"పాలకొల్లు"
"మీ పేరేటండి" అని అడగబోయి మానేసింది. అంతకు ముందు కేండేట్ చెప్పింది గుర్తొచ్చి.
"మీరేం చేస్తుంటారు?"
"పాలకొల్లులో ఏం చేస్తుంటామండి? పాలు కొలుస్తుంటామండి!"
"అంటే పాల వ్యాపారా?"
"అయ్....అవునండి!"
సమీర మనసులో అనుకుంది 'ప్రతి పిచ్చి సన్యాసికి ఫోన్ బ\నెంబర్ చెప్పడం వలన ఎవరు పడితే వాళ్ళు నోక్కేయడమే! పాలవాళ్ళు , చేపలోళ్ళు...చీ ఎంత చీఫ్ గా దొరికిపోయాను వీళ్ళకి."
"హలో! ఏంటి మేడమ్ నిద్రపోతున్నారా? ఇవతల ఎస్టిడి!"
"ఆ!.....ఆ!! మీకే పాట కావాలి?"
"డింగ్ చిక్....డింగ్ చిక్.... లంగ్ చిక్.....లంగ్ చిక్..... నీయమ్మ తెలుసా? నీ యబ్బ తెలుసా? అన్న పాట కావాలండి!"
నీ బూతుపాటలు చల్లగుండ. ఆ పాట రాసినవాణ్ణి పాడినవాణ్ణి, మ్యూజిక్ ఇచ్చినవాణ్ణి ఆ పాటలో నటించిన వాణ్ణి టోటల్ అందర్నీ కలిపి తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టుకుంది మనసులో సమీర.
"అమ్మా! ఎక్స్ ప్రేషన్స్ మారిపోతున్నాయి. ఫేస్ లో నవ్వు రావాలి!" అరిచాడు డైరెక్టర్ అవతల్నుంఛి.
సమీర ఉలిక్కిపడి పిచ్చి నవ్వు ముఖానికి పులుముకుంది.
"సరేనండి! తప్పకుండా వేస్తాం. పెట్టేయండి ఫోను!" అంది.
"ఉండవమ్మా! కాస్త మా ఇంటిది మాట్లాడుతుందట" అంటూ ఫోన్ వాళ్ళవిడకిచ్చాడు మాట్లాడమని.
"సమీరగారా?"
"అవునండి!" ఇక ఆవిడ తింటుందా నా మెదడ్ని! అయినా నవ్వక తప్పదు కనుక నవ్వింది-
"అవునండి, మీరేం చేస్తుంటారు?" అంది ఏదో ఒకటి మాట్లాడక తప్పదు కనుక.
:"మావారు కొలిచిన పాలల్లో నేను నీళ్ళు కలుపుతుంతానండి!"
"మరప్పుడు కొలతలు తప్పుతాయి కదా" వళ్ళు మండిన సమీర అనబోయి ఊరుకుంది.
"మీకేం పాట కావాలండి?" భయం భయంగా అడిగింది సమీర. మళ్ళీ ఏం బూతులు వినవలసివస్తుందో నని.
"మా పెనిమిటడిగిందే ఏసేసుకోండి. నాను పతివ్రతను కదా! భర్త ఏం కోరుకుంటే అదే కోరుకోవాలి కదు తల్లి!" అవతల నుండి వినపడింది.
"అవునవును బాగా చెప్పారు."
"ఇంతకీ నాకో డౌట్ తల్లీ అడిగేయ్యనా?"
"అడుగు చెప్పి చస్తాను. మనసులో అనుకున్న సమీర పైకి మాత్రం ఎప్పటిలా నవ్వులు రువ్వే మొహం పెడుతూ.
అడగండి దానికేముంది?" అంది.
"ప్రతివారం నువ్వేసుకునే డ్రెస్సులు నివేనమ్మా? లేక అవన్నీ టివీ వాళ్ళే ఇస్తారా? సొమ్ములు కూడా నీవేనా? లేక అవి వాళ్ళే ఇస్తారా? మళ్ళీ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇచ్చేయాలా? తీసుకెళ్ళవచ్చా?"
సమీరకు మంటలెక్కిపోయింది.
"ఈసారి హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటికి రండి. మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తాను. ఓకేనా, ఫోన్ వస్తుంది. మీలాంటి ప్రేక్షకులు చాలా మంది వుంటారు కదా? ఇప్పటికి ఫోన్ పెట్టేయండి"
"అదేమిటి? నా డబ్బులు నా ఇష్టం" ఖంగుమన్నట్టు వినిపించింది అవతలి కంఠం.
