"ఊఁ! అద్దెంతా?"
"నూట ఏభై రూపాయలు." బెదురుతూనే చెప్పాడు వెంకటపతి.
"సంవత్సరానికా?"
"కాదు, నెలకే!"
"నువ్వు బాగుపడతావంటారా? నెలకు నూటయాభై రూపాయలా? ఇంకా మందులూ - మాకులూ - డాక్టర్ల ఖర్చు ఎంతవుతుందో ఆలోచించావా?"
"ఎంతయినా సరే, కాన్పయేదాకా అక్కడే వుండాలి!" వెంకటపతి మాటలోని కరుకుతనం పసికట్టాడు సాంబయ్య.
ప్రసవవేదనలో వున్న దుర్గమ్మ... ఆనాడు గరళం పోసినప్పుడు దుర్గమ్మ చూసిన చూపులూ - మరణవేదనను అనుభవిస్తున్న దుర్గమ్మ - సాంబయ్యకు గుర్తొచ్చింది. మనస్సు మెత్తబడింది.
మాసూలు పూర్తయ్యాక వెంకటపతి బయలుదేరాడు. బియ్యం, పప్పులు మూట గట్టించి, పేరుకున్న నెయ్యి తపేళాలో పోయించి ఉగ్గంకట్టి బయలుదేరాడు వెంకటపతి. జీతగాడికి సామాను ఇచ్చి తను తండ్రి దగ్గరకొచ్చి నిలబడ్డాడు.
"మొన్నటి రెండువేలూ అయిపోయినయ్యా?" అన్నాడు సాంబయ్య.
"కొద్దిగా వుందిలే! ఇంకా రెండువేలుకావాలి." అన్నాడు కొడుకు.
సాంబయ్య ఇనప్పెట్టె తెరిచి వెయ్యి రూపాయలు విసిరి కింద కొట్టాడు.
డబ్బు తీసుకొని వెళ్ళబోతూ "మాసూలు అయిపోయిందిగా, నువ్వు కూడా అక్కడకొచ్చి వుండొచ్చుగా?" అన్నాడు వెంకటపతి.
వాడు పెళ్ళాం చెప్పిన మాటలు వల్లిస్తున్నాడు అనుకున్నాడు సాంబయ్య.
"వస్తాలే! ఇక పద, బస్సుకు సమయం అయింది." సాంబయ్య పలుకుల్లోని వ్యంగ్యం వెంకటపతికి అర్ధంకాలేదు.
వెంకటపతి సాయంకాలానికి బస్తీ చేరుకున్నాడు. రైలుపేటలో మేడకింద భాగమంతా అద్దెకు తీసుకున్నారు. మామ బలరామయ్యకూడా అక్కడే వుంటున్నాడు.
వరూధిని చేతిలో వెంకటపతి నోట్లకట్ట పెట్టాడు.
లెక్క చూసుకొని "ఇదేమూలకు వస్తుందండీ?" అని పకాలున నవ్వింది.
"డైనింగ్ టేబులూ, సోఫాసెట్టూ, స్ప్రింగ్ కాట్సూ ఆర్డరిచ్చింది మర్చిపోయారా ఏం? పదిరోజుల్లో వస్తాయి. వాటికే మూడువేలు అవుతుంది. ఎప్పుడు తెస్తారూ?" భర్త కళ్ళలోకి గుచ్చి చూస్తూ అడిగింది.
తెల్లవారి వెంకటపతి కనకయ్య దగ్గిరకెళ్ళి డబ్బు అడిగాడు.
"ఓసారి దెబ్బతిన్నా! మీ బాబును అడక్కుండా ఒక్క కానీ ఇవ్వను" అని తిప్పి పంపించాడు వెంకటపతిని. ఆ మాటే తిరిగొచ్చిన వెంకటపతి భార్యకు చెప్పాడు.
వరూధిని భర్తకు తెలియకుండా కనకయ్యకు కబురుపెట్టింది. కనకయ్య వచ్చాడు.
