"రెండు సార్లే వచ్చామండి".
"అదేలే - ఇదివరలోనైనా రెండుసార్లెందుకు వచ్చారు?" అనడిగారు.
"పనిమీద".
"ఇక్కడేం పని?" అని మళ్ళీ ప్రశ్నించారు.
"మొదటిసారి చూడడానికి వచ్చాం. రెండోసారి, ఇక్కడే స్క్రిప్ట్ వర్క్ చేశాం. మీతో రావడం ఇది మూడోసారి" అన్నాను.
"మీ అమ్మగారు కూడా వచ్చారా?".
"నేను లేకుండా మా పిల్ల ఎక్కదికీ వెళ్ళదండి?? - అంది మా అమ్మ.
"ఏవండీ లైట్ల కాంతిలో గార్డెన్ మెరిసిపోతోంది. మనం తర్వాత అన్నీ మాట్లాడుకోవచ్చు మొదట చూద్దామా" అని అడిగాను.
అంతా ఒక రౌండ్ చుట్టి వచ్చేశాం. నేనూ, మా అమ్మా మెట్లకి దగ్గరగా వున్న పచ్చిక మీద కూర్చున్నాం. ఆవిడ పైకి వెళ్ళి శ్రీశ్రీగారి దగ్గర కూర్చున్నారు.
అమ్మా, నేనూ పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నాం. "ఆవిడంటే నాకు ఎందుకో చెప్పలేనంత ఇష్టం అమ్మా! అందుకే ఆవిడ ఎన్ని ప్రశ్నలు వేసినా నాకు కోపం రావడంలేద"న్నాను.
"వాళ్ళిద్దరూ మహా పొత్తుగా వుంటారు. నాకు సరదా వేస్తోంద"ని మా అమ్మ అంది.
"ఆవిడకి శ్రీశ్రీగారంటే విపరీతమైన ప్రేమనుకుంటానమ్మా" అని, ఇంకా ఏదో అనబోయి, వెనక్కి తిరిగి చూశాను.
భార్యాభర్తలిద్దరూ మా వెనక నిల్చున్నారు.
"రండి రండి కూర్చోండ"న్నాను.
"టైమయిపోయింది వెళ్ళిపోదాం" - అన్నారావిడ.
"మీ యిష్టం" అంటూ లేవబోయాను.
"ఏయ్ రెండు నిముషాలు కూర్చొని వెళదాం రా" అంటూ భార్యని కూర్చోపెట్టారు.
"స్క్రిప్ట్ రేపు రాయడం ప్ర్రారంభిస్తావాని" అడిగారు.
"ఊ" అన్నాను.
"డైలాగ్స్ ఎక్కువగా ఉన్నాయా?".
"ఫరవాలేదు మనం త్వరగా మద్రాసు వెళ్ళిపోవాలి. ఎప్పుడు బయలుదేరడం?"
"నువ్వు స్క్రిప్టు ఎంత త్వరగా పూర్తిచేస్తే అంత త్వరగా వెళ్ళిపోదాం" అన్నారు.
"అయితే నాకిక్కడ మరేమీ చూపించరా"ని అడిగారావిడ.
"రేపు కారు తెప్పిస్తాను. ముగ్గురూ వెళ్ళి రండి. నన్ను చంపకండ"న్నారు.
నేనేమీ మాట్లాడలేదు.
"ఎక్కడకొచ్చినా సరే మూడంకె వేసుకొని ముసుగు తన్నేస్త్ఘారు. ఆ మాత్రం దానికి నన్ను తీసుకొని రావడం ఎందుకు?" అని అలిగారావిడ.
"సరే. రేపటి సంగతి కదా ఇప్పట్నుంచి ఎందుకు గొడవ? ఆలోచిద్దాం. నడవండన్నారు".
వాళ్ళిద్దరూ ముందు నడుస్తున్నారు.
నేనూ, అమ్మా కాస్త దూరంలో నడుస్తున్నాం. పైనుండి మరోసారి గార్డెన్ అంతా చూశాను.
త్వరగా రండని ఆవిడ చేత్తో సౌంజ్ఞ చేస్తున్నారు.
శ్రీశ్రీగారు కారెక్కుతూ, "సరోజా! మా ఆవిడ నీతో ఏదో చెప్పాలట"
"ఇక్కడేనా?"
"కాదు లాడ్జిలో" అన్నారు.
* * *
లాడ్జిలో దిగాక "ఉదయం పది గంటలకి రమ్మ"ని డ్రైవర్ తో చెప్పారు.
ఎవరి రూముల్లోకి వాళ్ళం వెళ్ళిపోయాం.
నేను స్నానం చేసి రూమ్ లో కూర్చున్నాను. అప్పటికే టైం పది గంటలు కావస్తూంది. వచ్చి అరగంటయినా భోజనాలు రాలేదేమిటా అని ఆలోచిస్తున్నాను.
శ్రీశ్రీగారు వరండాలోకొచ్చి "సరోజా" అని పిలిచారు. వెళ్ళాను. మా అమ్మ రాలేదు. ముగ్గురం వాళ్ళ గదిలోనే కూర్చున్నాం.
శ్రీశ్రీగారు బాటిల్ ఓపెన్ చేశారు. మొదటి పెగ్ అయింది. వెళ్ళి మంచం మీద పడుకున్నారు.
ఆవిడ వచ్చి, "ఈరోజు నీకు పార్టీ ఇద్దామనుకుంటున్నాను"
"ఏం పార్టీ?"
"ఏఁ నువ్వు డ్రింక్ తాగవాని" అడిగారు.
నాకు ఒళ్ళు ఉడికిపోయింది. ఆడదయి వుండి కట్టుకున్న భర్త ఎదుట పరాయి స్త్రీని ఏమిటా అడగడం?
