగా తెల్సిపోయినయ్యి. ఇప్పటికయినా ఈ పద్మవ్యూహం నుంచి బయటపడ్డాం" జ్యోతి తల్లి వచ్చి ఆయనతో అన్నది. ఈవిధంగా నైనా మేనరికం తప్పిపోయినందుకు ఆమె సంతోషపడ్డా కూతురు మనస్సు నిజంగా క్షోభిల్లుతున్నదని ఆమె మొదటి సారిగా తెల్సుకున్నది.
ఆవిడ మెల్లిగా జ్యోతి గదిలోకి వెళ్ళింది. కళ్ళు మూసుకుని పడుకుంది జ్యోతి. కూతురి ముఖం లోని ఆవేదనా, దిగులూ, భయమూ స్పష్టంగా చూసిందావిడ. జ్యోతి విషయంలో మొదటి సారిగా ఆమె హృదయం తరుక్కుపోయింది. మన స్పూర్తిగా బావను ప్రేమించి మనస్సులో నిలుపుకుని, హృదయపీఠంలో ప్రతిష్ఠించుకున్నది. ఈ పీఠాన్ని ఎప్పటికప్పుడు కదిలిస్తూ మనసారా కూతుర్ని ఎప్పుడూ ఆ మూర్తిని ధ్యానించుకో నివ్వలేదు. అనుకూలమైన వాతావరణాన్ని ఆమె ఎప్పుడూ కలిపించలేదు. అపురూపమైన కూతురుమనస్సును ఆవిడ ఎప్పుడూ అర్ధం చేసుకోలేదు. చిరకాల వాంఛితమైన తన అయిష్టతే ఇంత ఉపద్రవాన్ని తెచ్చిపెట్టిందేమోనని ఆవిడ ఇప్పుడు కుమిలిపోతున్నది. మేనల్లునిగా, కాబోయే అల్లునిగా మురహరిని ఆమె ఎప్పుడూ చూడలేదు. ఆ కారణం చేతనే మురహరి జ్యోతిని ప్రేమించ లేక పోయాడేమోనని ఆమె ఇప్పుడు అనుకోసాగింది.
పక్కమీద కూర్చుని ఆప్యాయంగా జ్యోతి ముంగురులు సవరిస్తూ.
"జ్యోతీ" అన్నది.
మెల్లగా కళ్ళు తెరిచింది జ్యోతి. ఆమె కళ్ళు ఎర్రబారినయ్యి. ఉచ్చ్వాస నిశ్వాసాలు పొగలు గక్కుతున్నయ్యి. నుదుటిమీద చెయ్యివేసి చూసింది. పొట్టమీద చెయ్యివేసి చూసింది. వళ్ళంతా మసిలిపోతున్నది.
"ఇంత జ్వరం పేలిపోతుంటే చెప్పనైనా లేదేం జ్యోతీ. నామీద ఇంత కోపమైతే నేనేం చేసేది జ్యోతీ." అన్నదావిడ.
"జ్వరం తగిలిందా అమ్మా, ఏమిటో నాకూ తెలీలేదు." అన్నది జ్యోతి.
"డాక్టరును పిలిపించమంటాను" అంటూ మంచంమీద నుంచి లేచిందావిడ. తల్లి చెయ్యి పట్టుకుని విడువలేదు జ్యోతి.
"వద్దమ్మా ఒక్కపూట జ్వరానికి ఇంత హంగామా ఎందుకు. ఒక్కమాట అడుగుతా చెపుతావా అమ్మా" తల్లి వళ్ళో తల పెట్టుకుని పడుకుంది జ్యోతి. ఇదివరకు తన మనస్సులోని ఏ విషయాన్నయినా తల్లితో చెప్పటానికి బిడియపడేది. భయపడేది. తల్లి కల్పించిన వాతావరణమే అందుకు కారణం. ఈ రోజుతో ఆ భయం తీరింది జ్యోతికి.
"బావ అంటే నీ కెందుకమ్మా అంత కోపం. ఒక్కనాడయినా మర్యాదగా అతన్ని చూశావా. కనీసం ఆప్యాయంగా ఒక్కసారయినా అతని విస్తట్లో నువ్వు అన్నం పెట్టలేదు కదూ." తల్లి ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగింది. ఆమె పైట చెంగుతో కళ్ళు తుడ్చుకుంది.
"అవునమ్మా మురహరిబావంటే ఎందుకో నాకు ఇష్టం ఉండేది కాదు. మన హోదాకు తగినవాడు కాదని నా భ్రాంతి. మేనరికానికి హోదా తోనూ, ధన ధాన్యాలతోనూ సంబంధ మేమిటనే జ్ఞానం నాకు లేకపోయింది. అదీగాక అతనూ చదువుకున్నవాడు. నిరక్షరకుక్షి కాదు. నీ మనస్సు తెలుసుకోలేక, నా అహంభావంతో నీ మనస్సును గాయపరిచాను. ఆదరణలేని అత్తతో అల్లుడుగా నేను పొందే గౌరవ మర్యాదలు ఏముంటయ్యని మురహరి నిన్ను చేసుకోదల్చుకోలేదేమో. ఈ స్థితికి తగిన వాతావరణం నేనే కల్పించాను జ్యోతీ, నేనే కల్పించాను" అంటూ విచారపడసాగింది ఆవిడ.
కొంతసేపటికి తల్లి వళ్లోనే తల ఉంచి నిద్ర పోయింది జ్యోతి, మెల్లిగా పక్కమీద పడుకో బెట్టిందావిడ. ఆయన ఉన్నారేమో కూతురు జ్వరం సంగతి చెపుదా మనుకుంది. అదే సమయంలో స్వాతి వచ్చింది. భార్యాభర్త లిద్దరి దృష్టి స్వాతి మీదనే కేంద్రీకరించబడింది. ఒకరి ముఖా లొకరు చూసుకున్నారు.