"ఏమిటి కనకయ్యగారూ? మీరిప్పుడు ధాన్యం కొనడంలేదా? మీ మిల్లు మూసేశారా ఏం?" అడిగింది వరూధిని.
కనకయ్య బిత్తరపోయాడు. "అదేంకాదే? కొంటూనే వున్నాం" అన్నాడు కనకయ్య.
"అయితే మా ధాన్యం అమ్ముతాం. అర్జంటుగా నాలుగువేలు కావాలి. ధాన్యం ఇచ్చేదాకా కావాలంటే వడ్డీ తీసుకోండి."
"మాసూళ్ళు అయినైగా, వారం పదిరోజులకు వడ్డీ ఎందుకమ్మా? అలాగే తీసుకోండమ్మా పైకం." కనకయ్య అంటుండగానే వెంకటపతి వచ్చాడు.
"విన్నారా? కనకయ్య డబ్బు ఇస్తానంటున్నాడు." తెలివిగా అంది వరూధిని మొగుడితో.
"అదేంటయ్యా పెద్దమనిషీ? మా నాన్నను అడగందే ఒక్క కానీ కూడా ఇవ్వనన్నావుగా?" అడిగాడు వెంకటపతి కనకయ్యను.
"నువ్వు ధాన్యం ఇస్తాననలేదే? అమ్మాయి ఇస్తానంటూంది."
"నాన్నను అడక్కుండా వడ్లెట్టా అమ్ముద్దీ?" గాబరాపడ్డాడు వెంకటపతి.
"మన వడ్లు మనం అమ్ముకోవడానికి ఒకర్ని అడగటం ఎందుకూ?"
"అదీ, అలా వుండాలి! లక్షల విలువచేసే మాటన్నావమ్మా! మొత్తం మీద షావుకారి బిడ్డవనిపించావు తల్లీ!" అన్నాడు కనకయ్య.
"ఇంకా కూర్చున్నారెందుకూ? కనకయ్యతో వెళ్ళి డబ్బు పట్టుకురండి!" దిగాలుపడి కూర్చున్న వెంకటపతిని హెచ్చరించింది వరూధిని.
14
వరూధినికి మూడోనెల. డాక్టరు కనకమ్మే వచ్చి చూసిపోతోంది. ఓ రోజు టానిక్కుకొని ఇంటికి వచ్చిన వెంకటపతికి ఎదురెళ్ళి "ఈరోజు మన ఇల్లు చూడండి, ఎట్లా వుందో?" అంది వరూధిని.
వెంకటపతి నోరు తెరచుకొని చూశాడు. హాల్లో సోఫాసెట్టూ, డైనింగ్ రూంలో డైనింగ్ టేబులూ - ఆరు కుర్చీలూ, పడకగదిలో స్ప్రింగ్ కాట్సూ, డ్రెస్సింగ్ టేబులూ, దానిముందు పెద్ద నిలువుటద్దమూ, దానిపక్కనే ఖరీదైన బీరువా అమర్చివున్నాయి.
"చెప్పండి. ఇప్పుడు మన ఇల్లు ఎట్లా వుంది?" టానిక్ సీసా అందుకొంటూ మురిపెంగా అడిగింది వరూధిని.
"సినిమాల్లో చూసినట్టుగా వుంది!" అన్నాడు వెంకటపతి ఉక్కిరిబిక్కిరి అయిపోయి.
"అన్నీ అబద్దాలు!" రాగం తీసింది వరూధిని.
"నిజంగా! చాలా బాగుంది మన ఇల్లు!"
"మర్చిపోయాను. ప్యాలెస్ లో కొత్త సినిమా వచ్చింది. బట్టలు మార్చుకోండి, వెళ్దాం!" వరూధిని భర్త చొక్కా గుండీలు విప్పింది.
