26
"తర్వాత బావ, నేను ఎక్కువ సన్నిహితం అవడం ఆరంభించాం. ఆ ఇంట్లో మసలడం, నాన్న వైఖరి అన్నీ ఆ ఏడాది రెండేళ్ళకే బావకీ అలవాటు అయిపోయాయి. కాస్త భయం, బెరుకు పోగొట్టుకుని యింట్లో అమ్మతో నాతో చనువుగా మాట్లాడడం, నాన్న ఎదుటపడ్డా పూర్వం అంత భయపడకపోవడం, అలవాటయింది బావకి. పోయిన ఆత్మస్థైర్య, ఆత్మ విశ్వాసం తిరిగి కాస్త కాస్త పోగుచేసుకుంటున్నట్టు కనిపించాడు. నాతో ఇదివరకులా కాక చనువుగా మాట్లాడడం ఆరంభించాడు. ఇద్దరం సాయంత్రాలు అలా డాబామీద కూర్చుని పిచ్చిపిచ్చిగా ఏవేవో సంగతులు మాట్లాడుకునే వాళ్ళం.
"బావ మే మిద్దరం ఏకాంతంగా వున్నప్పుడు నా మొహంలోకి, కళ్ళలోకి పట్టిపట్టి చూస్తుండేవాడు. 'ఏమిటి బావా అలా చూస్తున్నావు?' అనేదాన్ని మొదట్లో 'ఏంలేదు' అని తత్తరపడేవాడు.
"చెప్పు బావా, చెప్పాలి. లేకపోతే నీతో మాట్లాడను" అని అలిగేదాన్ని.
"చెబితే యేం అనుకోవుగదా, తిడ్తావేమో చెపితే....."
"ఊహు......ఏం అనను చెప్పు" ఆరాటంగా అడిగాను.
"నీ కళ్ళు యెంత బాగుంటాయి కల్యాణీ! ఆ కళ్ళల్లోకి చూస్తుంటే అలా నీ కనుపాపల ఛాయల్లో విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. నీ కనురెప్పలు, నీ కనుబొమలు, నీ పెదాలవంపు అన్నీ యెంత బాగుంటాయో తెలుసా! ఆ ముక్కుచివర వంపు.....యీ నీ చేతివేళ్ళు.....నీలో యెటు చూసినా చిత్రకారుడు అందంగా చిత్రించిన చిత్రంలా వుంటుంది కల్యాణీ నీ అందం నువ్వు అందమయిన భావాలకి అపురూపమయిన రూపకల్పన. నాకు తెలియకుండానే నీ అందాన్ని మాటల్లో కూర్చుకుంది నా మనసు. అవన్నీ కవిత రూపాల్లో రాయాలనిపిస్తుంది.'
బావ నోటంట నా అందం గురించి వింటూంటే సిగ్గుతోపాటు మనసులో ఆనందమూ కల్గేది. 'ఫో బావా, మరీ చెప్తావు. అంత బాగున్నానా ఏమిటి?' అనేదాన్ని పైకిమాత్రం.
"నిజం కల్యాణీ, నీ అందం గురించి నీకేం తెలుస్తుంది!"
"అవునుగాని బావా, నీ కసలు ఇలా కవితలు రాయాలని, రాయగలనని యెలా తెలిసింది. బొమ్మలు వేయడం యెప్పు డారంభించావు.....ఇంత చిన్నప్పటినించి నీకెలా వచ్చాయి ఇవన్నీ.....?"
"ఏమో కల్యాణీ, ఇక్కడికి వచ్చాక నిన్ను చూసేకే యెందుకో నాకు నీ బొమ్మ గీయాలనిపించింది. అంతవరకు యేవో పిచ్చి పిచ్చి బొమ్మలు యెప్పుడన్నా అలా గీస్తూండేవాడిని. కాని నిన్ను చూశాక నీ బొమ్మ గీయాలనిపించి ప్రయత్నించాను. ఉత్త పెన్సిల్ తో అవుట్ లైన్ వేసిగీసినా నీ పోలికలన్నీ స్పష్టంగా తేగలిగాను. ఆ మాత్రం వేయగలనని ఆశించిన నాకు చాలా ఆనందం కలిగింది. తరువాత మరింత పట్టుదలగా గీశాను. ఈసారి ఇంకా స్పష్టంగా వచ్చింది నీ రూపు.....తరువాత నీలో నాకు కావాల్సిన భంగిమలన్నింటితో బొమ్మ గీస్తున్నాను. ఇదంతా దొంగతనంగా నిన్ను అప్పుడప్పుడు చూసి నా మనసులో హత్తుకుపోయిన నీ రూపుని జాగ్రత్తగా దాచుకుని ఏకాంతంగా ఏ డాబా మీదో కూర్చుని వేస్తూండేవాడ్ని అలాగే కవితలూ - చిన్నప్పటినించి నాకెందుకో పద్యాలు చదవడం అంటే చాలా యిష్టంగా వుండేది. క్లాసులో తెలుగు మాష్టారి పాఠం చాలా జాగ్రత్తగా వినేవాడని. పద్యాలు చెపుతున్నప్పుడయితే మరీ ఆసక్తిగా వినేవాడ్ని. క్రమంగా కవిత్వంమీద ఆసక్తి పెరిగి నేను ఎప్పటికయినా అలా రాయాలనిపించేది. నిన్నుచూశాక, నీ మనసులో కలిగే ప్రతిభావనా పద్యరూపందాల్చేది. కవిత్వానికి స్వచ్చమయిన ఆవేశమే ఆలంబ మనుకుంటాను. ఓ కవిత అల్లాను. చదువుకుంటూ నాలో నేను పొంగిపోయాను. బాగానే వచ్చిందనిపించింది. అలాగే రెండుమూడుసార్లు యేవో రాయాలని ప్రయత్నించాను. రాయగలనన్న నమ్మకం రాయాలన్న పట్టుదల వచ్చాయి. నా కవితకి, నా చిత్రాలకి ఆలంబన నీవే కల్యాణీ! నిన్ను చూశాకే ఆవేశం కల్గింది" అన్నాడు బావ.
"బావలో గుప్తంగా వుండిన అభిరుచి, కళ వయసుతోపాటు పెరిగి పెద్దదైంది. మా ఇద్దరి మధ్య అనుబంధమూ నానాటికీ పెరిగింది. ఇద్దరం రోజు రోజుకి సన్నిహితులం అయిపోయాం. ఇద్దరం ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలని ఏ విషయం ఒకరినించి ఒకరు దాచుకోకుండా చెప్పాలని కష్టం, సుఖం, మంచి చెడ్డా అన్నీ విడమర్చి చెప్పుకునేవాళ్ళం. బావ వ్యక్తిత్వం, అభిరుచులు, అతని కళాభిరుచిపట్ల నా హృదయం నాకు తెలియకుండానే అతనికి చేరువయింది. అసలే అందగాడు, వయసు తెచ్చిన మిసమిసలతో మెరిసిపోతూ, యవ్వనంలోవున్న బావ బాహ్యాకర్షణ కంటే అంతఃసౌందర్యం నా మనసుని మరింత ఆకట్టుకొంది.
"బావని ప్రేమిస్తున్నానన్న సంగతి, బావ నేను ఒకరిని వదిలి ఒకరం బ్రతకలేమన్న సంగతి మరో రెండేళ్ళ లోపలే మాకు ఒకరికి ఒకరం చెప్పుకోకుండానే తెలుసుకున్నాం. అప్పటికి బావకి ఇరవై నాకు పద్దెనిమిది ఏళ్ళున్నాయి. పసితనం, అమాయకత్వం స్టేజి దాటిపోయాం. యవ్వనంలో అడుగుపెట్టాం. మా ఇద్దరిమధ్య వున్న మమతానురాగాల అర్ధం తెలుసుకో కలిగే వయసు వచ్చింది.


