"చంటోళ్ళ స్నానాలు అయ్యాక అరుణ చేస్తుందిలెండి ! ఇదిగో అర్ధగంటలో అయిపోతుంది!" అంటూ పిన్ని శారదనూ , నీరదనూ పురమాయించి బాత్ రూమ్లోకి నడిచింది. సంతానంగారూ షేవింగ్ సెట్టూ తీసుకొని అద్దం ముందు కూర్చున్నారు.
నాకు ముందు ముగ్గురూ వెనక ఇద్దరూ రాగా గదిలోకి దారి తీశాను. మళ్ళీ పెట్టె ఎవడో బిగించి వేశాడు. పావుగంట వెతికినా తాళం చేతులు కనిపించలేదు. వెంకట్రావ్ అట్లకాడ తెచ్చి ప్రయత్నిస్తే ఎలాగో పెట్టె తెరచుకుంది.
పెట్టెలోంచి స్వీట్స్ ప్యాకెట్స్ బయటికి తీశాను. అట్ట పెట్టెలో వున్న స్వీట్స్ ఒకదానికొకకి అతుక్కుపోయి వున్నాయ్.
"ఇవిగో ఇంద! అందరూ సమానంగా తీసుకోండి!" నా మాట పూర్తికాకుండానే ఓ డజన్నుర చేతులు వాలాయి. గద్దలు తన్నినట్టు నా చేతులోని స్వీట్స్ ప్యాకెట్స్ తన్ని వేశారు. వాళ్ళు రాల్చిన పొడితో నా తల వళ్ళూ నిండిపోయింది. పది నిమిషాలు నా గదంతా అల్లకల్లోలం అయింది. గడ్డం చేసుకొంటున్న సంతానం గారూ వచ్చి జుట్లు జుట్లు పట్టుకొన్న పిల్లల్ని వదిలించారు. చిన్నసైజు వాళ్ళను నేను విడదీశాను. అభీభత్సంలో ఒహడిపళ్ళూ, మరొకడి గోళ్ళూ నా చేతుల మీద దిగిపోయాయి.
సంతానం గారూ పెద్దగా అరిచి అందర్నీ నా గదిలో నుంచి బయటికి వెళ్ళమన్నారు. హైదరాబాదు పట్నంలో 144 లా అది వాళ్ళ మీద ఏమీ పనిచేయలేదు. నేనే గదిలో నుంచి బయటికి వచ్చాను. మరుక్షణంలోనే సంతానం గారూ మాములుగా అయ్యారు. అయన ముందు కూర్చొని , లేని ఉత్సాహాన్ని తెచ్చుకొని కబుర్లు చెప్పసాగాను. అంతలో పిన్ని వచ్చి స్నానానికి లేవమంది.
చీరా, టవలూ తీసుకొని బాత్ రూంకు వెళ్ళాను. నా వెనక ఇద్దరూ ముందు ఒక్కరూ నడిచారు. బాత్ రూం తలుపు దగ్గర ఆగిపోయారు. వాళ్ళు నన్నలా చుట్టుకు చుట్టుకు తిరుగుతూ వుంటే నాకు తమాషాగా వుంది.
మొహం కడుక్కున్నప్పుడు వదిలేసిన నా సోప్ అక్కడ లేదు. మళ్ళీ తలుపు తెరచి ఆ మాట నోటితో అనకుండా వెతకసాగాను. నా అవస్థ గ్రహించిన నీరద "అక్కయ్యా ! నీ సోపే, మరే పాప అందులో జారవిడిచింది." అంటూ మోరీ కేసి చూపించింది. అంతలో శారద మరో సోప్ కేస్ తెచ్చి ఇచ్చింది. ఆ సోపు నిండా జుట్టూ, సున్నిపిండి, ఇసుకా అతుక్కొని వున్నాయి. ఆ సోపు తీయటానికి మనసొప్పక ఎలాగో స్నానం పూర్తీ చేశాను.
తల దువ్వుకుందామంటే నా దువ్వెన కన్పించలేదు. ఆ దువ్వెనతో పాపా చిక్కు తీసుకుంటూ కన్పించింది. దాని జుట్టులో నుంచి దువ్వెన బయటకు తీసేసరికి రెండు పళ్ళు ఊడోచ్చాయి.
