"నా స్థాయి హీరోయిన్ తో నటించే అవకాశం వుండగా సుకృతి పావనీలతో నువ్వు చేయాల్సిన ఆగత్యం లేదు" అసలు టాపిక్ కదిలించింది.
విస్మయంగా చూశాడు.
అసలు రమ్యశ్రీ స్థాయి యిలా ఆలోచించాల్సిన ఆగత్యం లేదు. క్షణంపాటు యిది నిజంగా తన మీద అభిమానమేమో అని అతడు భ్రమ పడిపోయాడు.
"సిన్సియర్ గానే అంటున్నావా రమ్యా?"
"ఎంత సిన్సియర్ కాకపోతే నీతో నా బెడ్ రూం లో యిలా గడుపుతాను."
"నిజంగా నాతో నటిస్తావా?" నరేంద్ర యింకా నమ్మలేకపోతున్నాడు. ఆమె సరేనంటే నరేంద్రకి ప్రొడ్యూసర్ల కొరత లేదు "చెప్పు రమ్యా!"
అతడి ఉన్మాదం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తూంటే అసంకల్పితంగా "ఓ.కే." అంది "కానీ ఓ షరతు....."
"చెప్పు."
"నువ్వు శివ సినిమాలో నటించకూడదు."
"అదేం?"
శివతో తనకున్న వైరంకన్నా నారాయణశెట్టి మూలంగా హీరోయిన్ అయిపోతున్న సుకృతి గురించి ఆమె భయపడుతూంది. ఆ విషయం దాచేస్తూ అంది రమ్యశ్రీ- "ఎదగాలనుకునే హీరో బేనరేమిటి, దర్శకుడి స్థాయి ఏమిటీ అన్నది ఆలోచించాలి. నారాయణశెట్టి చిత్రం కావచ్చది కానీ శివ కొత్త డైరెక్టరు. రేపు ఆ సినిమా ప్లాపయితే నీ యిమేజ్ డామేజ్కావాలి? అలాంటప్పుడు నాలాంటి నెంబర్ వన్ హీరోయిన్ తో కలిసి నటించే అవకాశం చేజారిపోతుంది."
రమ్యశ్రీ వుద్దేశ్యం నరేంద్రని అలా ఒప్పిస్తే సుకృతి నటించాల్సిన ఆ సినిమా ఆగిపోతూందని......అదే ముఖ్యంగా ఆమె కోరుకుంటున్నది.
"ఓ.కె. రమ్యా. నువ్వు నాతో కలిసి నటించడమే నిజమైతే నేను శివ సినిమా డ్రాప్ చేసుకుంటాను" హామీ యిచ్చాడు.
రమ్యశ్రీ యిచ్చిన "ఆఫర్" సామాన్యమైంది కాదు. "ఓ.కె రమ్యా.....ఆరునెలల్లో నువ్వు నా సినిమాకి డేట్స్ యిస్తానంటే నేను రేపు ఉదయమే శివకి చెప్పేస్తాను."
"ప్రామిస్" అంది రమ్యశ్రీ వుత్సాహంగా.
నరేంద్రకి డేట్స్ యిచ్చినా ఆమెకు భయంలేదు. రేపు కథలో తన పాత్రకే ప్రాముఖ్యత వుండేట్టు హీరోయిన్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ని తయారు చేయిస్తే తన యిమేజ్ కే భయమూ వుండదు.
అందుకే నిజాయితీగా అంగీకరించింది.
ఆ తర్వాత ఉత్సాహంగా బాత్ రూం లోకి నడిచింది. మైల స్నానానికి అన్నట్టుగా.
నరేంద్ర ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ బెడ్ మీద రిలాక్సయ్యాడు. అతడి కళ్ళముందు రేపు చలనచిత్ర రంగంలో పెరిగిపోతున్న స్థాయి "ప్లేష్ ఫార్వార్డ్" లా దృశ్యరూపంలో కదులుతూంటే తనను తానే కాదు తనెక్కడున్నది మరిచిపోయాడు.
అదిగో సరిగ్గా అప్పుడు ఫోన్ రింగయ్యింది.
ఆల్కహిస్తూనే యధాలాపంగా రిసీవర్ అందుకున్నాడు.
"హీరో నరేంద్ర హియర్"
ఒకవేళ ఫోన్ రింగయ్యే సమయానికి రమ్యశ్రీ బయటవుంటే తనే అందుకునేది. బాత్ రూంలో వుండటంతో మిస్సయ్యింది.
"నువ్వక్కడేం చేస్తున్నావ్?" కంచుకంఠంలా వినిపించింది అతనివైపునుంచి.
నరేంద్రకి అప్పుడు తెలిసింది తను మాట్లాడుతున్నది రమ్యశ్రీ పర్సనల్ ఫోన్ లో అని. కొద్దిగా తమాయించుకుని "మీరెవరు?" అన్నాడు.
"ధనుంజయ"
నరేంద్ర కంపించిపోయాడు. ఇంతసేపూ యిండస్ట్రీని శాసిస్తున్న ఏ టాప్ హీరో గురించి మాట్లాడుకున్నారో సాక్షాత్తూ ఆ పెద్ద మనిషే ఫోన్ చేస్తే పొరపాటున తన పేరు కక్కేశాడు.
ఆ తర్వాత ఆవలివైపు క్లిక్ మన్న చప్పుడు.
నరేంద్రకి ముచ్చెమటలు పోశాయి.
"ధనుంజయ" ఎంత ప్రమాదకరమైన వ్యక్తో తెలుసతడికి. తనతో నటించే ప్రముఖనటి తన బెడ్ రూంకే పరిమితం కావాలనే మనస్తత్వం.
"ఎవరూ?"
తలారా స్నానం చేసి బయటికి వచ్చిన రమ్యశ్రీ అడిగింది ఫోన్ గురించి ఎంక్వయిరీ చేసినట్టుగా.
చెప్పలేదు నరేంద్ర. "ఏదో రాంగ్ నెంబర్" దాటేశాడు ధనుంజయ గురించి చెబితే షాక్ తిని తనకివ్వాల్సిన కాల్ షీట్స్ యిబ్బంది పెడుతుందని. "రేపు ఉదయమే ప్రొడ్యూసర్ ని పంపుతాను రమ్యా. అడ్వాన్స్ కూడా యిస్తాడు. డేట్స్ కన్ ఫాం చేయాలి."
"చెప్పానుగా......నేను మాట తప్పను. ఆరు నెలల్లో కాదు మూడు నెలల్లో యిస్తాను. సరేనా?"
"థాంక్యూ" అన్నాడు ఆనందంగా.