స్వప్న, రవి శెలవు తీసుకుని వచ్చారింటికి.
దారిలో కార్లో స్వప్న ఒక్కమాట కూడా మాటాళ్ళేదు. ఆమె మనస్సంతా ఆలోచనలతో నిండిపోయింది.
రవి కూడా మౌనంగా వున్నాడు. అతని మనస్సులో వెంకట్రామయ్య, మోహన్ వాళ్ళ దుర్మార్గమే కనిపిస్తోంది.
ఇంటికి వెళ్ళేసరికి లాయర్ గారు వచ్చి కూర్చున్నారు. ఆయన ఒకే గాబరా పడుతున్నారు.
29
"ఏంటమ్మా ఇది?"
ఆ ప్రశ్నకి స్వప్న సమాధానం యివ్వలేదు.
ఆమె ముఖమంతా పాలిపోయింది. అలసట బాగా కనిపిస్తోంది. అవమానం స్పష్టమవుతోంది.
రవి కూడా గంభీరంగా వున్నాడు.
"రవీ!"
లాయర్ గారి పిలుపుకి తలెత్తి చూశాడతను.
"చూశావా? మనుషులెంత ఘోరంగా ప్రవర్తిస్తారో? ఆఖరికి జంతువులకి వేళకింత తిండీ నీరూ పెడుతూ ఉంటే విశ్వాసంగా ఉంటాయే? ఈ మనిషి జంతువుకన్నా హీనమయ్యాడే.
మీకు తెలియదు బాగా. ఈ వెంకట్రామయ్యకి పూటకి ఠికాణాలేని స్థితిలో ఆశ్రయమిచ్చింది అమ్మమ్మ గారు. అతని కొడుకుని చదివించటానికీ తోడ్పడింది. అంత చేస్తే ఆఖరికి వీళ్ళు చూపిన కృతజ్ఞతా రూపం ఇది. నేననుకోవటం దీనికి వెంకట్రామయ్య ప్రోద్భలం కూడా పరోక్షంగా వుండొచ్చని. లేనిదే వాడికంత ధైర్యం వచ్చేదికాదు. అందుకే యీకేసు అంతం చూడదలుచుకున్నాను. వాడిని జైలుకి పంపేదాకా వదలను.
స్వప్నా! అమ్మమ్మగారు నాతో చూచాయగా అనేవారు. వెంకట్రామయ్య దొంగ వోచర్లతో డబ్బు చేసుకుంటాడని. పకడ్బందీగా పదికి యాభయి రసీదు తీసుకునే వాడట. అలా ఎక్కువే సంపాదించి ఉంటాడు.
దుర్మార్గుడు. తిన్న యింటి వాసాలే లెక్కపెట్టాడు!"
ఆయన చెపుతూ ఉన్నంతసేపూ వింటూ కూర్చున్నారిద్దరూ.
ఎవరేం అనలేదు.
మళ్ళీ లాయర్ గారే అన్నారు "ఇదంతా ఎందుకు జరిగిందంటావ్? నీ ఐశ్వర్యం తెచ్చిన ప్రలోభం. నీ అందం కల్పించిన వ్యామోహం. దిక్కులేని నీ పరిస్థితి సృష్టించిన ఆశ. నిన్ను కట్టుకుంటే-బలవంతంగా నయినా-యీ ఆస్తి అంతా వాళ్ళది-నువ్వూ వాళ్ళ స్వంతం అవుతావు చూశావా ఎంత దుర్మార్గమో!"
స్వప్న చివ్వున తలెత్తి చూసింది. ఆ కళ్ళల్లోని మెరుపు కోటి మోహన్ లనయినా అట్టే నిలిపేసేట్టుగా ఉంది "మామయ్యా! నేనంటే ఏమనుకున్నారు. నేను ఆట బొమ్మని బుట్టబొమ్మని కాను. నాకూ వ్యక్తిత్వం ఉంది. అతను నన్ను బలవంతంగా ఎత్తుకెళ్ళగలిగాడే కానీ పెళ్ళి చేసుకోలేక పోయేవాడు!" అన్న భావం కన్పించింది.
మృదువుగా నవ్వేడు లాయర్ గారు.
"కాబట్టి నా సలహా ఒకటే-తక్షణం మీ పెళ్ళికి ఏర్పాటు చేయటం. నువ్వు పెళ్ళి చేసుకుంటే రవి బాధ్యత పెరుగుతుంది. వాళ్ళ ఆశా, ఆటకడుతుంది. సందేహం లేదు!"
రవి కాళ్ళలో ఏవో భావాలు తారట్లాడాయి.
"నేను చాలా రోజులక్రితమే మీ పెళ్ళి జరిపించాలని చూశా. అయితే వెంకట్రామయ్యే అడ్డుపుల్ల వేశాడు. అతని ఉద్దేశ్యం ఏమిటో యిప్పుడు బాగా అర్ధమైంది__ఈ పాడు ఆలోచనతోనే అతనప్పుడు అడ్డుచెప్పేడు."
స్వప్న ఏం మాటాల్లేదు. మౌనంగా వింటోంది. గడియారంలోని పెండ్యూలంలాగా ఆమె మనస్సు ఎటూ నిర్ణయించుకోలేని స్థితిలో ఊగిస లాడుతోంది.
"ఎంత త్వరగా పెళ్ళి జరిగితే అంత మంచిదని మరోసారి చెపుతున్నాను. నేను రేపే శాస్తుర్లుగారిని పిలిచి కనుక్కుంటాను. మంచి ముహూర్తం చూడమంటాను. ముహూర్తం కుదరగానే నిశ్చితార్ధం-అదే ఎంగేజ్ మెంట్ బ్రహ్మాండంగా జరిపిద్దాం"తన నిర్ణయాన్ని చెప్పేశాడు లాయర్ విశ్వేశ్వరంగారు.
"ఇప్పుడేమంత తొందర వచ్చింది?" పొడిగా అన్నాడు రవి.
చప్పున అతనివైపు చూసింది స్వప్న. ఆ చూపులో ఎన్నో భావాలు, ఎంతో ఆలోచన.
రవి కొద్దిగా సిగ్గుపడ్డాడు అలా అన్నందుకు.
"రవీ! నీకూ మళ్ళీ చెప్పాలా?"
రవి తలొంచుకున్నాడు.
"స్వప్నా! మరి నే వెళ్ళి వస్తాను. రేపు అటు శాస్తుర్లు వద్దకి వెళ్ళి కనుక్కుని ఆయన్ని తీసుకుని వస్తాను!" అంటూ లేచారు లాయర్.
స్వప్న ఊ అన్లేదు. ఆ అన్లేదు.
లాయర్ వెంటే నడిచింది. రవి కుర్చీలోనే వుండిపోయాడు.
హాలుదాటి వరండాదాటి ఒక్క క్షణం ఆగేడు.
"అంకుల్! రేపు శాస్తుర్లు గారిని పిలుచుకుని వచ్చేముందు రవితో ఫోన్ లో మాటాడండి. అతని ఉద్దేశ్యం కనుక్కోండి-అతనికి అమ్మమ్మపై గౌరవం వుండొచ్చు. ఆమె అంత్యదశలో కోరిన, కోరిక అని అంగీకరించాడేమో!"
"స్వప్నా!" ఆమె మాటలకి అడ్డొస్తూ పిలిచేడు.
ఆమె ఆగిపోయింది.