"అవునవును. సారీ మీ కిష్టమైన పాటని చూడండి ఇప్పుడు" కట్ చేసి ఫోన్ పెట్టేసింది సమీర.
జీవితంలో ఈ ప్రోగ్రాంకి యాంకరింగ్ చెయ్యకూడదని ఆ క్షణమే డిసైడ్ చేసేసుకుంది సమీర.
అయినా ఇరవై ఆరు వారాల కాంట్రాక్ట్ అది. ఇంకెంతమంది మెంటలేక్కిస్తారో అనుకోసాగింది పదేపదే!
* * *
"ప్లీజ్! ఇంకాసేపు కొట్టుకుంటాను" అన్నాడు మళ్ళీ బుంగమూతిపెట్టి ఇన్స్ పెక్టర్.
యమధర్మరాజు ఆశ్చర్యంగా చూసాడు.
నారదుడు యముడితో "బహుశా పిచ్చెక్కిపోయుంటాడు. వదిలి వేయుము సమవర్తి!"
"అటులనే" అని ఇన్స్ పెక్టర్ వైపు తిరిగి "జాగ్రత్త, ఇక్కడ జరిగింది నువ్వు చూసింది బయట చెప్పవో నా గదతో నీ తల పగులగొట్టి ముక్కలు చేసి సూపర్ బజార్ లో అమ్మేస్తాను. నాతొ బుద్దిగా బయటకు రా" అన్నాడు యమధర్మరాజు.
"అలాగే" అంటూ బుద్దిగా తలూపాడు.
ఇన్స్ పెక్టర్ సాదరంగా వాళ్ళకు వీడ్కోలు చెప్పాడు. ఇన్స్ పెక్టర్ ప్రవర్తన అర్ధం కాక పిచ్చిగా జాలిగా ఇన్స్ పెక్టర్ వైపు చూసారు కానిస్టేబుళ్లు.
* * *
యమధర్మరాజు నారదుడు రోడ్డుపైకి వచ్చేశారు.
"నారదా! ఆ మానవుడిని ముప్పితిప్పలు పెట్టు సమయం ఆసన్నమైనది. అటు చూడుము" అంటూ రోడ్డుకవతల వున్న శ్రీచంద్రను, సత్తిపండును చూపించాడు యమధర్మరాజు.
శ్రీచంద్ర, సత్తిపండు మాట్లాడుకుంటున్నారు.
"ఒరే పండూ! మన చేతిలో కరెన్సీ టేన్నుంది. ఆ టేన్నుతో రెండు బన్నులు కొనుక్కుని రెండు చాయ్ లతో ముంచుకుని హాయిగా తినేయొచ్చు" అన్నాడు శ్రీచంద్ర.
"ఆహా! దివ్యమైన భేషైన బ్రహ్మాండమైన, శ్రేష్టమైన ఆలోచన గురూ!" సత్తిపండు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయి అన్నాడు.
"ఒరే పండూ! కొడితే గురూ ఎవరో దొంగ దెబ్బ తీసారు అని అరుస్తావు గానీ ఇప్పుడు నేను బన్నులు తిందాం రా అని అన్నందుకు ఇన్నేసి పదాలు వాడ్డం అవసరమంటావా?" అడిగాడు శ్రీచంద్ర సత్తిపండును.
"ఏదో ఎమోషన్ లో అలా అనేసాను గురూ! నీ చేతిలో బుజ్జి పది రూపాయల నోటు చూస్తుంటే ముద్దేట్టుకుని నా జేబులో దాచి పెట్టుకోవాలనిపిస్తుంది గురూ! ఎందుకంటావ్?"
ఫట్ మని కొట్టాలన్న కోరికను అతికష్టమ్మిద నిగ్రహించుకున్నాడు శ్రీచంద్ర.
"ఓసారి ఆ బుజ్జిపండునిలా ఇవ్వు గురూ. నా కళ్ళారా చూసుకుంటాను" అంటూ శ్రీచంద్ర చేతిలో వున్న నోటును తన చేతిలోకి తీసుకున్నాడు.
"ఆహా! ఏమి నోటు? చూస్తేనే మతిపోవును......తాజానోతులలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా ఈ నోటేనండి" అంటూ ఆ నోటు వంక మైమరచి చూస్తుండిపోయాడు పట్టుకుని.
