Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 40

 

    లావెండర్ ఫేర్ ఫ్యూమ్ సువాసనలు ఆ ప్రాంతంలో గుభాళించాయి.
    వచ్చింది ఎవరో, ఆ స్పర్శ ఎవరిదో అతని అంతరంగానికి తెలుసు! కాని , అతడు పెదవి విప్పలేదు, కనీసం కదలి చూడలేదు@!
    ఆమె ముఖం ఈపాటికి కోపంతో జేవురించింది. తను వచ్చి ఎంత సేపయింది. ప్రేమికులకు ఈ వ్యవధి  ఎంత విలువైనదో ఆమెకు తెలుసు! తెలియనిదల్లా విష్ణుమూర్తి అంతరంగమే! ఏ కోణం నుంచి చూస్తున్నా అతను ఆమెకు అర్ధం కావడం లేదు!
    "యూ.....ట్యూబ్ లైట్......"
    కోపంతో అతని కనుల మీద తన వేళ్ళను తొలగిస్తూ అన్నదామె.
    అయినా అతనిలో ఉలుకూ పలుకూ లేదు. ముఖంలో ఎటువంటి స్పందనా లేదు!
    "ఛ ఛ......వట్టి బుద్దవతారం!" అతనికి మాత్రమే వినిపించేటట్టు గొణిగింది.
    అప్పటికి కనులు తెరిచాడు విష్ణుమూర్తి. ఆమె కనులలోకి చూశాడు.
    ఆమె కలవర పడింది. అది, అతను తనను చూచినందుకు కాదు, అతని కనుగుడ్లను చూసి, అవి అగ్నిగోళాలు......! అవి శివుని త్రినేత్రాలు ......! ఆ తీక్షణత మహోగ్రం......!
    "ఐయాం వెరీ సారీ డియర్! నీ ఏకాగ్రతను అంతరాయం కలిగించినట్టున్నాను......ఐయామ్ రియల్లీ వెరీ వెరీ సారీ......." ఆమె తన తొందరపాటును సరిదిద్దుకోయత్నించింది.
    అతను మాట్టాడతాడు, తన ఉనికిని గుర్తిస్తాడు. అని ఆమె ఆశించింది. అయితే , అతనిలో ఏ మార్పు లేదు!
    "అబ్బ సారీ చెప్పానుగా........!" ఒకింత చిలిపిగా, కాసింత నిష్టూరంగా గొణిగిందామే.
    "ధీరజా........! అతని పెదవులు విచ్చుకున్నాయి. కంఠం ఖంగుమంది.
    "నువ్వేమీ చిన్నపిల్లవు కాదు. ఏమిటీ వింత ప్రవర్తన?"
    అతని స్వర కాథిన్యానికి కళవళ పడిపోతూనే ఆ మాటలకు ఆమె భిన్నురాలయింది.
    ఒక ప్రేయసిని ఒక ప్రియుడు అనవలసిన మాటా అది? తన ప్రేమ విలువను అతనికి తెలియజేప్పడంలో తను విఫలమైనట్టా....? తనను తను సంభాళించుకుంది.
    "మళ్ళీ చెబుతున్నాను - అయాం రియల్లీ సారీ విష్ణు! ఎనీథింగ్ రాంగ్ ఎట్ యువర్ హోమ్?" అతని చూపులకు ఆందోళన చెందుతూ అడిగింది ధీరజ.
    ఈ పలకరింపు అతనిని పులకరింపు చేసింది. మనసు జలదరించింది. తన కుటుంబ స్థితి గతులను గురించి ఆమె పరామర్శించడంతో అతని హృదయం పల్లవించింది. ఆ కొద్దిపాటి అనునయంతోనే అతనికి కొండంత ఉపశమనం కలిగింది. అంతరంగం అవురుమంది......
    తనే గనుక ఆడపిల్ల అయివుంటే ఆమె గుండెల మీద వాలిపియి వెక్కి వెక్కి ఏడ్చేవాడేమో? అతని గుండెలవిసిపోయాయి.