"ఇంతవరకూ నాకా అలవాటు లేదండి. నన్ను అడుగుతున్నారు. మీరు తాగుతారా?" అని అడిగాను.
కొంపదీసి ఈవిడ మనల్ని టెస్ట్ చెయ్యలేదు కదా అన్న అనుమానం కలిగింది. ఎందుకయినా తొందరపడి నోరు పారేసుకోవడం మంచిది కాదు. చూద్దాం - అని కాస్త తగ్గాను.
"కోపం వచ్చిందాని" అడిగారావిడ మాట్లాడలేదు నేను.
"నీ పేరు సరోజే కదూ?"
మళ్ళీ మొదటికొచ్చారేఁవిటీవిడ? - అనుకున్నాను.
"నిన్నే అడుగుతున్నాను".
"అవును".
"మా వారి సంగతి నీకు తెలుసా?"
"ఏ సంగతి?"
"ఒకటేమిటి చాలా వున్నాయి"
"అలాగా"
"ఏమిటని అడగవేం?"
"చెప్తున్నారుగా, చెప్పండి"
"బాగా తాగుతారు. స్త్రీలోలుడు. సిగరెట్లు లెక్కేలేదు....." - అని ఇంకా ఏదో చెప్పబోతూ వుండగా,
"ఇప్పటికే చాలా అయిపోయాయి. ఇక చెప్పకండ"న్నాను.
"ఈ విషయాల్లో వారికి మంచి పేరు లేదు. ఇవన్నీ తెలిసేవారి దగ్గర పనికి చేరేవా, తెలియక చేరేవా?".
"చూడండి నేను ఎలా చేరినా, మీ నోటెంట వారి గురించి ఇలాంటి మాటలు రావడం ఏం బాగులేదు. మీరు నాతోనే ఇలా అంటున్నారా? లేక అందరి దగ్గిరా ఇలాగే కంకణం కట్టుకొని ప్రచారం చేస్తుంటారా?" అని అడిగాను.
"నీ కెందుకంత కోపం వస్తోంది? నీ మేలు కోరినదాన్ని కనుక చెప్తున్నాను. ఆయన నా భర్తన్నమాట మరచిపోకు" అన్నారు.
"అందుకనే వారి గురించి మీ రాడుతున్న మాటలకి బాధపడుతున్నాను. లోకులు కాకులు. గోరంతల్ని కొండంతలు చెయ్యడమే వాళ్ళ పని. కానీ భార్య అయి మీరెందుకలా మాట్లాడుతున్నారో నాకు అర్ధం కాలేదు. అదీకాక.
నా మేలు కోరి అంటున్నానన్నారు. వారి వ్యసనాలవల్ల నాకోచ్చే నష్టం ఏమీలేదు. అవి వారి పర్సనల్. మీరు ఇప్పటికైనా తగు జాగ్రత్త తీసుకుంటే వారికున్న అలవాట్లన్నీ మానేసేటట్టు చెయ్యవచ్చు. ఇంకో సంగతి.
మీ మనసులో ఏదైనా వుంటే, ముఖం మీదే అడగండి. ఈ డొంకతిరుగుళ్ళు అవసరం లేదు. వారి విషయంలో మీకు సర్వ హక్కులూ వున్నాయి. ఎవరి జాగ్రత్తలో వారుంటే ఎవరూ ఎవర్నీ ఏమీ చేయలేరు" అన్నాను.
ఆవిడని చూస్తే జాలివేసింది.
సృష్టిలో ఏ స్త్రీ అయినా తన సర్వస్వం - చివరికి ప్రాణాలు కూడా త్యాగం చెయ్యడానికి సిద్దపడుతుంది. కానీ కట్టుకున్న భర్తని మాత్రం వదులుకోదు. అదొక్కటే ఆడదానికి మిగిలిన తృప్తి.
ఆవిడలా అన్నందుకు కాదు నా బాధ. ఆడవాళ్ళంతా ఒక్కలాంటి తత్వం గలవారే అని అనుకుంటే ఎలా? మనుషుల్ని వారి స్వభావాల్ని అర్ధం చేసుకోడానికి ప్రయత్నించాలి కదా?
ఆవిడ కేవలం నా సంగతి తెలుసుకోడానికి, నన్ను టెస్ట్ చెయ్యడం కోసమే మైసూరు వచ్చారు. ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు.
"ఏమిటాలోచిస్తున్నావ"ని అడిగారావిడ.
"ఏంలేదు" అన్నాను.
"మావారి దగ్గర ఇంకా ఎంతకాలం పనిచేస్తావ్?" అనడిగారు.
"వారు అవకాశం ఇచ్చినంతకాలం" అన్నాను.
- ఆవిడ ఇంకా ఏదో అడగబోతూవుంటే, ఇంతలో శ్రీశ్రీగారు లేచి, "ఏయ్, ఎందుకు పాపం దాని ప్రాణాలు తీస్తావు? వెధవ అనుమానాలూ నువ్వూనూ. నేను నీకు ముందే చెప్పలేదూ. ఇప్పటికయినా అర్ధమయ్యిందా? నే చెప్తే నమ్మావా? ఇన్ని మాట లడిగినందుకు నువ్వు కాబట్టి బతికి పోయావు. సరోజ సంగతి నీకింకా తెలీదు...
- సరోజా! దానితో ఏమిటిగానీ, భోంచేశావా?" అనడిగారు.
"ఇంకా భోజనం రాలేదండి" అన్నాను.
"రాకపోవడం ఏమిటి? అన్నీ ఇక్కడే పెట్టేశాడు. నువ్వూ, మీ అమ్మగారూ భోంచెయ్యండి. అరగంట తర్వాత పిలుస్తానన్నారు".