పిన్ని స్నానం చేసి వచ్చేటప్పటికి ఒంటిగంట అయింది. భోజనాల దగ్గర ఓ సంతర్పణలా జరిగిపోయింది. అదంతా తమాషాగా వుంది. చెప్పొద్దూ అక్కడ మాత్రం నాకు సర్దాగానే వుంది. పిల్లల కంచాలూ, ఎంగిళ్ళు దాటుకొని బయటికి రావటం చంద్రగోళం మీద మొదటిసారిగా కాలుపెట్టిన మనిషి నడిచినట్టే అనిపించింది.
మధ్యాహ్నం పడుకోగానే ఓ కునుకు పట్టింది. ఆ సుఖం ఎంత సేపో పట్టలేదు. ఉలిక్కి పడి లేచాను. రేడియోలో బాలానందం ప్రోగ్రాం పెద్దగా పెట్టినప్పుడు వచ్చే ధ్వనులు వినబడ్డాయి. లేచి బయటకొచ్చాను. ఇంటి కప్పు ఎగిరిపోయేట్టు పిల్లలు అరుస్తున్నారు. అంతవరకూ నయం ఆ రోజు బాలల ప్రోగ్రాం లేదు.
సాయంకాలం శారదను వెంటబెట్టుకొని బజారుకు బయలు దేరాను. రిక్షాలో ఎక్కిన పిల్లల్ని వదిలించుకునేసరికి తల ప్రాణం తోకకు వచ్చింది. అందరికీ బిళ్ళలూ, బొమ్మలూ కొని తెస్తానని నచ్చచెప్పి పిల్లల్ను వదిలించుకొని శారదా, నేనూ బయటపడ్డాం. నా దగ్గర వున్న రెండొందల్లో మరొక వందరూపాయలు ఖర్చు పెట్టామనుకున్నాను. శారదకు చీర కూడా కొన్నాను. బిల్లు చెల్లించి లెక్క చూసుకుంటే నూటపాతిక రూపాయలు అయినై.
పిన్నీ, సంతానం గారూ నేను అంత ఖర్చు పెట్టినందుకు నన్ను మందలించారు.
ఆ రాత్రి పిల్లలు అక్కయ్య దగ్గర నేను పడుకుంటానంటే నేను పడుకుంటానని పోటీలు పడ్డారు. అందరికీ నచ్చే ఉపాయం చెప్పి, హల్లో చాపల మీద వాళ్ళ మధ్య పడుకొన్నాను. పిల్లలతో కబుర్లూ చెబుతూ పడుకుంటే నాకు చెప్పరాని అనందం కలిగింది.
అర్ధరాత్రి పూట ఒకడు చెవులో నొప్పి అని ఇల్లు యెగిరిపోయేట్టు గల్లంతు చేశాడు. పిన్ని నూనె కాసి వాడిచేవిలో పోసింది. వాడు పడుకోగానే మరోహతి ఒరగాలు నొప్పి అంటూ లేచి కూర్చుంది. తెల్లవారి కోడి కూసెంత వరకూ ఎవరో ఒహరు వంతుల ప్రకారం లేచి కూర్చుంటూనే వున్నారు. తెల్లవారి ఒళ్ళంతా నొప్పులుగా వుంది. ఇంతకీ నేను వచ్చి ఎన్నాళ్ళయింది? ఓ రోజు గడిచేసరికి ఎన్నో రోజులయినట్టు అనిపించింది.
ఆరోజు శనివారం. సంతానం బాబాయి ఆఫీసుకు వెళ్ళబోయే ముందు చెప్పాను. "రేపు సాయంకాలం బస్ లో వెళ్ళతాను బాబాయ్ వెంకట్రావ్ ను పంపించి టికెట్ రిజర్వు చేయించు."
"అదేమిటమ్మా? ఇన్నాళ్ళకు వచ్చావ్? వారం రోజులన్నా వుండకుండా ఎలా వెళ్తావమ్మా?" ఆశ్చర్యంగా అన్నారు సంతానం గారు. పిన్ని వచ్చి అందుకుంది.