    అతను మగవాడై నందున పైకి బావురుమని ఏడవలేకపోయాడే కాని విష్ణు మూర్తి హృదయంలో లావాలు జ్వలిస్తున్నాయి. ఆవేదనకు అంతు లేదు. వేదన వర్ణనాతీతం.....
    ఆమె అతని భుజం మీద చేయి వేసింది. తమ మధ్య అరమరికలు వుండకూడదనుకున్నది. అతని దుఃఖాన్ని పంచుకోవాలనుంది. అంది.
    "విష్ణు! నాకు నీవు, నీకు నేను. నీ బాధ ఏమిటో నాకు చెప్పు. నీలో నువ్వే ఏదేదో ఆలోచించుకుంటూ మాధనపడిపోతూ , కుమిలిపోవడం ఎందుకు? నేను లేనా? నీ కష్టాలలో, నష్టాలలో, కన్నీళ్ళలో నన్ను భాగం పంచుకొనివ్వవా? నీ దృష్టిలో నేను పరయిదానినా?"
    అతను తన ఆవేదనను బలవంతాన అణచుకుంటున్నాడు. దుఃఖాన్ని పంటిబిగావున దిగమింగుకుంటున్నాడు. దానిని గమనించిందామె. అతని రెండు చేతులను అందుకుంది. ఆత్మీయతతో కౌగలించుకుంది........
    అతని కనులు వర్షించాయి. దుఃఖం ఎగదన్ని ఉబికి వెల్లువై ప్రవహించింది.
    ఆ కన్నీటి ధారలను ఆమె తన పెదవులతో తుడిచివేసింది.
    గాడ పరిష్వంగంలో వారు అలా ఎంత సేపు వున్నారో వారికే తెలియదు.
    దూరం నుంచి ఆగి ఆగి లయబద్దంగా కరతాళధ్వనులు వినరవడంతో ఉలిక్కిపడి విడివడి వడివడిగా సర్దుకున్నారు. బింకంగా బిడియంగా తేరిపార చూశారు.
    కాలేజీ మేట్స్ చేరువకు వచ్చారు. వాళ్ళు అనుకున్నంత ఉత్సాహంగా ఏమీ లేరు.
    కాలేజీ మేట్స్ చేరువకు వచ్చారు. వాళ్ళు అనుకున్నంత ఉత్సాహంగా ఏమీ లేదు.
    విష్ణు! అయాం సారీ......' ఒక క్లాస్ మెట్ అతని భుజం మీద చేయి వేశాడు.
    విష్ణు కంటే రిజర్వుడ్ గా వుండే క్లాస్ మేట్ కరుణా కరన్ ఇప్పుడు తనే ముందు వచ్చి విష్ణు ను పలకరించాడు. అయితే, అతను ముభావంగం మూడీ గా ఉన్నాడు. అతని స్వరంలో ఏదో బాధ ధ్వనించింది.
    మిగిలిన విద్యార్ధినీ విద్యార్ధులు విష్ణునే తదేకంగా చూస్తున్నారు. ఆ చూపులలో జాలి వుంది. వారి ముఖాలలో దీనత్వం దోబూచులాడుతోంది.
    "ఏమిటి? ఏమయింది? అందరూ ఇలా కూడాబలుక్కున్నట్టు కలసి కట్టుగా వచ్చారేమిటి?" ఆతురతగా అడిగాడు విష్ణు. జీరబోయిన అతని గొంతులో ఏదో సన్నని వణుకు వినవస్తున్నది. దానిని అందరూ గమనించారు.
    విష్ణు మనసు ఏదో కీడు శంకిస్తున్నది. అపశకునం అగుపిస్తున్నది.
    కరుణాకరన్ ఏదో టెలిగ్రాం కాగితాన్ని ధీరజకు అందించాడు. అది విష్ణు పేర వచ్చింది. వణుకుతూ దాని మడత విప్పింది. ఆమె .
    "ఫాదర్ ఎక్స్ ఫైర్డ్,  స్టార్ట్ ఇమిడియట్ లీ......"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS