Previous Page Next Page 
చీకటి పొద్దున వెలుగురేఖ పేజి 40


    "ఓ రోజు ధైర్యంచేసి, నాన్న మంచి మూడ్ లో వుండగా అమ్మ మనసులో మాట బయటపెట్టింది. 'వాడా ......ఇక్కడెందుకు? బాగుంది, దిక్కు మొక్కులేని వాళ్ళందరిని ఇంట్లో పెట్టుకోడానికి ఇదేం ధర్మసత్రమా' అన్నారు మొహం చిట్లించి. అమ్మ ధైర్యం తెచ్చుకొని 'అదికాదండీ, ఎదిగిన కుర్రాడు, ఇంట్లో మీరు తప్ప మరో మగ మనిషి లేరు. కాస్త యీ పనికి ఆ పనికి సాయం వుంటాడు యింట్లో పెద్దవుతే చేతి కందివస్తాడు. మనకా ఒక్కర్తే పిల్ల. మగపిల్లలు లేనేలేరు. మగపిల్లలు లేని లోటూ తీరుతుంది. మనకూ ఆసరా అవుతాడు పెద్దకాలంలో ఇంతకీ వాడీ యింటిలో తిన్నంత మాత్రాన మనదెం కరిగిపోదు. ఆ దిక్కు మొక్కు లేనివాడిని ఆదరించి యింత అన్నం పెడితే పుణ్యమే కాని, పాపం కాదు, ఆ పైన మీ యిష్టం' అమ్మ ఆవేదనతో అంటూ కళ్ళు వత్తుకుంది. నాన్న అదోలా మొహంపెట్టి యేం అనకుండా ఆలోచిస్తున్నట్టు వూరుకున్నారు. అక్కడే వున్న నేను అదే సమయం అన్నట్టు-'పాపం బావని రమ్మనండి నాన్నా......మనింట్లో వుంటాడు. చక్కగా బావా, నేను కలిసి చదువుకుంటాం......ఒంటరిగా నాకేం తోచడంలేదు నాన్నగారూ....' అంటూ ముద్దులు గునిశాను. కాసేపటికి 'చూద్దాం...... ఆలోచిద్దాం' అంటూ నావేపు, అమ్మవేపు చూసి అన్నారు. తరువాత నాన్న లేచి వెళ్ళిపోయారు.
    "ఆ రాత్రి అమ్మతో అన్నారట. 'సరే, ఏదో పోనీ తల్లి, తండ్రి లేనివాడని, మనింటిలో కాస్త ఆసరాగా వుంటాడని వప్పుకుంటున్నాను. అంతేగాని, అన్నకొడుకు అంటూ వాణ్ణి నెత్తి కెక్కించుకుని, వాడిమీద యేవో ఆశలు, కోరికలు మాత్రం పెంచుకోకు. అమ్మాయి యింట్లోవుంది. వావి వరస అంటూ ఆ తర్వాత ఆరంభిస్తావేమో, అలాంటి పిచ్చివేషాలు యేం కుదరవు. ముందే చెప్పుతున్నాను. అది మాత్రం గుర్తుంచుకోండి' అంటూ ముందే అమ్మకి హెచ్చరిక చేశారట.
    "అమ్మ కసలు అలాంటి ఆలోచన కలలోకూడా రాలేని స్థితి. ఆ మాటే అమ్మ అందిట. ఆ విషయం అమ్మ నాతో చెప్పలేదు. ఆ తర్వాత యెప్పుడో చెప్పింది.
    "మొత్తంమీద యేమయితేనేం; నాన్న వప్పుకున్నారు. అమ్మ బావకి ఉత్తరం రాసి వెంటనే వచ్చేయమంది. నెల రోజుల లోపలే బావ మా యింటికి వచ్చేశారు.
    "బావని చూశావుగా.....ఎంత మంచి పర్సనాలిటీనో! ఎంత అందముగా వుంటాడో నీవే చూశావుగా అమ్మ ఇంటిలో వాళ్ళందరిది పచ్చని పసిమిరంగు.....మామయ్యా ఆరడుగుల పొడుగుతో, పచ్చగా వుండేవాడు. బావ అచ్చు తండ్రి పోలిక. మా ఇంటికి వచ్చేసరికి పదిహేనేళ్ళు నిండి వుంటాయ్. అప్పటికే బాగా పొడుగ్గా వుండేవాడు. వయసుకి తగ్గ గడుసు తనం లేకుండా చాలా అమాయకంగా, భయం భయంగా, దిగులుగా, దీనంగా వుండేవి ఆ కళ్ళు. బహుశా చిన్నప్పటినించి పడ్డ కష్టాలు, లోకంలో వంటరి ఐపోయిన దైన్యత ఆ పదిహేనేళ్ళ అబ్బాయి ఆత్మవిశ్వాసాన్ని హరించి వుంటాయి. చిన్నప్పుడే తండ్రిపోవడం, తల్లి పడ్డ కష్టాలు, ఆ తల్లీ ఏకాకిని చేసిపోవడం, వారి, వీరిపంచనపడి బ్రతుకీడవడంతో బ్రతుకుమీద భయం పుట్టినట్టు ఆ కళ్ళలో ప్రతిదానికి బెదురు కనిపించేది. కూర్చుంటే నిల్చుంటే ఏం తప్పో నన్నట్టుగా బితుకు బితుకుమని చూసే వాడు. అందులో మా నాన్న గురించి అందరిదగ్గరనించీ వినే వున్నాడు కనుక నాన్నంటే మరి భయపడేవాడు. పులి ఎదుట నిలబడ్డ మేకపిల్లలా గజగజ లాడేవాడు. తన దైన్య స్థితి తనకు తెలుసు. ఆ ఇంటివాళ్ళ దయా దాక్షిణ్యాలమీద ఆధారపడిన సంగతి అనుక్షణం గుర్తున్నట్టు వదిగి వదిగి మెదిలేవాడు ఇంట్లో.