నేను వెళ్ళకపోతే అక్కడేదో కొంప మునిగిపోతున్నదన్న సాకు వెతికి చెప్పాను. పిన్ని బాబాయిని వెనక్కు తీసుకెళ్ళి ఏదో మాట్లాడింది. వెంకట్రావును పిలిచి టికెట్ రిజర్వేషన్ను గురించి పురమాయించి సంతానం గారూ ఆఫీసుకు వెళ్ళిపోయారు.
ఆ మధ్యాహ్నం పిల్లలు మ్యాట్నికి ప్రోగ్రాం లేవదీశారు. రిక్షాకు ముగ్గురు చొప్పున నాలుగు రిక్షాల్లో వెళ్ళాం. ముప్పై రూపాయలకు పైగా టికెట్లకు అయిపోయినై. హల్లో కూర్చున్న నాకు పిల్లలు తింటున్న చిప్స్, వేరు సెనగకాయల మోత తప్ప సినిమా డైలాగ్స్ విన్పించలేదు.
ఆ తెలుగు సినిమాలో గంపెడు పిల్లలతో సంసారం ఎంత ఆదర్శప్రాయంగా , ఆనందదాయకంగా గడపోచ్చునో మూడు గంటలపాటు చూసి బయటపడ్డాను.
తెల్లవారి ఆదివారం. పిన్ని నాకు వద్దంటున్నా తలంటి పోసింది. ఇంట్లో అంతా పండుగ హడావుడి చేశారు. వంద రూపాయల కొత్తచీర పసుపు కుంకుమతో పెట్టింది పిన్ని. పిన్ని బలవంతం మీద ఆచీర కట్టుకున్నాను. ఆప్యాయంగా చూస్తూ నిలబడ్డ బాబాయి పాదాలకు నమస్కరించాను. అయన దీవించారు. పిన్ని నిండారా నన్ను చూసుకొని గుండెలకు హత్తుకొంది. నా కళ్ళు చెమ్మగిల్లాయి. అంత పెద్ద సంసారంలో పడి తలమునకలవుతున్న ఆ దంపతుల ఔదార్యానికి అప్యాయతకూ నా హృదయం ద్రవించి పోయింది.
పిన్ని దగ్గర సెలవు తీసుకొని రిక్షా ఎక్కాను. రిక్షా బయలు దేరింది. రిక్షా వెనకే నడుస్తున్న సంతానం గారూ, నా రిక్షా ఒకేసారి ఆగిపోయాయి.
ఎదురుగా వచ్చిన పోలీస్ వాన్ గుమ్మం ముందు ఆగింది. సంతానం బాబాయి ఇంట్లో కన్నా వెళ్ళకుండా పోలీస్ వాన్ ఎక్కి కూర్చున్నారు.
* * * *
కోర్టుకు వెళ్ళబోతున్న నాన్నగారూ రిక్షా దిగుతున్న నన్ను చూసి ఆగిపోయారు.
"అదేమిటి అరుణా అప్పుడే వచ్చేశావ్?" అన్నారు ఆశ్చర్యంగా.
"నాన్నా, అవసరానికి ఆఫీస్ క్యాష్ వాడుకోవటం తప్పా నాన్నా?" అన్నాను.
నాన్న ఓ క్షణం వింతగా నా ముఖంలోకి చూసి అన్నారు. "మామూలు నేరం కాదు క్రిమినల్ నేరం!"
"దానికి శిక్షేమిటి?"
"ఆరునెలలు జైలు, ఉద్యోగం పోవటం ."
అంతలోనే నాన్నగారు తెప్పరిల్లి "ఏమిటమ్మా నువ్వనేది? సంతానం బాబాయి బాగున్నాడా? పిల్ల లేంతమంది? పిన్ని ఎలా వుంది ?" అనడిగారు.
"సంతానం బాబాయి తలమునక నీళ్ళలో ఈతరాని బతుకు బతుకు తున్నాడు నాన్నా" అన్నాను ఆర్ద్ర స్వరంతో.
"మీరు మేజిస్ట్రేట్! ఇంకా ఏం చెప్పాలి!" అంటూ కళ్ళలో నీరు తిరుగుతుంటే గబగబా లోపలకు వెళ్ళిపోయాను .