జట్కా దిగుతుండగానే హాలుముందు నిలబడ్డ రామనాథబాబు వచ్చి చిరునవ్వుతో ఆహ్వానించాడు వరూథిన్నీ, వెంకటపతినీ స్వయంగా తనే హాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళను రిజర్వుడు సీట్లలో కూర్చోపెట్టాడు. సినిమా అయిపోగానే జట్కా మాట్లాడబోతున్న వెంకటపతిని ఆపి, కారు డ్రైవర్ను పిల్చాడు రామనాథబాబు.
"షరీఫ్! అయ్యగార్నీ అమ్మగార్నీ దించిరా!" అని డ్రైవరుకు చెప్పి, డోర్ తెరిచి. వరూధినికేసి చూశాడు. సందేహిస్తున్న వరూధిని చూసి "ఫర్వాలేదండీ! ఎక్కండీ!" అన్నాడు రామనాథబాబు.
కారు సాగుతుండగా "ఓసారి మా ఇంటికి రాకూడదూ?" అన్నట్టు రామనాథబాబు కళ్ళలోకి చూసింది వరూధిని.
ఆరోజు మధ్యాహ్నం డైనింగ్ టేబుల్ ముందు, వరూధినికి ఎదురుగా కూర్చొని నేతిలో వేడివేడి గారెలు ముంచుకుతింటున్న వెంకటపతి, కనకయ్య పిలుపు విని హాల్లోకి వచ్చాడు.
"మీ బాబు ధాన్యం పరమేశ్వరీ రైస్ మిల్లుకు ఖాయం చేశాడని తెలిసింది. రేపో మాపో వాళ్ళు ధాన్యం మిల్లుకు తోలుకుపోతున్నారట. ధాన్యం ఇస్తానని నెల క్రితం డబ్బు తెచ్చుకున్నావ్. ఇట్లా అయితే మా వాటాదారులతో నాకు మాట వస్తుంది" కనకయ్య గొంతు పెద్దది చేసి మాట్లాడాడు.
"కనకయ్యా! ఎందుకలా గగ్గోలు పెడతావ్? ఇవ్వాళ్ళే లారీ తీసుకెళ్ళి ధాన్యం తోలుకో వరూధిని కంఠంలోని తీవ్రతకు కనకయ్య గొంతు తడారిపోయింది. మంచినీళ్ళు అడిగాడు. నీళ్ళు తాగి "అది కాదమ్మా! ఉన్నసంగతి చెప్పా. వెంకటపతి ధాన్యం ఇస్తే తీసుకోవటానికి నాకేం? కళ్ళకద్దుకొని మరీ తీసుకుంటా" అన్నాడు.
"ఎందుకివ్వరూ? డబ్బు తెచ్చుకున్నవాళ్ళకు ధాన్యం ఇవ్వటం తెలియదా?" అంది మొగుడివంక చురచురా చూస్తూ.
"అయితే రేపే లారీలు మాట్లాడతా వెంకటపతీ! నువ్వుకూడా నాతో పాటు లారీలోనే వచ్చేయ్" అంటూ కనకయ్య వెళ్ళిపోయాడు.
వెంకటపతి లేచి డైనింగ్ టేబుల్ దగ్గరకువెళ్ళి మిగిలిన గారెలు పట్టించసాగాడు. అప్పటికే గిన్నెలోని నెయ్యి పేరుకుపోయింది.
15
దుమ్ము లేపుకుంటూ లారీ ఊళ్ళోకి వచ్చింది. కనకయ్య రామాలయం దగ్గిరదిగి వెంకటపతిని హెచ్చరించాడు. లారీవచ్చి సాంబయ్య ఇంటిముందు ఆగింది. కూలీలు కాటా, గోనెసంచులూ పట్టుకొని బిలబిలా దిగారు. ఇంటిముందు పురులు కట్టి పోసివున్నాయి వడ్లు. లారీ వచ్చిన రొదకూ, కూలీల అరుపులకూ అప్పుడే కునుకుపట్టిన సాంబయ్య లేచాడు.