    "బావని చూస్తే అప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా వుండేది. బావ యింత పిరికివాడేమిటి అనిపించేది. అమ్మ, నాన్నల మధ్య అపురూపంగా పెరిగే నాకు దిక్కు మొక్కు లేని బావ దైన్యస్థితి పిరికితనంగా కనపడడంలో ఆశ్చర్యమేముంది? అంతకంటే లోతుగా ఆలోచించే...వయసేది? బావ నాకంటే పెద్దవాడయినా నాతోపాటే మెట్రిక్ చదువుతున్నాడు. తల్లి పోయిన గొడవల్లో ఆ యేడు అతని పరీక్ష పోయింది. నాతోపాటు చదువుకుందుకు, మాట్లాడేందుకు నా యీడువాడు తోడయ్యాడన్న ఆనందం తప్ప మరో ఆలోచనలేని వయస్సు అది. అన్నాళ్ళూ వంటరిగా ఇంటిలోవుండి విసిగిపోయిన నేను, బావ తోడయ్యేసరికి మహాసంతోషించి, అస్తమానం బావతో కబుర్లేసుకుని కూర్చునేదాన్ని. బావ అయితే మహా మొహమాట పడేవాడు. నాన్న ఆ చుట్టుప్రక్కల వుంటే పిల్లిలా ముడుచుకొని 'ఊ, ఆ' అనికూడా అనేవాడుకాడు. 'ఏమిటి బావా, సరిగా మాట్లాడు! నేనిలా వాగుతూంటే జవాబు చెప్పవేం?' అని దబాయించేదాన్ని బావ బెదురుగా చూస్తూ, 'ఏం చెప్పను....మనం యిలా మాట్లాడుతూంటే మీనాన్న చదువుకోలేదని తిడ్తారు.....వెళ్ళి  చదువుకో' అనేవాడు నెమ్మదిగా.
    "అబ్బ.....చదువు, చదువు యెప్పుడూ యేం చదువుతాను......నీవు మాట్లాడపోతే ఫో.....నాకేం ఫ్రెండ్సు లేరా ఏమిటి?' అని కోపంగా అలిగి పోతుండేదాన్ని బావ అలా భయపడడానికి కారణం వుంది. మేమిద్దరం యెప్పుడుమాట్లాడుకుంటున్నట్లు కనపడినా నాన్న ఏమిటమ్మా ఎప్పుడూ కబుర్లేనా, చదువు లేదా ఏమిటి?' అని నన్ను కాస్త విసుగ్గామందలిస్తూ, బావవేపు ఉరిమి చూస్తూ 'మరేం పనీపాటు లేదా ఏమిటి? ఈ ఏడన్నా పరీక్ష గట్టెక్కించాలని లేదా ఆడపిల్లలతోచేరి ఆ కబుర్లేమిటి? పోయి చదువుకో, లేదంటే ఏదన్నా పనుంటే చెయ్యి' అని కసురుతూండేవారు.
    "పాపం బావ మొహం చిన్నపుచ్చుకొని అక్కడనించి లేచి వెళ్ళిపోయేవాడు. అప్పుడే కాదు. ఎప్పుడు నాన్న కనిపించినా బావ భయంతో బిగుసుకుపోయేవాడు. అన్నం తింటున్నప్పుడు నాన్న వంటిటి ఛాయలకి వస్తే నోటిలో ముద్దలు కూరుకొని గబగబ వెళ్ళిపోయేవాడు. కాఫీ త్రాగుతూంటే నాన్నని చూసి ఏదో తప్పుపనిచేసినట్లు గ్లాసు క్రింద పెట్టేసేవాడు చప్పున. అద్దంలో చూస్తూ తల దువ్వుకోడం కూడా ఓ నేరం అన్నట్టు నాన్న ఆ వైపులకి రాగానే సగం సగం దువ్వుకుంటూనే వదిలివెళ్ళిపోయేవాడు. బావ భయానికి తగ్గట్టు నాన్న ఎప్పుడూ బావని చూడగానే మొహం చిటపట లాడించేవారు. ఎప్పుడు ఖాళీగా కనిపించినా ఇది చేశావా అది చేశావా అంటూ ఏదన్నా వంక దొరికితే తిడదామన్నట్టు చూసేవారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS