Previous Page Next Page 
చీకటి పొద్దున వెలుగురేఖ పేజి 41


    "మొత్తంమీద ఆ యింట్లో బావ స్థానం చాలాహీనంగా వుండేది. బావ వచ్చాక ఆ పని యీ పని చెయ్యడానికి మంచి నౌకరు కుర్రాడు దొరికినట్లు ఫీలయ్యేవారు. తల్లి-తండ్రి లేని కుర్రాడు ఇంకోరి దయాధర్మంమీద బ్రతకాల్సి వచ్చినపుడు అంతకంటే ఆదరాభిమానాలు ఎక్కడా లభించవనుకుంటాను. దానికి ఆ జీవితం క్రమంగా అలవాటయి మా నాన్నప్రవర్తనకి అట్టే బాధ పడేవాడుకాదు. లేక తన పరిస్థితి అర్ధం చేసుకుని అంతకంటే గత్యంతరం లేదని సహిస్తూండేవాడో.
    "ఆ ఇంటిలో అమ్మ, నేను చూపే ఆదరణ ఒక్కటే బావకి కాస్త ఓదార్పు. అమ్మ, నాన్న ఎదుట బావతో ముభావంగా అట్టే అనుబంధం లేనట్టే ప్రవర్తించేది. కాని చాటుమాటుగా బావని ఆప్యాయంగా పలకరించడం, అభిమానంగా ఇదీ అది పెట్టడం-'స్నానం చెయ్యరా నాయనా తలంటుతానురా' అంటూ నాన్న లేనపుడు ఆప్యాయత చూపేది. భోజన విషయంలో కూడా సాధ్యమైనంతవరకు నాన్న ఎదుట బావకి అన్నం పెట్టేదికాదు. అలాగే ఎలాగో అన్న కొడుకుని ఆదరిస్తూ, నాన్నని ఎదిరించకుండానే బావకి ఆయింట్లో ఆశ్రయం ఇచ్చింది అమ్మ, కొడుకులు లేని బావమీద పుత్రవాత్సల్యం పెంచుకున్నా, కొడుకుగా దత్తత చేసుకుందామన్న కోరికవున్నా నాన్న అంగీకరించరని తెలిసి ఆ ఆశ తన మనసువరకే పరిమితం చేసుకుంది అమ్మ.
    "బావవచ్చిన ఏడాదివరకు ఏదో కలిసి మాట్లాడుకోడం, ఓ ఇంట్లో వున్న చనువు తప్ప బావమీద పెద్ద అభిమానం ప్రత్యేకంగా ఏం వుండేది కాదు. అప్పుడప్పుడు బావ పరిస్థితి చూసి జాలిమాత్రం కలిగేది. నాన్న ఏ విషయానికన్నా తిడ్తున్నప్పుడు, కోపగించినపుడు బావమీద జాలేసేది. చాతనైన రీతిగా ఓదార్చేదాన్ని.
    "బావ, నేను ఆ ఏడాది స్కూలు ఫైనలు ప్యాసయ్యాం. నాకు ఫస్టు క్లాసు వచ్చింది. బావ మామూలుగా ప్యాసయ్యాడు. బావకు ముందునించి చదువులో అంత చురుకులేదు. బావకి చదువులోలేని అభిలాష, అభిరుచి కవిత్వంలోనూ, పెయింటింగ్లోనూ వున్నాయన్న విషయం నాకు చాలా రోజులకి గాని తెలియలేదు.
    "ఇద్దరం కాలేజీలో చేరాం. బావ చదువు మీద మనస్సు లగ్నం చెయ్యలేకపోయేవాడు. పుస్తకాలు ముందేసుకుని ఎటో కలలు గంటున్నట్టు చూస్తుండేవాడు. లేదూ - ఏదో కాగితంమీద పిచ్చి బొమ్మలు వేస్తుండేవాడు. ఏదేదో రాస్తూండేవాడు.
    'చదువు బావా, చదవకపోతే ఎలా పాసవుతావు' అంటోండే దాన్ని నేను చదువుకుంటూ మధ్య మధ్య.
    'యీ చదువులు నేను చదవలేను కల్యాణీ. నా మనసు యీ చదువుల మీద లేదు' అనేవాడు అదోలా దిగులుగా బాధపడుతూ.
    "అదేమిటి బావా చదవకుండా ఎలా ప్యాసవుతావు? ఏదో ఉద్యోగం దొరకాలంటే కనీసం ఏదో ఒక డిగ్రీ అన్నా వుండాలి గదా అనేదాన్ని.
    'అవును కల్యాణీ, ఏదో ఒక డిగ్రీ తీసుకుని, నా పొట్ట నేను పోసుకోగలిగే ఉద్యోగం సంపాదించుకుని, అప్పటికయినా మనిషిగా బ్రతకడానికైనా చదవాలనిపిస్తుంది. కాని.....నా దృష్టి చదువు మీదకి మళ్ళడం లేదు. ఏం చెయ్యమంటావు?'
    'మరి దేని మీద వుంది?' ఆశ్చర్యంగా అడిగాను.
    'ఏమిటో పిచ్చి పిచ్చిగా పద్యాలు రాయాలని, కవిత లల్లాలని, మంచి బొమ్మలు గీసుకుంటూ కూర్చోవాలనిపిస్తుంది. ఏదన్నా చదువుతూంటే కవిత తడ్తుంది. అది రాసేవరకు మనసు నిలవదు, ఏ లెక్కలో చేస్తూంటే నా చేతులు నాకు తెలియకుండానే ఏదో బొమ్మలు గీస్తుంటాయి....'
    "నీవు బొమ్మలు గీస్తావా? పొయిట్రీ రాస్తావా? నాకు తెలియనే లేదే. ఏవీ ఏమన్నా చూపించు." ఆశ్చర్యంగా, ఉత్సాహంగా అడిగాను.
    "ఏదో, అంత మంచి బొమ్మలు కావులే కల్యాణీ, రంగులవీ వుంటే ఇంకా బాగా వస్తాయి. మామూలుగా పెన్సిల్ తో వేస్తే ఏం తెలుస్తుంది?.....యేదో పిచ్చిగా రాశాను యీ పద్యాలు!" అంటూ సిగ్గు సిగ్గుగా తను మామూలు కాయితం మీద వేసిన బొమ్మలు, చిత్తు కాగితాల మీద రాసిన కవితలు చూపించాడు.
    ఆ వయసులో ఆ బొమ్మలలోని కళా నైపుణ్యాన్ని, ఆ కవితలలో మాధుర్యాన్ని గ్రహించే శక్తి లేకపోయినా ఆ కవితలు చదివి 'బాబోయ్, ఇవన్నీ నీవు రాసినవేనా ....అంత బాగా ఎలా రాయగలిగావు' అన్నాను చదివి యేం అర్ధం కాక, కేవలం ఆ పదాల కూర్పుకి మురిసిపోతూ. ఆ బొమ్మలు, ఆ ప్రకృతి దృశ్యాలు మామూలు పెన్సిల్ తో గీసినవే అంత చక్కగా వుంటే ఆర్ట్ పేపర్ మీద రంగులు మేళవిస్తే అద్భుత చిత్రాలుగా తయారవుతాయనిపించింది. ఆ బొమ్మలలోని మూర్తులన్నీ కాస్త పట్టి చూస్తే, నా పోలికలు కనిపించాయి. 'ఇదేమిటి, ఇవన్నీ నా బొమ్మల్లా వున్నాయి బావా!'అన్నాను ఆశ్చర్యంగా.
    బావ చిరు నవ్వు నవ్వాడు. నా బొమ్మ లెందుకు గీశావు బావా!" మళ్ళీ అడిగాను.
    'నీవు తప్ప నా కింకెవరు తెలుసు కల్యాణీ, నాకు తెల్సిన అమ్మాయిని నీ నొక్కర్తివే! నా చిత్రాలకి, నా భావాలకి, నా కవితకి, నా నా ఆరాధనకి, నా ఆవేశానికి అన్నింటికి, ఆలంబనం, ఆధారం నీవే కల్యాణీ, బావ నావైపు అదోలా చూస్తూ ఉత్తేజితుడై అన్నాడు. అప్పటి బావ ముఖం, ఆ కళ్ళల్లో నాపట్ల ఆరాధన, ఆ ఉద్రేకం అన్నీ అప్పుడు నా కర్ధం కాకపోయినా బావ మాటలు, బావ ముఖం వింతగా అనిపించి ఆశ్చర్యంగా చూశాను. నా ఆశ్చర్యం గమనించి బావ సిగ్గుపడి నానించి చూపులు మరల్చుకున్నాడు. బావ అలా సిగ్గుపడడం క్రొత్తగా, వింతగా అనిపించింది. పద్దెనిమిదేళ్ళ అబ్బాయి, అప్పుడే యవ్వనంలో అడుగు పెట్టిన నవయువకుడి మనసులో తనకి చేరువుగా వున్న ఓ అందమైన అమ్మాయిపట్ల ఎటువంటి భావం, ఆకర్షణ కలుగుతుందో పూర్తిగా అర్ధం చేసికొనే వయసులేకపోయినా బావ ముఖం ఆ కళ్ళల్లో నా పట్ల కాంక్ష, ఆరాధన చూసేసరికి నేనూ ఎందుకో చలించాను. అప్పటి నా మనసులో భావం మాటల్లో చెప్పలేకపోయినా, బహుశా బావ పట్ల అభిమానం పెరిగిన, అనురాగం జనించిన క్షణాలవేనని చెప్పవచ్చునేమో! మేమిద్దరం మానసికంగా చేరువవడం ఆ రోజునించే ఆరంభం అనుకుంటాను.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS